వలస కార్మికులను ముంచిన గల్ఫ్‌ కంపెనీలు | Gulf Companies Cheated Indian Migrant Labour Amid Corona Crisis | Sakshi
Sakshi News home page

వలస కార్మికులను ముంచిన గల్ఫ్‌ కంపెనీలు

Aug 2 2021 1:57 PM | Updated on Aug 2 2021 2:03 PM

 Gulf Companies Cheated Indian Migrant Labour Amid Corona Crisis - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్‌ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. 

తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. 
కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్‌ వంటి గల్ఫ్‌ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. 

గల్ఫ్‌ కార్మికులకే ఎక్కువ నష్టం.. 
వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్‌ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్‌ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు.  

పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం 
కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్‌ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. 

ప్రభుత్వాలు స్పందించాలి 
వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. 
– మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు




మానవత్వంతో వ్యవహరించాలి 
వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. 
– స్వదేశ్‌ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement