సాక్షి, హైదరాబాద్ : సమూల మార్పుకోసం.. సమగ్ర ప్రణాళిక అనే నినాదంతో 'పీపుల్స్ మేనిఫెస్టో-2018' పేరుతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. బొంబాయి - దుబాయి - బొగ్గుబాయి అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో ప్రవాస భారతీయులు మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు ఉపాధి అవకాశాలు వెదుక్కుంటూ వెళుతున్న కార్మకుల పాత్ర మరవలేనిదని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే గల్ఫ్ కార్మకుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేసిన కేసీఆర్, తానూ ప్రవేశపెట్టిన నాలుగు బడ్జెట్ లలో గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి కేటాయించకుండా అరచేతిలో వైకుంఠం చూపించారని, గల్ఫ్ కార్మికుల వలసల వల్ల రాష్ట్రానికి ప్రతి నెలా రూ.1500 కోట్ల ఆదాయం వస్తున్నా వారిసంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని వివరించారు.
కాంగ్రెస్ గల్ఫ్ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాల వివరాలు యధాతథంగా..
► కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటిస్తాము.
► గల్ఫ్ కార్మకుల సంక్షేమ నిధికి ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాము.
► గల్ఫ్ లో మృతిచెందిన వలసకార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాము. (గల్ఫ్ నుండి వాపస్ వచ్చిన 6 నెలల లోపు ఇక్కడ మరణించిన వారికి కూడా వర్తింపు)
► విదేశాల్లో ఉన్న వలసకార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి, వారికి తగిన సహాయం అందించేందుకు 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము.
► ఇమ్మిగ్రేషన్ అధికారుల సహకారంతో నకిలీ ఏజెంట్ల మోసాలపై నిఘా ఏర్పాటు చేసి, దొంగ ఏజెంట్లను కఠినంగా శిక్షిస్తాము.
► కార్మికుల వలసలను నివారించేందుకు వారికి అనేక రంగాల్లో "ఒకేషనల్, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎంప్లాయిమెంట్ విశ్వవిద్యాలయాని" కి అనుసంధానంగా స్కిల్ బిల్డింగ్ కార్యక్రమాలు చేపట్టి స్వదేశంలోనే స్వయం
ఉపాధి మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తాము.
► అనారోగ్య కారణాలతో స్వదేశానికి తిరిగి వచ్చిన వారికి వైద్య సదుపాయాలను కల్పిస్తాము.
► విదేశాలలో ఉన్నత విద్య కొరకు తీసుకున్న బ్యాంకు రుణాలపై అర్హులైన విద్యార్థులకు వడ్డీని మాఫీ చేస్తాము.
► TOMCOM (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ) ను లేబర్ డిపార్టుమెంటు పరిధిలో నుండి తప్పించి ఎన్నారై కార్పొరేషన్ పరిధిలోకి తెస్తాము.
► గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న వలసకార్మికులకు, ఎన్నారైలకు న్యాయ సహాయం చేస్తాము.
► గల్ఫ్ వలసకార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన 'ప్రవాసీ యోగక్షేమ' అనే పథకాన్ని ప్రవేశపెడతాము.
► ఆహార భద్రత, పెన్షన్ మరియు ఆరోగ్యశ్రీ పథకాన్ని గల్ఫ్ కార్మికులకు, వారి కుటుంబాలకు వర్తింపచేస్తాము.
► అమెరికా తరహాలో ఎన్నారై పౌరుల లిస్టు తయారు చేసి వారి యోగక్షేమాలు తెలుసుకుంటాము.
► గల్ఫ్ కార్మికులకు ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా చేరువై వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తాము.
► గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారికి ఇంగ్లీష్, అరబిక్ భాషలు అర్థం చేసుకుని, అక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై తగిన అవగాహన కల్పించడానికి మొబైల్ యాప్ తయారు చేసి శిక్షణ ఇస్తాము.
► గల్ఫ్ దేశాల్లోని తెలుగు స్వచ్చంద సంస్థలను రాజకీయాలకు అతీతంగా సంఘటిత పరిచి తద్వారా కార్మికులకు మద్దతుగా నిలిచేలా కృషి చేస్తాము.
► మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి, రిక్రూటింగ్ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేస్తాము. అవగాహన సదస్సులు నిర్వహిస్తాము.
► గల్ఫ్ కు వెళ్ళడానికి అవసరమైన 'గమ్కా' మెడికల్ చెకప్ చార్జీలను (రూ.4 నుండి 5 వేలు) ప్రభుత్వంద్వారా రీయింబర్స్ చేస్తాము.
► గల్ఫ్ కు ఉద్యోగానికి వెళ్ళడానికి చట్టబద్దంగా రిక్రూటింగ్ ఏజెన్సీలకు చెల్లించాల్సిన సర్వీస్ చార్జీలను, ఇతర ఖర్చులను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తాము.
► ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నారై విభాగాలను ఏర్పాటు చేస్తాము.
► రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాలలో వలసలపై అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేస్తాము.
► నేషనల్ అకాడమి ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాలను బలోపేతం చేసి, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రతి షబ్ డివిజన్ కేంద్రాలలో ఏర్పాటు చేస్తాము.
► ప్రతి ఏటా ప్రవాసి తెలంగాణ దివస్ అధికారికంగా నిర్వహిస్తాము.
► గల్ఫ్ దేశాల్లోని ప్రవాసీ తెలంగాణా స్వచ్చంద సంస్థలను గుర్తించి, వారి ద్వారా సమస్యలను పరిష్కరిస్తాము.
► రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుబాయి, సౌదీ అరేబియా లలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నియమించి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము.
► హైదరాబాద్ లో సౌదీ కాన్సులేట్, యుఏఇ కాన్సులేట్ ల ఏర్పాటుకు ప్రయత్నిస్తాము. ఎంబసీలలో తెలుగు మాట్లాడే అధికారులను నియమించేలా ప్రయత్నిస్తాము.
Comments
Please login to add a commentAdd a comment