= హాజరైన మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య
నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన (పురా) ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలంలో రూ.168.52 కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పనుల అమలుపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు కలెక్టర్ కిషన్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింత నెక్కొండ, రోళ్లకల్లు, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూర్, పెద్దతండాల్లో ప్రభుత్వం పుర ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది.
ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రాజెక్ట్ అమలు చేసేందుకు మొత్తం రూ.168.52 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ.123.34 కోట్లు (73 శాతం కేంద్ర ప్రభుత్వం), రూ.25.80 కోట్లు (15 శాతం రాష్ట్ర ప్రభుత్వం) రూ.19.38 కోట్లు (11 శాతం కన్సోరిటీయం) చెల్లిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను యుగాంతర్, ఎస్‌వీఈసీ సంస్థలు చేపట్టనున్నాయి.
ఈ మేరకు పర్వతగిరి పెద్ద చెరువులోకి ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటిని పంపింగ్ చేసి సాగు, తాగునీరు అందించేందుకు రూ. 41 కోట్లు, మైనర్, మేజర్ ఇరిగేషన్ పనులను చేపట్టేందుకు రూ.36 కోట్ల ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పంపే విషయంపై మంత్రి, ఎంపీ, కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్ ఎస్‌ఆర్‌ఎస్‌పీ అధికారులు, ఇరిగేషన్ విభాగం అధికారులతో సుమారు రెండుగంటలపాటు చర్చించారు.
కాగా, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పక్షాన పుర పనులను డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్ పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో భూమి కొనుగోలుకు సుమారు రూ. 3 కోట్లు, నీటి పంపిణీకి రూ.36.60 కోట్లు, వాటర్‌షెడ్ల నిర్మాణం కోసం రూ.14.94 కోట్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 6.82 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీలకు రూ. 1.85 కోట్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణకు రూ. 1.59 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ. 4.80 కోట్లు, రూరల్ బిజినెస్ హబ్‌కు రూ. 53 లక్షలు, ల్యాండ్ ఇన్ఫర్‌మేషన్ సిస్టంకు రూ.52 లక్షలు, కమ్యూనిటీ రేడియో ఏర్పాటుకురూ. 63లక్షలు, వాటర్ సస్టెనబులిటీకి రూ.41.53 కోట్లు, బ్రాడ్‌బాండ్‌కు రూ.63లక్షలు, ప్యాక్‌హౌస్‌కు రూ.1.19కోట్లు, రీఫర్ వ్యాన్‌కు రూ.60 లక్షలు, కామన్ సర్వీస్ సెంటర్‌కు రూ.47లక్షలు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌కు రూ.33 లక్షలు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. కాగా, ఆర్థిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.6.11 కోట్లతో జిన్నింగ్ మిల్లు ఏర్పాటు, రూ.3.20 కోట్లతో రూరల్ గోదాం నిర్మాణం, రూ.11 లక్షల తో ఇంటర్‌నెట్ కియోస్క్, రూ.3.16 కోట్లతో లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
గత జూలై 22వ తేదీన పురా ప్రాజెక్ట్ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సి ఉండగా... చివరి నిమిషంలో సీఎం రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఈ నెల చివరన ... లేకుంటే నవంబర్ మొదటి వారంలో గాని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, పురా ప్రాజెక్ట్‌ను కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంతోపాటు మరో గ్రామంలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలుకు ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.