చిగురంత ఆశ.. జగమంత వెలుగు | Ciguranta hope .. Jagamanta light | Sakshi
Sakshi News home page

చిగురంత ఆశ.. జగమంత వెలుగు

Published Sat, Nov 2 2013 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

చిగురంత ఆశ.. జగమంత వెలుగు

చిగురంత ఆశ.. జగమంత వెలుగు

(బి.ఎస్.రామచంద్రరావు)
 

బీద రైతు బతుకులో జడివాన నిప్పులు కురిపించింది. పొలాలపై విరుచుకు పడ్డ వరద అన్నదాత నోట మట్టికొట్టింది. చేను నీటిపాలై కర్షకుడి జీవితం విషాదానికి ప్రతిరూపమైంది. ఈ చిమ్మచీకట్లు కమ్ముకున్న వేళ వెలుగుల పండగ దీపావళి వచ్చింది.. నిరాశలో చిక్కిన బతుకులకు ఇప్పుడు చిగురంత ఆశే వెలుగిస్తుందన్న విశ్వాసంతో ప్రతి రైతూ జీవితాన్ని స్పృశిస్తూ రాసిన కథ ఇది.. కష్టజీవుల వ్యథకు అద్దం పట్టే గాథ ఇది..
 
 గాలివాన..


 ‘ఓలమ్మ.. ఏటీ వోన.. ఏటీ గాలి’.. వందోసారి అనుకుంది గౌరమ్మ ఆరిపోతున్న దీపానికి అరచెయ్యి అడ్డుపెడుతూ.. అప్పటికి నాలుగు రోజులుగా భోరున కురుస్తున్నాయి వర్షాలు. భూమ్మీద పగబట్టినట్టు కమ్ముకుంటున్నాయి కారుమేఘాలు. ఉండీ ఉం డీ విరుచుకు పడుతున్నా యి ఈదురుగాలులు. గాలి వేసినప్పుడల్లా తాటాకు పాక గజగజ వణుకుతోంది. చూరు మీంచి నీరు బొట్లుబొట్లుగా ఇంటి మధ్యలోకి కారి మట్టి నేలలోకి ఇంకుతోంది. ‘పెనక మీద ముచ్చి గుడ్డ కప్పరోరయ్యా అని నెత్తీనోరూ కొట్టుకు సెప్పేను. మొగోడు ఇనిపించుకోకుండా ఇద్దిలాడాడు.. ఇప్పుడు సూరు కారిపోతన్నాది. గిన్నిలడ్డు ఎట్టలేక సత్తన్నాను.’ ధుమధుమలాడుతూ నీటి ధార కింద గిన్నె ఉంచింది గౌరమ్మ.
 
ఆమె దృష్టి మరల్చడానికన్నట్టు పెరట్లో ఆవు అంబా అని అరిచింది. ‘వస్తున్నానొస్తున్నా’ అని గౌరమ్మ కుడితి బాల్చీ తీసుకెళ్లి పెరట్లో ఆవు ముందించింది. ‘గాలోనలో ఈనేస్తాదో ఏటో.. గోవు మాలచ్చిమి నిండు సూలుతో ఉంది.. సాల సిన్నది.. కారిపోద్దో ఏటో’ దిగులుగా అనుకుంది. దృష్టి మొగుడి మీదకు పోయింది.. ‘కాల్వ గట్టు తెగిందట..పొట్ట మీదుంది వొరి.. పొలం ముంచీసింది.. ముష్టోన’ శపించింది. ‘ఏకువనే ఎల్లిపోనాడు.. సేల్లోకి నీరొచ్చిందట.. కాల్వ గట్టు కప్పనానికి తంటాలొడుతున్నారట.. ఈ పాలి పంటేటవుద్దో’ గుబులుపడింది. ‘దీపావలి పండగొస్తంది. ఆ సందడే లేదు.. రైతులంతా సచ్చి ఉన్నారు. ‘ఇంకేటి పండగ’.. నిట్టూర్చింది..
 
గౌరమ్మ ఇంకా ఇంకా ఇంట్లోకి అడుగు పెట్టిందో లేదో... అమ్మా.. అంటూ సుడిగాలిలా పరుగులు తీసుకుంటూ వచ్చి కాళ్లకు చుట్టేసుకుంది తొమ్మిదేళ్ల మాలక్ష్మి.. తల మీంచి నీరు ధారాపాతంగా కారిపోతోంది. ‘సెస్.. ఒదులే పాడు మొకమా.. సీరంతా తడిపీసినావు.. అంత వోనలో తడుసుకొచ్చీసినావు’ అని కూతురి మీద గౌరమ్మ గయ్ మంది. ఆమె కోపాన్ని పట్టించుకోకుండా ‘బడంతా నీరొచ్చీసింది.. వోన తగ్గీదాకా స్కూలుకి సెలవిచ్చీసినారు’ అంది మాలక్ష్మి సంబరంగా.. ‘చాల్లే సంబరం.. తల తుడుసుకో.. ఊష్టమొస్తాది’ గదమాయించింది గౌరమ్మ.
 
వాన జోరు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. గాలీ అలాగే ఉంది. రాజయ్య కోసం గౌరమ్మ వీధిలోకి వచ్చిపోతూనే ఉంది. ఎప్పటికో సాయంత్రానికి నిలువునా నీళ్లోడుతూ వచ్చిన మొగుడు ఉలుకూ పలుకూ లేకుండా అలానే గడపలో నులకమంచం మీద కూలబడేసరికి పలకరించే ధైర్యం కూడా లేకపోయిందామెకు. ఆమె ఏమీ అనకుండానే ‘ఈ ఏడూ పంట మట్టి కల్సిపోయినట్టే’ లోగొంతుకలో అన్నాడు రాజయ్య. ఆ చీకట్లో అతన్ని చూస్తే దిగులు గడ్డ కట్టినట్టు ఉన్నాడు. దుఃఖాన్ని గొంతులోనే ఒడిసిపట్టి ‘ఏటి శేత్తాం.. ఏటికేడూ ఇలా బతుకు కాలిపోతంది.. దవిర్యం తెచ్చుకో’ అని తొట్రుపడుతున్న గొంతుకతో అంది గౌరమ్మ. ‘ఇంకేటి దవిర్యం.. పొలమంతా నీరు పోటెత్తీసినాది.. కాల్వ గట్టు కప్పినాం.. కానీ ఆకాసాన్ని, ఆపేత్తామా ఏటి.. వొరి ఏపాటి సేతికొత్తాదో అర్దం కాకుండా ఉంది’ అన్నాడు రాజయ్య.
 
అర్ధరాతి ‘అంబా’ అన్న అరుపుతో గౌరమ్మ దిగ్గున లేచింది. ‘మావా.. లెగులెగు ఆవు ఈనినట్టుంది’ గబగబా లేపింది. ఇద్దరూ ఒక్క ఉదుటున పెరట్లోకి వెళ్లారు.. ఆవు అవస్థ పడుతోంది. గిరగిరా తిరుగుతోంది. వాన, గాలి పెద్దగా లేకపోవడంతో కాస్త పొడిగా ఉన్నచోట ఆవును కట్టారు. మొత్తానికి ఆ పనంతా అయ్యేసరికి వెలుగొచ్చేసింది. ఆవు ఈనినందుకు సంతోషంగానే ఉన్నా ‘ ఈ వానలో దాని పేనానికీ మాకూ బోల్డు కట్టమొచ్చి పడింది’ అనుకుంది గౌరమ్మ.
 
ఓసారి నడుం వాల్చబోతూ ఉంటే నులకమంచం మీద పడుకున్న కూతురు మూలిగినట్టునిపించి అనుమానంగా వెళ్లి ఒంటిమీద చెయ్యేసింది. ‘బగవంతుడా.. మావా సూడు.. దీనొల్లు కాలిపోతంది’ అరిచినట్టే పిలిచింది. ‘ఏటయిందే.. రాత్తిరి బాగానే ఉంది కదేటే’ గాభరాగా అన్నాడు రాజయ్య. ‘పగలంతా సుబ్బరంగా తడిసింది. ఏటీ బాదలు..పిల్ల లెగ్గానే ఆస్పత్రికి తీసుకెల్లు.. ఆలీసం సెయ్యకు’ వొణుకుతున్న గొంతుకతో చెప్పింది.
 
త గ్గినట్టే తగ్గి విరుచుకు పడుతోంది వర్షం. ‘ ఈపాలికి పొలానికెల్లక్కర్లేదులే.. నిన్నటికే సేను నీట్లో తేల్తంది. బగమంతుడి దయ.. సేతిలో దేనికీ రూపాయి డబ్బు నేదు.. వొర్సానికి ఇంటి గోడ సుబ్బరంగా నానీసింది. పడిపోద్దో ఏటో.. వోనెలిస్తే తాపీమేస్త్రీని పిలిసి సిమెంటు పామించడమో.. ఏదో సెయ్యాల .. ఆవుకి తవుడో, సిట్టో కొనాల.. పిల్లకి మందులు కొనాలనీ, ఇండీషన్‌లు ఇప్పించాలని డాకుటేరు సెప్పాడు.. ఎవుర్ని అడిగితే ఎవురిత్తారు.. అందరి బాదా ఒకేనాగ ఉంది. ఏటీ తోసడం నేదు’ నిట్టూర్చాడు రాజయ్య. ‘బాగున్నోల్లు బాగుంటున్నారు.. మనలాటోల్లనే వోనలు, వొరదలు .. సిక్కులు .. సీకాకులు.. దేముడేటి సేత్తన్నాడో’ ఉసూరంది గౌరమ్మ.
 
దీపావళి..

ముసురు తగ్గింది.. వాన తెరిపిచ్చింది.. చెయ్యాల్సిందంతా చేసి, ఇక చాలన్నట్టు ఆకాశంలో మబ్బులు తేలిపోతున్నాయి. వరదల తర్వాత పరామర్శకు వచ్చే పెద్దల్లా సూర్యుడు అలనల్లన తొంగిచూస్తున్నాడు. పొలానికెళ్లిన రాజయ్య కోసం గౌరమ్మ ఎదురుచూస్తూనే ఉంది. మధ్యాహ్నమయింది.. సాయంత్రం కావస్తోంది.. ఆమెలో దిగులు పెరిగింది. సందె చీకట్లు కాసేపట్లో కమ్ముకుంటాయనగా, దూరంగా కాళ్లీడ్చుకుంటూ వస్తున్న పెనిమిటిని చూసి కోపం, కన్నీరు ఒకేసారి ఉప్పొంగాయి. ‘పగలనగా ఎల్లావు.. ఎటయ్యావో తెల్దు.. ఇక్కడ సచ్చి సచ్చి ఉన్నాను. ఎక్కడికెల్లిపోయావు.. కబురయినా ఎట్టావా.. మనిసివేనా నువ్వు’ దులిపేసింది.
 రాజయ్య మాట్లాడలేదు.
 
‘ముంగినాగున్నావు.. నోరు పడిపోయిందేటి’

 ‘నోర్ముయ్యే.. ఏటి సావమంటావు.. నాకు మాత్రం తెల్దా ఏటి?.. పొద్దెక్కిన కాడి నుంచి తెలిసినోల్లందరి దగ్గిరికి తిరుగుతున్నాను .. సేతిలో ఏగానీ లేదు.. పండగపూట .. నాను బతిమాలనోడు లేడు.. రెండు ఏల రూపాయలైనా కావాలి.. కూలోడినెట్టాలి.. మందులు కొనాలి.. గోడ బాగు సేయించాలి.. పిల్లకి మందులు.. ఆవుకు తిండి దేన్ని మానీమంటావు? నేదునేదన్నోడే కానీ ఒక్కడయినా అప్పిచ్చినోడు నేడు.. ఏటి సావమంటావు? పేనం సోలొచ్చి ఇంటికొత్తే సంపేత్తన్నావు’ అరిచేశాడు రాజయ్య.
 
మౌనంగా ఉండిపోయింది గౌరమ్మ.

 ‘ఏటి మాటాడవేటి.. ఏటి సెయ్యాల?’ వెటకారంగా అన్నాడు రాజయ్య.
 గౌరమ్మ మౌనంగానే వంటగదిలోకి వెళ్లింది. నీళ్లు నిండుకున్న ఆమె కళ్లకు ఫొటోలో సీతారాములు మసకమసగ్గా కనిపించారు. ఓ నిర్ణయానికొచ్చిన ఆమె ఫొటో ముందు నిలబడింది. దండం పెట్టి.. ‘తల్లీ,తండ్రీ... మరో దారి లేకపోయింది.. తప్పు కాయండి’ అని మెళ్లో శతమానం తీసింది. పుట్టింటి వాళ్లు పెట్టిన రెండు తులాల గొలుసు తీస్తున్నప్పుడు ఆమె చేయి వణికింది. నులక మంచం మీద కూర్చున్న రాజయ్య చేతిలో దాన్ని ఉంచింది మౌనంగా.. ఏదో ఆలోచిస్తున్న రాజయ్య చీకట్లో చేతిలో గొలుసు చూసి నిర్ఘాంతపోయాడు.

‘ఏటే ఇది.. పండగేల.. ఏటయింది నీకు.. నేను లేననుకున్నావా?’ వణుకుతున్న గొంతుకతో అడిగాడు. ‘మావా మరేటనక.. నీకూ, నాకూ మరో దారి లేదు.. ఎల్లి తనకా ఎట్టు.. రోజులు బాగుంటే ఇడిపించుకోకపోం’ స్థిరంగా అంది గౌరమ్మ. స్పృహలోకొచ్చిన దాన్లా ‘సాయంత్రం పిల్ల ఏటో కొనుక్కుంటానని వయిదు రూపాయిలొట్టుకెల్లింది. సీకటొడిపోతంది.. ఎక్కడికెల్లిందో తెల్దు’ అని ఆందోళనగా అంది.’ దానికి బాగునేదు కదా.. బయటకెందుకెల్లనిచ్చినావు’ కసిరాడు రాజయ్య.
 
గబగబా ఇద్దరూ గ డపలోకొచ్చారు.. ఆ మూల.. చీకట్లో.. మాలక్ష్మి.. ఒద్దిగ్గా కూర్చుని.. సీసాతో తాను తెచ్చుకున్న నూనె  నాలుగు ప్రమిదల్లో పోసి.. చిరుదీపాలు వెలిగిస్తోంది. గాలి వీస్తున్నా నిశ్చలంగా వెలుగుతున్న దీపాలు కమ్ముతున్న చీకట్లను తరిమేస్తున్నాయి. ఆ వెలుగులో పసిదాని మొహంలో నవ్వు ధగధగలాడుతోంది. కళ్లారా కూతుర్ని చూసి భార్య వైపు చూపు తిప్పిన రాజయ్యకు గౌరమ్మ ముక్కు నత్తు పక్కనే అశ్రు బిందువు మంచి ముత్యంలా కనిపించి అబ్బురమనిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement