గల్ఫ్ కార్మికులకు శుభవార్త ! | Good News To Gulf Workers Central Govt Waived Off New Minimum Wage Rules | Sakshi
Sakshi News home page

గల్ఫ్ కార్మికులకు శుభవార్త !

Published Fri, Jul 23 2021 1:16 PM | Last Updated on Fri, Jul 23 2021 1:24 PM

Good News To Gulf Workers Central Govt Waived Off New Minimum Wage Rules - Sakshi

గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై కేంద్రం తన పంథాను మార్చుకుంది. గత సెప్టెంబరులో జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేసింది. 2019-20లో ఉన్నట్టుగానే కనీస వేతనాలు ఉంటాయంటూ పార్లమెంటులో ప్రకటన చేసింది.
 
మంత్రి ప్రకటన
ప్రస్తుతం ఆరు గల్ఫ్ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి...  కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్ మార్కెట్ స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తామ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. కేరళకు చెందిన ఎంపీ ఎంవీ  శ్రేయాన్స్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.    

గత సెప్టెంబరులో
ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్)ను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్ లో సర్కులర్లను జారీ చేసింది. తాజాగా వాటిని రద్దు చేసి  పాత వేతనాలను కొనసాగించాలన్న కార్మికులు, ఉద్యోగుల డిమాండును  ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో గల్ఫ్ ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.

కేంద్రంపై ఒత్తిడి
కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జెఏసీ చేసిన ఉద్యమానికి కేంద్రం తల ఒగ్గింది. కనీస వేతనాల తగ్గింపుపరై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ సమస్యపై ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. మరోవైపు గల్ఫ్ కార్మికనేత మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి కొనసాగించడంతో వేతన తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. 

29న హైకోర్టులో విచారణ 
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల  ధర్మాసనం ఈ కేసును ఈనెల 29న విచారించనున్నది.

గల్ఫ్‌ జేఏసీ శ్రమతో
మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి  వీ మురళీధరన్‌తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు గల్ఫ్‌ జేఏసీ బృందం వినతిపత్రాలు సమర్పించింది. గల్ఫ్ జెఏసి బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్, బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు ఉన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement