
పనిగంటలపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న సమయంలో.. తాజాగా సెలవుల సంస్కృతికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఒక్క నెలలోనే (ఏప్రిల్ 2025) ఏకంగా 17 సెలవులు ఉన్నాయంటూ.. క్లీన్‌రూమ్స్ కంటైన్‌మెంట్స్ వ్యవస్థాపకులు & సీఈఓ 'రవికుమార్ తుమ్మలచర్ల' చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
భారతదేశ సాంస్కృతి, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మనం ఎంతో గౌరవిస్తున్నాము. వారాంతాలతో కలిపి ప్రభుత్వ సెలవులు, ఆప్షనల్ హాలిడేస్ కారణంగా.. పనులు వాయిదా పడుతున్నాయి. ఏప్రిల్ 2025లో, మాకు 10 కంటే ఎక్కువ సెలవులు వచ్చాయి. సెలవులు అధికం కావడంతో ముఖ్యమైన ఫైల్స్ ఆఫీసుల్లో కదలకుండా నిలిచిపోతున్నాయి.
మేము భారతీయ.. పాశ్చాత్య సంప్రదాయాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అయితే ఇదే సమయంలో ఉత్పాదకతను కోల్పోకుండా చూసుకోవాలి. ఉత్పాదకత తగ్గితే.. అది దాదాపు అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. ఆర్థిక వేగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే చైనా 60 సంవత్సరాలు ముందుంది.

భారతదేశంలో మనం మాత్రం వేగవంతమైన ప్రక్రియల కోసం విదేశాలకు వలసపోతాము. కాబట్టి మన సెలవు సంస్కృతిని పునరాలోచించాలి. మెరుగైన సమతుల్యతను సాధించాలి. ఇదే సరైన సమయం అంటూ.. సెలవుల జాబితాను రవికుమార్ తుమ్మలచర్ల సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రభుత్వ సంస్థలను ట్యాగ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!
రవికుమార్ తుమ్మలచర్ల షేర్ చేసిన లింక్డ్ఇన్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఈయన అభిప్రాయంపై ఏకీభవిస్తుంటే.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇలాంటి పోస్టులు ఎప్పుడు యజమాని నుంచే వస్తాయి. ఉద్యోగి ఎప్పుడూ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటాడు అని చెబుతున్నారు. సెలవులు అంటే ఆర్థిక కార్యకలాపాలలో విరామం మాత్రమే కాదు, అవి ఉద్యోగులు రీఛార్జ్ అవ్వడానికి తగిన సమయం అని కూడా ఇంకొందరు తమ అభిప్రాయాలను చెబుతున్నారు.