Railway Bracket Insulators Fall On Satavahana Express At Madhira - Sakshi
Sakshi News home page

శాతవాహన ఎక్స్‌ప్రెస్‌: పెద్ద శబ్దం.. బోగీలపై వ్యాపించిన మంటలు

Published Tue, Jun 20 2023 7:58 AM | Last Updated on Tue, Jun 20 2023 12:25 PM

Railway Bracket Insulators Fall On Satavahana Express At Madhira - Sakshi

మధిర/ఖమ్మం మామిళ్లగూడెం: సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న శాతవాహన (12714) ఎక్స్‌ప్రెస్‌ రైలుపై మధిర రైల్వే స్టేషన్‌ సమీపాన బ్రాకెట్‌ ఇన్సులేటర్లు తెగిపడ్డాయి. దీంతో పెద్ద శబ్దం రావడమే కాక మంటలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. మధిర రైల్వేస్టేషన్‌కు పది అడుగుల దూరాన రైలు నిలిచిపోగానే ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరిన శాతవాహన ఎక్స్‌ప్రెస్‌.. రాత్రి 9.30 గంటలకు కిలోమీటర్‌ నంబర్‌ 528/26 వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ట్రాక్‌ పక్కన ఉండే స్తంభాల నుంచి రైళ్లు నడిచేలా ఏర్పాటుచేసిన విద్యుత్‌ తీగలకు అనుసంధానంగా బ్రాకెట్‌ ఇన్సులేటర్లు ఉంటాయి. ప్రమాదవశాత్తు ఈ ఇన్సులేటర్లు తెగిపడటంతో బోగీలపై మంటలు వచ్చినట్లు చెబుతున్నారు.

విద్యుత్‌ తీగలు కూడా తెగిపోయినా రైలుకు పక్కన పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వెంటనే రైలు ఆగింది. ఒకవేళ విద్యుత్‌ తీగలు తెగి బోగీలపై పడి ఉంటే, విద్యుత్‌ సరఫరా ఉన్నందున పెనుప్రమాదం జరిగేదని చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చిన భారీ శబ్దాలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైలు ఆగగానే లగేజీ, పిల్లలతో కలిసి కిందకు దిగి పరుగులు పెడుతూ మధిర స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ విషయమై టీవీల్లో స్క్రోలింగ్‌ మొదలుకావడంతో వారికి బంధువులు ఫోన్‌ చేసి క్షేమ సమాచారాలను ఆరా తీయడం కనిపించింది.  

నిలిచిన రైళ్లు: శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ ఓవర్‌ హెడ్‌ ఎలక్ట్రికల్‌ (ఓహెచ్‌ఈ) వైర్లలో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. ఓ పక్క సరఫరా నిలిచిపోయి శాతవాహన మధిరలో ఆగగా, మిగతా రైళ్లను కూడా ముందు జాగ్రత్తలో భాగంగా అటూ, ఇటు స్టేషన్లలో ఆపేశారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌ – తిరుపతి ప్రత్యేక రైలు, మధిర సమీపాన జీటీ, గోదావరి రైళ్లు, డోర్నకల్, పాపటపల్లి స్టేషన్లలో పద్మావతి, చారి్మనార్‌ రైళ్లను అధికారులు నిలిపివేశారు. రైల్వే ఉద్యోగులు మధిర వెళ్లి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఓహెచ్‌ఈకి రెండుగంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. 11.30 గంటల తర్వాత నిలిచిపోయిన రైళ్లన్నీ ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. 

పెద్ద శబ్దం వచ్చింది..
సికింద్రాబాద్‌ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరా. మధిర స్టేషన్‌ సమీపిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. ఆ తర్వాత బోగీలపైన మంటలు వస్తున్నాయని ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో నేను కూడా భయపడ్డా. దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు.  – ప్రశాంత్‌ కుమార్, ప్రయాణికుడు 

ప్రాణం పోయిందనుకున్నా.. 
అప్పుడే నిద్ర పోతున్నా. బోగీలపై ఏదో రాడ్డు దూసుకుపోతున్న శబ్దం వచి్చంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి లేచా. ఆ తర్వాత బోగీలపై మంటలు కూడా వచ్చాయి. ప్రాణం పోయిందనే అనుకున్నా. రైలు ఆగగానే అందరం కిందకు దిగి పరుగులు తీశాం. – వి.శ్రీనివాస్, ప్రయాణికుడు 

ఇది కూడా చదవండి: మీడియా ఎదుటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని నిలదీసిన కూతురు.. ఏడ్చేసిన ముత్తిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement