
నియంత్రణకు బిలియన్ డాలర్లు వెచ్చింపు
2024లో 1.5 కోట్ల ఉత్పత్తుల స్వాధీనం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథను ఉపయోగించుకుని నకిలీ ఉత్పత్తులను కట్టడి చేయడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెడుతోంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల పైగా ఇలాంటి ఉత్పత్తులను గుర్తించింది. కస్టమర్ల ప్రయోజనాలకు భంగం కలిగేలా, మరో విధంగా ఇంకెవరూ విక్రయించకుండా, వాటిని స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేసింది.
నకిలీలు, మోసాల నుంచి కస్టమర్లు, బ్రాండ్లు, విక్రేతలకు రక్షణ కల్పించేందుకు బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసినట్లు, వేల కొద్దీ సంఖ్యలో ఇన్వెస్టిగేటర్లు, మెషిన్ లెర్నింగ్ సైంటిస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లలాంటి ఉద్యోగులను నియమించుకున్నట్లు బ్రాండ్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2024లో అమెజాన్ వెల్లడించింది. బ్రాండ్లు గుర్తించి, రిపోర్ట్ చేయడానికి ముందే తమ నియంత్రణ వ్యవస్థలు 99 శాతం సందేహాస్పద లిస్టింగ్స్‌ను బ్లాక్ చేసినట్లు వివరించింది.
అమెజాన్ పారదర్శకత ప్రోగ్రాం ద్వారా 250 కోట్ల ఉత్పత్తుల యూనిట్లను సిసలైనవిగా ధృవీకరించినట్లు పేర్కొంది. ఫార్చూన్ 500 కంపెనీలు, గ్లోబల్ బ్రాండ్స్, అంకుర సంస్థలు, చిన్న వ్యాపార సంస్థలు సహా ప్రపంచవ్యాప్తంగా 88,000 బ్రాండ్ల ఉత్పత్తులు తమ దగ్గర లిస్టయినట్లు వివరించింది. భారత్ తమకు కీలక మార్కెట్ అని, కస్టమర్లు .. విక్రేతల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని అమెజాన్ డైరెక్టర్ కెబారు స్మిత్ తెలిపారు.
170 పైగా నగరాల్లో ఫ్రెష్..
దేశీయంగా నిత్యావసరాల సేవల సెగ్మెంట్ ఫ్రెష్‌ను విజయవాడ, చిత్తూరు తదితర 170 పైగా నగరాలు, పట్టణాలకు విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. 11,000 మంది పైచిలుకు రైతుల నుంచి తాజా పండ్లు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. 2023 ద్వితీయార్థంతో పోలిస్తే 2024 ద్వితీయర్ధంలో 50 శాతం వ్యాపార వృద్ధి నమోదు చేసినట్లు అమెజాన్ ఫ్రెష్ ఇండియా డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీరామ్ తెలిపారు.