
మృతుల్లో ఒకరిది నిర్మల్ జిల్లా, మరొకరిది జగిత్యాల జిల్లా
విద్వేషంతో నరికి చంపిన పాకిస్తానీ
విదేశాంగ అధికారులతో మాట్లాడిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్
మృతదేహాలను త్వరగా భారత్‌కు తీసుకురావాలని వినతి
సోన్/నిర్మల్/ధర్మపురి/ఆర్మూర్ టౌన్: పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్ ప్రాంతంలో మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాకిస్తానీ దాడిలో నిర్మల్ జిల్లాకు చెందిన ఆష్టపు ప్రేమ్‌సాగర్ (40), జగిత్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్ మరణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన దేగాం సాగర్‌కు గాయాలయ్యాయి. సాగర్‌ను సహోద్యోగులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని బయటకు చేరవేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం హెచ్చరించినట్లు వారి బంధువులు చెప్పారు.
చిన్న బిడ్డను చూడకుండానే..
నిర్మల్ జిల్లా సోన్ మండలానికి చెందిన ప్రేమ్‌సాగర్ (40) ఇరవై ఏళ్లుగా గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం దుబాయ్‌లోని మోడర్న్ బేకరీలో యంత్రం ఆపరేట్ చేసే పనిలో చేరాడు. ప్రేమ్‌సాగర్‌కు తల్లి లక్ష్మి, భార్య ప్రమీల (35), కూతుళ్లు విజ్ఞశ్రీ (9), సహస్ర(2) ఉన్నారు. పదిరోజుల క్రితమే ప్రేమ్‌సాగర్ నాన్నమ్మ ముత్తమ్మ (90) చనిపోయారు. ఆమె పెద్దకర్మ చేసిన శుక్రవారం రోజే ప్రేమ్‌సాగర్ హత్యకు గురయ్యాడు. ప్రేమ్‌సాగర్ మృతి వార్తను ఆయన కుటుంబసభ్యులకు చెప్పలేదు.
ప్రేమ్‌సాగర్ తన చిన్నకూతురు సహస్ర తల్లి కడుపులో ఉన్నప్పుడే దుబాయ్ వెళ్లాడు. తను పుట్టినప్పటి నుంచి గ్రామానికి రాలేదు. బిడ్డను చూడకుండానే ఆయన తనువు చాలించడం స్థానికులను కలచివేస్తోంది. కాగా, దుబాయ్‌లో మరణించిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ (42)కు భార్య మంజుల, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు.
శ్రీనివాస్ మృతి విషయం ఆయన తల్లి రాజవ్వకు ఇంకా చెప్పలేదు. ప్రేమ్‌సాగర్ కుటుంబానికి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురా>వడంతోపాటు నిందితులపై కఠినచర్యలు తీసుకునేలా చూడాలని విదేశాంగ శాఖను కోరారు.

విదేశాంగ శాఖ మంత్రికి కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్తానీ హత్య చేసిన ఘటనపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో చొరవతీసుకుని వీలైనంత త్వరగా మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని కోరారు. దీనిపై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆదేశాలకు అనుగుణంగా దుబాయ్ లోని భారత కాన్సులేట్ అధికారులు.. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు వివరాలను తెలుసుకున్నారు.
ఉద్దేశపూర్వక హత్యకేసుగా నమోదు చేశామని పోలీసులు వారికి చెప్పారు. కాగా, ఇద్దరు తెలంగాణ కార్మికులు మరణించడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. భారత కాన్సులేట్ ద్వారా దుబాయ్ పోలీసులు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఆయన ప్రేమ్ సాగర్ సోదరుడు అష్టపు సందీప్‌తోనూ మాట్లాడారు.