జీతాలు పెంచినా సమ్మె ఎందుకు?
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా దాదాపు 15 కోట్ల మంది కార్మికులు శుక్రవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఫ్యాక్టరీలు, బ్యాంకులు, గనులు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికులు ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే కార్మికుడి కనీస దినసరి వేతనాన్ని 350 రూపాయలకు, అంటే నెలకు 9,100 రూపాయలకు పెంచినప్పటికీ, ఆ విషయాన్ని కేంద్రమే తాటికాయంత అక్షరాలతో ఈ రోజు వాణిజ్య ప్రకటనలతో పత్రికల్లో ఊదరగొట్టినప్పటికీ కార్మికులు ఎందుకు సమ్మెకు దిగారు? అందుకు కారణాలేమిటీ? అన్న ప్రశ్నలు తలెత్తక మానవు.
వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దేశ జనాభాలో 46 కోట్ల మంది ఉన్నారు. వారిలో వ్యవసాయేతర రంగాల కార్మికులకు మాత్రమే కేంద్రం కనీస వేతన ఉత్తర్వులు వర్తిస్తాయి. అందులోను కేవలం 48 కేటగిరీలకు చెందిన కార్మికులకు మాత్రమే కేంద్రం ఉత్తర్వులు వర్తిస్తాయి. ఇనుప గనుల్లో పనిచేసే కార్మికులు, రైల్వే సరకుల అన్‌లోడింగ్, రాళ్లు కొట్టడం లాంటి కేటగిరీలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఈ రంగాల్లో ఇప్పటికే కేంద్రం నిర్ణయించిన కనీస దినసరి వేతనం 350 రూపాయలకన్నా ఎక్కువే పొందుతున్నారు. ఇక 1679 జాబ్ కేటగిరీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి. ఈ క్యాటగిరీ కార్మికులకు కేంద్రం ఉత్తర్వులు వర్తించవు.
దేశంలోని మొత్తం 46 కోట్ల మంది కార్మికుల్లో కేవలం 70 లక్షల మందే, అంటే 1.5 శాతం మంది కార్మికులు మాత్రమే కేంద్రం ప్రకటించిన కనీస వేతన ఉత్తర్వుల వల్ల లబ్ధి పొందుతారు. కేంద్ర వేతన సంఘం కనీస వేతనాన్ని 18 వేల రూపాయలుగా సిఫార్సు చేయగా, కార్మికులకు మాత్రం అందులో కనీస వేతనాన్ని సగానికి సగంగా నిర్ణయించడం అన్యాయమని కేంద్ర కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల కిందకు వచ్చే 1679 కేటగిరీలకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం వేతనాలు ఇవ్వొచ్చు. ఇలాంటి అవకాశం లేకుండా కేంద్రం ఉత్తర్వులను తూచాతప్పకుండా రాష్ట్రాలు అమలు చేసేలా చట్టాల్లో మార్పులు తీసుకరావాలని కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కనీస వేతన బోర్డు సూచన మేరకే కార్మికుల కనీస వేతనాన్ని తాము 350 రూపాయలుగా నిర్ణయించామంటూ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమర్థించుకోవడానికి ప్రయత్నించి తప్పులో కాలేశారు. కేవలం రెండు రోజుల నోటీసుతో ఆగస్టు 29న కనీస వేతన బోర్డు సబ్యుల సమావేశాన్ని కేంద్రం ఆదరాబాదరగా ఏర్పాటు చేసింది. అందులో తాము కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసిన మేరకు కార్మికుల కనీస వేతనాన్ని నెలకు 18 వేల రూపాయలుగా నిర్ణయించాలని తాము డిమాండ్ చేశామని, అయితే ఏకాభిప్రాయం కుదరక, ఎలాంటి నర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసిందని కార్మిక సంఘాల తరఫున ప్రాథినిధ్యం వహిస్తున్న బోర్డు సభ్యుడు డాక్టర్ కాశ్మీర్ సింగ్ తెలిపారు.
బోనస్ చెల్లించడంలో, కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. కార్మికుల కనీస బోనస్‌ను 3,500 రూపాయల నుంచి ఏడు వేల రూపాయలకు పెంచుతున్నట్లు 2015, డిసెంబర్‌లో ఘనంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ దాన్ని నోటిఫై చేయలేదు. దాంతో గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు బోనస్ చెల్లించలేదు. ప్రాఫిడెంట్, ప్రభుత్వ బీమా పథకం కింద అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న కేంద్రం హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కమిటీల మీద కమీటీలు వేస్తూ కాలయాపన చేస్తోంది. ఈ పథకం అమల్లోకి వస్తే దాదాపు 20 లక్షల మంది అంగన్‌వాడి కార్యకర్తలు ఎక్కువగా లబ్ధిపొందుతారు.