బానిసలుగా చూస్తుండటం వల్లే..
హైదరాబాద్: హోం గార్డులు తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని , కనీస మర్యాద, వేతనం లేకుండా బానిసలుగా చూస్తుండటం వల్లే వారిప్పుడు తిరగబడుతున్నారని బీజేఎల్పీనేత కిషన్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వం హోంగార్డుల శ్రమను దోచుకుంటున్నదని విమర్శించారు. జీవితాంతం శ్రమించినా పదవీ విరమణ సమయంలో ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదన్నారు. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం లేదని తెలిపారు.
తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందన్నారు. పోలీసు వ్యవస్థతో మమేకమై పనిచేస్తున్న హోంగార్డుల సమస్యలు ప్రభుత్వాలు సానుభూతితో పరిశీలించాలని సూచించారు. ఆందోళన చేస్తున్న హోంగార్డులకు నోటీసులిచ్చి వారిని మరింత క్షోభకు గురిచేయ్యొద్దన్నారు. వారం రోజుల్లో హోంగార్డుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే తానే స్వయంగా ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంపై గవర్నర్, ఇద్దరు సీఎం, ఇద్దరు సీఎస్, డీజీపీలకు లేఖలు రాస్తానని తెలిపారు.