సియాటిల్: ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్.. అమెరికాలోని తమ సిబ్బంది కనీస వేతనాలను పెంచింది. వచ్చే నెల నుంచి గంటకు 15 డాలర్ల (సుమారు రూ.1,050) చొప్పున కనీస వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించింది. దాదాపు 3,50,000 మంది ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్, తాత్కాలిక ఉద్యోగులకు దీనితో ప్రయోజనం చేకూరనున్నట్లు అమెజాన్ తెలియజేసింది. ఇప్పటికే గంటకు 15 డాలర్ల వేతనం పొందుతున్నవారికి కూడా తగు స్థాయిలో పెంపు ఉంటుందని తెలిపింది.
కంపెనీలో పై స్థాయి, కింది స్థాయి ఉద్యోగుల వేతనాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను సరిదిద్దాలంటూ ఆర్థిక, రాజకీయ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెజాన్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. మిగతా రిటైల్ సంస్థలు కూడా క్రమంగా కనీస వేతనాలను క్రమంగా పెంచుతున్నాయి. వాల్‌మార్ట్ ఈ మధ్యే జనవరిలో తమ సిబ్బంది కనీస వేతనాలను గంటకు 11 డాలర్లకు పెంచగా, మరో రిటైల్ సంస్థ టార్గెట్ 2020 నాటికల్లా గంటకు 15 డాలర్ల కనీస వేతన స్థాయిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.
‘‘కనీస వేతనాన్ని 15 డాలర్లకు పెంచేలా ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం ఉన్న 7.25 డాలర్లనేది 11 ఏళ్ల కిందటి చట్టం. అప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారాయి. అందుకే మేం 15 డాలర్లకు పెంచుతున్నాం’’ అని అమెజాన్ పేర్కొంది. కనీసం గంటకు 15 డాలర్లు చెల్లించాలన్న ఉద్యమం ఇపుడు అమెరికాలో ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా చర్యలు తీసుకోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment