బాత్రూమ్‌లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా | Edelweiss Mutual Fund CEO Radhika Gupta Reflects On Her Experience Working 100 Hour Weeks | Sakshi
Sakshi News home page

బాత్రూమ్‌లో ఏడ్చేదాన్ని: పనిగంటలపై రాధికా గుప్తా

Published Sat, Jan 11 2025 3:28 PM | Last Updated on Sat, Jan 11 2025 3:51 PM

Edelweiss Mutual Fund CEO Radhika Gupta Reflects On Her Experience Working 100 Hour Weeks

వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' (Narayana Murthy), 70 గంటలు కాదు.. వారానికి 90 గంటలు పనిచేయాలని ఎల్ అండ్ టీ చైర్మన్ 'సుబ్రమణ్యన్' (Subrahmanyan) పేర్కొన్నారు. తాజాగా ఇప్పుడు ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' (Radhika Gupta) తాను వారానికి 100 గంటలు పనిచేశానని వెల్లడించారు.

రాధికా గుప్తా ఉద్యోగంలో చేరిన మొదటి రోజుల్లో వారానికి 100 గంటలు పనిచేసాను. అలా నాలుగు నెలల పాటు పని చేసినట్లు పేర్కొన్నారు. పనిగంటలు పెరిగినంత మాత్రమే ఉత్పాతకత పెరుగుతుందనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఇది ఉద్యోగిపై ఒత్తిడిని పెంచడమే కాకుండా.. మానసికంగా కృంగదీస్తుంది. కుటుంబాలకు సైతం దూరం చేస్తుందని అన్నారు.

ఛాయిస్, హార్డ్‌వర్క్, ఆనందం పేరుతో ట్వీట్ చేస్తూ.. రాధికా గుప్తా ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పనిగంటలపై పెద్ద డెబిట్ జరుగుతోంది. కాబట్టి ఈ అంశం మీద ట్వీట్ చేయాలా? వద్దా? అని ఆలోచించాను. అయితే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే అంశం మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.

కష్టపడి పనిచేయడం ముఖ్యం. నేను దానిని నేర్చుకున్నాను. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడిపని చేయడం అని నమ్ముతున్నాను. కష్టపడి పనిచేసే వ్యక్తి వేగంగా ఎదుగుతాడని కూడా నేను నమ్ముతానని అన్నారు.

ఇక పని గంటల విషయానికి వస్తే.. నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజుల్లో, మొదటి ప్రాజెక్ట్‌లో నెలకు వారానికి 100 గంటలు, రోజుకు 18 గంటలు పని చేశాను. పని ఒత్తిడి తట్టుకోలేక ఆఫీసు బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. కొన్ని సార్లు తెల్లవారుజామున 2 గంటలకు తినేదాన్ని. ఈ కారణంగానే రెండు సార్లు ఆసుపత్రిలో చేరాను. బ్యాంకింగ్, కన్సల్టింగ్ మొదలైన రంగాలలో ఉద్యోగాలు చేసే నా స్నేహితులు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.

ఎక్కువ గంటలు పనిచేసినంత మాత్రాన.. ఎక్కువ ఉత్పాదకత ఉండదు. ఉన్న సమయంలో ఎంత సమర్ధవంతంగా పనిచేశామన్నదే ముఖ్యం అని రాధికా గుప్తా పేర్కొన్నారు. పని గంటలు ఎక్కువైతే.. ఆందోళన, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతూ.. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఇబ్బందులను కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో ఉద్యోగులు రోజుకు గరిష్టంగా 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. అయితే ఆ సమయంలో ఉత్పాదకత ఉండేలా చూసుకుంటారు. కాబట్టి సమయానికి ఆఫీసుకు రండి, చేయాల్సిన పనిని పూర్తి చేయండి. అవసరమైన సమావేశాలను మాత్రమే నిర్వహించండి, టెక్నాలజీని కావలసిన విధంగా ఉపయోగించుకోండని రాధికా గుప్తా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక రిపోర్ట్: వేలాది ఉద్యోగులు బయటకు

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి మనమందరం దోహదపడాలి. కానీ మనం అలా చేస్తున్నప్పుడు, ఆ అభివృద్ధి ఫలాలను ఆస్వాదించడానికి కూడా మనం ప్రయత్నించాలి. పని చేస్తూనే కుటుంబాలతో కలిసి ఉండటం.. పిల్లలకు మెరుగైన జీవితాలను అందించడం వంటి వాటి మీద కూడా దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.

నేను ఎంతోమంది యువతను.. ముఖ్యంగా మహిళలకు కలుస్తుంటాను. కుటుంబం & కెరీర్ కలిసి ఉండలేవనే భయం కారణంగా తమకు కుటుంబం ఉండాలా వద్దా అని వారు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను చాలా భయపెడుతుంది. అయితే ప్రతి ఒక్కరూ.. వికసిత్ భారత్ కల సాకారానికి దోహదపడుతూనే.. పని - జీవితంతో సంతోషాన్ని ఆస్వాదించాలని రాధికా గుప్తా స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement