Rajya
-
కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతి
సదాశివనగర్ (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య (50) ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాజయ్య ధాన్యం నూర్పిడి చేసి కొనుగోలు కేంద్రానికి తరలించి 15 రోజులు గడుస్తోంది. వర్షాలు పడటంతో ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. రెండు రోజుల నుంచి ఛాతీలో నొప్పి వస్తోందని కుటుంబీకులతో చెబుతున్నాడు. గురువారం సాయంత్రం కూడా ధాన్యం ఆరబెడుతున్న సమయంలో ఛాతీలో నొప్పి వస్తోందని తోటి రైతులకు చెప్పడంతో వారు రాజ య్య భార్య రాజవ్వకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆమె స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రాజయ్య మృతి చెందాడు. -
వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
నయీంనగర్, న్యూస్‌లైన్ : యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పిలుపునిచ్చారు. హన్మకొండ కిషన్‌పురలోని వాగ్దేవి కళాశాలలో ఆదివారం వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సమ్మేళనాన్ని నిర్వహించారు. కలెక్టర్ కిషన్ అధ్యక్షత వహించి సమ్మేళనాన్ని జ్యోతి వెలిగిం చి ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ రాజయ్య హాజరై మాట్లాడుతూ యువత స్వీయ నియంత్రణ కలిగి ఉండాలని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన వివేకానందుడి సేవలు మరువలేనివన్నారు. అన్నింటి కంటే జ్ఞానం గొప్పదని, యువత జ్ఞానాన్ని పెంపొం దించుకుని తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు. ప్రపంచ జనాభాలో భారతదేశం రెం డో స్థానంలో ఉందని వివరించారు. ఉన్నత విద్య పూర్తి చేసుకున్న యువత సైతం మాన వ సంబంధాలను మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి యువత సన్మార్గంలో నడవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత లక్ష్యంతో యువత ముందుకు సాగాలని కోరారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సంస్కృతీసంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జి.కిషన్ మాట్లాడుతూ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న నేటి యువతలో తగిన నైపుణ్యత కొరవడిందని చెప్పారు. యువత చెడు అనుకరణలతో బంగారు భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టివేసుకుంటుందన్నారు. ప్రతి గ్రీవెన్స్‌లో 50 మంది డిగ్రీలు, పీజీలు చదువులు పూర్తి చేసుకున్న యువతీయువకులు కనీసం అటెండర్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పించాలని దరఖాస్తులు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధిలోకి రావాలని ఆయన సూచించారు. అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో 40 శాతం యువత ఉందని ఆయన తెలిపారు. యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సంయుక్త కార్యదర్శి పాలకుర్తి విజయ్‌కుమార్‌కు కలెక్టర్ అవయదాన పత్రాన్ని అందజేశారు. సమావేశంలో రామకృష్ణ మఠం నుంచి ఆత్మపరమానందస్వామి, సెట్వార్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి కె.పురుషోత్తం, నెహ్రూ యువకేంద్రం మనోరంజన్, యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు పాల్గొన్నారు. -
కేసీఆర్.. బిజీబిజీ
=మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ =ఎమ్మెల్యే రాజయ్య కుమారుల వివాహ వేడుకలకు హాజరు =టీఆర్ఎస్ ముఖ్య నేతలతో భే టీ =తాజా పరిస్థితులపై మాటామంతి వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం ఓరుగల్లుకు వచ్చారు. నాలుగు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రంలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నప్పటికీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తనను కలిసిన విలేకరులతో మరోసారి మాట్లాడుకుందామంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనప్పటికీ తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 11గంటల సమయానికి కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని కేథడ్రల్ చర్చిలో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ఇద్దరు కుమారులు డాక్టర్ క్రాంతిరాజ్, డాక్టర్ విరాజ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండలోని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి మధ్యాహ్నం 12-15 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఆయనను టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్రావు, భరత్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్రావు, కిషన్‌రావు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. తదుపరి అక్కడి నుంచి వరంగల్‌లోని సీఎస్ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వినయ్, బిక్షపతి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్‌తో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వడ్డేపల్లి రోడ్డులోని మాజీ డీజీపీ పేర్వారం రాములు ఇంటికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు తనను కలిసి నేతలతో తాజా పరిస్థితులు, పార్టీ విలీన అంశాలపై తెలంగాణవాదులు, నేతల స్పందనను తెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు. -
చిగురంత ఆశ.. జగమంత వెలుగు
(బి.ఎస్.రామచంద్రరావు) బీద రైతు బతుకులో జడివాన నిప్పులు కురిపించింది. పొలాలపై విరుచుకు పడ్డ వరద అన్నదాత నోట మట్టికొట్టింది. చేను నీటిపాలై కర్షకుడి జీవితం విషాదానికి ప్రతిరూపమైంది. ఈ చిమ్మచీకట్లు కమ్ముకున్న వేళ వెలుగుల పండగ దీపావళి వచ్చింది.. నిరాశలో చిక్కిన బతుకులకు ఇప్పుడు చిగురంత ఆశే వెలుగిస్తుందన్న విశ్వాసంతో ప్రతి రైతూ జీవితాన్ని స్పృశిస్తూ రాసిన కథ ఇది.. కష్టజీవుల వ్యథకు అద్దం పట్టే గాథ ఇది.. గాలివాన.. ‘ఓలమ్మ.. ఏటీ వోన.. ఏటీ గాలి’.. వందోసారి అనుకుంది గౌరమ్మ ఆరిపోతున్న దీపానికి అరచెయ్యి అడ్డుపెడుతూ.. అప్పటికి నాలుగు రోజులుగా భోరున కురుస్తున్నాయి వర్షాలు. భూమ్మీద పగబట్టినట్టు కమ్ముకుంటున్నాయి కారుమేఘాలు. ఉండీ ఉం డీ విరుచుకు పడుతున్నా యి ఈదురుగాలులు. గాలి వేసినప్పుడల్లా తాటాకు పాక గజగజ వణుకుతోంది. చూరు మీంచి నీరు బొట్లుబొట్లుగా ఇంటి మధ్యలోకి కారి మట్టి నేలలోకి ఇంకుతోంది. ‘పెనక మీద ముచ్చి గుడ్డ కప్పరోరయ్యా అని నెత్తీనోరూ కొట్టుకు సెప్పేను. మొగోడు ఇనిపించుకోకుండా ఇద్దిలాడాడు.. ఇప్పుడు సూరు కారిపోతన్నాది. గిన్నిలడ్డు ఎట్టలేక సత్తన్నాను.’ ధుమధుమలాడుతూ నీటి ధార కింద గిన్నె ఉంచింది గౌరమ్మ. ఆమె దృష్టి మరల్చడానికన్నట్టు పెరట్లో ఆవు అంబా అని అరిచింది. ‘వస్తున్నానొస్తున్నా’ అని గౌరమ్మ కుడితి బాల్చీ తీసుకెళ్లి పెరట్లో ఆవు ముందించింది. ‘గాలోనలో ఈనేస్తాదో ఏటో.. గోవు మాలచ్చిమి నిండు సూలుతో ఉంది.. సాల సిన్నది.. కారిపోద్దో ఏటో’ దిగులుగా అనుకుంది. దృష్టి మొగుడి మీదకు పోయింది.. ‘కాల్వ గట్టు తెగిందట..పొట్ట మీదుంది వొరి.. పొలం ముంచీసింది.. ముష్టోన’ శపించింది. ‘ఏకువనే ఎల్లిపోనాడు.. సేల్‌లోకి నీరొచ్చిందట.. కాల్వ గట్టు కప్పనానికి తంటాలొడుతున్నారట.. ఈ పాలి పంటేటవుద్దో’ గుబులుపడింది. ‘దీపావలి పండగొస్తంది. ఆ సందడే లేదు.. రైతులంతా సచ్చి ఉన్నారు. ‘ఇంకేటి పండగ’.. నిట్టూర్చింది.. గౌరమ్మ ఇంకా ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో... అమ్మా.. అంటూ సుడిగాలిలా పరుగులు తీసుకుంటూ వచ్చి కాళ్లకు చుట్టేసుకుంది తొమ్మిదేళ్ల మాలక్ష్మి.. తల మీంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. ‘సెస్.. ఒదులే పాడు మొకమా.. సీరంతా తడిపీసినావు.. అంత వోనలో తడుసుకొచ్చీసినావు’ అని కూతురి మీద గౌరమ్మ గయ్ మంది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా ‘బడంతా నీరొచ్చీసింది.. వోన తగ్గీదాకా స్కూలుకి సెలవిచ్చీసినారు’ అంది మాలక్ష్మి సంబరంగా.. ‘చాల్లే సంబరం.. తల తుడుసుకో.. ఊష్టమొస్తాది’ గదమాయించింది గౌరమ్మ. వాన జోరు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గాలీ అలాగే ఉంది. రాజయ్య కోసం గౌరమ్మ వీధిలోకి వచ్చిపోతూనే ఉంది. ఎప్పటికో సాయంత్రానికి నిలువునా నీళ్లోడుతూ వచ్చిన మొగుడు ఉలుకూ పలుకూ లేకుండా అలానే గడపలో నులకమంచం మీద కూలబడేసరికి పలకరించే ధైర్యం కూడా లేకపోయిందామెకు. ఆమె ఏమీ అనకుండానే ‘ఈ ఏడూ పంట మట్టి కల్సిపోయినట్టే’ లోగొంతుకలో అన్నాడు రాజయ్య. ఆ చీకట్లో అతన్ని చూస్తే దిగులు గడ్డ కట్టినట్టు ఉన్నాడు. దుఃఖాన్ని గొంతులోనే ఒడిసిపట్టి ‘ఏటి శేత్తాం.. ఏటికేడూ ఇలా బతుకు కాలిపోతంది.. దవిర్యం తెచ్చుకో’ అని తొట్రుపడుతున్న గొంతుకతో అంది గౌరమ్మ. ‘ఇంకేటి దవిర్యం.. పొలమంతా నీరు పోటెత్తీసినాది.. కాల్వ గట్టు కప్పినాం.. కానీ ఆకాసాన్ని, ఆపేత్తామా ఏటి.. వొరి ఏపాటి సేతికొత్తాదో అర్దం కాకుండా ఉంది’ అన్నాడు రాజయ్య. అర్ధరాతి ‘అంబా’ అన్న అరుపుతో గౌరమ్మ దిగ్గున లేచింది. ‘మావా.. లెగులెగు ఆవు ఈనినట్టుంది’ గబగబా లేపింది. ఇద్దరూ ఒక్క ఉదుటున పెరట్లోకి వెళ్లారు.. ఆవు అవస్థ పడుతోంది. గిరగిరా తిరుగుతోంది. వాన, గాలి పెద్దగా లేకపోవడంతో కాస్త పొడిగా ఉన్నచోట ఆవును కట్టారు. మొత్తానికి ఆ పనంతా అయ్యేసరికి వెలుగొచ్చేసింది. ఆవు ఈనినందుకు సంతోషంగానే ఉన్నా ‘ ఈ వానలో దాని పేనానికీ మాకూ బోల్డు కట్టమొచ్చి పడింది’ అనుకుంది గౌరమ్మ. ఓసారి నడుం వాల్చబోతూ ఉంటే నులకమంచం మీద పడుకున్న కూతురు మూలిగినట్టునిపించి అనుమానంగా వెళ్లి ఒంటిమీద చెయ్యేసింది. ‘బగవంతుడా.. మావా సూడు.. దీనొల్లు కాలిపోతంది’ అరిచినట్టే పిలిచింది. ‘ఏటయిందే.. రాత్తిరి బాగానే ఉంది కదేటే’ గాభరాగా అన్నాడు రాజయ్య. ‘పగలంతా సుబ్బరంగా తడిసింది. ఏటీ బాదలు..పిల్ల లెగ్గానే ఆస్పత్రికి తీసుకెల్లు.. ఆలీసం సెయ్యకు’ వొణుకుతున్న గొంతుకతో చెప్పింది. త గ్గినట్టే తగ్గి విరుచుకు పడుతోంది వర్షం. ‘ ఈపాలికి పొలానికెల్లక్కర్లేదులే.. నిన్నటికే సేను నీట్లో తేల్తంది. బగమంతుడి దయ.. సేతిలో దేనికీ రూపాయి డబ్బు నేదు.. వొర్సానికి ఇంటి గోడ సుబ్బరంగా నానీసింది. పడిపోద్దో ఏటో.. వోనెలిస్తే తాపీమేస్త్రీని పిలిసి సిమెంటు పామించడమో.. ఏదో సెయ్యాల .. ఆవుకి తవుడో, సిట్టో కొనాల.. పిల్లకి మందులు కొనాలనీ, ఇండీషన్లు ఇప్పించాలని డాకుటేరు సెప్పాడు.. ఎవుర్ని అడిగితే ఎవురిత్తారు.. అందరి బాదా ఒకేనాగ ఉంది. ఏటీ తోసడం నేదు’ నిట్టూర్చాడు రాజయ్య. ‘బాగున్నోల్లు బాగుంటున్నారు.. మనలాటోల్లనే వోనలు, వొరదలు .. సిక్కులు .. సీకాకులు.. దేముడేటి సేత్తన్నాడో’ ఉసూరంది గౌరమ్మ. దీపావళి.. ముసురు తగ్గింది.. వాన తెరిపిచ్చింది.. చెయ్యాల్సిందంతా చేసి, ఇక చాలన్నట్టు ఆకాశంలో మబ్బులు తేలిపోతున్నాయి. వరదల తర్వాత పరామర్శకు వచ్చే పెద్దల్లా సూర్యుడు అలనల్లన తొంగిచూస్తున్నాడు. పొలానికెళ్లిన రాజయ్య కోసం గౌరమ్మ ఎదురుచూస్తూనే ఉంది. మధ్యాహ్నమయింది.. సాయంత్రం కావస్తోంది.. ఆమెలో దిగులు పెరిగింది. సందె చీకట్లు కాసేపట్లో కమ్ముకుంటాయనగా, దూరంగా కాళ్లీడ్చుకుంటూ వస్తున్న పెనిమిటిని చూసి కోపం, కన్నీరు ఒకేసారి ఉప్పొంగాయి. ‘పగలనగా ఎల్లావు.. ఎటయ్యావో తెల్దు.. ఇక్కడ సచ్చి సచ్చి ఉన్నాను. ఎక్కడికెల్లిపోయావు.. కబురయినా ఎట్టావా.. మనిసివేనా నువ్వు’ దులిపేసింది. రాజయ్య మాట్లాడలేదు. ‘ముంగినాగున్నావు.. నోరు పడిపోయిందేటి’ ‘నోర్ముయ్యే.. ఏటి సావమంటావు.. నాకు మాత్రం తెల్దా ఏటి?.. పొద్దెక్కిన కాడి నుంచి తెలిసినోల్లందరి దగ్గిరికి తిరుగుతున్నాను .. సేతిలో ఏగానీ లేదు.. పండగపూట .. నాను బతిమాలనోడు లేడు.. రెండు ఏల రూపాయలైనా కావాలి.. కూలోడినెట్టాలి.. మందులు కొనాలి.. గోడ బాగు సేయించాలి.. పిల్లకి మందులు.. ఆవుకు తిండి దేన్ని మానీమంటావు? నేదునేదన్నోడే కానీ ఒక్కడయినా అప్పిచ్చినోడు నేడు.. ఏటి సావమంటావు? పేనం సోలొచ్చి ఇంటికొత్తే సంపేత్తన్నావు’ అరిచేశాడు రాజయ్య. మౌనంగా ఉండిపోయింది గౌరమ్మ. ‘ఏటి మాటాడవేటి.. ఏటి సెయ్యాల?’ వెటకారంగా అన్నాడు రాజయ్య. గౌరమ్మ మౌనంగానే వంటగదిలోకి వెళ్లింది. నీళ్లు నిండుకున్న ఆమె కళ్లకు ఫొటోలో సీతారాములు మసకమసగ్గా కనిపించారు. ఓ నిర్ణయానికొచ్చిన ఆమె ఫొటో ముందు నిలబడింది. దండం పెట్టి.. ‘తల్లీ,తండ్రీ... మరో దారి లేకపోయింది.. తప్పు కాయండి’ అని మెళ్లో శతమానం తీసింది. పుట్టింటి వాళ్లు పెట్టిన రెండు తులాల గొలుసు తీస్తున్నప్పుడు ఆమె చేయి వణికింది. నులక మంచం మీద కూర్చున్న రాజయ్య చేతిలో దాన్ని ఉంచింది మౌనంగా.. ఏదో ఆలోచిస్తున్న రాజయ్య చీకట్లో చేతిలో గొలుసు చూసి నిర్ఘాంతపోయాడు. ‘ఏటే ఇది.. పండగేల.. ఏటయింది నీకు.. నేను లేననుకున్నావా?’ వణుకుతున్న గొంతుకతో అడిగాడు. ‘మావా మరేటనక.. నీకూ, నాకూ మరో దారి లేదు.. ఎల్లి తనకా ఎట్టు.. రోజులు బాగుంటే ఇడిపించుకోకపోం’ స్థిరంగా అంది గౌరమ్మ. స్పృహలోకొచ్చిన దాన్లా ‘సాయంత్రం పిల్ల ఏటో కొనుక్కుంటానని వయిదు రూపాయిలొట్టుకెల్లింది. సీకటొడిపోతంది.. ఎక్కడికెల్లిందో తెల్దు’ అని ఆందోళనగా అంది.’ దానికి బాగునేదు కదా.. బయటకెందుకెల్లనిచ్చినావు’ కసిరాడు రాజయ్య. గబగబా ఇద్దరూ గ డపలోకొచ్చారు.. ఆ మూల.. చీకట్లో.. మాలక్ష్మి.. ఒద్దిగ్గా కూర్చుని.. సీసాతో తాను తెచ్చుకున్న నూనె నాలుగు ప్రమిదల్లో పోసి.. చిరుదీపాలు వెలిగిస్తోంది. గాలి వీస్తున్నా నిశ్చలంగా వెలుగుతున్న దీపాలు కమ్ముతున్న చీకట్లను తరిమేస్తున్నాయి. ఆ వెలుగులో పసిదాని మొహంలో నవ్వు ధగధగలాడుతోంది. కళ్లారా కూతుర్ని చూసి భార్య వైపు చూపు తిప్పిన రాజయ్యకు గౌరమ్మ ముక్కు నత్తు పక్కనే అశ్రు బిందువు మంచి ముత్యంలా కనిపించి అబ్బురమనిపించింది. -
‘పురా’ అమలుపై సమీక్ష
= హాజరైన మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన (పురా) ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలంలో రూ.168.52 కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పనుల అమలుపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు కలెక్టర్ కిషన్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింత నెక్కొండ, రోళ్లకల్లు, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూర్, పెద్దతండాల్లో ప్రభుత్వం పుర ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రాజెక్ట్ అమలు చేసేందుకు మొత్తం రూ.168.52 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ.123.34 కోట్లు (73 శాతం కేంద్ర ప్రభుత్వం), రూ.25.80 కోట్లు (15 శాతం రాష్ట్ర ప్రభుత్వం) రూ.19.38 కోట్లు (11 శాతం కన్సోరిటీయం) చెల్లిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను యుగాంతర్, ఎస్వీఈసీ సంస్థలు చేపట్టనున్నాయి. ఈ మేరకు పర్వతగిరి పెద్ద చెరువులోకి ఎస్ఆర్ఎస్పీ నీటిని పంపింగ్ చేసి సాగు, తాగునీరు అందించేందుకు రూ. 41 కోట్లు, మైనర్, మేజర్ ఇరిగేషన్ పనులను చేపట్టేందుకు రూ.36 కోట్ల ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పంపే విషయంపై మంత్రి, ఎంపీ, కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ఇరిగేషన్ విభాగం అధికారులతో సుమారు రెండుగంటలపాటు చర్చించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పక్షాన పుర పనులను డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో భూమి కొనుగోలుకు సుమారు రూ. 3 కోట్లు, నీటి పంపిణీకి రూ.36.60 కోట్లు, వాటర్షెడ్ల నిర్మాణం కోసం రూ.14.94 కోట్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 6.82 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీలకు రూ. 1.85 కోట్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు రూ. 1.59 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కు రూ. 4.80 కోట్లు, రూరల్ బిజినెస్ హబ్‌కు రూ. 53 లక్షలు, ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంకు రూ.52 లక్షలు, కమ్యూనిటీ రేడియో ఏర్పాటుకురూ. 63లక్షలు, వాటర్ సస్టెనబులిటీకి రూ.41.53 కోట్లు, బ్రాడ్‌బాండ్‌కు రూ.63లక్షలు, ప్యాక్‌హౌస్‌కు రూ.1.19కోట్లు, రీఫర్ వ్యాన్‌కు రూ.60 లక్షలు, కామన్ సర్వీస్ సెంటర్‌కు రూ.47లక్షలు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌కు రూ.33 లక్షలు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. కాగా, ఆర్థిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.6.11 కోట్లతో జిన్నింగ్ మిల్లు ఏర్పాటు, రూ.3.20 కోట్లతో రూరల్ గోదాం నిర్మాణం, రూ.11 లక్షల తో ఇంటర్నెట్ కియోస్క్, రూ.3.16 కోట్లతో లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గత జూలై 22వ తేదీన పురా ప్రాజెక్ట్ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సి ఉండగా... చివరి నిమిషంలో సీఎం రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఈ నెల చివరన ... లేకుంటే నవంబర్ మొదటి వారంలో గాని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, పురా ప్రాజెక్ట్‌ను కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంతోపాటు మరో గ్రామంలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలుకు ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.