దుబాయ్‌లోని సెంట్రల్ జైలు
గల్ఫ్ దేశాల చట్టాలపై కనీస అవగాహన కూడా లేకపోవడంతో పలువురు భారతీయులు జైళ్ల పాలవుతున్నారు. మన దేశానికి చెందిన కొన్ని రకాల మందులను గల్ఫ్ దేశాలు నిషేధించాయి. ఇది కూడా తెలియనివారు అనేకమంది ఉన్నారు.ఉపాధి కోసం ఎడారి బాట పట్టేవారిలో డిగ్రీ కూడా దాటని వారే అధికంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని విడిపించడానికి మన విదేశాంగ శాఖ చొరవ తీసుకోవాల్సి ఉంది. కేంద్రం ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌కు నిధులు కేటాయించి గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వారికి న్యాయసాయం అందించాలి. –మోర్తాడ్ (బాల్కొండ)/జగిత్యాల క్రైం
కొందరు ఇలా..
- జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడు ఒళ్లు నొప్పులు తగ్గడానికి వేసుకునే మందులతో పట్టుబడి ఆబుదాబిలోని సుహాన్ సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. ఇది గడిచిన జనవరిలో జరగ్గా, విచారణ ఖైదీగా జైలుకు పరిమితమయ్యాడు.
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ఓ యువ ఇంజినీర్ జాతీయభద్రత కేసులో నాలుగేళ్ల కింద అరెస్టు అయ్యాడు. అప్పటినుంచి అబుదాబి జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.
- నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, జగిత్యాల జిల్లా కన్నాపూర్, కామారెడ్డి జిల్లా కరడ్‌పల్లికి చెందిన యువకులు నిషేధిత మందులతో పట్టుబడి జైల్లోనే ఉండిపోయారు.
దౌత్య, న్యాయ సాయం అందించాలి
విదేశీ జైళ్లలో ఉన్న వారికి మన విదేశాంగశాఖ కార్యాలయాల ద్వారా దౌత్యసాయం అందించాలి. న్యాయసాయం అందించి విడుదల అయ్యేలా చూడాలి. రాయభార కార్యాలయాల్లో ప్యానల్ లాయర్ల సంఖ్య పెంచాలి. వలస వెళ్లే కార్మికులకు గల్ఫ్ చట్టాలపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి.
– చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నేత
రాజ్యసభలో ప్రశ్నతో..
ఇటీవల రాజ్యసభలో ఎంపీలు డాక్టర్ మనోజ్ రాజోరియా, రంజితా కోలి, సుమేధానంద సరస్వతిలు గల్ఫ్ జైల్లో మగ్గుతున్న భారతీయుల సంఖ్య ఎంత అంటూ ప్రశ్నించారు. దీనికి విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సమాధానం ఇస్తూ గల్ఫ్ దేశాల్లోని వివిధ జైళ్లలో మగ్గుతున్న వారు 4,630 మంది ఉన్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment