రాయన్నపేటలో వైరస్ సోకిన మిర్చి తోటను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారిణి సరిత
- 170 ఎకరాల్లో నకిలీ విత్తనాల మిర్చిసాగు
- లబోదిబోమంటున్న రైతులు
మిర్చితోటలను పరిశీలించిన వ్యవసాయాధికారిణి
నకిలీ మిర్చి విత్తనాలతో మండల రైతులు బెంబేలెత్తుతున్నారు. 170 ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు నష్టాలపాలయ్యారు. విత్తనాలను అట్టగట్టిన డీలర్లను దుమ్మెత్తి పోస్తున్నారు. నర్సరీల్లో పెంచిన మిర్చి నారు కూడా నలికీ కావటం ఏమిటని లబోదిబోమంటున్నారు. అధికారులే తమకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.
బోనకల్ :
నకిలీ మిర్చి విత్తనాలు అని తెలియక నారు పెంచి మిర్చి తోటలను సాగు చేశారు కొందరు రైతులు. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కలతో మిర్చితోటలను సాగు చేశారు మరికొందరు రైతులు. ఆ విత్తనం నకిలీవి అని తెలిసి ఏమి చేయాలో పాలుపోక అయోమయ స్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు.. మండలంలోని రాయన్నపేట, చిరునోముల, లక్ష్మీపురం, చొప్పకట్లపాలెం, మోటమర్రి, తూటికుంట్ల గ్రామాల రైతులు.
సీఎస్ 333ను సాగుచేసిన రైతులు నిండా మునిగిపోయారు. పంట సాగుచేసిన తరువాత ఆకులు ముడతబారి కాయ ముడుచుకొని పోవడంతోపాటు తోటకు పూర్తి స్థాయిలో వైరస్ సోకింది. భూమి లోపం వల్ల తమ పంటకు వైరస్ సోకిందని ఎవరికి వారే అనుకున్నారు. కానీ సీఎస్ 333 రకం సాగుచేసిన రైతులకు మాత్రమే ఈ విధంగా వైరస్ సోకడంతో విత్తన లోపం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు. ఎకరం సాగుచేయడానికి రూ.60 నుంచి 70వేల వరకు పెట్టుబడులు పెట్టామని, పంటకాలం రెండు నెలలు పూర్తయిందని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయాన్ని మండల వ్యవసాయాధికారిణి సరితకు తెలియజేశారు. ఆమె శుక్రవారం గ్రామాల్లోని సాగు చేసిన మిర్చి తోటలను పరిశీలించారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు అంటకట్టిన నర్సరీలు, విత్తన షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయిలో తమకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.