counterfeiting
-
కల్తీ కల్లోలం!
సాక్షి, హైదరాబాద్: ఇందుగలదు అందులేదన్న సందేహమే లేదన్నట్టుగా.. నిత్యావసర సరుకుల్లో దేనిలో చూసినా కల్తీలు, నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, మసాలాలు, నూనెలు వంటివి విపరీతంగా కల్తీ అవుతున్నాయి. గ్రేటర్ నగరంలో ఉద్యోగాలు, పని ఒత్తిడితో రెడీమేడ్ సరుకులు కొనేవారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని కల్తీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. చెడిపోయిన, కుళ్లిపోయిన పదార్థాలను వాడటంతోపాటు వివిధ రకాల రసాయనాలు, ప్రమాదకర పదార్థాలు కలిపి కల్తీ దినుసులను మార్కెట్లోకి వదులుతున్నాయి. టాస్‌్కఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్న ప్రతిసారి భారీ మొత్తంలో ఇలాంటి నకిలీ, కల్తీ సరుకులు పట్టుబడుతూనే ఉన్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ప్రమాదకర పదార్థాలతో..⇒ కల్తీ ముఠాలు.. దినుసుల్లో కలుపుతున్న పదార్థాలు భయపెడుతున్నాయి. జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో తయారైన మంచి నూనె.. రంపపు పొడి, బోరిక్ పౌడర్లు కలిపిన మసాలా పౌడర్లు.. ప్రమాదకర రసాయనాలు కలిపిన మసాలాల విక్రయం సర్వసాధారణంగా మారింది. ⇒ రాతిపొడి, పెయింట్ స్టెయినర్, మైదా పిండి వంటివి కలిపి నకిలీ గసగసాలు తయారు చేస్తున్నారు. ⇒అంతేకాదు పలు దినుసులలో సింథటిక్ పెయింట్లు కలుపుతున్నట్టు అధికారుల దాడుల్లో తేలింది. ఆ పెయింట్లలో ఉండే సీసం విషపూరితమని, రక్తంలో హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుందని... బరువు తగ్గడం, మలబద్ధకం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఆ పేస్ట్.. వరస్ట్..కల్తీ లేకుండా దొరకాలంటే భూతద్దం పెట్టి వెతకాలేమో అనేలా మారిపోయిన సరుకుల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. మార్కెట్లో లభించే అత్యధిక అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీదే. నాసిరకం అల్లం, వెల్లుల్లిలను వాడటమేకాదు.. ఉల్లి, దుంపలు, ఇతర పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఈ మిశ్రమం డయేరియా, ఉదరకోశ వ్యాధులకు కారణమవుతోంది. అలాగే వీటిలో కలిపే సింథటిక్ పౌడర్,గమ్ పౌడర్లు కూడా ప్రమాదకరం.⇒ఇటీవల ఉప్పర్‌పల్లిలో ఓ గోడౌన్ మీద దాడి చేసిన పోలీసులు.. ఏకంగా 4 టన్నుల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఖమ్మంలోని ప్రకాశ్‌నగర్‌లో 5 క్వింటాళ్ల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను, యాదాద్రి జిల్లా బీబీనగర్ పరిధిలోనూ కల్తీ అల్లం పేస్ట్‌ను పోలీసులు పట్టుకున్నారు. పేస్ట్ చిక్కగా ఉండేందుకు వీరు సింథటిక్ పౌడర్, గమ్ పౌడర్ వంటి ప్రమాదకర పదార్థాలను కలిపినట్టు గుర్తించారు.⇒ ఈ ఏడాది మే నెలలో కాటేదాన్‌లోని ఓ పరిశ్రమపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి.. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితోపాటు ప్రమాదకర రసాయనాలు కలిపిన అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు.⇒ పహాడీ షరీఫ్‌లో చెక్కపొడి,ఎండుటాకులు, కృత్రిమ రంగులను కలిపి కల్తీ గరం మసాలా తయారీ చేస్తూ, ప్రముఖ కంపెనీల లేబుళ్లతో విక్రయిస్తున్నవారిని అరెస్ట్ చేశారు. ⇒ నకిలీ మసాలా ఉత్పత్తులను విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్ వాసిని నగరంలోని బేగంబజార్‌లో నిర్వహించిన దాడుల్లో పట్టుకున్నారు.ఆయిల్.. అనారోగ్యం ఫుల్అత్యధికంగా కల్తీ అవుతున్న సరుకుల్లో వంట నూనెలు కూడా ఒకటి. సన్‌ఫ్లవర్, పామాయిల్ వంటి ఎక్కువగా వాడే నూనెలను.. జంతు కళేబరాల నుంచి తీసిన కొవ్వులతో కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఈ కల్తీ నూనెల వల్ల కంటి జబ్బులు, గుండె జబ్బులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ⇒ నగరంలో విషపూరిత రసాయనాలతో కల్తీ చేసిన మసాలాలు భారీగా పట్టుబడ్డాయి. బొప్పాయి గింజలకు సింథటిక్ గమ్, ఐరన్ ఆక్సైడ్, మైదా పిండి, కొన్ని రసాయనాలు కలిపి మిరియాలుగా విక్రయిస్తున్నారు.ఆరోగ్యానికి అప‘కారం’జనం ఒకప్పుడు ఎండు మిరపకాయలను కొని పొడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు మార్కెట్లో నేరుగా కారంపొడి కొనుగోలు చేస్తున్నారు. ఈ కారంపొడి విపరీతంగా కల్తీ అవుతోంది. ఇటుక పొడి, పాడైన మిరియాలు, సున్నపు పొడి వంటి పదార్థాలను కలుపుతున్నారు. కారంపొడి ఎర్రగా కనిపించేందుకు ‘సుడాన్ డై’ అనే రసాయనాన్ని కలుపుతున్నారు. ఇది కేన్సర్ కారకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. కారంపొడిలో కలిసే కల్తీలతో డయేరియా, ఇతర అనారోగ్య సమస్యలూ వస్తాయని చెప్తున్నారు.కల్తీని తెలుసుకోవడం ఎలా.. నకిలీ, కల్తీ సరుకుల విషయంలో మోసపోకుండా, వాటిని గుర్తించేందుకు ఏం చేయాలన్న దానిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తరచూ పలు సూచనలు చేస్తూ ఉంటుంది. వాటిని పాటిస్తే కల్తీల నుంచి మనం బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు. వీలైనంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాల వంటివి ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు అని స్పష్టం చేస్తున్నారు.ఉదాహరణకు కారంపొడిని తీసుకుంటే.. ‘ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని, అందులో ఒక చెంచాడు కారంపొడి వేయాలి. నీళ్లన్నీ రంగు కలిపినట్టుగా ఎర్రగా అయితే అది కల్తీయే. గ్లాసులో అడుగుకు చేరిన కారం పొడిని చేతిలోకి తీసుకుని రుద్ది చూడాలి. గరుకుగా అనిపిస్తే ఇటుక పొడి కలిసి ఉందని అర్థం. కారంపొడి నీళ్లు సబ్బులా మృదువుగా అనిపిస్తే.. అందులో డిటర్జెంట్, యూరియా వంటివి కలిసి ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు.కల్తీల నిరోధానికి చట్టం ఉన్నా.. ఆహార పదార్థాల కల్తీని నిరోధించేందుకు, కల్తీకి పాల్పడినవారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం ఉంది.కల్తీలు, నకిలీలకు పాల్పడినవారికి గరిష్టంగా ఆరు నెలల జైలుశిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. కానీ అది సరిగా అమలుకాని పరిస్థితి. దాడుల్లో కల్తీ, నకిలీ ఉత్పత్తులను పట్టుకుంటున్న అధికారులు.. గట్టి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
నకిలీ మందుల తయారీదారులపై దాడులు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మందుల తయారీ కేంద్రం గుట్టుర ట్టు చేసేందుకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ), హైదరాబాద్ సీపీ టాస్‌్కఫోర్స్ బృందం అధికారులు కలిసి ‘ఆపరేషన్ జై’పేరిట అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ పేరిట ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు పక్కా ఆధారాలు సేకరించారు. దాడిలో మొత్తం రూ.44.33 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ జైకు సంబంధించిన వివరాలను డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మలక్‌పేట్‌లో లింకులు ఉత్తరాఖండ్ వరకు.. నకిలీ మందుల విక్రయానికి సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు డీసీఏ అధికారులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది మలక్‌పేట్‌లోని ఓ మెడికల్ దుకాణంలో ఫిబ్రవరి 27న సోదాలు చేపట్టగా రూ.7.34 లక్షల విలువైన ఎంపీఓడీ–200 ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. ఈ నకిలీ మందులను విక్రయిస్తున్న అర్వపల్లి సత్యనారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మీర్‌పేట్‌కు చెందిన గాండ్ల రాములు నుంచి తాను ఈ నకిలీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసినట్టు అతను అంగీకరించాడు. ఈ సమాచారంతో డీసీఏ అధికారులు గాండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌కు చెందిన విషాద్ కుమార్, సచిన్ కుమార్ల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. సచిన్ కుమార్, విషాద్ కుమార్‌లు వాట్సప్ కాల్స్ ద్వారా తన నుంచి ఆర్డర్లు తీసుకుని ఉత్తరాఖండ్ నుంచి మందులను పంపుతున్నట్టు పేర్కొన్నాడు. ఈ సమాచారం మేరకు డీసీఏ, టాస్‌్కఫోర్స్ అధికారులు ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్ హెర్బ్స్ అండ్ డ్రగ్స్ సంస్థలో ఫిబ్రవరి 29న డీసీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సచిన్ కుమార్ నకిలీ ట్యాబ్లెట్లను తయారు చేసి, వివిధ కంపెనీల లేబుల్స్ అతికించి లక్ష నకిలీ ట్యాబ్లెట్లను రూ.35 వేలకు విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఆ సంస్థనుంచి మొత్తం రూ. 44.33 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. -
Tea Powder: అరే ఏంట్రా ఇది.. టీ పౌడర్ని కూడా వదలరా..?
నిర్మా పౌడర్.. జీడి తొక్కల పొట్టు.. సుద్ద మట్టి.. రంపపు పొట్టు.. కాదేదీ టీ పొడి తయారీకి అనర్హం అన్నట్టుగా ఉంది టీ పొడి తయారీ కేంద్రాల్లో పరిస్థితి. తేయాకుతో తయారు చేయాల్సిన టీ పొడిని.. ప్రజల ఆరోగ్యానికి తూట్లు ‘పొడి’చేలా తయారు చేస్తూ సొమ్ములు చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. లూజ్ టీ పొడి పేరుతో గలీజు వ్యాపారాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో టీస్టాల్ నిర్వాహకులు, పేదలు వీటిని వినియోగిస్తూ తమ గొంతుల్లో గరళాన్ని నింపుకొంటున్నారు. సాక్షి, మండపేట: ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్.. ఏ ఛాయ్ ఖరీదులో చీపురా భాయ్.., ఈ ఛాయ్ ఖుషీలనే చూపురా భాయ్.., ఏ ఛాయ్ గరీబుకు విందురా భాయ్.. అంటూ ఓ సినీ కవి ఛాయ్(టీ) గొప్పదనాన్ని ఎంతో బాగా వివరించారు. నిజమే.. ఎందుకంటే చాలా మందికి వేడివేడి టీ తాగనిదే పొద్దు గడవదు.. నిత్యజీవితంలో భాగమైన ఈ టీ అమ్మకాల ద్వారా ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. మరోవైపు టీకి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని లూజ్ టీపొడి మాటున కల్తీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు కొందరు. కల్తీ టీ పొడి తయారీకి వినియోగిస్తున్న సుద్దమట్టి జిల్లాలో లైసెన్సుడ్ టీపొడి తయారీ కేంద్రాలు రాజమహేంద్రవరం, మండపేట తదితర చోట్ల కేవలం 11 మాత్రమే ఉన్నాయి. వీరు కేరళ, అస్సాం, కోల్‌కతా నుంచి లూజ్ టీ పొడి తీసుకువచ్చి వాటిని 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు తదితర కేటగిరీలుగా ప్యాకింగ్ చేసి విక్రయాలు చేస్తుంటారు. అయితే ఏ విధమైన అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న అనధికార కేంద్రాలు కూడా జిల్లాలోని రాజమహేంద్రవరం, మండపేట, అనపర్తి, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ నకిలీ ముఠాలు స్థానిక అధికార యంత్రాంగానికి ముడుపులు ముట్టచెప్పుతుండడంతో వారు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలున్నాయి. చదవండి: (మార్కాపురం కోర్టుకు హీరో సుమంత్, సుప్రియ) కల్తీకి అడ్డదారులెన్నో.. రాజమహేంద్రవరంలో రూ.40 నుంచి రూ.50లకు లభ్యమయ్యే నాసిరకం లూజ్ టీపొడి తీసుకువచ్చి వాటిలో రంగు, రుచి, వాసన కోసం డిటర్జెంట్ పౌడర్, జీడిపిక్కల పొట్టు, చింతపిక్కల పొడి, రంపం పొట్టు, సుద్ద మట్టి, కెమికల్స్‌ను కలుపుతూ కల్తీ టీ పొడి తయారు చేస్తున్నారు. బ్రాండెడ్ టీ పొడి కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉండగా ఈ లూజ్ టీ పొడి కేవలం రూ.150కు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకే లభ్యమవుతుండటంతో టీ స్టాళ్లు, పేదవర్గాల వారు దీనినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, సైకిళ్లు, మోటారు సైకిళ్లపై కల్తీ టీపొడి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కల్తీ టీ పొడి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు జిల్లా నుంచి వ్యాపారులు లూజ్ టీ పొడి తయారు చేసి ఎగుమతులు చేస్తున్నారు. దీని నాణ్యతపై అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఇటీవల బిక్కవోలు మండలం ఆర్ఎస్ పేటలో ఫుడ్ సేఫ్టీ, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో విస్మయం కలిగించే విషయాలు వెలుగుచూశాయి. ప్రజారోగ్యానికి చేటు చేసే కెమికల్స్, డిటర్జెంట్స్‌తో నాలుగేళ్లుగా కల్తీ టీపొడి తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు. పలు లైసెన్సుడ్ కేంద్రాల్లోనూ టీ పొడిలో రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్నారు. చదవండి: (బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లోనే ఎక్కువ!) ఆరోగ్యానికి చేటు ప్రమాదకర కెమికల్స్‌ను కలపడం వలన కల్తీ టీపొడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్సర్, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందంటున్నారు. కల్తీ టీ పొడికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. కేసుల నమోదు ఆహార పదార్థాల్లో కల్తీలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కల్తీ టీ పొడి తయారీపై ఏడాది కాలంలో జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేశాం. ఎక్కడైనా ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతున్నాం. కల్తీ ఉన్నట్టు నిర్ధారణ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – బి. శ్రీనివాస్, సహాయ నియంత్రణ అధికారి, కాకినాడ కల్తీని ఇలా గుర్తించవచ్చు టీ పొడి కల్తీ జరిగింది లేనిది సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు అంటున్నారు. కొంత టీ పొడిని తీసుకుని గాజు గ్లాసులోని నీటిలో వేసినప్పుడు కల్తీ జరిగితే రంగు కిందికి చేరుతుందని, రంగు దిగలేదంటే కల్తీ జరగలేనట్టుగా గుర్తింవచ్చని సూచిస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ల అక్రమాలపై కొరడా
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ లోతైన విచారణ జరుపుతోంది. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ముమ్మర తనిఖీలు చేయిస్తోంది. నకిలీ చలానాల వ్యవహారంలో 16 మంది సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) కీలకపాత్ర పోషించినా సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం కూడా ఉండవచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వారి సహకారం ఉండటం వల్లే డాక్యుమెంట్ రైటర్లు ఇంత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. మరో 10 మందిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. వారిలోనూ కొందరిని విధుల నుంచి తప్పించారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ అక్రమాలపై ఆయా కార్యాలయాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి 10 కేసులు నమోదు చేయించారు. మరికొంత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనుమానం ఉన్న కార్యాలయాల్లో నాలుగు రోజుల్లో మొత్తంగా 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన వాటిలో 30 వేల చలానాల విషయంలో తేడాలున్నట్టు గుర్తించారు. రికవరీపై దృష్టి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.5.42 కోట్లు కోల్పోవడంతో దాన్ని తిరిగి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే రూ.1.37 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తేడా వచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్ రైటర్, రిజిస్టర్ చేయించుకున్న యజమానులతో మాట్లాడి ఈ సొమ్ము తిరిగి కట్టించుకుంటున్నారు. ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్లే యజమానులకు తెలియకుండా చలానాల ద్వారా ఈ అక్రమాలు చేసినట్టు తేలింది. అందుకే వారినుంచి తిరిగి సొమ్ము రికవరీ చేయడంతోపాటు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ అక్రమాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయనే అంశంపైనా దృష్టి సారించారు. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇది బయటపడినా ఎక్కువగా అక్రమాలు జరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో కావడంతో అక్కడ రిజిస్టరైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు కమిషనర్ అండ్ ఐజీ కార్యాలయంలో అదనపు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతోంది: ధర్మాన రిజిస్ట్రేషన్ల శాఖలో తప్పుడు చలానాలపై విచారణ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పు చేసినట్టు తేలిన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకుంటామన్నారు. చలానాల చెల్లింపులపై అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. మొదట ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పామని తెలిపారు. తర్వాత 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లపై నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అక్రమాలు ఇక అసాధ్యం రజత్ భార్గవ చలానాలతో అక్రమాలకు పాల్పడటం ఇకపై సాధ్యం కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన వెంటనే సంబంధిత వ్యవస్థను మార్పు చేసినట్టు తెలిపారు. విజయవాడలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎఫ్ఎంఎస్కు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను అనుసంధానం చేశామని తెలిపారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల కోసం తీసిన చలానాలపై ఆధారపడకుండా అవి రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో (కార్డ్ సిస్టమ్) కనబడతాయని తెలిపారు. తద్వారా డాక్యుమెంట్ విలువ ప్రకారం చలానా ఉందో లేదో తెలుస్తుందని, అప్పుడే డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందని వివరించారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతోపాటు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారు కూడా వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరు తప్పు ఉంటే వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నామన్నారు. -
వీటిపై 71 వేల ఫిర్యాదులు అందాయి: గూగుల్
న్యూఢిల్లీ: మే, జూన్ నెలల్లో భారతీయ వినియోగదారుల నుంచి 71,148 ఫిర్యాదులు అందినట్లు గూగుల్ శుక్రవారం వెల్లడించింది. ఆయా ఫిర్యాదుల ఆధారంగా సమాచారంలోని 1.54 లక్షల భాగాలను తొలగించినట్లు తెలిపింది. అందులోనూ జూన్ నెలలోనే 36,265 ఫిర్యాదులు అందాయని, వాటి కారణంగా 83,613 తొలగింపు చర్యలను చేపట్టినట్లు పేర్కొంది. వీటితో పాటు తమ ప్లాట్‌ఫామ్‌లోని ఆటోమేటెడ్ డిటెక్షన్ పద్ధతి ద్వారా 11.6 లక్షల సమాచార భాగాలను తొలగించినట్లు తెలిపింది. తొలగింపునకు గురైన సమాచారంలో కాపీరైట్ (70,365), ట్రేడ్ మార్క్ (753), కౌంటర్ఫీట్ (5), లీగల్ (4) వ్యవహారాలు ఉన్నాయని గూగుల్ చెప్పింది. -
కరోనాపై పోరాటంలో కొత్త సవాల్
ఇది కూడా ఒక రకమైన వైరస్సే. ఊడలు విప్పిన అవినీతి వైరస్. అక్రమంగా డబ్బు సంపాదనకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్వార్థం. కరోనాపై పోరాటంలో అవినీతి అడుగడుగునా సవాల్ విసురుతోంది. మాస్కులు నకిలీ, పీపీఈ కిట్లు నకిలీ, శానిటైజర్లు నకిలీ, రెమిడెసివిర్ నకిలీ, బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లు నకిలీ.. ఇప్పుడు ఈ నకిలీల జాబితాలో వ్యాక్సిన్ చేరింది. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాం. ఒకేరోజు 88 లక్షల టీకా డోసులు ఇచ్చి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించాం. అదే సమయంలో నకిలీ టీకాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల ముంబైలో కాందివలిలో టీకా డ్రైవ్ నకిలీదని తేలడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. తృణమూల్ పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తికే బురిడీ కొట్టించి నకిలీ వ్యాక్సిన్ ఇవ్వడం కలకలం రేగుతోంది. ముంబైలో పలుచోట్ల ప్రైవేటుగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాల్లో 2 వేల మందికి పైగా నకిలీ టీకా డోసులు తీసుకోవడం ఆందోళనను పెంచుతోంది. ఎంపీకే బురిడీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తిని కూడా కేటుగాళ్లు మాయ చేశారు. ఐఏఎస్ అధికారిగా చెప్పుకున్న ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు టీకా కార్యక్రమం ఉందని ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ శిబిరానికి హాజరైన ఆమె ప్రజల్లో వ్యాక్సిన్ తీసుకోవాలన్న చైతన్యాన్ని నింపడానికి తాను స్వయంగా కోవిషీల్డ్ టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ ఇచ్చిన సమయంలో ఆధార్ వివరాలు అడగకపోవడం, ఆ తర్వాత కోవిన్ నుంచి మెసేజ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ వ్యాక్సిన్ గుట్టు రట్టయింది. ఈ క్యాంప్‌లో 250 మంది వరకు వ్యాక్సిన్ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. నకిలీకి చైనాయే కేంద్రం నకిలీ టీకాలకూ చైనాయే కేంద్రంగా ఉంది. చైనా, దక్షిణాఫ్రికా, యూకేలలో ఈ నకిలీ వ్యాక్సిన్లు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. సెలైన్, మినరల్ వాటర్‌తో ఈ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు. యూకేలో గత ఏడాది నవంబర్‌లో 20 మంది నకిలీ విక్రేతలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 1,200 మందిపైగా విక్రేతలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొడక్ట్ వల్నర్‌బులిటీ రీసెర్చ్ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రభుత్వాల కళ్లు గప్పి అ మ్మేస్తున్న ఎన్నో సంస్థలపై ఇటీవల ఇంటర్‌పోల్ కొ రడా ఝళిపించింది. లక్షకిపైగా ఆన్లైన్ ఫార్మసీ సంస్థలను మూసివేసింది. 2 కోట్ల డాలర్ల విలువైన నకిలీ వ్యాక్సిన్‌కి సంబంధించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది. అడ్డుకట్ట ఎలా? ఈ నకిలీ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్లో జరిగిపోతూ ఉండడంతో వాటిని కనిపెట్టడం కష్టంగా మారింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా అసలేదో, నకిలీ ఏదో గుర్తించే అవకాశం ఉంది. కానీ నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అందుకే వ్యాక్సినేషన్ పంపిణీకి ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేస్తే నకిలీల బెడద అరికట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ వ్యాక్సిన్లే కాకుండా కోవిడ్‌పై పోరాటంలో భాగంగా వాడే వస్తువులైన మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు వంటివాటిలో నకిలీవి గుర్తించడానికి ప్రభుత్వాలే ప్రజల్లో అవగాహన పెంచాలి. వీటిని తయారు చేసే కంపెనీలు కూడా ఒరిజినల్ ఉత్పత్తులకు సంబం« దించిన డిజైన్లను మారుస్తూ ప్రచారం కల్పించాలి. ప్రభుత్వ టీకా కేంద్రాలకు వెళ్లే టీకా డోసులు వేసుకోండి. వెబ్సైట్లలోనూ, ఫోన్లలోనూ వచ్చే సమాచారాన్ని చూసి టీకాలు తీసుకోవద్దు. వ్యాక్సిన్ డిమాండ్‌కి తగ్గట్టుగా ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోతున్నాయి. అందుకే నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. – డబ్ల్యూహెచ్‌వో చీఫ్ ఘెబ్రెయాసస్ -
భీమవరంలో నకిలీ మందుల కలకలం
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నకిలీ మందుల గుట్టు రట్టయింది. మాత్రల్లో ఎలాంటి మందు లేకుండా అమ్ముతుండటం కలకలం రేపుతోంది. ఇలాంటి నకిలీ మందులు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని షాపుల్లో ఉన్నాయి, వాటిని తయారు చేసే కంపెనీలు ఎన్ని ఉన్నాయన్న దానిపై ఔషధ నియంత్రణ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే భీమవరానికి రెండు బృందాలను పంపి విచారణ జరిపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం ఓ మెడికల్ షాపులో అక్కడి డ్రగ్ ఇన్స్పెక్టర్ కొన్ని అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లను సేకరించి పరీక్షల నిమిత్తం విజయవాడలోని డ్రగ్ ల్యాబొరేటరీకి పంపించారు. వీటిని ఇక్కడ పరిశీలించగా.. 500 ఎంజీ అజిత్రోమైసిన్‌లో కనీసం 10 శాతం కూడా మందు లేనట్టు వెల్లడైంది. సుమారు 8 బ్యాచ్‌ల మందులను పరిశీలించగా అన్ని మందులూ ఇలాగే ఉన్నట్టు తేలింది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ కంపెనీ ఈ మందులను తయారు చేసినట్టు గుర్తించారు. బ్యాచ్ నంబర్లు, తయారీ తేదీ వంటివన్నీ మల్టీనేషనల్ కంపెనీ స్థాయిలో ముద్రించి ఉండటంతో సాధారణంగానే జనం కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందులను పరిశీలిస్తే మాత్రం సుద్ద బిళ్లలుగా తేలింది. అసలు ఉత్తరాఖండ్‌లో అలాంటి కంపెనీ ఉందా, రాష్ట్రంలోనే ఎక్కడైనా తయారు చేస్తున్నారా, మందుల దుకాణదారు వాటిని ఎక్కడ కొన్నారు, అవి ఇంకా ఎక్కడైనా అమ్ముడవుతున్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టారు. దగ్గు తగ్గేందుకు అజిత్రోమైసిన్ మాత్రలు వాడతారు. వీటిని వేసుకోవడం వల్ల దగ్గు తగ్గకపోగా మరేదైనా సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఔషధ నియంత్రణ శాఖ సంచాలకులు ఎంబీఆర్ ప్రసాద్ చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరిన్ని నమూనాలను ల్యాబొరేటరీలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకూ నరసరావుపేట నకిలీ మందులకు అడ్డాగా ఉండేది. ఇప్పుడు భీమవరంలోనూ ఈ మందులు బయటపడటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. -
‘నకిలీ’ గుట్టు రట్టు
ఇల్లెందు: ఇల్లెందు పట్టణంలో బుధవారం టాస్క్‌ఫోర్స్ అధికారులు నకిలీ పురుగుమందులను పట్టుకున్నారు. ఏడీఏ వాసవి రాణి కథనం ప్రకారం.. పట్టణంలోని జగదాంబసెంటర్‌లో ఉన్న సునీత ట్రేడర్స్ దుకాణం యజమాని ఆకుల నాగేశ్వరరావు కొందరు వ్యక్తులతో కొంతకాలంగా నకిలీ పురుగు మందుల తయారు చేయిస్తున్నాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో బుధవారం వ్యవసాయశాఖ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నకిలీ పురుగుల మందు తయారీ చేస్తున్న వారిని పట్టుకున్నారు. ఆ ఇంటిని సీజ్ చేశారు. సుమారు రూ.8.40 లక్షల విలువైన పురుగు మందులను స్వాధీ నం చేసుకున్నారు. అనంతరం సూత్రధారి అయిన నాగేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ డీలర్ నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం షాపును సీజ్ చేస్తామన్నారు. పట్టుబడింది ఆరుగురు.. ఫిర్యాదు ఒక్కరిపైనే.. అధికారులు తనిఖీలకు వచ్చినప్పడు నకిలీ పురుగుల మందు తయారీ ప్రదేశం వద్ద ఆరుగురు ఉన్నారు. నాగేశ్వరరావు, అతని కుమారుడు సాయి, గుమస్తా అల్తాఫ్‌తోపాటు మరో ముగ్గురు గుమస్తాలు ఉన్నారు. ఈ విషయాన్ని పోలీసులు కూడా గుర్తించారు. కానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఒక్క నాగేశ్వరరావు పేరు మాత్రమే పేర్కొనడంతో వ్యవసాయాధికారులపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాగేశ్వరరావు కొత్తగూడెంలో కూడా నకిలీ పురుగు మందులు తయారు చేయిస్తున్నాడని, అక్కడి నుంచి ఇల్లెందుకు సరుకు తెస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. నకిలీ పురుగుమందులను బయో కెమికల్స్ పేరుతో గ్రామాల్లో రైతులకు అంటగట్టి మోసం చేస్తున్నాడని పలువురు ఆరోపిస్తున్నారు. -
నకిలీలతో బెంబేలు
170 ఎకరాల్లో నకిలీ విత్తనాల మిర్చిసాగు లబోదిబోమంటున్న రైతులు మిర్చితోటలను పరిశీలించిన వ్యవసాయాధికారిణి నకిలీ మిర్చి విత్తనాలతో మండల రైతులు బెంబేలెత్తుతున్నారు. 170 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు నష్టాలపాలయ్యారు. విత్తనాలను అట్టగట్టిన డీలర్లను దుమ్మెత్తి పోస్తున్నారు. నర్సరీల్లో పెంచిన మిర్చి నారు కూడా నలికీ కావటం ఏమిటని లబోదిబోమంటున్నారు. అధికారులే తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు. బోనకల్ : నకిలీ మిర్చి విత్తనాలు అని తెలియక నారు పెంచి మిర్చి తోటలను సాగు చేశారు కొందరు రైతులు. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలతో మిర్చితోటలను సాగు చేశారు మరికొందరు రైతులు. ఆ విత్తనం నకిలీవి అని తెలిసి ఏమి చేయాలో పాలుపోక అయోమయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు.. మండలంలోని రాయన్నపేట, చిరునోముల, లక్ష్మీపురం, చొప్పకట్లపాలెం, మోటమర్రి, తూటికుంట్ల గ్రామాల రైతులు. సీఎస్ 333ను సాగుచేసిన రైతులు నిండా మునిగిపోయారు. పంట సాగుచేసిన తరువాత ఆకులు ముడతబారి కాయ ముడుచుకొని పోవడంతోపాటు తోటకు పూర్తి స్థాయిలో వైరస్ సోకింది. భూమి లోపం వల్ల తమ పంటకు వైరస్ సోకిందని ఎవరికి వారే అనుకున్నారు. కానీ సీఎస్ 333 రకం సాగుచేసిన రైతులకు మాత్రమే ఈ విధంగా వైరస్ సోకడంతో విత్తన లోపం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు. ఎకరం సాగుచేయడానికి రూ.60 నుంచి 70వేల వరకు పెట్టుబడులు పెట్టామని, పంటకాలం రెండు నెలలు పూర్తయిందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయాధికారిణి సరితకు తెలియజేశారు. ఆమె శుక్రవారం గ్రామాల్లోని సాగు చేసిన మిర్చి తోటలను పరిశీలించారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు అంటకట్టిన నర్సరీలు, విత్తన షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో తమకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.