భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. ఇందులో 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఏకంగా 5,370 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది.
మొదటి రెండు త్రైమాసికాల్లో ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్న టీసీఎస్.. మూడో త్రైమాసికంలో మాత్రం వేలాదిమందిని బయటకు పంపిది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య మొత్తం 6,07,354కు చేరింది. కరోనా మహమ్మారి తరువాత దాదాపు అన్ని కంపెనీలు కోలుకున్నాయి. దీంతో కొన్ని సంస్థలు కొత్త ఉద్యోగులను కూడా తీసుకోవడం మొదలుపెట్టాయి.
ఈ త్రైమాసికంలో 25,000 మంది అసోసియేట్‌లను ప్రమోట్ చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రమోషన్‌ల సంఖ్య 1,10,000 కంటే ఎక్కువకు చేరిందని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు. అంతే కాకుండా.. మేము ఉద్యోగి నైపుణ్యం, శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తామని.. వచ్చే ఏడాది అధిక సంఖ్యలో క్యాంపస్ నియామకాలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
వచ్చే ఏడాది 40,000 ఉద్యోగాలు
2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్‌మెంట్స్ ఉంటాయని.. వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ (Milind Lakkad) అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం.
19 ఏళ్లలో ఇదే మొదటిసారి
డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల వలసలు 13 శాతం పెరిగింది. అంతకు ముందు ఇది 12.3 శాతంగా ఉంది. ముంబై (Mumbai) కేంద్రంగా సేవలందిస్తున్న టీసీఎస్ కంపెనీ 2004లో మార్కెట్లోకి లిస్ట్ అయింది. అప్పటి నుంచి (19 సంవత్సరాల్లో) సంస్థలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడం ఇదే మొదటిసారి. 2023లో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 22,600 పెంచుకుంది. అంతకు ముందు 2022లో 1.03 లక్షల ఉద్యోగులను చేర్చుకుంది.
టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.
పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ.. భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ (K Krithivasan) పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment