Kajipeta
-
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..! ఇక అంతే సంగతులు..!!
వరంగల్: ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్‌పై అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. షోరూంలలో కనిపించని వస్తువులు అనేకం ఆన్లైన్ షాపింగ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే నెట్లో కనిపించే ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలన్నీ నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రచారంలో చెప్పేదొకటి.. ఆర్డర్ ఇవ్వగానే డెలివరీ అయ్యేది మరోటి. పైగా ధరల్లో తేడాలు. దీని గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్‌లో చాలా తక్కువ ధరలకే వివిధ రకాల ఉత్పత్తులను లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, రెడీమేడ్స్, లేడీస్ యాక్సెసరీస్, కాస్మోటిక్స్, స్మార్ట్ఫోన్లు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్డర్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయా కంపెనీలు వాటిని ఇంటికే నేరుగా సరఫరా చేస్తాయి. ఇంట్లో కూర్చోనే కావాల్సిన వస్తువులను హాయిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చూడడానికి, వినడానికి ఇది ఎంతో బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వస్తువులు ఇంటికి రాగానే వాటిని చూసి అవాకై ్కపోతున్న వారు అధిక శాతం మంది ఉన్నారు. ఆకర్షణలకు లొంగొద్దు.. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చే కంపెనీల్లో నమ్మకమైనవే కాకుండా కొన్ని బోగస్ కంపెనీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక స్మార్ట్‌ఫోన్‌కు ధర చెల్లిస్తే ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెప్పారు. తీరా ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్యాక్‌ను తెరిస్తే బొమ్మ ఫోన్ లేదా రాళ్లు నింపి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే రెడీమేడ్ వస్తువులు ఆర్డర్ ఇస్తే నాసిరకం ఉత్పత్తులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా వారిచ్చిన నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. దీంతో తాము మోసపోయమని గ్రహించిన పట్టించుకునే వారు ఉండరు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని ఉండడం మంచిది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు.. ► సదరు కంపెనీ ఎలాంటి ఉత్పత్తులపై వ్యాపారం చేస్తుందో గమనించాలి. ► కంపెనీకి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువులు, షాపింగ్ మాల్స్‌లో లభించే వస్తువుల ధరల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో గమనించాలి. ► ఆయా ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్స్, వివిధ రకాల ఆఫర్ల గుర్తించి అవగాహన ఉండాలి. ► బోగస్ కంపెనీల గురించి తరచూ పత్రికల్లోకానీ, పోలీసులు చెబుతుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ► ఆన్లైన్ మోసాలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ► ఎప్పుడైనా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ► ఆన్లైన్ కంపెనీలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. వాటి అడ్రస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే సదరు నంబరుకు ఫోన్ చేయాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్‌పై కంపెనీల చిరునామా, ఎప్పుడు తయారయ్యాయే? గమనించడంవంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లను నమ్మితే ఇక అంతే.. డిస్కౌంట్లు.. డిస్కౌంట్లు. అప్టు 50 పర్సంట్, 75 పర్సంట్ వరకు తగ్గింపు.. ఒక వస్తువు కొంటే మరోటి ఫ్రీ.. పైగా ఉచిత డోర్ డెలివరీ.. ఇలా ఒకటేమిటి ఆన్లైన్ షాపింగ్‌లో అన్నీ ఇలాంటి ఆఫర్లే దర్శనమిస్తాయి. బోగస్ ప్రకటనలెన్నో. ఇందులో కొన్ని నిజం కూడా కావొచ్చు.. అయితే ఉద్యోగాలు, ఇంటి పనులతో సమయం చిక్కని వారికి ఆన్లైన్ షాపింగ్ వరమే. కానీ ఆన్లైన్ షాపింగ్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తగిన సూచనలు పాటిస్తూ, విచక్షణ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి ఆన్లైన్లో కనిపించే ప్రతి ప్రకటన నిజమేననే భ్రమ వీడాలి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆయా కంపెనీలకు ఉన్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడు మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. –సార్ల రాజు సీఐ, కాజీపేట -
వినాయక చవితి: కానరాని సందడి
సాక్షి, హన్మకొండ : జిల్లావ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు శనివారం ఆరంభమయ్యాయి. కరోనా నిబంధనల కారణంగా గతంతో పోలిస్తే ఈసారి సందడి కనిపించడలేదు. చాలాచోట్ల మండపాలు ఏర్పాటుచేయకపోగా, ఎక్కువ మంది ఇళ్లలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కాగా, హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో మహాగణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన పూజలు చేయగా, వేదికపై విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ – రేవతి దంపతులు ప్రారంభించారు. ఆ తర్వాత మూషిక వాహనసేవలో చీఫ్ విప్‌తో పాటు గ్రేటర్ డిప్యూటీ మేయర్ సిరాజుదీ్దన్, ఈఓ పనతుల వేణుగోపాల్, అర్చకులు మణికంశర్మ, ప్రణవ్, నాయకులు పులి రజనీకాంత్, గండ్రాతి రాజు పాల్గొన్నారు. ఇక మేయర్ గుండా ప్రకాశ్‌రావు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కాగా, తొలిరోజు గణపతిని హరిద్రాగణపతిగా అలంకరించగా, రెండో రోజైన ఆదివారం ద్విముఖ గణపతిగా అలంకరించి పూజలు చేయడంతో పాటు ఐరావత వాహనసేవ, పల్లకీసేవ నిర్వహించారు. భద్రకాళి ఆలయంలో... హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీగణపతి నవరాత్రయాగం ప్రారంభమయింది. గణపతినవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం ఉదయం ఆయప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యాన వల్లభగణపతికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి ఉపాసకులు అర్చకులు అరవింద్‌శర్మ, వేముగంటి కాళీప్రసాదశర్మ నేతృత్వంలో శ్రీ గణపతి నవరాత్రి యాగాన్ని నిర్వహించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ – రేవతి దంపతులు పూజల్లో పాల్గొనడంతో పాటు గణపతి ఉత్సవాల నిర్వహణకు రూ.10వేల విరాళం అందజేశారు. మల్లన్న ఆలయంలో... ఐనవోలు : ఐనవోలులోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేశారు. అర్చకులు పాతర్లపాటి రవీందర్, పురోహిత్ ఐనవోలు మధుకర్ శర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్వేతార్కుడిపై సూర్య కిరణాలు కాజీపేట: కాజీపేటలోని స్వయంభూ శ్రీ శ్వేతార్కమూలగణపతి స్వామి వారిపై ఆదివారం సూర్య కిరణాలు ప్రసరించాయి. ఈ మేరకు ప్రత్యేక పూజల్లో ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంతమల్లయ్యశర్మ, గణపతి ఉపాసకులు త్రిగుళ్ల శ్రీనివాస్‌శర్మ, కార్పొరేటర్ జక్కుల రమ, రవీందర్‌యాదవ్, మహతి – రాధాకృష్ణ, కళ్యాణి – సాయికృష్ణ, చొక్కరపు శ్రీనివాస్, దేవులపల్లి సదానందం, శనిగరపు రాజ్‌మోహన్, రవి, మణిదీప్, సుధీర్ పాల్గొన్నారు. ఖిలా వరంగల్: వరంగల్ పెరకవాడలోని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ క్యాంప్ కార్యాలయంలో విత్తన గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఈ పూజలో ఎమ్మెల్యే సతీమణి వాణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కరీమాబాద్ : వినాయక చవితి సందర్భంగా హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో చైర్మన్ మర్రి యాదవరెడ్డి పూజలు నిర్వహించారు. హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చైర్మన్ మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రె రెడ్డి, డైరెక్టర్ అన్నమనేని జగన్మోహన్రావు, సీఈఓ ఉషశ్రీ పూజలు చేశారు. ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ ప్రాంతంలో భక్త సమాజ్ అధ్యక్షుడు నిషాంత్ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్ ఝెంబాడి రవీందర్, నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్, సదానందం, మహ్మద్ అయూబ్ దర్శించుకున్నారు. వరంగల్: వరంగల్‌లో 28వ డివిజన్ కార్పొరేటర్ ఝెలగం లీలావతి పసుపుతో వినాయక ప్రతిమ తయారుచేసి పూజలు చేశారు. కాజీపేట అర్బన్ : హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలో అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేష్‌కుమార్ ఆధ్వర్యాన లక్ష్మీగణపతిని సిద్దిబుద్ధి సమేత వరసిద్ది వినాయకుడిగా అలంకరించి పూజలు చేశారు. వరంగల్ లీగల్ : కరోనా నిబంధనల కారణంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదుట ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. కాజీపేట: కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ముస్లింలైన నిర్వాహకులు ఎం.డీ.యాకూబీ – చోటు సమాజ కట్టుబాట్లను పక్కన బెట్టి వృద్ధులతో కలిసి పూజలు చేశారు. -
కోర్టులో లొంగిపోనున్న ప్రదీప్‌రెడ్డి?
సాక్షి, కాజీపేట అర్బన్ : ఖమ్మం అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోకు ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సూత్రదారి పింగిళి ప్రదీప్‌రెడ్డి సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు పుకార్లు శికార్లు చేస్తున్నాయి. ఆనంద్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి మధ్య ఇసుక వ్యాపారం నిమిత్తం 80 లక్షల లావాదేవీల చెల్లింపులో భాగంగా శనిగరంకు చెందిన శనిగరం గ్రామానికి చెందిన పింగిళి ప్రదీప్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, రమేష్ ఈనెల 7న కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద్‌రెడ్డిని కమలాపూర్ మండలం హన్మకొండలో కిడ్నాప్ చేసి భూపాలపల్లి జిల్లా రామారం అడవుల్లో గట్టమ్మగుడి దగ్గర దారుణంగా హత్య చేశారు. లేబర్ ఆఫీసర్ ఆనంద్‌రెడ్డి దారుణ హత్య మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగానే.. ప్రదీప్‌రెడ్డిపై అనుమానం ఉందని మృతుడు ఆనంద్‌రెడ్డి సోదరుడు శివకుమార్‌రెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో ఆరుగురు పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు శివరామకృష్ణ, శంకర్, మధుకర్‌లను అరెస్టు చేసి వాహనాన్ని, కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగి వారం అవుతున్నా మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లోనే 2 స్పెషల్ టీంలు.. ఆనంద్‌రెడ్డి హత్య కేసును వరంగల్ కమిషనరేట్ పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి రెండు స్పెషల్ టీంలు ముగ్గురు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని హోటళ్లలో బస చేశారనే సమాచారంతో తనిఖీలు చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ రెడ్డి ఎవరు? ఆనంద్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు పింగిళి ప్రదీప్‌రెడ్డి మిత్రుడుగా పేర్కొంటున్న విక్రమ్‌రెడ్డి ఎవరు అనే కోనంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌రెడ్డి బంధువులు పోలీస్ విభాగంలో ఉన్నారని, ఇందుమూలంగానే అరెస్ట్ పర్వం ఆలస్యం అవుతుందనే అనుమానం తలెత్తుతుంది. -
'స్వచ్ఛ’ ర్యాంకులు: వరంగల్ 51, కాజీపేట స్టేషన్ 67
సాక్షి, కాజీపేట: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని స్టేషన్ల కు అధికారులు బుధవారం ‘స్వచ్ఛ రైల్ – స్వచ్ఛ భారత్’ ర్యాంకులను ప్రకటించారు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, తరలింపు, ప్రయాణికులకు అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటాయించారు. ఈ మేరకు వరంగల్ రైల్వే స్టేషన్‌కు 51వ ర్యాంక్, కాజీపేట జంక్షన్‌కు 67వ ర్యాంక్ లభించింది. అయితే, గత ఏడాది వరంగల్ రైల్వే స్టేషన్‌కు 3వ ర్యాంక్ రాగా ఈ ఏడాది 51వ స్థానానికి పడిపోవడంతో గమనార్హం. రూ.కోట్ల నిధులు వెచ్చించి అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిలో అత్యాధునీకరించిన వరంగల్ రైల్వే స్టేషన్‌కు ర్యాంకు తగ్గడాన్ని రైల్వే అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు
సాక్షి, వరంగల్: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి లో బుధవారం చోటు చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. దొడ్ల నరేష్(22) కొన్ని నెలలుగా మతి స్థిమితం కోల్పోయాడు. బుధవారం తల్లి లక్ష్మితో కలిసి వ్యవసాయ భూమిలో పంటకు మందు కొట్టేందుకు వెళ్లారు. తల్లి నీళ్లు తాగేందుకు కొంతదూరం వెళ్లగా నరేష్ వద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. గమణించిన తల్లి స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం చిట్యాల సామాజిక ఆరోగ్యానికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మతిస్థిమితం కోల్పోయిన నరేష్ గతంలో కూడా రెండుసార్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్సాడ్డాడని తెలిపారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పల్లె నర్సింగ్ తెలిపారు. ఉరి వేసుకుని మరో యువకుడు.. కాజీపేట: ప్రభుత్వ ఐటీఐ చదువులో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మానసిక ఆవేదనతో క్షణికావేశానికిలోనై ఓ యువకుడు బుధవారం కాజీపేట ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ అజయ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. రామకృష్ణకాలనీకి చెందిన తాండ్ర అరవింద్(20) ఇటీవల ఐటీఐలో ఫెయిల్ అయ్యాడు. కొద్ది రోజులుగా మిత్రులతో కలిసి క్యాటరింగ్ పనులకు వెళ్తున్నాడు. చదువులో వెనుకబడిపోయాననే బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపాడు. మహిళా ఆత్మహత్యాయత్నం.. నర్మెట: ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానకి పాల్ప డింది. ఈ సంఘటన మండలంలోని ఆగాపేటలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొన్నేళ్లుగా వ్యవసా యం కలసిరాకపోవడంతో రైతు శిల్వారెడ్డి అప్పులపాలై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది కూడా వర్షాలు కురవకపోవడంతో మనస్తాపానికి గురైన రైతు భార్య సబీనమ్మ బుధవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఎంజీఎంకు తరలించారు. -
శబ్దాన్ని ఆపండి..
కాజీపేట: పరీక్షల కోసం విద్యార్థులు ఎంతో ఏకాగ్రతతో చదువుతుంటారు. ఆ సమయంలో ఏదైనా ఇబ్బందికలిగితే వారి ఏకాగ్రత దెబ్బతిని చదువుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు. ప్రధానంగా పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవితవ్యానికి మార్గం చూపే వార్షిక పరీక్షల సమయంలో ఈ పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తుంటాయి. అయితే మారుతున్న కాలాన్నిబట్టి వాహనాల రణగొనధ్వనులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రభావం పరీక్షల సమయంలో విద్యార్థులపై ఎక్కువగా ఉంటోంది. కాలనీల్లో ఆగని మైక్‌ల గోల... ఉదయం 6గంటలకే ఉల్లిపాయలోయ్.. ఉల్లిపాయలంటూ ఆటోలో మైక్ సెట్‌తో ఒకరు రెఢీ. గ్యాస్ స్టవ్‌లు బాగు చేస్తామంటూ ఇంకొక్కరు సిద్దం. ఇవన్నీ వెరసి ప్రశాంత వాతావరణంలో చదువుకునే విద్యార్థుల ఏకాగ్రతను భగ్నం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న మైకులతో వచ్చే శబ్దంతో అటు విద్యార్థులు, ఇటు వృద్ధులతోపాటు సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులు మానసిక ఆందోళనతో పాటు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కల్యాణ మండపాల్లో హోరు.. పెళ్లిళ్లు, చిన్న చిన్న వినోద కార్యక్రమాలు నిర్వహించే కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఊరికి దూరంగా విశాలమైన ప్రాంతాల్లో ఉండేవి. కాలక్రమేణా ఇవి నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. పెళ్లంటే ఒకప్పుడు సన్నాయి, మేళతాళాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు సంగీత్ పేరుతో రెండు రోజుల ముందు నుంచే ఆర్కెస్ట్రా, మ్యూజిక్, తీన్మార్లతో హోరెత్తించేస్తున్నారు. రకరకాల బ్యాండ్లతో కిలో మీటర్ల మేర వినిపించే మోతకు తోడు, బాణాసంచా పేలుళ్లతో బెంబేలెత్తిస్తూ సరికొత్త సమస్యలకు కేంద్రాలుగా మారుస్తున్నారు. దీనికితోడు ఆటోలు, మోటారు సైకిళ్లు, లారీలు, బస్సుల హారన్ల మోత భరించలేనిదిగా మారింది. చిన్నచిన్న వ్యాపారులు తోపుడు బండ్లు, ఆటోల్లో మైకుల ద్వారా చేస్తున్న ప్రచారం చికాకు తెప్పించేదే. 40 డెసిబుల్స్ దాటకూడదు.. శబ్ధ తీవ్రతను డెసిబల్స్‌లో కొలుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ధ్వని తీవ్రత 40 డెసిబుల్స్ లోపు ఉండాలి. అయితే వరంగల్ నగరంలోనే గాక రాష్ట్రంలోని చాలా పట్టణాల్లో ధ్వని తీవ్రత 55 డెసిబుల్స్ వరకూ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ ఎలా.. డెసిబల్స్‌లో గ్రంథాలయాలు 45 దుకాణాలు, రెస్టారెంట్లు 65 పారిశ్రామిక ప్రాంతం 70 ఆసుపత్రులు 40 కార్యాలయాలు 50 నివాసప్రాంతాలు 55 నిశబ్ద జోన్ 10 నిబంధనలు ఏం చెబుతున్నాయి..? శబ్ద కాలుష్యాన్ని ఎలా ఎదుర్కోవాలి?, నివాసప్రాంతాలు, వ్యాపారకూడళ్లు, పారిశ్రామిక వాడల్లో ధ్వనితీవ్రత ఎలా ఉండాలి?, పరిమితికి మించి శబ్దంతో ఏమవుతుంది?, చదువు, ప్రశాంతతకు భంగం కలిగించే రణగొణ ధ్వనులు వేధిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి లాంటి ప్రశ్నలకు సమాధానాలివే... అనుమతి తప్పనిసరి..! మన ఇంట్లో అయినా సరే పరిమితికి మించి శబ్దం బయటకు రాకూడదు. ఉదాహరణకు టీవీ, టేప్రికార్డు సౌండు, చుట్టుపక్కల వారి ప్రశాంతతకు భంగం కలిగించకూడదు. భజనల పేరిట నిర్వహించే పూజల్లో మైకులు వినియోగించాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. రాత్రి 9గంటల తర్వాత మైకులు వినియోగిస్తే చుట్టుపక్కల వారు అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడంతో పగలు, రాత్రి వేళల్లో మైకుల మోతలపై నిషేదం విధిస్తున్నారు. మైకులు వినిఝెగించాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలి. ఎక్కడ, ఏ రోజు ఎప్పటినుంచి ఎప్పటి వరకు మైకు వినియోగిస్తారో తదితర వివరాలను తెలియజేస్తూ దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఇక్కడ.. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా అనుమతి కోసం దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. వాటిని సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తారు. అక్కడి సీఐ దాన్ని పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఏసీపీ స్థాయి అధికారికి పంపిస్తారు. ఆయన క్షుణ్నంగా పరిశీలించి అనుమతిస్తారు. ఒక్కోసారి కొంతమంది ప్రార్ధనా మందిరాలు, పాఠశాలలు, ఆసుపత్రులకు సమీపంలో మైకు పెట్టేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తారు. వీటిని ఆయా అధికారులు పరిశీలించి అనుమతిని తిరస్కరించేందుకే ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఇలా చేస్తే మేలు... నివాస ప్రాంతాల్లో మైకుల ప్రచారాన్ని కట్టడి చేయాలి. పగటి వేళల్లో శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాటిని నియంత్రించాలి. పాఠశాలకు సమీపంలో ఎలాంటి ధ్వనులు, గోల లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. -
‘సఖీ’తో సమస్యల పరిష్కారం
కాజీపేట అర్బన్ : బాధిత మహిళల సంరక్షణ, వసతి, పోలీస్, న్యాయ సేవలందించేందుకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది సఖీ/వన్‌స్టాప్ సెంటర్. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర సమస్యలను ఒకే చోట పరిష్కారం అందించేందుకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఇది తోడ్పడుతోంది. 24 గంటలు అందుబాటులో సేవలందిస్తూ నేడు మహిళలకు, బాలికల సంరక్షణకు ఆత్మీయ నేస్తంగా సఖీ సెంటర్ మారింది. 2017 డిసెంబర్లో ప్రారంభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్స్, 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, డీవీ సెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 186 వన్‌స్టాప్ సెంటర్లను ప్రారంభించేందుక శ్రీకారం చుట్టగా రాష్ట్రంలోని పది జిల్లాలను ఎంపిక చేసింది. వీటిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవలందించేందుక ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో 2017 డిసెంబర్లో సర్వోదయ యూత్ ఆరనైజేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలో సఖి/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. సఖీ సెంటర్ కార్యాలయం అందుబాటులో సేవలు.. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలపాటు సఖి/వన్‌స్టాప్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మహిళలకు, బాలికలకు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్ సహాయం, కోర్టుకు రాలేని బాధిత మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సహాయం అందిస్తారు. వన్‌స్టాప్ సెంటర్ వీరికే.. బాధిత మహిళలు, బాలికలకు సేవలందించే లక్ష్యంతో సఖీ/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న, లైంగిక వేదింపులు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, పనిచేసే చోట లైం గిక వేదింపులకు గురి చేసే చోట అన్ని శాఖ సమన్వయంతో పరిష్కార మార్గాలను చూపుతుంది. వన్‌స్టాప్ అంబులెన్స్ 260 సమస్యల పరిష్కారం.. మహిళలకు, బాలికలకు తక్షణ రక్షణ, తాత్కాలికంగా ఐదు రోజుల వసతిని అందిస్తూ బాధితులకు మేమున్నామనే భరోసానందిస్తుంది సఖీ సెంటర్. గత పదిహేను నెలల్లో సుమారు 260 బాధిత మహిళల సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని 58 డివిజన్ల్లో సఖీ సెంటర్ సేవలపై విస్త్రత ప్రచారం అందిస్తూ బాధితులకు చేరువవుతున్నారు. నిరంతర సేవలందిస్తున్నాం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధిత మహిళలకు నిరంతరం సేవలందించడం ఆనందంగా ఉంది. హింసా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. న్యాయ, పోలీసు, వైద్య సేవలతో పాటు తాత్కాలిక వసతి అందించి కౌన్సిలింగ్ ద్వారా మార్పునకు నాంది పలుకుతున్నాం. – పల్లెపాటు దామోదర్, సఖీ సెంటర్ నిర్వాహకుడు -
యువదొంగకి దేహశుద్ధి
సాక్షి, కాజీపేట: ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు అభరణాలను దొంగిలించడానికి ప్రయత్నించిన యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం రాత్రి బాపూజీనగర్‌లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం కొంపెల్లి శేషమ్మ(62) భర్త చనిపోవడంతో రైల్వే ఫించన్‌పై ఆధారపడి జీవిస్తుంది. కొడుకు వేరే ఇంటిలో ఉంటుండడంతో తాను కట్టుకున్న ఇంట్లోనే శాంతమ్మ ఒంటరిగా ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ యువకుడు వృద్ధురాలి మెడలో ఉన్న నగలపై కన్నెసి గురువారం రాత్రి ఇంటి వెనుక తలుపు లేపుకుని లోపలి చోరబడి దాడి చేశాడు. శేషమ్మ మెడలో ఉన్న బంగారు అభరణాలను తెంచుకోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటిస్తునే కేకలు వేయడంతో స్థానికులు అటుగా రావడంతో బయపడి బయటకు పరుగెత్తాడు. స్థానికులు ఏం జరిగిందని అడిగి తెల్సుకుంటుండగా నేరం తనపైకి రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ యువకుడు వృద్ధురాలి కొడుకు ఇంటికి వెళ్లి మీ అమ్మ వాళ్ల ఇంటి దగ్గర ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వారితో కలిసి ఏం తెలియనట్లుగానే మళ్లీ ఘటన స్థలికి వచ్చాడు. సదరు యువకుడిని గుర్తించిన వృద్ధురాలు స్థానికులకు చూపించింది. దీంతో వారు ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. అప్పటికే కాలనీవాసులు 100 డయల్‌కు ఫోన్ చేయడంతో బ్లూకోర్ట్స్ టీం పోలీసులు వచ్చి యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించి వాస్తవ పరిస్థితిపై విచారణ జరుపుతున్నారు. ఈ పేనుగులాటలో వృద్ధురాలి మెడ నుంచి ఎటువంటి బంగారు నగలు పోలేదని పోలీసులు తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్లో గుర్తులుండవ్..
సాక్షి, కాజీపేట: సాధారణంగా సర్పంచి నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు ఉంటాయి. స్వతంత్ర అభ్యర్థులకు సైతం ఎన్నికల కమిషన్ సూచించిన ఏదో ఒక గుర్తు కేటాయిస్తారు. కానీ పోస్టల్ బ్యాలెట్లో మాత్రం గుర్తులు ఉండవు. అభ్యర్థుల పేర్లు, పార్టీల పేర్లు మాత్రమే ఉంటాయి. గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినప్పుడు మామూలు ఓటర్లకిచ్చే బ్యాలెట్ పత్రాన్నే ఉద్యోగులకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఈవీఎం యంత్రాలు రావడంతో వారికి యంత్రంలో ఓటేసే పరిస్థితి లేదు. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటుచేశారు. ఎన్నికల విధులకు వెళ్లే అధికారులు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల శిక్షణ ముగిసేలోపు వారంతా పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12 ద్వారా వారు తమ పూర్తి వివరాలు రాసి దరఖాస్తు చేసుకుంటారు. కౌంటింగ్‌లో మొదటగా పోస్టల్ బ్యాలెట్లనే అధికారులు లెక్కగడతారు. ఏ అభ్యర్థికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని లెక్కచూసిన తర్వాతే ఈవీఎం యంత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు. రెండో ఈవీఎం ఎప్పుడు వినియోగిస్తారంటే... కాజీపేట: పెరిగిన సాంకేతికతను దృష్టిలో పెట్టుకుని కొద్ది కాలంగా ప్రతి ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల స్థానంలో ఈవీఎంలను వినియోగిస్తున్నారు. ఒక ఈవీఎంలో 64 మంది అభ్యర్థుల పేర్లను రికార్డు చేయవచ్చు. అంతకు మించి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉంటే రెండో ఈవీఎంను వినియోగిస్తారు. ఒక ఈవీఎంలో 3,740 ఓట్లు మాత్రమే వేయడానికి అవకాశం ఉంటుంది. -
ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ పాలన
కాజీపేట : ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు కొనసాగడం వల్లే తెలంగాణ జన సమితి ఆవిర్భావం జరిగిందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో సీమాంధ్ర నాయకులతో కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజా వ్యతిరేకతో కూడిన కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్పష్టమైన విధానాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. జిల్లా కోఆర్డినేటర్ బోట్ల భిక్షపతి మాట్లాడుతూ ఆదివారం ఎర్రగట్టు గుట్ట కింద ఉన్న బాలాజీ ఫంక్షన్హాల్లో నిర్వహించే రాజ కీయ శిక్షణ తరగతులను విజయవంతం చే యాలన్నారు. రాజేంద్రప్రసాద్, రాజేందర్, పులి సత్యం, తిరునహరి శేషు, శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ఛత్రపతిశివాజీ, డా.కృష్ణ, శ్రావణ్, శ్రీకాంత్, శివ పాల్గొన్నారు. -
వీసా పేరిట టోకరా..
కాజీపేట అర్బన్ : సామాజిక మాధ్యమాలు మానవ సంబంధాలను దగ్గర చేస్తూ.. ఉపాధికి బాటాగా నిలుస్తుండగా.. మరో వైపు సైబర్ నేరగాళ్లకు పైసా వసూల్‌కు ప్రజలను దగ్గర చేస్తున్నాయి. ఉద్యోగాల పేరిట, రుణాల అందిస్తామని, నూతన ఏటీఎం కార్డును పంపిస్తామని నిత్యం ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తమవడం లేదు. ఇందుకు జిల్లాలో జరిగిన ఈ తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. యూఎస్‌కు వీసా ఇస్తామని నమ్మబలికి ఏకంగా తమ అకౌంట్లో రూ.6.97 లక్షలను వేయించుకుని ఓ సైబర్ నేరగాడు ఓ నిరుద్యోగిని నిలువు దోపిడీ చేశాడు. సూబేదారి పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాట్సప్ అంటూ పలకరింపు ... సుబేదారి ఎన్జీఓస్ కాలనీకి చెందిన మహేష్‌చంద్ర బికాం కంప్యూర్స్ పూర్తి చేసి దుబాయ్‌లోని బెహరీన్‌లో ఉద్యోగం చేసి ఈ ఏడాది నగరానికి విచ్చేశాడు. ఆన్లైన్ ఉద్యోగాల కోసం తన బయోడేటాను జనవరిలో పొందుపర్చాడు. మార్చిలో యూఎస్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ మహేష్‌చంద్ర సెల్‌ఫోన్‌కు వాట్సప్ బ్రదర్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. యూఎస్‌కు వీసా అందిస్తానని నమ్మబలికాడు సదరు వాట్సప్ కాల్ సైబర్ నేరగాడు. రూ.6.97 లక్షల చెల్లింపు యూఎస్‌కు వీసా అందించేందుకు సహకరిస్తానని ఆన్లైన్లో బయోడేటాను స్వీకరించానని మార్చిలో వాట్సప్ కాల్ ద్వారా పరిచమైన వ్యక్తి మహేష్ చంద్రకు తెలిపాడు. సదరు వ్యక్తి మాటలను నమ్మిన మహేష్‌చంద్ర తొలుత మార్చి 23న రెస్యూమ్ రిజిస్ట్రేషన్‌కు రూ.30 వేలు ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్లో వేశాడు. మెడికల్ చెకప్, అగ్రిమెంట్, జాబ్‌ష్యూరిటీ పేరిట ఆరు సార్లు వివిధ అకౌంట్లలోకి సుమారు రూ.6.97 లక్షలను ఏప్రిల్ 27వ తేదీ వరకు జమ చేశాడు. అనంతరం వాట్సప్ కాల్ వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో మహేష్‌చంద్ర మోసపోయినట్లు నిర్దారించుకుని ఆదివారం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ సైబర్ నేరం కింద చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
‘సివిల్స్’లో ఓరుగల్లు కెరటం
కాజీపేట అర్బన్ : చారిత్రక ఓరుగల్లు నగర యువకుడు ఎడవెల్లి అక్షయ్‌కుమార్ సివిల్స్‌లో ప్రతిభ చాటాడు. తాత, తండ్రి స్ఫూర్తితో రక్షకభటుడిగా దేశానికి సేవలందించాలనే లక్ష్యంతో సివిల్స్‌లో ఐఏఎస్‌కు అవకాశం ఉన్నా ఐపీఎస్‌ను ఎంచుకున్నాడు. 2017 జూన్‌లో ప్రిలిమినరీ, అక్టోబర్‌లో మెయిన్స్‌కు హాజరయ్యాడు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 15 వరకు ఇంటర్వ్యూల్లో పాల్గొని శుక్రవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 624వ ర్యాంకు సాధించి ఓరుగల్లు కీర్తిని చాటాడు. ఈ సందర్భంగా ఎడవెల్లి అక్షయ్‌కుమార్ ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే.. తాత, నాన్నే స్ఫూర్తి.. మా తాత, నాన్న ఇద్దరూ పోలీస్‌శాఖలో పనిచేస్తున్నారు. మా నాన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో పనిచేస్తున్న తరుణంలో ఒక రోజు నన్ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు. నాడు నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారిని నిలువరించేందుకు చేపట్టే వ్యూహాలు, చర్యలు చాలా బాగా నచ్చాయి. నాడే పోలీసుగా మారాలని నిర్ణయించుకున్నా. నాన్న ప్రస్తుతం మడికొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. దుబాయ్‌లో రూ.40 లక్షల అవకాశం వచ్చినా.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన ఎడవెల్లి దయాకర్, స్రవంతి నా తల్లిదండ్రులు. బాలసముద్రంలోని గురుకుల్ పాఠశాలలో పదో తరగతి వరకు, ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, భూపాల్‌లోని నిట్‌లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. బీటెక్ పూర్తి చేస్తున్న తరుణంలోనే క్యాంపస్ ఇంటరŠూయ్వల్లో ఎంపికై రూ.40 లక్షల ప్యాకేజీకిగాను దుబాయ్‌లోని పెట్రోలియం కంపెనీలో అవకాశం వచ్చింది. కానీ.. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరాను. సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించాను. అకాడమీ తోడ్పాటునిచ్చింది.. ఐపీఎస్ సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీలో చేరాను. సివిల్స్ 2004, 2016 ర్యాంకర్, ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ టాపర్ బాలలత, మేడం స్ఫూర్తి. ఆమె ప్రోత్సాహంతో అత్యుత్తమ కోచింగ్‌ను అందుకున్నాను. ప్రతి రోజు 9 గంటల పాటు జనరల్, ఆప్షనల్, మెయిన్స్‌లో శిక్షణ అందించేవారు. నేను మరో నాలుగు గంటల పాటు ప్రత్యేకంగా చదివేవాడిని. నాకు సివిల్స్‌లో 624వ ర్యాంకు సాధించడానికి సీఎస్బీ అకాడమి ఎంతగానో తోడ్పాటునందించింది. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా.. మవోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సేవలందిస్తా. కేఎస్.వ్యాస్, ఉమేష్‌చంద్ర స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తా. మెరుగైన సమాజ నిర్మాణానికి, దేశరక్షణకు, నక్సలైట్ రహిత సమాజానికి సేవలందిస్తా. -
శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలిన సెల్‌ఫోన్
కాజీపేటరూరల్: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్ సీ-2 కోచ్‌లో సీట్ నంబర్ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక్షన్ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్ పెట్టిన అతడి సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలింది. దీంతో పొగలు వ్యాపించగా ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలులో ఏదో జరిగిందని ఉలిక్కి పడ్డారు. వెంటనే బోగీలో ఉన్న టిక్కెట్ కండక్టర్ రైలు చైయిన్ లాగి ఆపారు. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టగా పేలిందని తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేఅధికారులు, పోలీసులు బోగీలోకి వెళ్లి తనిఖీ చేసి జరిగిన విషయం తెలుసుకొని రైలును విజయవాడకు పంపించారు. ఈ ఘటన కారణంగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట యార్డులో 10 నిమిషాలపాటు అధికారులు నిలిపివేశారు. తర్వాత రైలు వరంగల్ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్ చైర్‌కార్ బోగీని తనిఖీ చేసి పంపించినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ కంట్రోల్ రూంకు సమాచారం అందించినట్లు తెలిపారు. -
కేసీఆర్.. బిజీబిజీ
=మీడియాతో మాట్లాడేందుకు నిరాకరణ =ఎమ్మెల్యే రాజయ్య కుమారుల వివాహ వేడుకలకు హాజరు =టీఆర్ఎస్ ముఖ్య నేతలతో భే టీ =తాజా పరిస్థితులపై మాటామంతి వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) సోమవారం ఓరుగల్లుకు వచ్చారు. నాలుగు గంటలపాటు ఇక్కడే ఉన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రంలో హాట్‌హాట్‌గా చర్చలు జరుగుతున్నప్పటికీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. తనను కలిసిన విలేకరులతో మరోసారి మాట్లాడుకుందామంటూ ముక్తసరిగా సమాధానం చెప్పారు. ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనప్పటికీ తనను కలిసిన పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ 11గంటల సమయానికి కాజీపేటకు చేరుకున్నారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని కేథడ్రల్ చర్చిలో జరిగిన స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య ఇద్దరు కుమారులు డాక్టర్ క్రాంతిరాజ్, డాక్టర్ విరాజ్ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. గంటపాటు అక్కడే గడిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హన్మకొండలోని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి మధ్యాహ్నం 12-15 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఆయనను టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, రాజయ్యయాదవ్, పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, ఆరూరి రమేష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్రావు, భరత్‌కుమార్, ఇండ్ల నాగేశ్వర్రావు, కిషన్‌రావు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులతో కొద్దిసేపు మాట్లాడారు. తదుపరి అక్కడి నుంచి వరంగల్‌లోని సీఎస్ఆర్ గార్డెన్‌కు చేరుకున్నారు. అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పార్టీ నాయకులు కె.కేశవరావు, ఎంపీ వివేక్, ఎమ్మెల్యేలు వినయ్, బిక్షపతి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, కేటీఆర్‌తో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వడ్డేపల్లి రోడ్డులోని మాజీ డీజీపీ పేర్వారం రాములు ఇంటికి చేరుకున్నారు. అక్కడ గంటపాటు తనను కలిసి నేతలతో తాజా పరిస్థితులు, పార్టీ విలీన అంశాలపై తెలంగాణవాదులు, నేతల స్పందనను తెలుసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు.