Gulf NRIs
-
రాహుల్‌గాంధీ ఇచ్చిన భరోసా హామీ కోసం చూస్తున్నా..
ఆదిలాబాద్: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు మూడ లక్ష్మి. నిర్మల్‌రూరల్ మండలంలోని కౌట్ల–కే గ్రామం. గల్ఫ్ కార్మికుడైన భర్తను పోగొట్టుకుంది. శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు అందించింది. గతేడాది నవంబర్ 6న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో తన పదినెలల పసిపాప సాత్వికతో కలిసి తన గోడును విన్నవించుకుంది. ఆ పసిపాపది మాట్లాడే వయసు కూడా కాదు. గల్ఫ్ మృతుడి భార్య దీనస్థితిని చూసి చలించిన రాహుల్‌గాంధీ తనతో పాటు యాత్రలోని కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆ కుటుంబానికి సాయం అందేలా చూడాలని సూచించారు. నిర్మల్ జిల్లాలోని కౌట్ల–కే గ్రామానికి చెందిన మూడ అశోక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశమైన అబుదాబి వెళ్లాడు. అక్కడ అనుకొని ఘటనలో మృతి చెందాడు. అయితే అతడికి అప్పటికే భార్య మూడ లక్ష్మితో పాటు ఆరేళ్లలోపు ఇద్దరు పిల్లలు, పది నెలల పసిపాప సాత్విక ఉంది. ఈ చిన్నారికి పుట్టుకతోనే అనారోగ్య సమస్య ఉండడంతో రాహుల్‌గాంధీని కలిసిన అనంతరం నాలుగు నెలలకే మృత్యుఒడికి చేరుకుంది. సంవత్సరం దాటిపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొలువుతీరింది. అనంతరం ఆరు గ్యారెంటీల అమలు నిమిత్తం ప్రస్తుతం ప్రజాపాలన కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం గల్ఫ్ మృతుల కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని వేడుకుంటోంది. తన భర్త అశోక్ గతేడాది జూలై 24న అబుదాబి దేశంలో మరణించడంతో తన కుటుంబ జీవనం కష్టతరంగా మారిందని వాపోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, తదితర నాయకుల హామీ మేరకు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విన్నవిస్తోంది. ఇదే అంశంపై శుక్రవారం నిర్మల్ రూరల్ మండలంలోని కౌట్ల(కె) గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించింది. -
తడారిన ఎడారి గొంతు వినండి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్, మోర్తాడ్ (బాల్కొండ) : రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న గల్ఫ్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధపడుతుతున్నారు. తమ సమస్యలు తీరాలంటే.. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి గల్ఫ్‌దేశాల్లో మరణించిన కుటుంబాల నుంచి ఒకరిని పోటీ చేయించాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు నిర్ణయించాయి. ఇటీవల షార్జాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో దాదాపుగా 32 నియోజకవర్గాల్లో దుబాయ్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా తదితర మధ్యప్రాచ్య దేశాల్లో పనిచేసి వచ్చిన ఓటర్లు ఉన్నారని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరంతా తమ హక్కుల సాధనకు సంఘటితంగా మారి అసెంబ్లీ ఎన్నికలు వేదికగా తమ డిమాండ్లను తెలియజేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం కామారెడ్డి లేదా నిర్మల్ వంటి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. కామారెడ్డిలో 100 మంది విడోలతో, నిర్మల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాల్లో ఒక్కో విడోతో నామినేషన్ వేయించేలా కసరత్తులు ప్రారంభించారు. ఇందుకోసం అన్ని గల్ఫ్ కుటుంబాలతో వాట్సాప్ గ్రూపులు ప్రారంభించి వారిని సంసిద్ధం చేస్తున్నారు. హామీల కోసం పట్టు.. గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారి సంఖ్య దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి వచ్చిన వారి సంఖ్య కూడా 15 లక్షలకుపైగానే ఉంటుందని ప్రవాసీ సంఘాలు చెబుతున్నాయి. వీరి సంక్షేమానికి, పునరావాసానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని గల్ఫ్ ప్రవాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత పదేళ్ల కాలంలో గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాల వల్ల 1,800 మందికిపైగా వలస కారి్మకులు ప్రాణాలు కోల్పోయారు. కార్మికులు మరణిస్తే.. రూ.5 లక్షల పరిహారం ఇస్తానన్న డిమాండ్‌ను ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలని ప్రవాసీ సంఘాలు కోరుతున్నాయి. యుద్ధభేరి మోగిస్తాం కామారెడ్డిలో వందమంది మహిళలతో నామినేషన్ వేయిస్తాం కోరుట్ల: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో గల్ఫ్ బాధిత కుటుంబాల నుంచి వంద మంది మహిళలతో నామినేషన్లు వేయిస్తామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు గుగ్గిల్ల రవిగౌడ్, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాస్‌రావు, మంద భీంరెడ్డి, బూత్కురి కాంత అన్నారు. గల్ఫ్ వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడంలో పార్టీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని ఆరోపించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గల్ఫ్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో ప్రవాసీ బోర్డు, గల్ఫ్ కార్మికులకు ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబాలను ఆదుకునే అంశాల ప్రస్తావన తేలేదన్నారు. సమావేశంలో గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు అశోక్, మోహన్‌రెడ్డి, రవి, మారుతి, బీడీ చెన్న విశ్వనాథం, శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్ హయాంలోనే ఆర్థిక సాయం ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పని చేసిన వైఎస్సార్ తన హయాంలో గల్ఫ్ వలస కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారు. అప్పట్లో 1000 మంది గల్ఫ్ మృతులకు రూ. లక్ష చొప్పున సాయం అందించారు. గల్ఫ్ దేశాలను వీడి ఇంటిబాట పట్టిన వలస కార్మికులకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రాయితీ రుణాలను ఇప్పించారు. వైఎస్ తర్వాత పనిచేసిన సీఎంలు ఎవరూ కూడా గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమయం కావడంతో గల్ఫ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. వలస కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
-
గల్ఫ్ కార్మికులను అన్యాయం చేయొద్దు: గల్ఫ్ జేఏసీ
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికులకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తానని మాట తప్పినందుకు నిరసనగా ఇక నుంచి అధికార ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు గల్ఫ్ నుంచి వచ్చిన శవపేటికలను ఉంచుతామని గల్ఫ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిల్ల రవిగౌడ్ అన్నారు. ఇటీవల దుబాయిలో ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముల్క నాగరాజు (25) అంత్యక్రియలు ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేటలో జరిగాయి. గల్ఫ్ కార్మికుల అంత్యక్రియల్లో పాల్గొని మృతుడు నాగరాజుకు రవిగౌడ్ నివాళులు అర్పించారు. పని ప్రదేశంలో (వర్క్ సైట్) లో జరిగిన ప్రమాద మరణానికి దుబాయిలో ఫ్యాక్టరీ యాజమాన్యం బాధ్యత వహించి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని రవిగౌడ్ అన్నారు. కార్మికులకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి తగిన శిక్షణ ఇవ్వాలని, ఈ విషయంలో భారత ప్రభుత్వం, గల్ఫ్ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రతి ఒక్క గల్ఫ్ కార్మికుడు 'ప్రవాసి భారతీయ బీమా యోజన' అనే ప్రమాద బీమా ను తీసుకోవాలని రవిగౌడ్ కోరారు. రూ. 325 చెల్లిస్తే రెండు సంవత్సరాలు అమలులో ఉండే రూ. 10 లక్షల ప్రార్ద బీమా పాలసీ పొందవచ్చు. ఈ విషయమై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవిగౌడ్ కోరారు. -
టీపీసీసీ ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నరేష్ రెడ్డి
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీసీసీసీ) ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల విభాగం చైర్మన్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ ఈమేరకు నియామక పత్రాన్ని గాంధి భవన్ లో అందజేశారు. ఈ సందర్భంగా నరేష్ రెడ్డిని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అభినందించారు. గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది... గల్ఫ్ కార్మికుల బాధలు తీరుస్తుందని హమీ ఇచ్చారు. నరేష్ రెడ్డి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, మన్నెగూడెం సర్పంచ్ గా కొనసాగుతున్నారు. గతంలో 11 ఏళ్లపాటు సౌదీ లోని అరేబియన్ అమెరికన్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ కంపెనీ లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో లెవల్-1 సర్టిఫైడ్ రిగ్గర్ గా పనిచేశారు. 'సౌదీ అరామ్కో' కంపెనీలో అత్యంత నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి బృందంలో సభ్యుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్బంగా నరేష్ రెడ్డి మాట్లాడుతూ.. "తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ లతో పాటు 18 ఈసీఆర్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారు. విదేశాల్లో పనిచేసే కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ప్రవాసీ కార్మికుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది" అని అన్నారు. చదవండి: గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్ -
గల్ఫ్ కార్మికులను ఆదుకోవాలి - జేఏసీ డిమాండ్
గల్ఫ్ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి మంత్రి కేటీఆర్ కు గల్ఫ్ జెఏసి బృందం వినతిపత్రం ఇచ్చింది. ముస్తాబాద్‌లో ఆయన్ను కలిసి గల్ఫ్ జేఏసీ ప్రతినిధులు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తో వారు మాట్లాడుతూ కరోనా సందర్బంగా గల్ఫ్ తదితర దేశాల నుండి వాపస్ వచ్చిన వలస కార్మికులకు వారి యాజమాన్యాల నుండి రావలసిన జీతం బకాయిలు, బోనస్, పిఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు) రాబట్టుకోవడం వారి హక్కన్నారు. కావున బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి న్యాయ సహాయం అందించి కార్మికులను ఆదుకోవాలి కోరారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఓమన్, ఖతర్, కువైట్, బహ్రెయిన్ దేశాలతో పాటు మలేషియా, సింగపూర్, అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా తదితర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లారని తెలిపారు. వీరందరి సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన డిమాండ్లు.. - గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. - గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్మెంట్ ఫీజులు తదితర ఖర్చులకోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. - గల్ఫ్ లో చనిపోయిన కార్మికులకు రైతు బంధ, రైతు బీమా లాంటి రూ. 5 లక్షల "గల్ఫ్ ప్రవాసీ బీమా" పథకం ప్రవేశపెట్టాలి. ఈ పథకం ప్రవేశపెడితే ప్రభుత్వంపై ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) భారం ఉండదు. - విదేశాలకు వెళ్లి నష్టపోయి తిరిగి వచ్చిన వారిని ఆదుకోవడానికి కార్మికులు నైపుణ్యం మరియు అనుభవాన్ని ఉపయోగించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను తక్షణం కల్పించాలి. వాపస్ వచ్చినవారు జీవితంలో స్థిరపడటానికి పునరావాసం, పునరేకీకరణ కొరకు ప్రత్యేక పథకం రూపకల్పన చేయాలి. - జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం. - హైదరాబాద్ లో ప్రవాసీ భవన్ ఏర్పాటు. - తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ, గృహనిర్మాణం వంటి పథకాలను వర్తింపజేయాలి. - 24 గంటల హెల్ప్ లైన్ (సహాయ కేంద్రం) ఏర్పాటు చేయాకి. - విదేశాల్లో ఉన్న వలసకార్మికులు, ఉద్యోగులు, వృత్తినిపుణులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ కొరకు 'ప్రవాసి తెలంగాణ' వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయాలి . - ధనవంతులైన ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేలా ప్రోత్సాహించాలి. - గల్ఫ్ లోని ప్రవాస తెలంగాణీయులకు ఒక వేదిక కల్పించడానికి, రాష్ట్రంతో బంధం ఏర్పరచడానిక వార్షిక ప్రవాసి వేడుకను నిర్వహించడానికి 'గల్ఫ్ ప్రవాసి తెలంగాణ దివస్' ను జరుపాలి. సమస్యలను చర్చించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. వివిధ రంగాలలో సేవలందించిన ప్రవాసీలకు అవార్డులను ప్రధానం చేయాలి. - గల్ఫ్ ఎన్నారైలు తమ అమూల్యమైన ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా వినియోగించుకునేలా చేయాలి. చదవండి: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న పాతబస్తీ మహిళలు.. సాయం కోసం.. -
వలస కార్మికులను ముంచిన గల్ఫ్ కంపెనీలు
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ వలస కార్మికుల శ్రమను గల్ఫ్ కంపెనీలు దోచుకున్నాయి. కరోనా సాకు చూపి రెండు, మూడు నెలల వేతనాలు ఎగ్గొట్టాయి. అంతేకాదు కంపెనీల మాటలు నమ్మి స్వస్థలాలకు చేరుకున్న కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలు రద్దు చేశాయి. కార్మికులకు మొత్తంగా రూ.200 కోట్లకు పైగా వేతనాలు కంపెనీలు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. తిరిగొచ్చాక ఇస్తామని చెప్పి.. కరోనా ప్రభావంతో పనులు సరిగా సాగడం లేదని, కొన్ని నెలల పాటు సెలవులపై ఇంటికి వెళ్లాలని సౌదీ, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు చెందిన పలు కంపెనీలు కార్మికులకు సూచించాయి. అప్పటికే రెండు మూడు నెలల వేతనాలు బకాయి పడిన కంపెనీలు.. గల్ఫ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వేతనాలు చెల్లిస్తామని నమ్మ బలికాయి. ఈ క్రమంలో వందల సంఖ్యలో కార్మికులు రాష్ట్రానికి వచ్చారు. పరిస్థితి చక్కబడితే తిరిగి గల్ఫ్‌కు వెళదామని ఎదురుచూస్తున్న కార్మికులకు అనేక కంపెనీలు షాకిచ్చాయి. కార్మికులకు తెలియకుండానే వారి వీసాలను రద్దు చేశాయి. కరోనా పరిస్థితుల్లో తెలంగాణ జిల్లాలకు చెందిన సుమారు లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు చేరుకున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 50 వేల మంది కార్మికులకు వారి కంపెనీలు వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతన బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. కాగా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ.200 కోట్ల వరకు ఉంటుందని కార్మిక సంఘాలు అంచనా వేశాయి. గల్ఫ్ కార్మికులకే ఎక్కువ నష్టం.. వలస కార్మికుల వేతన దోపిడీపై కేరళలో రెండ్రోజుల క్రితం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. కరోనా కాలంలో ఎంతో మంది భారతీయులు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడయ్యింది. వీరిలో గల్ఫ్ వలస కార్మికులే ఎక్కువగా వేతనాలను నష్టపోయారని, ఒక్క తెలంగాణకు చెందిన కార్మికులే సుమారు రూ.200 కోట్లు కోల్పోయారని నిర్మల్‌కు చెందిన ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల ఈ సదస్సులో వెల్లడించారు. పొరుగు దేశాల్లో వలస కార్మికులకు సహకారం కరోనా నేపథ్యంలో ఇంటి బాట పట్టిన వలస కార్మికులు ఎంత మేరకు నష్టపోయారు? వారికి అంతర్జాతీయ స్థాయిలో సహకారం అవసరమా? అనే అంశంపై పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్ దృష్టి సారించాయి. వేతనాలు నష్టపోయిన తమ దేశానికి చెందిన వలస కార్మికులకు అవసరమైన న్యాయ సహాయం చేయడానికి ఆయా చర్యలు తీసుకున్నాయని తెలిసింది. మన దేశంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు న్యాయ సహాయం అందించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వాలు స్పందించాలి వలస కార్మికులకు జరిగిన భారీ నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మన రాయబార కార్యాలయాల ద్వారా న్యాయం జరిగేలా చూడాలి. దీని వల్ల వలస కార్మికులకే కాకుండా ప్రభుత్వాలకు కూడా ఆదాయం లభిస్తుంది. – మంద భీంరెడ్డి, ఇమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మానవత్వంతో వ్యవహరించాలి వలస కార్మికులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి గల్ఫ్ దేశాలకు వెళ్లారు. వారి విషయంలో ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వారికి న్యాయం జరిగేలా చొరవ చూపాలి. – స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు -
జులై 29న దోహాలో ఓపెన్ హౌజ్
దోహా: ఖతార్ లో ఇండియన్ ఎంబసీలో 2021 జులై 29న ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నారు. ఖతార్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక (లేబర్), కాన్సులర్ (దౌత్య) సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. జులై 29 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. భారత దౌత్య అధికారులు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశానికి నేరుగా రాలేకపోయిన వారు జులై 29వ తేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 00974 50411241 ఫోన్ ద్వారా అయినా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ ఐడీ ID: 830 1392 4063 పాస్‌కోడ్‌లను 121700 ఉపయోగించి జూమ్ సమావేశంలో జాయిన్ కావొచ్చు. వీటితో పాటు labour.doha@mea.gov.in కు మెయిల్ ద్వారా కూడా సమస్యలను విన్నవించుకోవచ్చు. -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త !
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై కేంద్రం తన పంథాను మార్చుకుంది. గత సెప్టెంబరులో జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేసింది. 2019-20లో ఉన్నట్టుగానే కనీస వేతనాలు ఉంటాయంటూ పార్లమెంటులో ప్రకటన చేసింది. మంత్రి ప్రకటన ప్రస్తుతం ఆరు గల్ఫ్ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి... కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్ మార్కెట్ స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తామ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. కేరళకు చెందిన ఎంపీ ఎంవీ శ్రేయాన్స్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత సెప్టెంబరులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్)ను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్ లో సర్కులర్లను జారీ చేసింది. తాజాగా వాటిని రద్దు చేసి పాత వేతనాలను కొనసాగించాలన్న కార్మికులు, ఉద్యోగుల డిమాండును ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో గల్ఫ్ ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కేంద్రంపై ఒత్తిడి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జెఏసీ చేసిన ఉద్యమానికి కేంద్రం తల ఒగ్గింది. కనీస వేతనాల తగ్గింపుపరై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ సమస్యపై ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. మరోవైపు గల్ఫ్ కార్మికనేత మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి కొనసాగించడంతో వేతన తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. 29న హైకోర్టులో విచారణ గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం ఈ కేసును ఈనెల 29న విచారించనున్నది. గల్ఫ్ జేఏసీ శ్రమతో మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు గల్ఫ్ జేఏసీ బృందం వినతిపత్రాలు సమర్పించింది. గల్ఫ్ జెఏసి బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్, బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు ఉన్నారు. -
వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎన్ఆర్ఐలు సంపాదిస్తున్న వేతనాలపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లు 2021 సవరణల్లోని గల్ఫ్ కార్మికుల ప్రత్యేక పన్నును ప్రస్తావిస్తూ.. గల్ఫ్‌లోని భారత కార్మికులపై అదనపు పన్నును విధించనున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహుమోయిత్రా చేసిన ట్వీట్‌కు మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సౌదీ, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో పనిచేస్తున్న భారత కార్మికులపై ఆర్థిక బిల్లు 2021లో కొత్తగా లేదా అదనపు పన్నును ప్రవేశపెట్టలేదని స్పష్టం చేశారు. ఆదాయ పన్ను చట్టంలో స్పష్టత కోసం పన్నుకు బాధ్యులు అన్న నిర్వచనాన్ని బిల్లులో ఇచ్చినట్టు చెప్పారు. ‘‘గల్ఫ్ దేశాల్లో భారత ఎన్ఆర్ఐ కార్మికులు ఆర్జిస్తున్న వేతనంపై పన్ను అంశంలో ఎంటువంటి మార్పు లేదు. వారి వేతనంపై భారత్‌లో పన్ను మినహాయింపు కొనసాగుతుంది’’ అంటూ తన ట్వీట్లో మంత్రి సీతారామన్ స్పష్టత ఇచ్చారు. తప్పుదోవ పట్టించడమే కాకుండా.. ప్రజల్లో అనవసర భయాలను కలిగిస్తున్నారని పేర్కొన్నారు. చదవండి: ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా -
గల్ఫ్ కార్మికులపై ‘కరోనా’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ గార్డ్ సంస్థ.. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద సప్లయింగ్ కంపెనీ. క్లీనింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు మొదలు అన్ని రకాల కార్మికులను వివిధ సంస్థలకు సమకూర్చే సంస్థ. సంపన్నుల ఇళ్లలో పనులకు కూడా కార్మికులను పనులకు కుదురుస్తుంది. రోజూ షిప్టుల వారీగా ఆయా సంస్థల వద్ద దిగబెట్టడం, ఆ తర్వాత గమ్యస్థానాలకు చేర్చడం ఈ కంపెనీ పని. అలాంటి ఈ సంస్థపై కరోనా పిడుగు పడింది. సంస్థలో పనిచేస్తున్న 12 వేల మంది వలస జీవులపై ప్రస్తుతం కత్తి వేలాడుతోంది. కార్మికుల సంఖ్యను తగ్గించుకునేందుకు వేతన రహిత సెలవు (అన్‌పెయిడ్ లీవ్)లపై వెళ్లాలని ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి ఎన్నో కంపెనీలు కరోనా ప్రభావం తో కార్మికులకు కోత పెడుతున్నాయి. ఇలా గల్ఫ్ దేశాల్లో అన్ని చోట్లా కార్మికుల ఉపాధిపై కరోనా వేటు పడ నుంది. ఆఖరికి ఇంట్లో పనిచేసే సిబ్బందిని కూడా రావొద్దని సంపన్నులు చెబుతున్నారంటే కరోనా వైరస్ భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ సంఖ్యలో ఉద్వాసన ఉద్యోగ, ఉపాధిరీత్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 87 లక్షల మంది భారతీయుల్లో 25 శాతం మంది ఉపాధి కోల్పోతారని అంచ నా. ఈ లెక్కన తెలంగాణకు చెందిన 15 లక్షల ప్రవాస భారతీయుల్లో.. సుమారు 3.75 లక్షల మంది కొలువు లు కోల్పోయే ప్రమాదముందని ప్రవాసీ మిత్ర సంస్థ, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపడంలో దేశవ్యాప్తంగా కీలకంగా పనిచేస్తున్న 1,400 రిక్రూటింగ్ ఏజెన్సీల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. కార్మికుల నియామకాలపై ఆంక్షలు కఠినతరం చేసే నేపథ్యంలో ఈ ఏజెన్సీల మనుగడ కష్టం కానుంది. బలవంతపు సెలవులు లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు కార్యకలాపాలను బంద్ చేశాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులను అన్‌పెయిడ్ లీవ్‌లో వెళ్లాలని యా జమాన్యాలు ఆదేశించాయి. కొన్ని సంస్థలు మాత్రం భోజనంతో సరిపెడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆసియా ప్రవాసీల్లో అత్యధికులు భారతీయులే. తాజాగా చమురు కంపెనీలు, నిర్మాణ, రిటైల్, ఆతిథ్య సేవారంగం తదితర రంగాలు కుదేలయ్యాయి. ముడిచమురు ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇది అన్ని రంగాల్లోని ఉపాధిపై ప్రభావం చూపుతుండడంతో కొలువుల కోతకు దారితీస్తోంది. మీ పౌరులను తీసుకెళ్లండి కరోనా కేసుల సంఖ్య పెరిగితే కష్టమని భావిస్తున్న గల్ఫ్ దేశాలు.. పౌరులను తీసుకెళ్లాలని భారత్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలకు యూఏఈ లేఖ రాసింది. అయితే ఆ దేశాల నుంచి స్పందన రాకపోవడంతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను పునఃసమీక్షిస్తామని హెచ్చరించింది. కాగా, ఒమన్ నుంచి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచిం చింది. లాక్డౌన్ ఎత్తివేయగానే స్వదేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసుల ఏర్పాటకు వీలుగా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. చట్టవిరుద్ధంగా ఉన్నవారికి ఇబ్బందులే కరోనా సంక్షోభం వల్ల ఒమన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా ఉన్న వలస కార్మికులకు ఇబ్బందులు తప్పవు. వీసా ఉన్న వారికే పని దొరికే పరిస్థితి లేదు. ఖల్లివెల్లి (అక్రమ నివాసులు) కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో వారి దేశాలకు పంపే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం గట్టెక్కినా కొందరు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్నవారికే ఒమన్‌లో భవిష్యత్తు ఉంటుంది. గతంలో ఉన్న వేతనాలు మున్ముందు చెల్లించే పరిస్థితి ఉండకపోవచ్చు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా వలస కార్మికులకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. – నరేంద్ర పన్నీరు, మస్కట్ కార్మికులకు భరోసా కష్టమే... ప్రస్తుత విపత్కర పరిస్థితిలో దుబాయ్‌లోని వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వలస కార్మికుల ఉద్యోగానికి భద్రత కష్టమే. తీవ్రమైన ఆర్థిక సం క్షోభం వల్ల కార్మికులకు భోజనం ఇతర సదుపా యాలు తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వలస కార్మికులకు గతంలో ఉన్నంత మంచి స్థితి ఉండకపోవచ్చు. – కుంట శివారెడ్డి, దుబాయ్ -
గల్ఫ్ ప్రవాసీలకు కరోనా హెల్ప్ లైన్లు
సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారతీయుల కోసం, కరోనా సంబంధిత సందేహాల నివృత్తికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఢిల్లీలో హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెం: 1800 11 8797, టెలిఫోన్ నెంబర్లు: +91 11 2301 2113 / 4104 / 7905 ఈ-మెయిల్: covid19@mea.gov.in లోసంప్రదించవచ్చు. నిర్దిష్ట, ప్రత్యేక సహాయం కోసం విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి (గల్ఫ్ వ్యవహారాలు) డా. టి.వి. నాగేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని అధికారుల బృందం పనిచేస్తుంది. వారి టెలిఫోన్ నెంబర్: +91 11 4901 8480, మొబైల్ నెంబర్: +91 92050 66104 కు కాల్ చేయవచ్చు. గల్ఫ్ దేశాలలో 85 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వారు 13 లక్షల చొప్పున గల్ఫ్ లో ఉన్నట్లు ఒక అంచనా. సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వారి హెల్ప్ లైన్ నెంబర్ +966 54610 3992 ఈ-మెయిల్: covid19indianembassy@gmail.com లేదా సౌదీ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నెంబర్ 937 కు సంప్రదించవచ్చు. దుబాయిలోని భారత రాయబార కార్యాలయం నెంబర్లు +9714 3971 222 / 333, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయం నెంబర్ +971 2 4492700, యూఏఈ ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్లు: +9712 4965228, +97192083344 కు సంప్రదించవచ్చు. పుకార్లు నమ్మవద్దు : కరోనా సందర్బంగా గల్ఫ్ లో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితిలో దుబాయి నుండి హైదరాబాద్ కు ప్రత్యేక విమానాలు నడుపుతామని కొందరు స్వార్థపరులు కార్మికుల నుండి టికెట్లకు డబ్బులు వసూలుకు ప్రయత్నిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతనే నేరుగా ఎయిర్ లైన్ సంస్థల నుండే టికెట్లు కొనుగోలు చేయాలని, అప్పటివరకు ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ఆయన కోరారు. గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ ఇవ్వాలి : "కరోనా కల్లోలంతో గల్ఫ్ దేశాల ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఆర్ధిక మాంద్యం వల్ల భవిష్యత్తులో లక్షలాది మంది గల్ఫ్ నుండి స్వరాష్ట్రం తెలంగాణాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ప్రవాసుల పునరావాసం, పునరేకీకరణ కొరకు ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో, సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా 'గల్ఫ్ ప్రవాసి ప్యాకేజీ' కి రూపకల్పన చేయాలి" అని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడు కోరారు. -
ఎన్ఆర్ఐ పాలసీపై ముందడుగు
ఎన్.చంద్రశేఖర్, మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రవాసీ విధానం(ఎన్ఆర్ఐ పాలసీ) సమగ్ర రూపకల్పనకు ప్రభుత్వం ముందడుగు వేసింది. మన రాష్ట్రం నుంచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన వారికి వివిధ రకాల ప్రయోజనాలను అందించడానికి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురావాలని సర్కారు భావిస్తోంది. ఈ విధానం అమలు ప్రక్రియ తుది దశకు చేరిందని వెలువడుతున్న వార్తలు ప్రవాసుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రవాసీ విధానం అమలు చేస్తామని 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన విషయం విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ఆర్ఐ పాలసీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎన్ఆర్ఐ పాలసీ ఎలా ఉండాలనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రవాసీ విధానం అమలు చేస్తున్నందన ఆ రాష్ట్రంలో పర్యటించి అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతస్థాయి అధికారుల బృందం కేరళ రాజధాని తిరువనంతపురానికి వెళ్లింది. ఆ రాష్ట్ర ప్రవాసీ, సంక్షేమ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇళంగోవన్, నోర్కా రూట్స్ సంస్థ సీఈవో హరికృష్ణ నంబూద్రితో మన అధికారుల బృందం విస్తృతంగా చర్చించింది. అధికారుల కేరళ పర్యటన అనతరం ఎన్ఆర్ఐ పాలసీపై మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం ప్రకటనతో గల్ఫ్ ప్రవాసుల్లో ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని, దీని కోసం ఎమ్మెల్యేల బృందాన్ని గల్ఫ్ దేశాలకు పంపి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. తాను కూడా గల్ఫ్ దేశాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటానని చెప్పారు. దీంతో ఎన్ఆర్ఐ పాలసీ అమలుకు మార్గం సుమగం అవుతుందని గల్ఫ్ వలస కార్మికులు భావిస్తున్నారు. ఎన్ఆర్ఐ పాలసీకి తుది రూపు తీసుకురావడానికి కృషి చేస్తున్న ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించడంపై దృష్టిసారించాల్సి ఉంది. నిధులు కేటాయించడంతో పాటు ఈ నిధుల వినియోగం కోసం మార్గదర్శకాలను జారీచేయాలి. గల్ఫ్ వలసదారులకే ఎక్కువ ప్రయోజనం.. తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు ఉపాధి, ఉన్నత విద్య కోసం వలస వెళ్లిన వారికి ఎన్ఆర్ఐ పాలసీ అండగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రవాసీ విధానంతో గల్ఫ్ వలసదారులకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఒమాన్, కువైట్, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్ దేశాలకు మన వారు అనేక మంది వలసవెళ్లారు. గల్ఫ్‌లో ఉపాధి పొందుతున్న మన రాష్ట్రానికి చెందిన వారు సుమారు 13లక్షల మంది ఉంటారని అంచనా. వీరందరిలో ఎన్ఆర్ఐ పాలసీపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయాలి. ఈ పాలసీ అమలైతే వలస కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అలాగే, 15 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉపాధి పొంది ఇంటికి వచ్చిన వారికి ప్రతి నెలా పింఛన్ అందించాలి. వలస కార్మికులు మోసపోకుండా ఉండటానికి నకిలీ ఏజెంట్లను అరికట్టాలి. విజిట్ వీసాల ద్వారా గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లకుండా అడ్డుకోవాలి. – గాజుల సంపత్‌కుమార్, అధ్యక్షుడు, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక, సిద్దిపేట జిల్లా వలస కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలి ఎన్నో ఏళ్లుగా వలసలు కొనసాగుతున్నాయి. వలస కార్మికుల వల్ల మన రాష్ట్రానికి, దేశానికి విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది. కానీ, వలస కార్మికుల శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలూ అమలు చేయడం లేదు. ఎవరైనా అనుకోని పరిస్థితిలో గల్ఫ్ దేశాల్లో మరణిస్తే వారి మృతదేహాలను ఇంటికి చేర్చడం ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేసి కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు, సేవలు అందించాలి.– కుంట శివారెడ్డి, నిజామాబాద్ జిల్లా(దుబాయి) ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఎన్ఆర్ఐ పాలసీ అమలులో భాగంగా ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ అమలులో ఇప్పటికే జాప్యం జరిగింది. అందువల్ల ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా స్పందించి ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులను కేటాయించాలి. ప్రవాస కార్మికులు ఇంటి వద్ద స్థిరపడాలని అనుకుంటే వారికి రాయితీపై రుణాలు ఇవ్వాలి. ప్రత్యేకంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలి. – దీకొండ కిరణ్‌కుమార్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఎన్ఆర్ఐ పాలసీ అమలైతే ఎన్నో ప్రయోజనాలు ఎన్ఆర్ఐ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే మన వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఎన్ఆర్ఐ పాల సీని అమలు చేస్తామని గతంలోనే సీఎం చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. కేరళ తరహా విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.– నందిని అబ్బగౌని,జాగృతి అధ్యక్షురాలు, ఖతార్(షామీర్పేట్) -
నేడు మస్కట్‌లో ‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరణ
గల్ఫ్ డెస్క్: గల్ఫ్ వలస జీవితాలు, కష్టసుఖాలు, హక్కులు, అభివృద్ధి.. ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ ప్రతివారం జిల్లా పేజీల్లో ‘గల్ఫ్ జిందగీ’ ప్రచురించడం తెలుగు జర్నలిజంలో కొత్త ప్రయోగం. 2017 నవంబర్ 11న ప్రారంభమై ఇప్పటి వరకు 83 వారాలుగా కొనసాగుతూ... వలస కార్మికులకు, ప్రభుత్వాలకు, యాజమాన్యాలకు మధ్య వారధిలా ఉపయోగపడుతోంది. సమగ్ర సమాచారాన్ని ఇస్తూ గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాననే భరోసా కల్పిస్తూ ముందుకెళ్తోంది. మొదట్లో ప్రతి శనివారం ప్రచురితమైన ఈ పేజీ, పాఠకుల కోరిక మేరకు 2018 జూన్ 15 నుంచి గల్ఫ్ దేశాల్లో సెలవు దినమైన శుక్రవారానికి మార్చడమైనది. ఈ పేజీలో గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడే సమాచారం, ఎంబసీలు నిర్వహించే సమావేశాలవివరాలతో పాటు ఆయా దేశాల్లో కష్టాల్లో చిక్కుకున్న కార్మికుల గురించి, వారి జీవన విధానాలు, సక్సెస్‌పై ప్రత్యేక కథనాలు ప్రచురించాం. ఒమాన్ రాజధానిమస్కట్లో నేడు (అక్టోబర్ 4) నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ప్రచురిచిత మైన పేజీలను అన్నింటినీ కలిపి‘గల్ఫ్ జిందగీ’ సావనీర్ ఆవిష్కరించబడనుంది. -
‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ తప్పనిసరి
గల్ఫ్ డెస్క్ : గల్ఫ్ తదితర 18 దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన భారతీయ కార్మికులకు రూ.10 లక్షల విలువైన ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ అనే ప్రమాద బీమా పాలసీని జారీచేయడం తప్పనిసరి చేస్తూ భారత ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అవగాహన లేక చాలా మంది కార్మికులు బీమా చేయించుకోకపోవడంతో నష్టపోతున్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన కమటం కొమురయ్య(46) సౌదీ అరేబియాలోని అభా ప్రాంతంలో ఏప్రిల్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొమురయ్య మృతదేహం కలిగిన శవపేటిక జూన్ 25న సౌదీ నుంచి స్వగ్రామానికి చేరింది. అయితే, కొమురయ్య సౌదీకి వెళ్లేటప్పుడు 2016 సెప్టెంబర్‌లో రెండేళ్ల కాలపరిమితిగల బీమా పాలసీ చేశాడు. అది 2018 సెప్టెంబర్ 28న ముగిసింది. కేవలం రూ.318 చెల్లిస్తే మరో రెండేళ్లపాటు గడువు పొడిగింపబడి రెన్యూవల్ అయ్యేది. అవగాహన లేక రెన్యూవల్ చేయించుకోలేదు. దీంతో బీమా వర్తించక కొమురయ్య కుటుంబం రూ.10 లక్షలు నష్టపోయింది. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం, సలహాల కోసం ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సహాయ కేంద్రం మొబైల్ నెంబర్ +91 94916 13129 కు కాల్ చేయవచ్చునని సంస్థ ప్రతినిధి స్వదేశ్ పర్కిపండ్ల తెలిపారు. -
నవ భారతాన్ని నిర్మిద్దాం
సేపూరి వేణుగోపాలచారి, కామారెడ్డి : నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయుల కృషి, భవిష్యత్తులో వారి పాత్ర, భాగస్వామ్యాన్ని తెలియపర్చేవిధంగా యేటా నిర్వహించే ప్రవాసీ భారతీయుల దినోత్సవాలకు వేదిక సిద్ధమైంది. 15వ ప్రవాస భారతీయుల వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఈనెల 21 నుంచి 23 వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు 2వేల మందికిపైగా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సంవత్సరం ప్రవాసీ భారతీయుల దినోత్సవం హైదరాబాద్‌లో నిర్వహించాలని భావించినప్పటికీ ఆ తర్వాత వేదిక వారణాసికి మారింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు వందల సంఖ్యలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రవాస భారతీయులు సైతం హాజరుకానున్నారు. ముఖ్య ఉద్దేశం... భారతదేశ అభివృద్ధిలో విదేశాల్లో స్థిరపడిన భారతీయులను భాగస్వామ్యం చేయడం, దేశ అభివృ ద్ధిలో ప్రవాస భారతీయుల కృషికి గుర్తుగా వేడుకలను జరుపుకోవడం ప్రవాసీ భారతీయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మహాత్మాగాంధీ సౌతాఫ్రికా దేశం నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన 1915 జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దినోత్స వంగా నిర్వహిస్తారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య ఆధ్వర్యంలో 2003 నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశం లోని ముఖ్య పట్టణాలతో పాటు విదేశాల్లోనూ ఈ ఉత్సవాలకు వేదికలను నిర్ణయిస్తారు. 2017లో జనవరి 7 నుంచి 9 తేదీల్లో న్యూఢిల్లీ, 2018 వేడుకలను జనవరి 6 నుంచి 8 వరకు సింగపూర్‌లో నిర్వహించారు. ఈ యేడాది ఉత్సవాలకు వారణాసిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభివృద్ధి, సమస్యలపై చర్చ ప్రవాస భారతీయ దివస్ అంటే.. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ధనవంతులైన ప్రవాస భారతీయులను పిలిపించి వేడుకలు నిర్వహిస్తున్నారనే అపోహలు గతంలో ఉండేవి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల, కార్మికుల సమస్యలు, సంక్షేమంపై ఈ వేడుకల్లో ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. ప్రపంచంలోని 208 దేశాల్లో 3.12 కోట్ల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌కు ప్రపచంలోని ఆయా దేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన 285 మంది పార్లమెంటేరియన్లను మాతృభూమితో వారి బంధాన్ని దృడపరచడమే లక్ష్యం గా భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఈసారి కూడా ఆయా దేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న భారత సంతతి ప్రముఖులతో పాటు సమస్యలపై చర్చించేందుకు అవగాహన కలిగిన ఆయా దేశాల ప్రవాస భారతీయులను ఆహ్వానిస్తున్నారు. -
గల్ఫ్‌లో 28,523 మంది భారతీయులు మృతి
గల్ఫ్ డెస్క్: గడిచిన ఐదేళ్లలో గల్ఫ్ దేశాల్లో మృతిచెందిన భారతీయుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్ దేశాల్లో 28,523 మంది భారతీయులు మరణించినట్లు బుధవారం లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఆత్మహత్యలు, అనారోగ్యం, వివిధ ప్రమాదాల వల్ల వలస కార్మికులు మృతి చెందినట్లు మంత్రి వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు గల్ఫ్‌లో మరణించిన భారతీయుల సంఖ్యను సంవత్సరాల వారీగా వెల్లడించారు. -
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : సమూల మార్పుకోసం.. సమగ్ర ప్రణాళిక అనే నినాదంతో 'పీపుల్స్ మేనిఫెస్టో-2018' పేరుతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. బొంబాయి - దుబాయి - బొగ్గుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ప్రవాస భారతీయులు మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి అవకాశాలు వెదుక్కుంటూ వెళుతున్న కార్మకుల పాత్ర మరవలేనిదని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే గల్ఫ్ కార్మకుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేసిన కేసీఆర్, తానూ ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్ లలో గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా అరచేతిలో వైకుంఠం చూపించారని, గల్ఫ్ కార్మికుల వలసల వల్ల రాష్ట్రానికి ప్రతి నెలా రూ.1500 కోట్ల ఆదాయం వస్తున్నా వారిసంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని వివరించారు. కాంగ్రెస్ గల్ఫ్ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల వివరాలు యధాతథంగా.. ► కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటిస్తాము. ► గల్ఫ్ కార్మకుల సంక్షేమ నిధికి ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాము. ► గల్ఫ్ లో మృతిచెందిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాము. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన 6 నెలల లోపు ఇక్కడ మరణించిన వారికి కూడా వర్తింపు) ► విదేశాల్లో ఉన్న వలసకార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి, వారికి తగిన సహాయం అందించేందుకు 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము. ► ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో నకిలీ ఏజెంట్ల మోసాలపై నిఘా ఏర్పాటు చేసి, దొంగ ఏజెంట్లను కఠినంగా శిక్షిస్తాము. ► కార్మికుల వలసలను నివారించేందుకు వారికి అనేక రంగాల్లో "ఒకేషనల్, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ విశ్వవిద్యాలయాని" కి అనుసంధానంగా స్కిల్ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి స్వదేశంలోనే స్వయం ఉపాధి మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాము. ► అనారోగ్య కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి వైద్య సదుపాయాలను కల్పిస్తాము. ► విదేశాలలో ఉన్నత విద్య కొరకు తీసుకున్న బ్యాంకు రుణాలపై అర్హులైన విద్యార్థులకు వడ్డీని మాఫీ చేస్తాము. ► TOMCOM (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) ను లేబర్ డిపార్టుమెంటు పరిధిలో నుండి తప్పించి ఎన్నారై కార్పొరేషన్ పరిధిలోకి తెస్తాము. ► గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలసకార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం చేస్తాము. ► గల్ఫ్ వలసకార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన 'ప్రవాసీ యోగక్షేమ' అనే పథకాన్ని ప్రవేశపెడతాము. ► ఆహార భద్రత, పెన్షన్ మరియు ఆరోగ్యశ్రీ పథకాన్ని గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబాలకు వర్తింపచేస్తాము. ► అమెరికా తరహాలో ఎన్నారై పౌరుల లిస్టు తయారు చేసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటాము. ► గల్ఫ్ కార్మికులకు ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా చేరువై వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాము. ► గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారికి ఇంగ్లీష్, అరబిక్ భాషలు అర్థం చేసుకుని, అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై తగిన అవగాహన కల్పించడానికి మొబైల్ యాప్ తయారు చేసి శిక్షణ ఇస్తాము. ► గల్ఫ్ దేశాల్లోని తెలుగు స్వచ్చంద సంస్థలను రాజకీయాలకు అతీతంగా సంఘటిత పరిచి తద్వారా కార్మికులకు మద్దతుగా నిలిచేలా కృషి చేస్తాము. ► మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి, రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేస్తాము. అవగాహన సదస్సులు నిర్వహిస్తాము. ► గల్ఫ్ కు వెళ్ళడానికి అవసరమైన 'గమ్కా' మెడికల్ చెకప్ చార్జీలను (రూ.4 నుండి 5 వేలు) ప్రభుత్వంద్వారా రీయింబర్స్ చేస్తాము. ► గల్ఫ్ కు ఉద్యోగానికి వెళ్ళడానికి చట్టబద్దంగా రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను, ఇతర ఖర్చులను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తాము. ► ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నారై విభాగాలను ఏర్పాటు చేస్తాము. ► రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలలో వలసలపై అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తాము. ► నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేసి, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి షబ్ డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తాము. ► ప్రతి ఏటా ప్రవాసి తెలంగాణ దివస్ అధికారికంగా నిర్వహిస్తాము. ► గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ తెలంగాణా స్వచ్చంద సంస్థలను గుర్తించి, వారి ద్వారా సమస్యలను పరిష్కరిస్తాము. ► రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుబాయి, సౌదీ అరేబియా లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము. ► హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్, యుఏఇ కాన్సులేట్ ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాము. ఎంబసీలలో తెలుగు మాట్లాడే అధికారులను నియమించేలా ప్రయత్నిస్తాము. -
వలస పోయిన ఓటు
గల్ఫ్ కార్మికుల అంశం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ప్రచారాస్త్రంగా మారనుంది. ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంది. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంఖ్య 13 లక్షలని అంచనా. ఈ ఓట్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల గత విధానాల వల్లే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని టీఆర్ఎస్ విమర్శిస్తోంటే.. గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, వారి కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పి నాలుగేళ్లలో పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తానికి ‘వలస ఓట్ల’ను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు వల విసురుతున్నాయి. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరిలో 80 శాతానికిపైగా కార్మికులు ఎలాంటి నైపుణ్యం లేకుండా కేవలం కూలీ పనుల కోసమే వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో సంపాదనపై ఆశతో వెళ్తున్న వీరిని దళారీలు దోచుకుంటున్నారు. మిగతా సమయాల్లో ఎలాగున్నా ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు గల్ఫ్ కార్మికుల సమస్యలు, వారి కుటుంబాలపై గురిపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ దేశాల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాన్ని మేనిఫెస్టోలో చూపించే యత్నం చేస్తోంది. గత శుక్రవారం టీపీసీసీ ప్రతినిధి బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించింది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడి మన వలస కార్మికులపై వరాల జల్లు కురిపించడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్ ఎంపీ కవిత.. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన, చేయబోయే ప్రవాసీ కార్యక్రమాలను వివరించారు. వైఎస్ హయాంలోనే గల్ఫ్ బాధితులకు మేలు గల్ఫ్ కార్మికుల కష్టాలను గుర్తెరిగిన మనిషిగా, వారి సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం, ఓ మంత్రిని నియమించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అక్కడి కార్మికుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. వైఎస్ తన ప్రభుత్వ హయాంలో.. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 200 కుటుంబాలకు ఈ సాయం అందింది. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణాలను గుర్తించి.. పలువు రికి 30–50 శాతం రాయితీ రుణాలను పంపిణీ చేసిన వైఎస్ ప్రభుత్వం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టింది. గల్ఫ్ దేశాల్లో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తే చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను స్వరాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవ చూపింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి వైఎస్ హయాంలో జారీ అయిన జీవోలను.. ఆపై వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాడు వైఎస్ తీసుకున్న చర్యలను ఇప్పటి రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో చేర్చాలని కార్మికులు కోరుతున్నారు. మేనిఫెస్టోలపై గంపెడాశలు తమ ప్రయోజనాల కోసం స్పందించే రాజకీయ పక్షాలపై బాధిత కుటుంబాలు ఆశ పెట్టుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్లతో ప్రత్యేక గల్ఫ్ ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయలేదు. కానీ, 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లను ఎన్ఆర్ఐ సెల్‌కు కేటాయించింది. గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ దేశాల్లో మరణించిన దాదాపు 1,200 మంది కార్మికుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంతోపాటు, వారి ఇళ్ల వరకు పంపించినట్లు అధికార పార్టీ చెబుతోంది. తమ పట్ల సానుకూలంగా ఉండే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు అంటున్నాయి. ఎన్ఆర్ఐల ఓట్లు కీలకం ప్రవాస భారతీయులు తమ ఓటు హక్కును విదేశాలలోనే ఉండి స్వదేశంలో జరిగే ఎన్నికలో ఉపయోగించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రాక్సీ ఓటింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది, రాజ్యసభ సైతం దీనికి ఆమోద ముద్రవేస్తే.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ఆర్ఐల ఓట్లు కీలకమవుతాయి. ఈ ప్రయత్నాలతో.. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుందనే ధీమాతో ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాల వల్ల కార్మికుల ఓట్లే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఓట్లతో లబ్ధిపొందే అవకాశం ఉంటుంది. గల్ఫ్ కార్మికుల డిమాండ్లు ఇవీ - గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ కార్మికుల లెక్క తేల్చడానికి కేరళ ప్రభుత్వ తరహాలో ప్రత్యేక సర్వే నిర్వహించాలి. దాని ఆధారంగా గల్ఫ్ వలస కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలి. కేరళ మాదిరిగానే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. - ఏజెంట్ల బారినపడి మోసపోయిన బాధితులకు స్వయం ఉపాధి కింద రాయితీ రుణాలు ఇవ్వాలి. లైసెన్స్‌లేని ఏజెంట్ల వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి. - కార్మికులకు ఉచిత శిక్షణనిచ్చి.. నైపుణ్యాలు అలవర్చుకున్నాకే వీసా ప్రక్రియను ప్రారంభించాలి. - గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం అధునాతన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్‌లో మరణించిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వం చొరవ చూపడంతో పాటు కార్మికులకు రావాల్సిన జీతభత్యాలను ఇప్పించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. - గల్ఫ్ వెళ్లిన కార్మికులకు ఉచిత బీమా సౌకర్యం, గల్ఫ్ నుంచి ఇళ్లకు చేరిన వారికి పింఛన్లు ఇవ్వాలి. గల్ఫ్ దేశాల్లో కార్మికులకు లేబర్ కోర్టులలో న్యాయపరమైన సలహా, సేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. -
జగిత్యాల...కేరాఫ్ గల్ఫ్
జగిత్యాల.. గల్ఫ్, ముంబాయి వలసలకు కేరాఫ్‌గా పేరొందిన జిల్లా.. ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40వేల మంది పొట్టకూటి కోసం బయటిదేశాలకు వెళ్లారు. సుమారుగా అంతేమంది జిల్లా నుంచి ముంబాయికి వలసవెళ్లారు. అవసరాలు, పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు తమతమ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. ఏళ్లతరబడి ఈ రాకపోకల పరంపర కొనసాగుతోంది. అయితే.. వచ్చే నెల ఏడో తేదిన వీరి రాక కోసం వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆరోజు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వీరితోపాటు వీరి కుటుంబ సభ్యుల ఓట్లు తమకే పడేలా చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, జగిత్యాల: మేం గెలిస్తే.. మా పార్టీ అధికారంలోకి రాగానే అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్ సమస్యలు పరిష్కరిస్తాం.. ఇక్కడ ఏ అవసరమొచ్చినా మీ కుటుంబాలకు అండగా ఉంటాం.అంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారు. తమతమ పార్టీల మేనిఫెస్టోల్లో అందుకు తగ్గట్టు హామీలను పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో పొందుపర్చింది. అందుకు తగ్గట్టు ప్రచారమూ జోరుగా నిర్వహిస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఆకర్షితులై సుమారు 200 మంది గల్ఫ్ బాధిత కుటుంబాలు ఈనెల 4న.. జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. ఇటు టీఆర్ఎస్ సైతం ఇప్పటికే ప్రవాస పాలసీ అమలుపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్ సమస్యలపై స్పందించారు. ఈ క్రమంలో పరాయిదేశంలో చిక్కుకున్న, మృతిచెందిన వారికి తనవంతుగా సహాయం అందించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపునకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. జిల్లా నుంచి 40వేలకు పైగా.. జిల్లా పరిధిలోని జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40వేలకు పైగా మంది సౌదీఅరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్ దేశాల్లో ఉంటున్నారు. ఎక్కువగా సౌదీ, దుబాయి, అబుదాబి, ఖతర్, షార్జాకు వెళ్తుంటారు. వీరిలో మంచి హోదాలో ఉన్నవారు 4వేలకు మించి ఉండరు. మిగిలిన వారందరూ భవన నిర్మాణ కార్మికులుగా, వివిధ కంపెనీల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా, హోటళ్లలో పనిచేస్తున్నారు. వీరందరూ చాలీచాలని వేతనాలతోపాటు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరి సంక్షేమం కోసం ఎన్నో ఏళ్ల నుంచి అనేక హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు.. అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రవాసుల డిమాండ్లు ఇవి..! రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. విదేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి. విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి. తెల్లరేషన్‌కార్డు ఉంటేనే.. మృతదేహాలను విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలి. గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించాలి. వలసల కారణాలు..?ఏయే జిల్లాల నుంచి వలసలు ఉన్నాయి..? తెలుసుకోవాలి. కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు ప్రత్యేక ఇన్సురెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వలస వెళ్లిన కార్మికుల పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగించొద్దు. వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలి. కేంద్రం చేయాల్సినవి ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి. -
ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్
మహమ్మద్ హమీద్ ఖాన్, హైదరాబాద్, సిటీబ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో రక్షణ సిబ్బంది, భద్రతా దళాలకు వెసులుబాటు ఉన్న సర్వీస్ ఓటింగ్ తరహాలోనే ప్రవాస భారతీయులకు పరోక్షఓటింగ్ (తమ ప్రతినిధి ద్వారా ఓటు వేయడం) సదుపాయం కల్పించే ప్రజా ప్రాతినిధ్య సవరణ బిల్లు– 2017ను కేంద్రమంత్రివర్గం అంగీకరించింది. దానికి గతనెలలో లోక్‌సభలో ఆమోద ముద్రపడింది. రాజ్యసభలో బిల్లు పాస్‌కావాల్సి ఉంది. తర్వాత రాష్ట్రప్రతి ఆమోదముద్రతో చట్టసవరణ అమల్లోకి వస్తుంది. దీనిని ‘ప్రాక్సీఓటింగ్’ అంటారు. 2010లోనే చట్ట సవరణ చేసినా..? వాస్తవానికి 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టసవరణ చేసింది. సెక్షన్ 20– ఏ ప్రకారం 18ఏళ్లు నిండి విదేశీ గడ్డపై నివసిస్తున్న ఎన్నారైలు భారతదేశంలో ‘ఓవర్సీస్ ఎలక్ట్రర్స్’గా తమ పేర్లు నమోదు చేసుకునేందుకు వీలుంది. ఆయితే అప్పట్లో ప్రవాస భారతీయులు ఇక్కడకు వచ్చి ఓటేయాల్సిం దేనని ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో కనీసం 25వేల మంది తమ ఓటుహక్కును నమోదు చేసుకోలేదు. కాగా వివిధ దేశాల్లో సుమారు కోటి 25లక్షల మందిపైగానే ఎన్నారైలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అరబ్ గల్ఫ్ దేశాల్లోనే సుమారు పది లక్షల మంది తెలంగాణ వలస కార్మికులు ఉన్నారు. సుమారు 25 అసెంబ్లీ, రెండులోకసభ నియోజకవర్గాల్లో వీరి కుటుంబాల ప్రభావం ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనా. భిన్నాభిప్రాయాలు.. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ఫోరం ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన సదస్సులో పలువు రు ఎన్నారైలు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. పరోక్ష ఓటింగ్ దుర్వినియోగమవుతోందని, దీనికి బదులు ప్రవాసీలంతా ఆయాదేశాల్లోని భారత రాయబార కార్యాలయంలో ఓటు వేసే ఏర్పాట్లు చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ ఇది కుదిరే పనికాదని స్పష్టం చేసిన విషయాన్ని మరి కొందరు గుర్తుచేశారు. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇదే విధానం అనుసరిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈ– పోస్టల్ బ్యాలెట్ విధానాలపై కొందరు ఆసక్తి కనబర్చినా, లోపాలున్నాయన్న వాదన వినిపించింది. పరోక్ష ఓటింగ్‌లో సూచిం చిన వ్యక్తికే ఓటు వేస్తారనే నమ్మకం లేదన్న అభిప్రాయాన్ని పలువురు ఎన్నారై ప్రతినిధులు వ్యక్తం చేశారు. ఓటుహక్కు అవసరం ఎన్నారైలు, వలస కార్మికులకు ఓటు హక్కు అవసరం.స్థానికంగా లేని కారణంగా ఓటు హక్కు తొలగిస్తున్నారు. దీంతో రాజకీయపక్షాలు వలస కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదు. గతంలో ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ జరిగినా ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనే నిబంధన ఉండటంతో ప్రవాస భారతీయులు, కార్మికులు ఓటరు నమోదుపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. తాజాగా పరోక్ష ఓటింగ్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. రాజ్యసభలో ఆమోదం తర్వాత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. – మంద భీంరెడ్డి, అధ్యక్షుడు ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఓటుహక్కు కల్పించాల్సిందే.. ప్రవాస భారతీయులకు ఓటు హక్కు అవసరం. విదేశాల నుంచి ఓటింగ్ కోసం ప్రత్యేకంగా రావడం సాధ్యం కాదు. ఉన్న చోట నుంచే ఓటు వేసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేయాలి. నేరుగా ఓటు వేస్తేనే తమ హక్కు వినియోగించుకున్నట్లు సంతృప్తి ఉంటుంది. ఎన్నికల కమిషన్ ప్రవాస భారతీయుల ఓటు హక్కు కల్పనపై పరిశీలించాలి.– శాంతిప్రియ, మలేషియా మన ఓటు మరొకరి ద్వారానా..? ఎన్నికల కోసం మనహక్కు ఇతరులకు అప్పజెప్పడమేమిటి..? దుర్వినియోగమయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు అవసరం. ఎన్నికల అవసరాలకు ఎన్నారైల ఫండ్ అవసరం కానీ, ఓటు హక్కు గురించి ఎందుకు ఆలోచించరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద విదేశాలకు వెళ్లిన వారి జాబితా ఉంటుంది. దాని ఆధారంగా ఓటు నమోదు ప్రక్రియ చేపట్టాలి. – హేమంత్‌కుమార్, మస్కట్ పరోక్ష ఓటుహక్కు దుర్వినియోగమే.. ఎన్నికల్లో పరోక్ష ఓటింగ్ విధానం దుర్వినియోగానికి దారితీస్తుంది. సూచించిన వ్యక్తికి ఓటు పడుతుందన్న నమ్మకం లేదు. ఉన్నచోట నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి. ప్రవాస భారతీయుల కోసం ఎంబసీలో బ్యాలెట్ ఏర్పాటు చేసి ఎర్లీ పోలింగ్ నిర్వహించాలి. ముందుగా ప్రవాస భారతీయులకు గుర్తింపు ఇవ్వాలి. రాజకీయాల్లో సైతం ప్రాధాన్యం కల్పించాలి. – భవానీరెడ్డి, ప్రవాస భారతీయురాలు, ఆస్ట్రేలియా ఈ– ఓటింగ్ విధానం అనుసరించాలి విదేశాల్లో మాదిరిగా ప్రవాస భారతీయులకు ఈ– ఓటింగ్ విధానం వర్తింపజేయాలి. పరోక్ష ఓటింగ్ సరైనది కాదు. విదేశాల్లో ఉండి నేరుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఎన్నారైలకు సరైన గుర్తింపు ఇస్తే అభివృద్ధిలో మరింత భాగస్వాములయ్యే అవకాశం ఉంది. – సురేశ్‌రెడ్డి, అమెరికా పరోక్ష ఓటింగ్‌కు వ్యతిరేకం ప్రవాస భారతీయులకు పరోక్ష ఓటింగ్ విధానం వర్తింపజేయడానికి వ్యతిరేకం. ఎవరి ఓటు హక్కు వారే వినియోగించుకోవాలి. ప్రవాస భారతీయుల ప్రతినిధి రాజకీయ ప్రలోభాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. రాజకీయపక్షాలు ఎన్నారైలను గుర్తించడం లేదు. కేవలం పార్టీఫండ్స్కు మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి.– దేవేందర్‌రెడ్డి ద్వినియోగం చేసుకోవాలి.. ఎన్నారైలు, వలస కార్మికులకు ప్రజాస్వామ్య బద్ధంగా ఓటుహక్కు అవసరం. పరోక్ష ఓటింగ్ విధానం కన్నా పోస్టల్, లేదా బ్యాలెట్ వెసులు బాటు కల్పించాలి. ఓటు హక్కు వినియోగించకున్నప్పుడే సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ కల్పించిన అవకాశాన్ని ఎన్నారైలు, వలస కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. – సునీల్‌కుమార్, గల్ఫ్ సినిమా డైరెక్టర్ ఎన్నారైలు ఓటర్లుగా నమోదు కావచ్చు ప్రవాస భారతీయులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ పాస్‌పోర్టులో పేర్కొన్న చిరునామా ప్రకారం సంబంధిత శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారికి భారత ఎన్నికల సంఘం వారి ఫారం–6ఏలో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. తరువాత భారత్‌లోని తమ చిరునామాలో బంధువులను విచారిస్తారు. ఏడు రోజులవరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఓటరుగా నమోదు చేస్తారు. ఏదైనా తేడా వస్తే దరఖాస్తుదారు నివసిస్తున్న దేశంలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారమిస్తారు. ‘‘ఓవర్సీస్ ఎలక్టర్స్ (ప్రవాసీఓటర్లు)గా నమోదు అయినవారు పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్ కు వచ్చి, ఒరిజినల్ పాస్‌పోర్ట్ చూపించి ఓటుహక్కును వినియోగించుకోవాలి. వీరికి ఎన్నికలలో పోటీ చేసే హక్కుతో పాటు సాధారణ ఓటరుకు ఉండే అన్ని హక్కులు సమానంగా ఉంటాయి. ఇలా నమోదు చేసుకోవాలి... https://www.nvsp.in/Forms/Forms/form6a?lang=en-GB ను క్లిక్ చేయగానే స్క్రీన్ పై ఫాం– 6ఏ కనిపిస్తుంది. ఓటరు నమోదు అధికారి రాష్ట్రం: తెలంగాణ, జిల్లా, నియోజకవర్గం పేరు నమోదు చేయాలి. పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ (పాస్‌పోర్ట్ ప్రకారం), ఆ ఊరిలో ఉన్న ఒక బంధువు పేరు నమోదు చేయాలి. పుట్టిన స్థలం, జిల్లా, రాష్ట్రం, లింగము (స్త్రీ, పురుష, ఇతర), ఇమెయిల్, ఇండియా మొబైల్నంబర్ పేర్కొనాలి. పాస్‌పోర్టు నంబర్, అది జారీ చేసిన ప్రదేశం, జారీచేసిన తేదీ, గడువు తేదీ, వీసానంబర్, వీసా క్యాటగిరీ (సింగిల్ఎంట్రీ / మల్టిపుల్ఎంట్రీ / టూరిస్ట్ / వర్క్ వీసా), వీసా జారీ చేసిన తేదీ, గడువు ముగిసే తేదీ, వీసా జారీ చేసిన అథారిటీ పేరు తెలియాజేయాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరు కావడానికి గల కారణాలు వివరించాలి. ఇండియాలోని సాధారణ నివాసంలో గైర్హాజరైన తేదీ పేర్కొనాలి. విదేశంలో నివసిస్తున్న ప్రదేశం యొక్క పూర్తి పోస్టల్ అడ్రస్ నమోదు చేయాలి. స్వదేశంలోని అడ్రస్, పూర్తి వివరాలు, పిన్‌కోడ్ నంబర్ సరిగా నమోదు చేయాలి. పాస్‌పోర్టుసైజ్ కలర్ ఫొటో, చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టు, వీసా పేజీలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వాగ్మూలం ఇలా ఇవ్వాలి.. ‘‘నాకు తెలిసినంతవరకు ఈ దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిజమైనవి. నేను భారత పౌరుడిని. నేను ఇతర దేశము యొక్క పౌరసత్వము కలిగిలేను. ఒకవేళ నేను విదేశీ పౌరసత్వం పొందినట్లయితే వెంటనే భారత రాయబార కార్యాలయానికి తెలియజేస్తాను. ఓటరు నమోదు కొరకు ఇతర నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకోలేదు.తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టం1950 సెక్షన్ 31 ప్రకారం నేను శిక్షార్హుడిని అని నాకు తెలుసు.’’ ఒమన్ రాయబారిగా మును మహావర్ ‘‘ఒమన్ దేశపు భారతరాయబారిగా మును మహావర్ 21ఆగస్టు 2018న బాధ్యతలు స్వీకరించారు. 1996 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన మును మహావర్ గతంలో మాస్కో, జెనీవాలో, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రులైన మునుమహావర్ చత్తీస్‌గఢ్‌కు చెందినవారు.’’ -
రూ.500 కోట్లతో ‘గల్ఫ్ ఫండ్’ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్లతో నిధి ఏర్పాటు చేయాలని టీ పీసీసీ మేనిఫెస్టో కమిటీకి గల్ఫ్ సబ్‌కమిటీ ప్రతిపాదనలు సమర్పించింది. ఏటా బడ్జెట్లో నిధులు కేటాయింపు, గల్ఫ్ ఫండ్ నిర్వహణకు గల్ఫ్ వర్కర్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించింది. శుక్రవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహాకు కమిటీ ఈ ప్రతిపాదనలు సమర్పించింది. అనంతరం విలేకరులతో గల్ఫ్ సబ్‌కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, ప్రవాస సంక్షేమ వేదిక చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు రాజ్‌కుమార్, అనిల్‌తో కలసి వివరాలను వెల్లడించారు. గల్ఫ్‌లో మృతి చెందినవారి కుటుంబాలకు 5 లక్షల పరి హారం, గల్ఫ్ బాధితులకు కార్పొరేషన్ నేరుగా అందుబాటులో ఉండే వెసులుబాటు, ఏజెంట్ల మోసాలకు, అక్కడి యజమానుల కుట్రలకు బలై చిన్నచిన్న కారణాలతో జైలుకెళ్లిన వారికి న్యాయ సహాయం అంశాలపై కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో అమలు చేయాలని సూచించినట్లు చెప్పారు. నాలుగున్నరేళ్లలో నయాపైసా ఇవ్వలే.. టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను నిర్లక్ష్యం చేసిందని భీంరెడ్డి ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో గల్ఫ్‌లో 800 మంది చనిపోతే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నయా పైసా సహాయం చేయలేదన్నారు. విదేశాల్లో మృతి చెందిన వారి శవపేటికలను తేవడం కూడా కష్టంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌తోనే గల్ఫ్ కార్మికుల సంక్షేమం సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గల్ఫ్ కార్మికులకు జీవిత, ఆరోగ్య బీమా వర్తింపజేసే విధంగా మేనిఫెస్టో కమిటీకి ప్రతిపాదించినట్లు ఆయన చెప్పారు. -
గల్ఫ్ ఎన్ఆర్ఐల సంక్షేమంపై త్వరలో ప్రకటన
రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్ఆర్ఐల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఎన్ఆర్ఐల సంక్షేమంపై త్వరలో ఓ ప్రకటన చేస్తామని రాష్ట్ర ఎన్ఆర్ఐ విభాగం మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ప్రవాస భారతీయులకు ఎన్నిక ల్లో ఇచ్చిన హమీలను అమలు చేస్తామన్నారు. ఇందు కోసం తాను త్వరలో గల్ఫ్‌లో పర్యటిస్తానని, అక్కడి ఎన్ఆర్ఐ సంఘాలు, ఎన్నారైలకు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఎన్ఆర్ఐలు ఏ సమస్య ఉన్నా తన కార్యాలయ సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఎమిరెట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ సంఘం ప్రతినిధులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి గల్ఫ్‌లో తెలంగాణ వాసుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నారైల సమస్యలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపట్ల కృతజ్ఞతలు తెలిపారు.