కాజీపేట అర్బన్ : సామాజిక మాధ్యమాలు మానవ సంబంధాలను దగ్గర చేస్తూ.. ఉపాధికి బాటాగా నిలుస్తుండగా.. మరో వైపు సైబర్ నేరగాళ్లకు పైసా వసూల్‌కు ప్రజలను దగ్గర చేస్తున్నాయి. ఉద్యోగాల పేరిట, రుణాల అందిస్తామని, నూతన ఏటీఎం కార్డును పంపిస్తామని నిత్యం ఆన్‌లైన్‌లో మోసాలు జరుగుతున్నా.. ప్రజలు మాత్రం అప్రమత్తమవడం లేదు. ఇందుకు జిల్లాలో జరిగిన ఈ తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. యూఎస్‌కు వీసా ఇస్తామని నమ్మబలికి ఏకంగా తమ అకౌంట్‌లో రూ.6.97 లక్షలను వేయించుకుని ఓ సైబర్ నేరగాడు ఓ నిరుద్యోగిని నిలువు దోపిడీ చేశాడు. సూబేదారి పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వాట్సప్ అంటూ పలకరింపు ...
సుబేదారి ఎన్జీఓస్ కాలనీకి చెందిన మహేష్‌చంద్ర బికాం కంప్యూర్స్ పూర్తి చేసి దుబాయ్‌లోని బెహరీన్‌లో ఉద్యోగం చేసి ఈ ఏడాది నగరానికి విచ్చేశాడు. ఆన్‌లైన్ ఉద్యోగాల కోసం తన బయోడేటాను జనవరిలో పొందుపర్చాడు. మార్చిలో యూఎస్‌లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ మహేష్‌చంద్ర సెల్‌ఫోన్‌కు వాట్సప్ బ్రదర్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. యూఎస్‌కు వీసా అందిస్తానని నమ్మబలికాడు సదరు వాట్సప్ కాల్ సైబర్ నేరగాడు.
రూ.6.97 లక్షల చెల్లింపు
యూఎస్‌కు వీసా అందించేందుకు సహకరిస్తానని ఆన్‌లైన్‌లో బయోడేటాను స్వీకరించానని మార్చిలో వాట్సప్ కాల్ ద్వారా పరిచమైన వ్యక్తి మహేష్ చంద్రకు తెలిపాడు. సదరు వ్యక్తి మాటలను నమ్మిన మహేష్‌చంద్ర తొలుత మార్చి 23న రెస్యూమ్ రిజిస్ట్రేషన్‌కు రూ.30 వేలు ఆన్‌లైన్‌లో బ్యాంక్ అకౌంట్‌లో వేశాడు. మెడికల్ చెకప్, అగ్రిమెంట్, జాబ్‌ష్యూరిటీ పేరిట ఆరు సార్లు వివిధ అకౌంట్లలోకి సుమారు రూ.6.97 లక్షలను ఏప్రిల్ 27వ తేదీ వరకు జమ చేశాడు. అనంతరం వాట్సప్ కాల్ వ్యక్తి అందుబాటులోకి రాకపోవడంతో మహేష్‌చంద్ర మోసపోయినట్లు నిర్దారించుకుని ఆదివారం సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుబేదారి ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ సైబర్ నేరం కింద చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment