శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలిన సెల్‌ఫోన్‌ | cell phone blasted in satavahana express | Sakshi
Sakshi News home page

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో పేలిన సెల్‌ఫోన్‌

Published Mon, Sep 25 2017 10:50 AM | Last Updated on Mon, Sep 25 2017 10:50 AM

cell phone blasted in satavahana express

కాజీపేటరూరల్: సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఒక ప్రయాణికుడి సెల్‌ఫోన్‌ పేలింది. దీంతో బోగీలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. కాజీపేట రైల్వే పోలీస్‌ అధికారుల కథనం ప్రకారం.. వినోద్‌సింగ్‌ అనే ప్రయాణికుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లోని చైర్‌కార్‌ సీ-2  కోచ్‌లో సీట్‌ నంబర్‌ 55-56 వద్ద ప్రయాణిస్తున్నాడు. రైలు కాజీపేట జంక‌్షన్‌ యార్డు దాటుతున్న క్రమంలో చార్జింగ్‌ పెట్టిన అతడి సెల్‌ఫోన్‌ ఒక్కసారిగా పేలింది. దీంతో పొగలు వ్యాపించగా ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళన చెందారు. రైలులో ఏదో జరిగిందని ఉలిక్కి పడ్డారు. వెంటనే బోగీలో ఉన్న టిక్కెట్‌ కండక్టర్‌ రైలు చైయిన్‌ లాగి ఆపారు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టగా పేలిందని తెలుసుకున్నారు.

ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైల్వేఅధికారులు, పోలీసులు బోగీలోకి వెళ్లి తనిఖీ చేసి జరిగిన విషయం తెలుసుకొని రైలును విజయవాడకు పంపించారు. ఈ ఘటన కారణంగా శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట యార్డులో 10 నిమిషాలపాటు అధికారులు నిలిపివేశారు. తర్వాత రైలు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లిన తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ చైర్‌కార్‌ బోగీని తనిఖీ చేసి పంపించినట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ కంట్రోల్‌ రూంకు సమాచారం అందించినట్లు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement