గల్ఫ్ కార్మికుల అంశం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ప్రచారాస్త్రంగా మారనుంది. ఉత్తర తెలంగాణలోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓట్లు పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగలిగే పరిస్థితి ఉంది. తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల సంఖ్య 13 లక్షలని అంచనా. ఈ ఓట్లకు గాలం వేసేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాల గత విధానాల వల్లే గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శిస్తోంటే.. గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, వారి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పి నాలుగేళ్లలో పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మొత్తానికి ‘వలస ఓట్ల’ను కొల్లగొట్టేందుకు అన్ని పార్టీలు వల విసురుతున్నాయి.
ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు పెద్దసంఖ్యలో వలస వెళ్తున్నారు. వీరిలో 80 శాతానికిపైగా కార్మికులు ఎలాంటి నైపుణ్యం లేకుండా కేవలం కూలీ పనుల కోసమే వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో సంపాదనపై ఆశతో వెళ్తున్న వీరిని దళారీలు దోచుకుంటున్నారు. మిగతా సమయాల్లో ఎలాగున్నా ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు గల్ఫ్ కార్మికుల సమస్యలు, వారి కుటుంబాలపై గురిపెట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ దేశాల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారాన్ని మేనిఫెస్టోలో చూపించే యత్నం చేస్తోంది. గత శుక్రవారం టీపీసీసీ ప్రతినిధి బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించింది. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడి మన వలస కార్మికులపై వరాల జల్లు కురిపించడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన టీఆర్‌ఎస్ ఎంపీ కవిత.. గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన, చేయబోయే ప్రవాసీ కార్యక్రమాలను వివరించారు.
వైఎస్ హయాంలోనే గల్ఫ్ బాధితులకు మేలు
గల్ఫ్ కార్మికుల కష్టాలను గుర్తెరిగిన మనిషిగా, వారి సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం, ఓ మంత్రిని నియమించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అక్కడి కార్మికుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. వైఎస్ తన ప్రభుత్వ హయాంలో.. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 200 కుటుంబాలకు ఈ సాయం అందింది. గల్ఫ్ వలసలకు ప్రధాన కారణాలను గుర్తించి.. పలువు రికి 30–50 శాతం రాయితీ రుణాలను పంపిణీ చేసిన వైఎస్ ప్రభుత్వం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టింది. గల్ఫ్ దేశాల్లో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తే చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను స్వరాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవ చూపింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి వైఎస్ హయాంలో జారీ అయిన జీవోలను.. ఆపై వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నాడు వైఎస్ తీసుకున్న చర్యలను ఇప్పటి రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో చేర్చాలని కార్మికులు కోరుతున్నారు.
మేనిఫెస్టోలపై గంపెడాశలు
తమ ప్రయోజనాల కోసం స్పందించే రాజకీయ పక్షాలపై బాధిత కుటుంబాలు ఆశ పెట్టుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రూ.500 కోట్లతో ప్రత్యేక గల్ఫ్ ప్యాకేజీ అమలు చేస్తామని ప్రకటించింది. టీఆర్‌ఎస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేయలేదు. కానీ, 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.100 కోట్లను ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు కేటాయించింది. గడిచిన నాలుగేళ్లలో గల్ఫ్ దేశాల్లో మరణించిన దాదాపు 1,200 మంది కార్మికుల మృతదేహాలను రాష్ట్రానికి రప్పించడంతోపాటు, వారి ఇళ్ల వరకు పంపించినట్లు అధికార పార్టీ చెబుతోంది. తమ పట్ల సానుకూలంగా ఉండే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు అంటున్నాయి.
ఎన్‌ఆర్‌ఐల ఓట్లు కీలకం
ప్రవాస భారతీయులు తమ ఓటు హక్కును విదేశాలలోనే ఉండి స్వదేశంలో జరిగే ఎన్నికలో ఉపయోగించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రాక్సీ ఓటింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది, రాజ్యసభ సైతం దీనికి ఆమోద ముద్రవేస్తే.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐల ఓట్లు కీలకమవుతాయి. ఈ ప్రయత్నాలతో.. ప్రధానంగా గల్ఫ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక దొరుకుతుందనే ధీమాతో ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాల వల్ల కార్మికుల ఓట్లే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఓట్లతో లబ్ధిపొందే అవకాశం ఉంటుంది.
గల్ఫ్ కార్మికుల డిమాండ్లు ఇవీ
- గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ కార్మికుల లెక్క తేల్చడానికి కేరళ ప్రభుత్వ తరహాలో ప్రత్యేక సర్వే నిర్వహించాలి. దాని ఆధారంగా గల్ఫ్ వలస కుటుంబాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయాలి. కేరళ మాదిరిగానే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.
- ఏజెంట్ల బారినపడి మోసపోయిన బాధితులకు స్వయం ఉపాధి కింద రాయితీ రుణాలు ఇవ్వాలి. లైసెన్స్‌లేని ఏజెంట్ల వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలి.
- కార్మికులకు ఉచిత శిక్షణనిచ్చి.. నైపుణ్యాలు అలవర్చుకున్నాకే వీసా ప్రక్రియను ప్రారంభించాలి.
- గల్ఫ్‌లో ఉపాధి పొందుతూ ప్రమాదాల వల్ల ఆరోగ్యం దెబ్బతిన్న వారికి ప్రభుత్వం అధునాతన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేయాలి. గల్ఫ్‌లో మరణించిన వారి మృతదేహాలను తెప్పించడానికి ప్రభుత్వం చొరవ చూపడంతో పాటు కార్మికులకు రావాల్సిన జీతభత్యాలను ఇప్పించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి.
- గల్ఫ్ వెళ్లిన కార్మికులకు ఉచిత బీమా సౌకర్యం, గల్ఫ్ నుంచి ఇళ్లకు చేరిన వారికి పింఛన్లు ఇవ్వాలి. గల్ఫ్ దేశాల్లో కార్మికులకు లేబర్ కోర్టులలో న్యాయపరమైన సలహా, సేవలు అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment