జగిత్యాల: ఇలా ఒకరిద్దరు కాదు.. సుమారు 25 మంది యువకులను కెనడా, జర్మనీ వంటి దేశాలకు పంపిస్తానని చెప్పి సాయితేజ అనే ఏజెంట్ సుమారు రూ.కోటి వరకు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా జగిత్యాల పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం.
ఉత్త లెటర్లే..
సాధారణంగా కెనడా, జర్మనీ వంటి దేశాలకు వెళ్లేవారు ఆయా దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నట్లు వాటికి సంబంధించిన ఆఫర్ లెటర్లను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈ ఆఫర్ లెటర్ల ఆసరాగా ఆయా కంపెనీలకు వెళ్లడానికి అవసరమైన అర్హతలు, మెడికల్, బయోమెట్రిక్ వంటి ఇతర అర్హత పత్రాలు జతచేయాల్సి ఉంటుంది.
అయితే సదరు ఏజంట్‌గా పనిచేసిన వ్యక్తి యూరప్ కంపెనీల బోగస్ ఆఫర్ లెటర్లను సృష్టించి ఉపాధి కోసం వలస వెళ్లే యువకులకు ఇచ్చి వాటితో హైదరాబాద్‌లో మెడికల్, బయోమెట్రిక్, స్టాంపింగ్ చేయించడం గమనార్హం. ఇదే రీతిలో కొల్వాయికి చెందిన ఏజంట్ ఓ వ్యక్తిని జర్మనీకి పంపగా.. అతడిని అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి తిప్పి పంపినట్లు సమాచారం.
ఆందోళనలో యువకులు..
జగిత్యాల, కోరుట్ల, బీర్‌పూర్, సారంగాపూర్ ప్రాంతానికి చెందిన సుమారు 25 మంది యువకులు ఏడాదిన్నరగా యూరప్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలన్న ఆశతో కొల్వాయికి చెందిన ఏజెంట్‌ను ఆశ్రయించినట్లు సమాచారం.
అతడు ఒక్కో యువకుడి నుంచి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకుని కెనడా, జర్మనీ దేశాలకు పంపేతంతును పూర్తి చేసినట్లు సదరు ఏజెంట్ నమ్మించినట్లు తెలిసింది. సుమారు ఏడాదిన్నరపాటు తమను యూరప్ దేశాలకు పంపుతాడని ఆశపడ్డ యువకులు కొన్నాళ్లపాటు వేచిచూసి చివరకు తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.
కేసులు నమోదు చేశాం..
యూరప్ దేశాలకు పంపిస్తానని నకిలీ పత్రాలు ఇచ్చి మోసం చేసినట్లు కొంతమంది యువకులు మాకు ఫిర్యాదు చేశారు. ఆయా యువకులు మోసపోయిన ఏరియాల్లోని పోలీస్‌స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశాం. – వెంకటస్వామి, డీఎస్పీ, జగిత్యాల
‘మాది కోరుట్ల. కెనడాకు వెళ్దామని మా ఫ్రెండ్ ద్వారా బీర్‌పూర్ మండలం కొల్వాయికి చెందిన సాయితేజను ఏడాది క్రితం సంప్రదించిన. ఆయన నా దగ్గర రూ.ఏడు లక్షలు తీసుకున్నాడు. నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి మెడికల్, బయోమెట్రిక్ చేయించాడు. తరువాత రెండు నెలలకు ఆయనే అవి నకిలీవని చెప్పి మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు. తరువాత ఓ చెక్ ఇచ్చాడు. అది బౌన్స్ అయింది. నెలరోజులుగా సాయితేజ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. వాళ్లింటికి వెళితే ఇంట్లో ఎవరూ లేరు.
చైతన్య, కోరుట్ల
Comments
Please login to add a commentAdd a comment