Minimum wages
-
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు త్వరలో కనీస వేతనాలను ఖరారు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడి కంటే తమిళనాడు, కర్ణాటకల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో తెలంగాణలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్‌కు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ఎం.భగవత్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్‌తో పాటు హెచ్సీఎస్సీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిçప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..’’రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల వరకు ఉండగా.. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్న ఈ రంగం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ సమ్మిట్ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.’’అని చెప్పారు. సెక్యూరిటీ ఏజెన్సీలు రిజి్రస్టేషన్ చేసుకోవాలి: సీపీ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఇప్పటికీ తక్కువ జీతాలే ఇస్తున్నారు. రాష్ట్రంలో 1500 ఏజెన్సీలు ఉండగా... 500 మాత్రమే రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. మిగిలినవీ రిజి్రస్టేషన్ చేసుకోవాలి’అని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండెంట్స్‌గా మారాలని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ పిలుపునిచ్చారు. ‘పోలీసులు వచ్చే వరకు నేర స్థలిని పరిరక్షించాలి. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అంశాన్నీ గుర్తిస్తూ, సంబంధిత శాఖలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్యూరిటీలకు సంబంధించిన పసేరా చట్టం కూడా అదే చెప్తోంది. సెక్యూరిటీ గార్డులు ఇలా రూపొందేలా ప్రతి ఏజెన్సీ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పోలీసు విభాగం అప్పట్లో నక్సలైట్లతో ఇప్పుడు సైబర్ క్రిమినల్స్‌తో పోరాటం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్ పెట్రోలింగ్ పోయి సైబర్ పెట్రోలింగ్ వచి్చంది’అని మహేశ్‌భగవత్ అభిప్రాయపడ్డారు. -
వేతన పోరులో గెలిచిన గల్ఫ్ కార్మికులు
భారత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్) తగ్గిస్తూ గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) పై బుధవారం (28.07.2021) తుది విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి. విజయసేన్ రెడ్డిల ధర్మాసనం జరిపిన విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది బి. రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు కొత్తగా ఉద్యోగానికి వెళ్లేవారితో సహా ప్రస్తుతం గల్ఫ్ లో పనిచేస్తున్న 88 లక్షల మంది భారతీయుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపే సర్కులర్లను రద్దు చేయాలని న్యాయవాది రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్కులర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని వాదించారు. వేతనాలను తగ్గిస్తూ సెప్టెంబర్ 2020 లో జారీ చేసిన సర్కులర్లను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకున్నదని, పాత వేతనాలను కొనసాగించాలని నిర్ణయించిందని ఈమేరకు ఈనెల 15న ఉత్తర్వులను జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వర్ రావు హైకోర్టుకు నివేదించారు. సమస్య పరిష్కారం అయినందున భీంరెడ్డి దాఖలు చేసిన 'పిల్' ను ముగిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గల్ఫ్ కార్మికులకు శుభవార్త !
గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై కేంద్రం తన పంథాను మార్చుకుంది. గత సెప్టెంబరులో జారీ చేసిన సర్క్యులర్లను రద్దు చేసింది. 2019-20లో ఉన్నట్టుగానే కనీస వేతనాలు ఉంటాయంటూ పార్లమెంటులో ప్రకటన చేసింది. మంత్రి ప్రకటన ప్రస్తుతం ఆరు గల్ఫ్ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో ఉన్న భారతీయుల ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి... కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్ మార్కెట్ స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తామ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ రాజ్యసభకు తెలిపారు. కేరళకు చెందిన ఎంపీ ఎంవీ శ్రేయాన్స్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత సెప్టెంబరులో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులకు కనీస వేతనాలు (మినిమం రెఫరల్ వేజెస్)ను 30 నుంచి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సెప్టెంబర్ లో సర్కులర్లను జారీ చేసింది. తాజాగా వాటిని రద్దు చేసి పాత వేతనాలను కొనసాగించాలన్న కార్మికులు, ఉద్యోగుల డిమాండును ఎట్టకేలకు కేంద్రం అంగీకరించింది. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 88 లక్షల మంది భారతీయ కార్మికులు, ఉద్యోగుల ఆదాయంపై తీవ్రమైన ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో గల్ఫ్ ప్రవాసుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. కేంద్రంపై ఒత్తిడి కనీస వేతనాల తగ్గింపు సర్కులర్ల రద్దు చేయాలని కోరుతూ గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ జెఏసీ చేసిన ఉద్యమానికి కేంద్రం తల ఒగ్గింది. కనీస వేతనాల తగ్గింపుపరై తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ సమస్యపై ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. మరోవైపు గల్ఫ్ కార్మికనేత మంద భీంరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిల్ వేశారు. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి కొనసాగించడంతో వేతన తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుంది. 29న హైకోర్టులో విచారణ గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబర్ లో జారీ చేసిన రెండు సర్కులర్లను రద్దు చేయాలని, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి ఫిబ్రవరిలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం ఈ కేసును ఈనెల 29న విచారించనున్నది. గల్ఫ్ జేఏసీ శ్రమతో మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌తో పాటు అన్ని పార్టీల ఎంపీలకు గల్ఫ్ జేఏసీ బృందం వినతిపత్రాలు సమర్పించింది. గల్ఫ్ జెఏసి బృందంలో గుగ్గిళ్ల రవిగౌడ్, స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, మెంగు అనిల్, పంది రంజిత్, పొన్నం రాజశేఖర్, బద్దం వినయ్, దాసరి మల్లిఖార్జున్, గన్నారం ప్రశాంత్, పట్కూరి బసంత్ రెడ్డి, కోటపాటి నరసింహ నాయుడు ఉన్నారు. -
కనీస వేతనాలు ఇలాగేనా?
వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్–19తో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 3న అధికారిక ప్రకటన చేస్తూ, కనీస వేతనాలు, జాతీయ స్థాయి కనీస వేతనాల స్థిరీకరణపై సాంకేతిక ప్రతిపాదనలు, సిఫార్సులు అందించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ డైరెక్టర్, ప్రొఫెసర్ అజిత్ మిశ్రా అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని నియమించినట్లు పేర్కొంది. ప్రకటన చేసిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ కమిటీ అమలులో ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ స్పందన అనేక కారణాల రీత్యా ఆశ్చర్యం కలిగిస్తోంది. కమిటీ కాల వ్యవధిని మూడేళ్లుగా నిర్ణయించడం ఇందులో కీలకమైంది. శ్రామికులపై రెండో నేషనల్ కమిషన్ లేదా అసంఘటిత రంగంలో వ్యాపార సంస్థలపై జాతీయ కమిషన్ వంటి పలు కీలక అంశాలపై విచారణ జరిపే కమిషన్‌కు మాత్రమే ఇన్నేళ్ల కాల వ్యవధిని నిర్ణయిస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ కనీస వేతనాలను నిర్ణయించే కమిటీకి ఇంత సుదీర్ఘ కాలవ్యవధిని నిర్ణయించడమే ఆశ్చర్య హేతువుగా ఉంది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అర్థవంతం చేస్తూ మిశ్రా కమిటీ తన కార్యాచరణ పరిధికి సంబంధించిన ప్రత్యేక నిబంధలపై వివరణ ఇచ్చేంతవరకు మనం వేచి ఉండాలి. ఈ మధ్య కాలంలో నాలుగు కీలక అంశాలను మాత్రం చర్చించాల్సి ఉంది. వాటికి పరిష్కారాలు సూచించాల్సి ఉంది. 1. మిశ్రా కమిటీ నియామకానికి దారితీసిన సందర్భం ఏమిటి? 2. ప్రస్తుతం ఉన్న కమిటీలకు ఇది స్వాగతించాల్సిన అదనపు చేర్పుగా ఉంటుందా? 3. కఠినమైన న్యాయాదేశం వెలుగులో ఈ కమిటీ కనీస వేతనాల విషయంలో అందించే చేర్పు ఏమిటి? 4. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఫలితాలు ఎలా ఉంటాయి? వేతన నియమావళి తొలి ముసాయిదాను 2017 ఆగస్టు 10న సమర్పించారు. తర్వాత సవరించిన నియమావళిని 2019లో ఆమోదించారు. వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ ఫెలో డాక్టర్ అనూప్ శతపథి (ఇకపై శతపథి కమిటీ అని పేర్కొందాం) అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని 2018 జనవరి 17న ఏర్పర్చింది. కనీస వేతనాలపై సమగ్ర సమీక్ష జరపడం.. జాతీయ, ప్రాంతీయ కనీస వేతనాలను సిఫార్సు చేయడం దీని లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా కనీస వేతనాల అమలు తీరును దృష్టిలో ఉంచుకుని, భారతీయ నేపథ్యంలో వాటిని స్వీకరించడంపై కమిటీ అధ్యయనం చేస్తుంది. శతపథి కమిటీ 2019లో ఒక సమగ్ర నివేదికను సమర్పించింది. భారత్‌లో కనీస వేతన విధాన చరిత్ర, కనీస వేతనాల వ్యవస్థకు సంబంధించిన ఐఎల్ఓ విధానం, పలు దేశాల్లో కనీస వేతన వ్యవస్థలు వంటి అనేక అంశాలపై ఈ కమిటీ సమగ్రంగా చర్చించింది. పర్యవసానంగా, జాతీయ స్థాయిలో రోజుకు రూ. 375ల కనీస వేతనాన్ని, నెలకు రూ. 9,750ల వేతనాన్ని ఇవ్వవచ్చని ఈ కమిటీ సిఫార్సు చేసింది. దేశంలోని అయిదు రీజియన్లకు గాను ప్రాంతీయ వారీ వేతనాలను స్థిరపర్చాలని పేర్కొంది. అయితే ఈ నివేదికలోని కొన్ని అంశాలకు కార్మిక సంఘాలు మద్దతిచ్చినప్పటికీ మొత్తంగా చూస్తే నివేదికపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లోని చాలా కార్మిక సంఘాలు ఏడవ పే కమిషన్ సిఫార్సు చేసిన వేతన రేట్ల ప్రకారం జాతీయ స్థాయిలో రోజుకు 600 రూపాయల కనీస వేతనాన్ని కల్పించాలని డిమాండ్ చేశాయి. యాదృచ్ఛికంగా శతపథి కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనాలపై ఏదైనా చర్చ చేసిందీ లేనిది పేర్కొనలేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2019లో రోజువారీ కనీస వేతనాన్ని రూ. 176ల నుంచి 178 రూపాయలకు కనిష్టంగా మాత్రమే పెంచుతున్నట్లు నిర్ణయిం చింది. ఈ నిర్ణయాన్ని శతపథి కమిటీ తిరస్కరించినట్లు కనిపిస్తోంది. కానీ తర్వాత కేంద్రం నియమించిన మిశ్రా కమిటీ ఇదే శతపథి కమిటీ చేసిన సిఫార్సులను తిరస్కరించడం గమనార్హం. మిశ్రా కమిటీలో ప్రభుత్వ ప్రతినిధుల పాత్ర సందేహాస్పదం మిశ్రా కమిటీలో ముగ్గురు ప్రభుత్వ ప్రతినిధుల నియామకం కాస్త అనుమానాలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే వీరి వల్ల కనీస వేతనాల రేట్లకు సంబంధించి అంతవరకు చేసిన ప్రతిపాదనలను కుదించే ప్రమాదం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శతపథి కమిటీ కానీ, మరో కమిటీ కానీ ద్రవ్యోల్పణానికి అనుగుణంగా చేసిన సిఫార్సులకంటే తక్కువ కనీస వేతనాన్నే తాజాగా ప్రతిపాదించాలని మిశ్రా కమిటీపై ఒత్తిడి చేసి ఉండవచ్చని అనుమానించవచ్చు కూడా. మొత్తం మీద చూస్తే మిశ్రా కమిటీ పేరుకు స్వతంత్ర ప్రతిపత్తిని ఆస్వాదిస్తున్నట్లు కనిపించవచ్చు కానీ ప్రభుత్వ ప్రతినిధులు ప్యానెల్లో చేరడం వల్ల ప్రభుత్వ నిర్ణయమే అమలు జరగవచ్చని స్పష్టమవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో కూడిన ఐఎల్ఓ అధికారులకు కనీస వేతనాలపై నిర్ణయ బాధ్యతను ఇచ్చి ఉండవచ్చు. భారత్‌లోనూ, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ కనీస వేతనాలపై కొంతమంది ఐఎల్వో అధికారులు విశేషమైన కృషి చేశారు. కాబట్టి వీరితో పోలిస్తే మిశ్రా కమిటీని నిపుణుల కమిటీ అని పిలవడం తప్పిదమే అవుతుంది. అయితే కమిటీలోని సాంకేతిక సభ్యుల విద్యార్హతలను నేను ప్రశ్నించను. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉందన్నదానితో పనిలేకుండా భారతీయ రాజ్యవ్యవస్థ వివిధ కమిటీలను, కమిషన్లను నియమించడం, తర్వాత అవి సమర్పించే నివేదికలను బుట్టదాఖలు చేయడం పరిపాటిగా మారింది. శతపథి కమిటీ నివేదికకు కూడా అదే గతి పట్టింది. 2024 జూ¯Œ లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉన్న మిశ్రా కమిటీకి సైతం అదే గతి పట్టబోదనే గ్యారంటీ ఏమిటి? కమిటీల నివేదికలు.. వాస్తవ ప్రతిఫలనాలు వేతన నియమావళిని 2019 ఆగస్టులోనే చట్టరూపంలోకి తీసుకువచ్చినప్పటికీ కేంద్రస్థాయిలో సలహా మండలి ఆమోదం 2021 మార్చిలోకానీ సాధ్యపడలేదు. కోవిడ్–19 భయానక ప్రభావం, ఆర్థిక మందగమనం దీనికి కారణం కావచ్చు. కానీ అదే సమయంలో సంఘటితరంగం, అసంఘటిత రంగంలోని కార్మికులు నిజాదాయాల మాట పక్కనబెడితే, ఆదాయ సంపాదనా మార్గాలను కూడా కోల్పోయి తీవ్రంగా దెబ్బతిన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం శాసనేతరపరంగా ప్రకటించిన కనీస వేతనం రూ. 178లు. అదే సమయంలో కోవిడ్ కారణంగా దేశ కార్మికుల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని వివిధ సర్వేలు, అధ్యయనాలు ఆధారపూరితంగా పేర్కొన్నాయి. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాలుగు కార్మిక నియమావళులు, వాటి పాక్షిక అమలు కారణంగా కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. ఈ మధ్యకాలంలో పలు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతనాలకు సంబంధించి వివిధ రకాలుగా డియర్నెస్ అలవె¯Œ్సలలో మార్పులను ప్రకటించాయి. వాస్తవ సమస్య ఏదంటే సార్వత్రిక కనీస వేతన వ్యవస్థ అమలవుతుందా అన్నదే. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణం తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సి ఉంది. దాని తర్వాతే రాష్ట్రాల ప్రభుత్వాలు కనీస వేతన రేటును సవరించి తగు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. 2021 జూన్ 4న సీఐటీయూ మిశ్రా కమిటీ నియామకం చట్టబద్ధతను ప్రశ్నిం చింది. ఈ కమిటీని వెనక్కు తీసుకోవాలని పిలుపునిచ్చింది. కనీస వేతనాలను నిర్ణయించడం విషయంపై కేంద్రం వర్గీకరణ నిబంధనలు పొందుపర్చినందున మిశ్రా కమిటీ పరిధిలో సామాజిక చర్చా ప్రక్రియకే తావు లేకుండా పోయిందని ఆరోపించింది. పైగా సాంకేతిక నిపుణులను పక్కన బెడితే మిశ్రా కమిటీ ఏర్పాటు ప్రక్రియ దానికదేగా కార్మికుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ కొట్టేటట్టు కనిపిస్తోంది. వేతన నియమావళిని అమలు చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం కాలాపహరణం చేయడానికే మిశ్రా కమిటీని ఏర్పర్చిందా అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. మూడేళ్ల తర్వాత ఈ కమిటీ నివేదిక విడుదల అవటం అంటే కనీస వేతనాల అమలుకు ఎదురుచూస్తున్న కార్మికుల ఆకాంక్షలను నిస్పృహపర్చడమే అవుతుంది. కేఆర్ శ్యామ్ సుందర్ వ్యాసకర్త ప్రొఫెసర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, జంషెడ్పూర్ (ది వైర్ సౌజన్యంతో) -
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కనీస వేతనం చెల్లించాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సమాన పనికి కనీస వేతనం కూడా చెల్లించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, రాజ్యాంగంలోని అధికరణ 14 ప్రకారం వివక్ష చూపడమేనని పేర్కొంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న వారికి కనీస వేతనం చెల్లించాలని పురపాలకశాఖ అధికారులను ఆదేశించింది. అయితే తమ సర్వీసులను క్రమబద్ధీకరించేలా ఆదేశాలివ్వాలన్న బాల్వాడీ టీచర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో బాల్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తాము రెగ్యులర్ టీచర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా తమకు కనీస వేతనాలు చెల్లించడంగానీ, తమ సర్వీసులను క్రమబద్ధీకరించడంగానీ చేయడం లేదంటూ జానపరెడ్డి సూర్యనారాయణ, మరో 49 మంది హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. మొదట్లో నెలకు రూ.375 వేతనం ఇచ్చేవారని, తరువాత దాన్ని రూ.1,300కు, 2016లో రూ.3,700కు పెంచారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి కనీస వేతనం రూ.6,700గా నిర్ణయిస్తూ ప్రభుత్వం 2011లో జీవో ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ జీవో ప్రకారం కనీస వేతనం చెల్లించాలని మునిసిపల్ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసినా, జీవీఎంసీ అమలు చేయలేదని తెలిపారు. పిటిషనర్లు ఔట్‌సోర్స్ పద్ధతిలో ఓ ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారని, అందువల్ల వారు సర్వీసు క్రమబద్ధీకరణకు అర్హులు కాదని జీవీఎంసీ న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి.. పిటిషనర్లు రెగ్యులర్ ఉద్యోగుల్లాగే 8 గంటలు పనిచేస్తున్నప్పుడు వారితో సమానంగా వేతనం పొందేందుకు అర్హులని తీర్పు చెప్పారు. వారికి కనీస వేతనాన్ని వర్తింపజేయాలని పురపాలకశాఖను ఆదేశించారు. పిటిషనర్లు ఎన్‌ఎంఆర్‌లుగా, రోజూవారీ వేతనాలు పొందేవారిగా నియమితులు కాలేదని, ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఔట్‌సోర్స్ పద్ధతిలో నియమితులయ్యారని, సర్వీసు క్రమబద్ధీకరణ కోరజాలరని తీర్పులో పేర్కొన్నారు. -
అమల్లోకి వేతన చట్టం
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో 50 కోట్ల మందికి కనీస వేతనం అందేలా కేంద్రం తీసుకొచ్చిన ‘వేతనాల చట్టం– 2019’ అమల్లోకి వచ్చింది. గత పార్లమెంటు సమావేశాల్లో జూలై 30న లోక్‌సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఈ బిల్లును ఆమోదించటంతో చట్టంగా మారింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కనీస వేతనాలు, బోనస్‌లు, సమాన వేతనాలు వంటి నిబంధనలు కలిగిన నాలుగు చట్టాల స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం వర్తక సంఘాలు, ఉద్యోగులు, రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో వేతనాలు నిర్ణయమవుతాయి. వివక్షకు తావు లేకుండా పురుషులతో సమానంగా మహిళలు, ట్రాన్‌జెండర్స్ వేతనాలు పొందేందుకు కొత్త చట్టం వీలు కల్పిస్తుంది. వేతన పరిమితితో పనిలేకుండా అన్ని రంగాల కార్మికులకూ కనీస వేతనం సకాలంలో అందేలా నిబంధనలను ఇందులో పొందుపరిచారు. -
కనీస వేతనం 18వేలు చేస్తాం
న్యూఢిల్లీ: కనీస వేతనం నెలకు రూ.18 వేలు ఉండేలా చట్టం, పౌరులపై ప్రభుత్వ సంస్థల నిఘా ఎత్తివేత, టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట. ఇవీ సీపీఎం మేనిఫెస్టోలో ప్రధానాంశాలు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు గాను గురువారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ఐటీ చట్టంలోని 69వ సెక్షన్‌ను తొలగిస్తుందని ఏచూరి తెలిపారు. ‘పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా/ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పడకుండా నివారిస్తాం. ఆధార్, బయో మెట్రిక్ సమాచారాన్ని సంక్షేమ పథకాలకు వినియోగించుకోవటాన్ని నిలిపివేస్తాం. రైతులు తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు విక్రయించుకునేలా హక్కు కల్పిస్తాం’ అని తెలిపారు. కొన్ని టెలికం సంస్థల గుత్తాధిపత్య ధోరణిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు రూ.18 వేలకు తక్కువ కాకుండా వేతనం ఉండేలా చట్టం చేస్తామని తెలిపారు. ప్రజా పంపిణీ విధానం ద్వారా కుటుంబానికి నెలకు 35 కేజీల ఆహార ధాన్యాలు అందించటంతోపాటు వృద్ధాప్య పింఛను రూ.6 వేలకు పెంచుతామన్నారు. ఎలక్టోరల్ బాండ్లకు బదులు అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ప్రభుత్వమే భరించేలా చట్టం చేస్తామన్నారు. -
ఉద్యోగుల కనీస వేతనం రూ. 9,880
సాక్షి, హైదరాబాద్: తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఉద్యోగి నెలవారీ (26 పనిదినాలకు) కనీస వేతనం రూ. 9,880గా ఉండాలని జాతీయ కనీస వేతన నిపుణుల కమిటీ నిర్ధారించింది. దేశంలో ఉద్యోగుల కనీస వేతన ఖరారుపై కేంద్ర కార్మికశాఖ గతంలో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించిన నిపుణుల కమిటీ... జాతీయ స్థాయిలో ఐదు రీజియన్లను గుర్తించగా తెలుగు రాష్ట్రాలను రెండో రీజియన్‌లో చేర్చింది. జూలై 2018 నాటి స్థానిక పరిస్థితులు, ధరల సూచీలు, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ కనీస వేతనాన్ని నిర్ధారించింది. 2012 కంటే ముందు జాతీయ స్థాయిలో ఉద్యోగి కనీస వేతనం రూ. 4,570గా ఉండేది. గత ఏడేళ్లలో జీవన వ్యయంలో భారీ మార్పులు వచ్చాయి. అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో వేతన సవరణ చేయాలని నిర్ణయించిన కేంద్రం ఆ మేరకు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి కనీస వేతన మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఈ మేరకు పూర్తిస్థాయి నివేదికను ఇటీవల కేంద్ర కార్మిక శాఖకు అందజేసింది. కమిటీ నివేదిక ఆధారంగా కేంద్రం కనీస వేతన విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. తక్కువ వేతనం ఉండొద్దు... జాతీయ కనీసవేతన నిపుణుల కమిటీ సూచన ప్రకారం ఉద్యోగికి నిర్దేశిత వేతనం కంటే తక్కువగా ఉండొద్దు. తక్కువ వేతనమున్న ఉద్యోగులకు సదరు కంపెనీ యాజమాన్యం నిర్దేశిత వేతనాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల నిర్దేశిత వేతనం కంటే ఎక్కువగా చెల్లిస్తే మాత్రం వేతన పెంపు యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
గంటకు 15 డాలర్లు!
సియాటిల్: ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్.. అమెరికాలోని తమ సిబ్బంది కనీస వేతనాలను పెంచింది. వచ్చే నెల నుంచి గంటకు 15 డాలర్ల (సుమారు రూ.1,050) చొప్పున కనీస వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 3,50,000 మంది ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, తాత్కాలిక ఉద్యోగులకు దీనితో ప్రయోజనం చేకూరనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఇప్పటికే గంటకు 15 డాలర్ల వేతనం పొందుతున్నవారికి కూడా తగు స్థాయిలో పెంపు ఉంటుందని తెలిపింది. కంపెనీలో పై స్థాయి, కింది స్థాయి ఉద్యోగుల వేతనాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సరిదిద్దాలంటూ ఆర్థిక, రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా రిటైల్ సంస్థలు కూడా క్రమంగా కనీస వేతనాలను క్రమంగా పెంచుతున్నాయి. వాల్‌మార్ట్ ఈ మధ్యే జనవరిలో తమ సిబ్బంది కనీస వేతనాలను గంటకు 11 డాలర్లకు పెంచగా, మరో రిటైల్ సంస్థ టార్గెట్ 2020 నాటికల్లా గంటకు 15 డాలర్ల కనీస వేతన స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ‘‘కనీస వేతనాన్ని 15 డాలర్లకు పెంచేలా ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం ఉన్న 7.25 డాలర్లనేది 11 ఏళ్ల కిందటి చట్టం. అప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. అందుకే మేం 15 డాలర్లకు పెంచుతున్నాం’’ అని అమెజాన్ పేర్కొంది. కనీసం గంటకు 15 డాలర్లు చెల్లించాలన్న ఉద్యమం ఇపుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకోవటం గమనార్హం. -
కనీస వేతనం ఎలా ఉండాలి?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని కార్మికులకు కనీస వేతనం నెలకు 18 వేల రూపాయలు ఉండాలన్నది బుధవారం నాడు ఢిల్లీని ముట్టడించిన కార్మికుల, కర్షకుల ప్రధాన డిమాండ్లలో ఒకటి. నెలకు 18 వేల రూపాయలన్నది ఎలా ప్రామాణికం? దేశంలో ప్రస్తుతం కనీస వేతన ఎంత ఇస్తున్నారు? దాన్ని ఎలా లెక్కిస్తున్నారు. ఏటా కనీస వేతనం పెరుగుతున్నదా ? తగ్గుతున్నదా? ఇతర దేశాల్లో ఈ వేతనం ఎలా ఉంది? కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించింది. తమకు కూడా అంతే వేతనాన్ని కనీస వేతనంగా ఇప్పించాలని కార్మిక లోకం డిమాండ్ చేస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రకారమే ఇప్పటికీ దేశంలో కనీస వేతనాన్ని అంచనా వేస్తున్నారు. నాటి చట్టానికే పలుసార్లు మార్గదర్శకాలను మారుస్తూ వచ్చారు తప్ప, చట్టం స్వరూపాన్ని ఇప్పటికీ మార్చలేక పోయారు. పర్యవసానంగా గత మూడు దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పెరగాల్సిన కార్మికుడి వేతనం (విలువ ఆధారిత సూచిక ప్రకారం...ఉత్పత్తులు, వచ్చిన లాభాలను పరిగణలోకి తీసుకొని విలువను అంచనా వేస్తారు) తగ్గుతూ వస్తోంది. దీని అర్థం దేశం సాధిస్తున్న ఆర్థిక ఫలితాల్లో కార్మికుడికి సరైన భాగం లభించడం లేదు. ఫలితాల్లో ఎక్కువ భాగం యజమానులకే వెలుతోంది. 1981–1982 సంవత్సరం నుంచి 2011–12 సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఆర్థిక పురోభివద్ధి గణాంకాల ప్రకారం కంపెనీల ఉత్పత్తి, లాభాలు ఎంతో పెరిగినా కార్మికుల కనీసవేతనాలు మాత్రం తగ్గుతూ వచ్చాయి. 2009–-2010లో ఆర్థిక పురోభివద్ధి విలువలో కార్మికుడి వేతనాల శాతం 11.9 శాతం ఉన్నట్లు తేలింది. అంతకు దశాబ్దం క్రితం 15 శాతం ఉండగా,ఆ తర్వాత తగ్గింది. అభివద్ధి చెందిన దేశాల సంగతి పక్కన పెడితే వర్ధమాన దేశాలకన్నా భారత కార్మికుల వేతనాలు ఎంతో తక్కువ. ఆర్థిక పురోభివద్ధి విలువ ఆధారిత వేతనాల పద్ధతి మన దేశంలో లేకపోవడంతో వేతనాలు తగ్గడం కనిపిస్తోంది. 1948 నాటి పార్లమెంట్ చట్టం ప్రమాణాల ప్రకారం నేడు కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా ఉంది. దీన్ని నెలలోని 31 రోజులకు లెక్కిస్తే 5,456 రూపాయలు మాత్రమే. ఈ కనీస వేతనాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన చట్టంలో లేకపోయినప్పటికీ కేంద్రం పరిధిలోని ఓ కంపెనీ తన కార్మికుడికి ఈ కనీస వేతనం ఇస్తే సరిపోతుందన్నమాట. రోజువారిగా ఓ కార్మికుడు తీసుకునే కాలరీల ఆహారం, నలుగురు సభ్యులుగల కుటుంబంలో వారందరి బట్టలకయ్యే గుడ్డా, ఉండటానికి అద్దె, ఇద్దరు పిల్లల చదువు, వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రమాణంగా తీసుకొని దినసరి వేతనాలను లెక్కించే బరువు బాధ్యతలను పార్లమెంట్ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. తర్వాత సవరించిన ప్రమాణాల్లోఓ కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పనిచేసినా, ఒకరి వేతనాన్నే పరిగణలోకి తీసుకోవాలని, కుటుంబంలోని నలుగురు వ్యక్తుల ఆహారాన్ని 2700 కాలరీలుగా లెక్కించాలని, వారికి ఏడాదికి 72 యార్డుల గుడ్డ ఖర్చు అవుతుందని, ఇద్దరి పిల్లల చదువు, నలుగురి ఆరోగ్యానికయ్యే ఖర్చును పరిగణలోకి తీసుకోవాలని, ఇంట్లో వంటకయ్యే ఖర్చును 20 శాతంగా తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించాలని (అంటే కనీస వేతనంలో 20 శాతం డబ్బులను చెల్లిస్తే వారి ఇంధనపు ఖర్చు వెళ్లిపోవాలి) సూచనలున్నాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని లెక్కిస్తేనే నేడు కనీస దినసరి వేతనం 176 రూపాయలుగా తేలింది. కార్మికుడి కనీస అవసరాలను దష్టిలో పెట్టుకొని కనీస వేతనాన్ని లెక్కించే ఈ పద్ధతిని మార్చుకోవాలని, దేశం సాధిస్తున్న ఆర్థిక వద్ధిలో వాటా పద్ధతిన కార్మికుడికి వేతనాలు ఇవ్వాలని ఎప్పటి నుంచో ఆర్థిక నిపుణులు ఆందోళన చేస్తుండడంతో కనీస వేతనాలను నిర్ణయించే పూర్తి అధికారం ఇటు రాష్ట్రాలకు అటు కేంద్రానికి అప్పగిస్తూ గతంలో కేంద్రం ఓ బిల్లును తీసుకొచ్చింది. అది ఇప్పటికీ పార్లమెంట్లో మూలన పడి ఉంది. మనకంటే ఆర్థికంగా ఎంతో అభివద్ధి సాధిస్తున్న చైనాలో కార్మికుడి కనీస వేతనం నెలకు 22 వేల రూపాయలుంది. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో గంటకు ఏడున్నర డాలర్ల నుంచి ఎనిమిది డాలర్ల వరకు కనీస వేతనం ఉంది. అంటే రోజుకు ఎనిమిది గంటలు పనిచేసే ఓ కార్మికుడికి నెలకు లక్షా ఇరవై వేల రూపాయల నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ఉంటుంది. అమెరికాకన్నా కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయా దేశాల్లో కనీస వేతనాలను చట్టబద్ధంగా అమలు చేయాల్సి ఉంటుంది. భారత్‌లో కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలు చేయాలన్న డిమాండ్‌తోపాటు పంటలకు కనీస మద్దతు ధరలను పెంచాలని, వ్యయసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, ఆదివాసీల అటవి హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ దాదాపు ఒకటిన్నర లక్షల మంది కార్మికులు, కర్షకులు బుధవారం ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఇవే డిమాండ్లపై దాదాపు ఆరు నెలల క్రితం మార్చిలో 40 వేల మంది రైతులు మహారాష్ట్రలో 180 కిలోమీటర్ల పాద యాత్ర జరిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అయితే అందులో ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేరలేదని నాటి ర్యాలీలో పాల్గొని నేటి ర్యాలీలో కూడా పాల్గొన్న నాసిక్ నుంచి వచ్చిన సోమ్‌నాథ్ మంకర్ లాంటి వారు చెబుతున్నారు. సీపీఎం నాయకత్వంలోని యూనియన్ల మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కార్మికులు, కర్షకులు ర్యాలీకి తరలి వచ్చారు. -
వారికి అన్ని ప్రయోజనాలూ ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టు వల్ల ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు చట్ట ప్రకారం వర్తింపచేయాల్సిన ఆర్అండ్ఆర్ ప్రయోజనాలను వర్తింప చేసి తీరాల్సిందేనని ఎస్సీసీఎల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అధికారుల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఎస్సీసీఎల్పై ఉందని స్పష్టం చేసింది. వారికి చట్ట ప్రకారం అందించాల్సిన సాయాన్ని అందించి తీరాల్సిందేనంది. ఇందుకు సంబంధించి కొన్ని విధి విధానాలను నిర్దేశించింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ విషయంలో 2005లో జారీచేసిన జీవో 68, ప్రభావిత, నిర్వాసితుల్లో గిరిజన కుటుంబాలు ఉంటే ఆ కుటుంబంలో నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ 2010లో జారీ చేసిన జీవో 34కు అనుగుణంగా కొత్తగూడెం జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రాలు సమర్పించాలని బాధిత వ్యక్తులు, కుటుంబాలను హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లో వినతిపత్రాలు పెట్టుకోవాలని, అలా సమర్పించిన వినతి పత్రాలపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంలో జాయింట్ కలెక్టర్‌కు 2013 భూసేకరణ చట్టంకింద నియమితులైన ఆర్అండ్ఆర్ కమిషనర్ దిశా నిర్దేశం చేయాలంది. వ్యక్తిగత, గ్రూపు వినతులు, అర్హతలు, కుమార్తెల అభ్యర్థనలు తదితర వాటిన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. జీవో 68, జీవో 34 కింద ప్రభావిత, నిర్వాసిత కుటుంబాలకు దక్కాల్సిన ప్రయోజనాలన్నీ వారికి దక్కేలా చూడాలని ఆర్అండ్ఆర్ కమిషనర్‌కు హైకోర్టు తేల్చి చెప్పింది. అటు జాయింట్ కలెక్టర్‌కు, ఇటు కమిషనర్‌కు పూర్తిస్థాయి సహకారం అందించాలని సింగరేణి కాలరీస్ అధికారులను ఆదేశించింది. డబ్బు చెల్లింపు బాధ్యత జేసీలకు.. కనీస వ్యవసాయ వేతనం అందని అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి తాజాగా సవరించిన లేబర్ రేట్ల ప్రకారం లేదా కనీస వేతన చట్టంకింద తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లోని రేట్లలో ఏవి ఎక్కువఉంటే వాటి ప్రకారం చెల్లింపులు జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలంది. ఇందుకు సంబంధించిన డబ్బును జాయింట్ కలెక్టర్‌కు అందుబాటులో ఉంచాలని సింగరేణి కాలరీస్ అధికారులను ఆదేశించింది. ఎంక్యూ, టీక్యూ క్వార్టర్లలో నివాసం ఉంటూ ఎవరైతే విద్యుత్, నీటి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆ సౌకర్యాన్ని రెండు వారాల్లో కల్పించాలంది. ఖాళీ చేసేందుకు ఎవరైతే హామీ ఇచ్చారో వారు ఆర్అండ్ఆర్ ప్రయోజనాల ఉత్తర్వులు జారీఅయిన 30 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది. నివాస ప్రాంతాలకు 250 మీటర్ల పరిధిలో ఎటువంటి బ్లాస్టింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని అధికారులకు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా, యల్లందు మునిసిపాలిటీ పరిధిలో 450.57 హెక్టార్లలో సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రాజెక్టు చేపట్టారు. దీని వల్ల ప్రభావితమవుతున్న, నిర్వాసితులవుతున్న తమకు సింగరేణి అధికారులు చట్ట ప్రకారం ప్రయోజనాలను వర్తింప చేయడం లేదంటూ ఐ.దిలీప్‌కుమార్, మరో 60 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ప్రభావిత, నిర్వాసిత కుటుంబాల విషయంలో సింగరేణి అధికారుల వ్యవహారశైలిని తప్పుపట్టారు. -
‘తొమ్మిదేళ్లు పాలించా..బెదిరిస్తే తోక కట్ చేస్తా’
-
తోక జాడిస్తే కత్తిరిస్తా : చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘ఇయ్యమయ్యా... కనీస వేతనాలు ఇవ్వమని చెబుతున్నా. ఇవ్వం... మళ్లీ మళ్లీ చెబుతున్నా.. తోక జాడిస్తే కట్ చేస్తా. బీ కేర్‌పుల్. ఇంకొకసారి తోక తిప్పండి చెబుతా మీ కథ’.. ‘సచివాలయానికి వచ్చి ఇష్ట్రపకారం చేస్తారా? ఇంకోసారి చేస్తే గుళ్లలోకి కూడా రారు. బీ కేర్‌పుల్’.. ‘ఆర్గ్యుమెంట్స్ లేవు. కనీస వేతనాలు ఇవ్వం. నో నో.. ఏం చేస్తారో చేయండి. ఇంకోసారి మాట్లాడితే మర్యాద కాదు..’ ‘ఏ వూరు మీది..? మీదే ఊరు..? తెలుసా మీకు.. తొమ్మిదేళ్లు పాలించా.. బెదిరిస్తే తోక కట్ చేస్తా’ ‘పిచ్చాటలాడితే మాత్రం.. చాలా సీరియస్‌గా ఉంటది’ ‘ఏం తమాషాలాడుతున్నారా...’ ఆలయ కేశఖండనశాలలో పనిచేసే క్షురకులపై సీఎం చంద్రబాబు వీరావేశంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇవన్నీ. తమను కాంట్రాక్టు ఉద్యోగులుగానైనా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని కోరిన వారిపై సీఎం తీవ్రస్థాయిలో మండిపడి వేలు చూపిస్తూ హెచ్చరికలు చేయటంతో నిర్ఘాంతపోయారు. సంఘాలతో సర్కారు చర్చలు విఫలం ఆలయ కేశఖండనశాలల్లో క్షురకుల విధుల బహిష్కరణతో గత నాలుగు రోజులుగా తలనీలాల సమర్పణ నిలిచిపోయిన సంగతి పాఠకులకు విదితమే. విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న క్షురక జేఏసీ ప్రతినిధులు, నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. సోమవారం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షురక ఉద్యోగ ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనాలైనా చెల్లించాలని ప్రతినిధులు పట్టగా అది కూడా కుదరంటూ కేఈ కృష్ణమూర్తి తేల్చి చెప్పడంతో వారంతా చర్చలను బహిష్కరించారు. ఎంతిచ్చినా జీతంగానే ఇవ్వాలన్న ప్రతినిధులు నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతుండగా అదే సమయంలో సీఎం చంద్రబాబు అక్కడ ఆగారు. ఆలయాల్లో పనిచేసే క్షురకులకు కనీస వేతనాలు ఇవ్వాలని నినాదాలు చేయటంతో.. భక్తుల ఒక్కొక్క గుండుకు రూ.25 చొప్పున చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు చంద్రబాబు వారితో చెప్పారు. అయితే ఒక్కొక్క గుండుకు రూ.50 చొప్పున ఇచ్చినా కూడా తమకు వద్దని, ఎంత ఇచ్చినా జీతం రూపంలోనే ఇవ్వాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. హామీని గుర్తు చేయగానే బాబులో ఆవేశం... ‘ఏం చేసినా కనీస వేతనాలు ఇవ్వడం కుదరదు. ఏం చేసుకుంటారో చేసుకోండని’ చంద్రబాబు ఆవేశంగా వ్యాఖ్యానించారు. ‘‘అయ్యా, మేం ఏ రోజైనా రోడ్డు మీదకొచ్చిన వాళ్లం కాదు. ఎన్నికలప్పుడు మీరే హామీ ఇచ్చారు. మీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టారు. దేవస్థానాల్లో క్షురక ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏళ్ల తరబడి ఆ పనిచేస్తున్న మాకు కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతున్నాం’ అంటూ నాయీ బ్రాహ్మణుల సంఘం ప్రతినిధులు విన్నవించటంతో చంద్రబాబులో ఆవేశం కట్టలు తెంచుకుంది. ‘‘అరుస్తారా.. ఏమన్నా ఫిష్ మార్కెటా ఇది (సచివాలయం)..? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. తాము అరవడం లేదంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు వినలేదు. ‘అరవలేదా.. మీరు తమాషాలాడుతున్నారు’ అని చిందులు తొక్కారు. ముందు విధుల్లో చేరండి... తర్వాతే ఏదైనా అనంతరం చంద్రబాబు వారికి హెచ్చరికలు చేస్తూ, వేలు చూపిస్తూ.. ‘ఏయ్, వినయ్యా విను.. నీకు కుటుంబం ఉండొచ్చయ్యా.. ఏమి మాట్లాడతావు (కోపంగా) ఏం తమాషాలు ఆడుతున్నావు నువ్వు?’ అంటూ ఒక ప్రతినిధిపై విరుచుకుపడ్డారు. దేవాలయంలో పనిచేసే వారు ఇలా ప్రవర్తించడం మంచిది కాదన్నారు. కనీస వేతనాలు ఇవ్వడం కుదరని పలుమార్లు స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. ‘ముందు మీరు విధుల్లో చేరండి. తర్వాత ఏదైనా మాట్లాడదాం’ అంటూ ఆవేశంగా తన కారు వద్దకు వెళ్లిపోయారు. రూ.25 చొప్పున చెల్లించేందుకు ముందుకొచ్చిన సర్కారు పలు దేవాలయాల్లో ప్రస్తుతం రూ.10 – రూ. 20 మధ్య ఉన్న తలనీలాల టిక్కెట్ ధరను అన్ని ఆలయాల్లో రూ.25కు పెంచి ఆ మొత్తాన్ని విధుల్లో పాల్గొనే క్షురకులకు చెల్లించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దేవాలయాల్లోని ప్రతి శిరోముండనానికి ప్రస్తుతం క్షురకులకు చెల్లిస్తున్న 13 రూపాయలను 25 రూపాయలకు పెంచుతామన్నారు. శిరోముండనం కోసం భక్తులు చెల్లించే టిక్కెట్ ధర పెంచే ఆలోచన లేదన్నారు. పెంపు వల్ల పడే అదనపు వ్యయాన్ని సంబంధిత దేవాలయమే భరిస్తుందన్నారు. భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని, ఆందోళనను విరమించాలని కోరారు. బాబుకు తగిన బుద్ధి చెబుతాం నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీనంద సీఎం స్థానంలో ఉన్న వ్యక్తే రౌడీలాగా మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కించపరిచి, మనోధైర్యాన్ని దెబ్బతీశారని నాయీ బ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద అన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళితే సానుకూలంగా స్పందిచకపోగా, తమపైనే ఆయన బెదిరించి, భయపెట్టే ధోరణిలో మాట్లాడారని చెప్పారు. అన్ని బీసీ కులాలతో పాటు నాయీ బ్రాహ్మణులు గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి పనిచేశారని, వచ్చే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. సాయంత్రం శివాలు....రాత్రి బుజ్జగింపు! ఆలయ కేశఖండనశాలల్లో పనిచేసే క్షురకుల జేఏసీ ప్రతినిధులపై సోమవారం సాయంత్రం సచివాలయంలో తీవ్ర ఆగ్రహావేశాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనంతరం రాత్రి వారిని మళ్లీ చర్చల కోసం తన ఇంటికి ఆహ్వానించారు. ప్రతి ఆలయంలో పనిచేసే ఇద్దరేసి చొప్పున ప్రతినిధులను చర్చలకు పిలిచారు. ఈనెల 25వ తేదీన ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుందామని జేఏసీ ప్రతినిధులకు చెప్పారు. దేవదాయశాఖ కమిషనర్ అనురాధ ప్రస్తుతం సెలవులో ఉన్నారని, ఆమె తిరిగి విధుల్లో చేరాక అన్ని విషయాలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు మంగళవారం నుంచి అన్ని ఆలయాల్లోని కేశఖండనశాలల్లో విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు క్షురకుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గుంటుపల్లి రాందాసు చెప్పారు. -
గోపాలమిత్రలతో గొడ్డుచాకిరీ
సాక్షి, హైదరాబాద్: గోపాలమిత్రలతో ప్రభుత్వం గొడ్డుచా కిరీ చేయిస్తోంది. నెలకు కేవలం రూ.3,500 వేతనం ఇచ్చి వీరితో పనిచేయిస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయకపోయినా, సగమే పూర్తిచేసినా కూడా వీరికి ఒక్క పైసా వేతనం రాదు. ఈ కఠిన నిబంధనలు వీరి జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు వేతనం పెంచాలని వినతులు చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని గోపాలమిత్రలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అప్పుడంటూ కాలయాపన చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కలగజేసుకొని తమ వేతనాలను పెంచాలని గోపాలమిత్రల సంఘం నేత చెరుకు శ్రీనివాస్ కోరుతున్నారు. అంతకుముందు వెట్టి... వైఎస్‌తోనే వేతనం గ్రామాల్లో పశుసంపదను సంరక్షించడం కోసం 2001లో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. గ్రామాల్లోని నిరుద్యోగులను ఎంపిక చేసి, నాలుగు నెలలు శిక్షణ ఇచ్చి, వారి సొంత గ్రామాల్లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు. అప్పట్లో వీరికి జీతాలు లేవు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక వీరికి వేతనం ఖరారు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలతో సమానంగా వీరి వేతనాలు పెంచడంలో విఫలమయ్యాయి. తెలంగాణ వచ్చాక కూడా వారి ఆశలు నెరవేరలేదు. గ్రామాల్లో ప్రభుత్వ పశు వైద్య సిబ్బందికి అనుబంధంగా వీరు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారు. పాడిపశువులకు కృత్రిమ గర్భధారణతోపాటు గొర్రెలకు, మేకలకు ప్రాథమిక చికిత్స చేయడం, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందులు వేయడం వీరి విధులు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.40 చొప్పున వీర్యాన్ని కొనుగోలు చేస్తారు. నెలలో 40 నుంచి 60 పశువులకు గర్భధారణ కోసం ఇస్తుంటారు. ఈ మొత్తాన్ని మొదట వీరు పెట్టుకుంటే, రెండు నెలల తర్వాత ప్రభుత్వం వీరి బ్యాంకు ఖాతాలో వేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలు, సబ్ సెంటర్లలో వీరు రైతులకు అందుబాటులో ఉంటారు. గొర్రెల పంపిణీ, వాటికి చికిత్సల్లోనూ వీరు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదని వీరు విధులకు సరిగా రావడం లేదు. గోపాలమిత్రల ప్రధాన డిమాండ్లు ఇవే... - పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.16 వేలు ఇవ్వాలి. - పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించాలి. - పశువైద్యశాఖ అటెండర్ పోస్టుల్లో 50 శాతం గోపాలమిత్రలకు అవకాశం కల్పించాలి. - ఆరోగ్యకార్డులు, అర్హత కలిగిన వారికి వెటర్నరీ అసిస్టెంట్లుగా అవకాశం ఇవ్వాలి. -
కనీస వేతనం పెంచినా..
లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే కనీస వేతనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను దాన్ని అమలు చేయమని ఏ విధంగా శాసిస్తారు? ఊడ్వడం, పరిశుభ్రం చేయడం వంటి పనులను చేస్తున్న కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం 19 జనవరి 2017న నిర్ణయం తీసుకున్నది. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వశాఖ ఈ ఉత్తర్వును బహిర్గతం చేసిందా, ప్రజలకు దాన్ని ఎలా తెలియజేశారు, విస్తృత ప్రచారం కల్పించారా, లేకపోతే అందుకు కారణాలు తెలియజేయండి. ఈ ఉత్తర్వులను అమ లుచేస్తే ఆ వివరాలను లేదా అమలు చేయకపోతే కారణాలను తెలపమని యశ్‌కుమార్ సమాచార హక్కు దరఖాస్తును పెట్టుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 19.1.2017న కనీస వేతనాలు పెంచుతున్నట్టు, గరిష్టంగా రోజుకు రూ. 523కు పెంచినట్టు అసాధారణ రాజపత్ర ముద్రణ ద్వారా ప్రకటనను ప్రచురించారని తెలిపారు. ఆగస్టు 7, 2008 ప్రకటన ప్రకారం వీరి కనీస వేతనం రూ. 374. రోజుకు రూ. 523 కనీస వేతనం ఇవ్వాలని కొత్త నోటిఫికేషన్ తెలుపుతున్నది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉద్యోగులకు, కాంట్రాక్టు ద్వారా నియమితులైన ఉద్యో్గగులకు కూడా పెరిగిన వేతనా లను అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రకట నకు ముందు ప్రచారం చేశామని చెబుతున్నారే తప్ప, తుది ప్రకటన తరువాత పెంచిన కనీస వేత నాల గురించి తగినంత ప్రచారం ఎందుకు చేయలే దని ప్రశ్నించారు. చాలా మంది కాంట్రాక్టర్లు పెంచిన జీతాలు ఇవ్వడం లేదని, తద్వారా కనీస వేతనాల చట్టాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలే ప్రతిరోజూ భంగపరుస్తున్నాయనీ విమర్శించారు. భారత రైల్వేలనే ఇందుకు ఉదాహరణగా చూపారు. లక్షల మంది ఊడ్చేవారు, కడిగేవారు రైల్వేలో పనిచేస్తున్నా, వారికి రూ. 523కు బదులు ఇంకా రూ. 374ల రోజుకూలీనే చెల్లిస్తున్నారు. 40 శాతం పెరిగిన జీతం ఇవ్వాలంటే హఠాత్తుగా పెరిగే ఖర్చులకు నష్టపరిహారం ఎవరిస్తారని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. ఒప్పందంలో డీఏ ఆధారంగా పెరిగే జీతాలు చెల్లించడంవల్ల అదనపు ఖర్చును భరించేందుకు ఒక షరతును చేర్చారు. కానీ అసా ధారణ నోటిఫికేషన్ ద్వారా కనీస వేతనాలను గణనీయంగా పెంచినప్పుడు పడే అదనపు భారాన్ని తామే మోయాలని చెప్పే ఏవిధమైన క్లాజూ కాంట్రాక్ట్‌లో లేదని రైల్వే వాదిస్తున్నది. 40 శాతం పెంపును భరించేంత డబ్బు తమ వద్ద లేవని ఈ ఉద్యోగుల గుత్తేదారులు అంటున్నారు. వారు రైల్వేల కోసమే నియమితులైనారు కనుక వారికి పెరిగిన జీతం ఇవ్వవలసిన బాధ్యత భారం రైల్వేనే భరించాలని వారు కోరారు. ఇది ఆర్థిక భారాన్ని మోపే నిర్ణయం కనుక బోర్డు సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని రైల్వే బోర్డు వాదిస్తున్నది. రైల్వేలో ఊడ్చే సిబ్బంది, పరిశుభ్రం చేసే పని వారు కొన్ని వేల మంది ఉంటారు. ఔట్ సోర్సింగ్ ద్వారానే 80 శాతం మందిని నియమిస్తారు. వారికి కనీస వేతనం చెల్లించడం యజమానుల బాధ్యత. యజమాని అంటే కాంట్రాక్టరు లేదా రైల్వే యాజ మాన్యం కూడా అవుతుంది. రైల్వే పాలకులను ప్రధాన నియామకులుగా చట్టం భావిస్తుంది. నౌక ర్లకు జీతాలు ఇచ్చే బాధ్యత చట్టప్రకారం ప్రధాన నియామకులదే. రైల్వే బోర్డు ఒకవేళ పెంచిన జీతా లకు అంగీకరించినా మరొక గొడవ ఉంది. అదే మంటే బోర్డు అంగీకరించిన తేదీ నుంచి కార్మికు లకు పెంచిన జీతం ఇస్తారు. అంతే. కానీ జనవరి 19 నుంచి అమలు చేయవలసిన పెంపును ఎవరి స్తారు? అనే ప్రశ్న మిగిలిపోతున్నది. ఎవరూ ఇవ్వక పోతే, కనీస వేతనాల చట్టం కింద పెంచిన జీతం ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనే అవుతుంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వెనుక తేదీ నుంచి అంటే జనవరి 19 నుంచి కార్మికులందరికీ పెంచిన జీతాలు ఇవ్వాలని తీర్మానించడం రెల్వే బోర్డు బాధ్యత. కాని వారు ఏవో కుంటి సాకులతో దీన్ని ఒక కోర్టు తగాదా కింద మార్చే ప్రయత్నాలు చేస్తు న్నారని, అసలు కారణం వ్యత్యాస వేతన భారాన్ని తప్పించుకోవడమే అని దరఖాస్తుదారుని విమర్శ. కేంద్ర ప్రభుత్వం, కార్మిక మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుని రైల్వేబోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయవలసి ఉన్నా, ఆ పని చేయడం లేదని ఆరో పణ. కనుక దీనిపై తగిన సమాధానాన్ని ఇచ్చి, ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారో, జీతాల పెంపు ఉత్తర్వులను ఏ విధంగా అమలు చేస్తారో తెలియజేయాలని ఆయన అంటున్నారు. లక్షలాది మంది కార్మికులను నియమించే అతి పెద్ద యజమాని రైల్వే శాఖే ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇతర ప్రభుత్వ శాఖలను, ప్రైవేటు యజమానులను ఏ విధంగా శాసిస్తారు? ఈ సమ స్యను ఏ విధంగా పరిష్కరిస్తారో తెలియజేయాలని చీఫ్ లేబర్ కమిషనర్, రైల్వే బోర్డు చైర్మన్, రైల్వే మంత్రిత్వశాఖ, కేంద్ర కార్మికశాఖలను సమాచార కమిషన్ ఆదేశించింది. (యశ్‌కుమార్ వర్సెస్ కార్మిక మంత్రిత్వ శాఖ పీఐఓ కేసు CIC/MLABE/A/ 2017/606546లో నవంబర్ 30న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
కనీస వేతనాలు ఇవ్వాల్సిందే!
- కేంద్రం నిర్దేశించిన మేర చెల్లించాలంటూ - సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఆందోళన - 7 గంటల పాటు కేంద్ర కార్మిక శాఖ అధికారుల నిర్బంధం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమకు కనీస వేతనాలు చెల్లించాలంటూ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సోమవారం కేంద్ర కార్మిక శాఖ, సింగరేణి బొగ్గు గనుల సంస్థల ఉన్నతాధికారులను నిర్బంధించారు. సుమారు ఏడు గంటల పాటు నిర్బంధించి ఆందోళన చేశారు. చివరికి ఈనెల 31లోగా కనీస వేతనాలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ ఉన్నతాధికారులు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పెద్ద సంఖ్యలో కార్మికులతో.. కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల నిర్వహణపై సోమవారం హైదరాబాద్‌లోని అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఏటీఐ)లో సన్నాహక సమావేశం జరిగింది. సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ (పర్సనల్ విభాగం) అనిల్‌కుమార్, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్లు లక్ష్మయ్య, బి.శ్రీనుతో పాటు 15 సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభంకాగా.. కొద్దిసేపటికే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు సమావేశ మందిరంలోకి చొచ్చుకువచ్చారు. కేంద్ర కార్మిక శాఖ గత జనవరి 19న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. తమ రోజువారీ కనీస వేతనాన్ని రూ.319 నుంచి రూ.359కు పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన ప్రకటన చేసేదాకా, రాతపూర్వకంగా హామీ ఇచ్చేదాకా కదిలేది లేదంటూ బైఠాయించారు. గత మార్చిలో 9 రోజుల పాటు కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయడంతో ఆయా డిమాండ్లను నెరవేరుస్తామని సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని... కానీ తర్వాత పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు మండిపడ్డారు. ససేమిరా అన్న సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల ఆందోళన నేపథ్యంలో.. సింగరేణి సంస్థ అధికారులు, జేఏసీ నేతలతో కేంద్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ ఎ.గోవర్ధన్, కేంద్ర కార్మిక శాఖ అధికారులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ నిర్దేశించిన ప్రకారమే గత 40 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నామని సింగరేణి యాజమాన్యం తరఫున సంస్థ అధికారులు స్పష్టం చేశారు. దీంతో కార్మికులు ఆందోళన మరింత ఉధృతం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక శాఖలు నిర్దేశించిన కనీస వేతనాల్లో ఏది ఎక్కువగా ఉంటే దానినే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా బోనస్ చెల్లించాలని కోరారు. చివరికి ఈ నెల 31వ తేదీలోగా కేంద్రం నిర్దేశించిన కనీస వేతనాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర అధికారులు ఎ.గోవర్ధన్, శ్యాంసుందర్‌లు రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో జేఏసీ నేతలు బి.మధు (సీఐటీయూ), పులి రాజిరెడ్డి(బీఎంఎస్), శంకర్, వెంకన్న (ఐఎఫ్టీయూ) తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు హెచ్చరించారు. వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్ద రెండో రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వీఆర్ఏలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి మధ్య చీలికలు తేవాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి పాత, కొత్త వీఆర్ఏలందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, కె.ఏసురత్నం, ఎం.రాఘవులు, ఎస్కే.మస్తాన్, ఎ.రవికుమార్, కె.నాగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎం.చంటిబాబు, కె.నాగమ్మ, సీహెచ్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ధర్నా
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం నాయకులు హెచ్చరించారు. వీఆర్ఏల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వీఆర్ఏలు స్థానిక కలెక్టరేట్ వద్ద రెండో రోజు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వీఆర్ఏలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. వీఆర్ఏలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిసి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వారి మధ్య చీలికలు తేవాలని చూస్తోందన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టి పాత, కొత్త వీఆర్ఏలందరూ ఐక్యంగా తమ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి, కె.ఏసురత్నం, ఎం.రాఘవులు, ఎస్కే.మస్తాన్, ఎ.రవికుమార్, కె.నాగరాజు, డి.వెంకటేశ్వరరావు, ఎం.చంటిబాబు, కె.నాగమ్మ, సీహెచ్.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ?
►దయనీయం ఆశ కార్యకర్తల జీవనం ►నాలుగేళ్లగా అందని యూనిఫారాలు, అలవెన్సులు ►కనీస వేతనాలకూ నోచుకోని వైనం! వైద్య, ఆరోగ్య శాఖలో ఎంతో ప్రాముఖ్యమైన మాతా, శిశు మరణాలు తగ్గించడానికి, గర్భిణి, బాలింతల సంరక్షణ కోసం ప్రభుత్వం ఆశ వర్కర్లను నియమించింది. అయితే వీరికి వేతనాలివ్వకుండా పారితోషికాలతో ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఏ విధమైన వేతనం నిర్ణయించకుండా ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తే జీవనోపాధి మెరుగుపడుతుందన్న ఆశతో దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా వారు కనీస వేతనాలకు నోచుకోలేదు. వేపాడ(ఎస్.కోట): జిల్లా వ్యాప్తంగా సుమారు 2500 మంది ఆశ కార్యకర్తలు వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్నారు. మహిళా ఆరోగ్య కార్యకర్తలతో సమానంగా గ్రామ స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమం, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, జనన మరణాల నమోదు, న్యూట్రిషన్, కుష్ఠు, క్షయ, ఫైలేరియా, ఎయిడ్స్, ప్రతీ ఏడాది నిర్వహించే పల్స్‌పోలియో, ఇంటింటి ప్రచారం, సర్వేలకు ఆశ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. నిరంతరం గ్రామ స్థాయిలో సేవలందించిన అరకొర ప్రోత్సాహమే తప్ప కనీస వేతనానికి నోచుకోలేదు. సమావేశాలకు వెళ్లే అలవెన్స్, యూనిఫారాలు కూడా అందించకపోవటంతో కుటుంబ పోషణ భారంగా తయారైందంటు వీరు ఆవేదన చెందుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 20 ఏళ్లుగా పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు నెలకు రూ.400 గౌరవ వేతనం ఇస్తున్నారంటే ప్రభుత్వం పనితీరు అర్ధం చేసుకోవచ్చు. పని భారమే తప్ప కనీస వేతనాలు లేకపోవటంతో ఆర్థిక పరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. ప్రతి నెలా పీహెచ్‌సీల్లో సమావేశాలకు రప్పించే వీరికి టీఏ, డీఏలు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే యూనిఫాం అలవెన్స్ రూ.500లకు కూడా నాలుగేళ్లగా నోచుకోవడం లేదు. సమావేశాలకు యూనిఫాంతో రాలేదంటూ ఇచ్చే పారితోషికాన్ని తగ్గిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో 7500 ఇస్తున్నారు... కేరళ రాష్ట్రంలో ఆశ కార్యకర్తలకు నెలకు రూ.7500లు గౌరవ వేతనం ఇస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణాలో కూడా నెలకు రూ.ఆరు వేలు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించి అమలు చేయటంలో నిమగ్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆశ కార్యకర్తలకు కనీస వేతనం, యూనిఫారాలు అలవెన్స్ మంజూరు ఉత్తర్వులు ఇవ్వటానికి వెనుకంజ వేస్తోంది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి పని భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనం రూ.ఆరు వేలు ఇవ్వాలంటు ఆశ కార్యకర్తలు కోరుతున్నారు . 12న చలో డీఎంహెచ్‌వో కార్యాలయం ఆశ కార్యకర్తల సమస్యలను పరిష్కరించి కనీస వేతనం చెల్లించాలంటూ ఏపీ ఆశ కార్యకర్తల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 12న చలో డీఎంహెచ్‌వో కార్యాలయం నిర్వహిస్తున్నారు. కనీస వేతనానికి పోరాటం ఏళ్లు గడుస్తున్నా ఆశ కార్యకర్తలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేవు. యూనియన్ తరఫున సమస్యలు పరిష్కరించే వరకు పోరాడుతాం. కుటుంబ పోషణకు ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా సహాయ పడేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో సమస్యలను పరిష్కారించాల్సి వుంది. కేరళ, తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఏపీలో కూడా రూ.ఆరు వేలు గౌరవ వేతనం ఇవ్వాలి. –చల్లా జగన్, జిల్లా కార్యదర్శి, సీఐటీయూ ఆదరణ చూపండి పదేళ్లుగా గ్రామ స్థాయిలో వైద్యసేవలతో పాటు సర్వేలకు సహాయ పడుతున్న ఆశ కార్యకర్తలకు ప్రభుత్వ ఆదరణ కరువైంది. దీంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నాం. యూనిఫారాలు అలెవెన్స్ ఇవ్వరు..అంతంత ప్రోత్సాహాలతో జీవనం సాగించలేకపోతున్నాం. ప్రభుత్వం స్పందించి కనీస వేతనం అందించి ఆదుకోవాలి. –దేవుపల్లి సన్యాసమ్మ, జిల్లా కార్యదర్శి, జిల్లా ఆశ వర్కర్లు యూనియన్ -
బానిసలుగా చూస్తుండటం వల్లే..
హైదరాబాద్: హోం గార్డులు తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని , కనీస మర్యాద, వేతనం లేకుండా బానిసలుగా చూస్తుండటం వల్లే వారిప్పుడు తిరగబడుతున్నారని బీజేఎల్పీనేత కిషన్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నదని విమర్శించారు. జీవితాంతం శ్రమించినా పదవీ విరమణ సమయంలో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదన్నారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందన్నారు. పోలీసు వ్యవస్థతో మమేకమై పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలు ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులకు నోటీసులిచ్చి వారిని మరింత క్షోభకు గురిచేయ్యొద్దన్నారు. వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే తానే స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్, ఇద్దరు సీఎం, ఇద్దరు సీఎస్, డీజీపీలకు లేఖలు రాస్తానని తెలిపారు. -
జీతాలు పెంచినా సమ్మె ఎందుకు?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది కార్మికులు శుక్రవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, గనులు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కార్మికుడి కనీస దినసరి వేతనాన్ని 350 రూపాయలకు, అంటే నెలకు 9,100 రూపాయలకు పెంచినప్పటికీ, ఆ విషయాన్ని కేంద్రమే తాటికాయంత అక్షరాలతో ఈ రోజు వాణిజ్య ప్రకటనలతో పత్రికల్లో ఊదరగొట్టినప్పటికీ కార్మికులు ఎందుకు సమ్మెకు దిగారు? అందుకు కారణాలేమిటీ? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దేశ జనాభాలో 46 కోట్ల మంది ఉన్నారు. వారిలో వ్యవసాయేతర రంగాల కార్మికులకు మాత్రమే కేంద్రం కనీస వేతన ఉత్తర్వులు వర్తిస్తాయి. అందులోను కేవలం 48 కేటగిరీలకు చెందిన కార్మికులకు మాత్రమే కేంద్రం ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇనుప గనుల్లో పనిచేసే కార్మికులు, రైల్వే సరకుల అన్లోడింగ్, రాళ్లు కొట్టడం లాంటి కేటగిరీలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఈ రంగాల్లో ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 350 రూపాయలకన్నా ఎక్కువే పొందుతున్నారు. ఇక 1679 జాబ్ కేటగిరీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. ఈ క్యాటగిరీ కార్మికులకు కేంద్రం ఉత్తర్వులు వర్తించవు. దేశంలోని మొత్తం 46 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 70 లక్షల మందే, అంటే 1.5 శాతం మంది కార్మికులు మాత్రమే కేంద్రం ప్రకటించిన కనీస వేతన ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందుతారు. కేంద్ర వేతన సంఘం కనీస వేతనాన్ని 18 వేల రూపాయలుగా సిఫార్సు చేయగా, కార్మికులకు మాత్రం అందులో కనీస వేతనాన్ని సగానికి సగంగా నిర్ణయించడం అన్యాయమని కేంద్ర కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల కిందకు వచ్చే 1679 కేటగిరీలకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వేతనాలు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశం లేకుండా కేంద్రం ఉత్తర్వులను తూచాతప్పకుండా రాష్ట్రాలు అమలు చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస వేతన బోర్డు సూచన మేరకే కార్మికుల కనీస వేతనాన్ని తాము 350 రూపాయలుగా నిర్ణయించామంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకోవడానికి ప్రయత్నించి తప్పులో కాలేశారు. కేవలం రెండు రోజుల నోటీసుతో ఆగస్టు 29న కనీస వేతన బోర్డు సబ్యుల సమావేశాన్ని కేంద్రం ఆదరాబాదరగా ఏర్పాటు చేసింది. అందులో తాము కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసిన మేరకు కార్మికుల కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించాలని తాము డిమాండ్ చేశామని, అయితే ఏకాభిప్రాయం కుదరక, ఎలాంటి నర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని కార్మిక సంఘాల తరఫున ప్రాథినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యుడు డాక్టర్ కాశ్మీర్ సింగ్ తెలిపారు. బోనస్ చెల్లించడంలో, కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కార్మికుల కనీస బోనస్‌ను 3,500 రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు 2015, డిసెంబర్లో ఘనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ దాన్ని నోటిఫై చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు బోనస్ చెల్లించలేదు. ప్రాఫిడెంట్, ప్రభుత్వ బీమా పథకం కింద అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న కేంద్రం హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కమిటీల మీద కమీటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వస్తే దాదాపు 20 లక్షల మంది అంగన్వాడి కార్యకర్తలు ఎక్కువగా లబ్ధిపొందుతారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి: సీఐటీయు
కళాశాలలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూసీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలోని బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు బాలు, దేవయ్యలు మాట్లాడుతూ..రోజు కూలీ లెక్కన కార్మికుల చేత పని చేయించుకుంటున్న కళాశాల యాజమాన్యం కార్మికులకు కనీస వేతనాలు అందించడంలో విఫలం అవుతున్నాయని అన్నారు. రోజుకు రూ. 500 వందల చొప్పున ప్రతి కార్మికునికి వేతనాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న బోజిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం కార్మికులకు జీతాలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పని చేస్తున్న మహిళా సిబ్బంది, లక్ష్మయ్య, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మెడికల్ రిప్స్ నిరసన దీక్ష
భీమవరం: తమకు కనీస వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్‌జీయూడీ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మెడికల్ రిప్స్ నిరాహార దీక్ష చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తమకు కనీస వేతనాలు నిర్ణయించాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భీమవరంశాఖ అధ్యక్షుడు సీహెచ్‌ఎన్‌ఎం మురళీ ప్రసాద్ మాట్లాడుతూ మెడికల్ రిప్స్‌లో మహిళలకు ప్రసూతి సెలవులు ఆర్నెల్లు ప్రకటించాలని, మేడే సెలవు ఇవ్వాలని కోరారు. దీక్షలో ఎస్.శిరీష్‌కుమార్, కెఎంఎస్‌సీ రాజు, బాలకృష్ణ, పవన్‌కుమార్ తదితరులు కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు వాసుదేవరావు, స్కూల్ బస్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ దీక్షకు మద్దతు తెలిపారు. -
కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించాలి
కడప సెవెన్‌రోడ్స్: కనీస వేతనాల చట్టం కింద ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్‌మెంట్స్‌లో కార్మికుల కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం వేతనాలను సవరించాల్సి ఉంటుందన్నారు. షెడ్యూల్డ్–1లోని 65 ఎంప్లాయ్‌మెంట్స్‌కు గాను 54 ఎంప్లాయ్‌మెంట్స్‌లో వేతన సవరణ పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. 2011, 2012లో షెడ్యూల్డ్–1లోని మిగతా 11 ఎంప్లాయ్‌మెంట్స్‌కు జరిగిన వేతన సవరణల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, ఆయిల్‌మిల్లులు, పేపరు మిల్లుల కార్మికులకు వేతనాలు తగ్గించడం అన్యాయమన్నారు. స్పిన్నింగ్ మిల్లులు, గార్మెంట్స్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు నిర్ణయించడం న్యాయం కాదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటినా వేతన సవరణ పెండింగ్‌లోనే ఉందని విమర్శించారు. ఇందువల్ల కార్మికులు వేలాది కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాల సలహాబోర్డును ఏర్పాటు చేసి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బద్వేలు శ్రీను, రిమ్స్ సుబ్బయ్య, సునీల్, అన్వేష్, మున్సిపల్ వర్కర్లు, యార్డు హమాలీలు, ఆటో వర్కర్లు, ఐఎంఎల్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
లాభాల్లో ఉంటేనే పీఆర్సీ
♦ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చంద్రబాబు షాక్ ♦ ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి సాక్షి, విజయవాడ బ్యూరో: లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే పీఆర్సీ ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమైన ఆయన వారి సమస్యలపై చర్చించారు. 4.60 లక్షల మంది ఉద్యోగుల్లో కేవలం 20 వేల మంది పీఆర్సీకి నోచుకోక ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి పీఆర్సీ ఇవ్వాలని నేతలు కోరగా సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, అప్పు తెచ్చుకోవడానికి ఎఫ్ఆర్బీఎం నిబంధనలు అడ్డొస్తున్నాయని తెలిపారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని, అక్కడి ఉద్యోగులతో పోల్చుకోవద్దని సూచించారు. ప్రైవేటు సంస్థలతో పోటీపడి ఉత్పాదకత పెంచేందుకు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు పని చేస్తే పీఆర్సీకి మించిన వేతనాలు ఇస్తానని స్పష్టం చేశారు. మంచి ఫలితాలు సాధిస్తేనే.. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం పీఆర్సీ అమలు చేస్తామని, తాను ఆశించిన ఫలితాలు రాబడితే అంతకు మించి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలనే డిమాండ్‌పై మంత్రుల కమిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కంటింజెంట్ ఉద్యోగుల రెగ్యులరైజ్, ఫుల్‌టైమ్ కంటింజెంట్ ఉద్యోగులకు పదో పీఆర్సీలో కనీస వేతనం, జూలై 2015, జనవరి 2016 రెండు విడతల డీఏ విడుదల, పది నెలల పీఆర్సీ బకాయిల చెల్లింపు, అంతర జిల్లాల బదిలీలకు ఆమోదం, పండిట్లు, పీఈటీ పోస్టుల అప్‌గ్రెడేషన్ త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు జేఏసీ నేతలు చెప్పారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, కో-చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.