సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ లోతైన విచారణ జరుపుతోంది. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ముమ్మర తనిఖీలు చేయిస్తోంది. నకిలీ చలానాల వ్యవహారంలో 16 మంది సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ వ్యవహారంలో దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) కీలకపాత్ర పోషించినా సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం కూడా ఉండవచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వారి సహకారం ఉండటం వల్లే డాక్యుమెంట్ రైటర్లు ఇంత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. మరో 10 మందిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.
వారిలోనూ కొందరిని విధుల నుంచి తప్పించారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ అక్రమాలపై ఆయా కార్యాలయాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి 10 కేసులు నమోదు చేయించారు. మరికొంత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనుమానం ఉన్న కార్యాలయాల్లో నాలుగు రోజుల్లో మొత్తంగా 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన వాటిలో 30 వేల చలానాల విషయంలో తేడాలున్నట్టు గుర్తించారు.
రికవరీపై దృష్టి
రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.5.42 కోట్లు కోల్పోవడంతో దాన్ని తిరిగి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే రూ.1.37 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తేడా వచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్ రైటర్, రిజిస్టర్ చేయించుకున్న యజమానులతో మాట్లాడి ఈ సొమ్ము తిరిగి కట్టించుకుంటున్నారు. ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్లే యజమానులకు తెలియకుండా చలానాల ద్వారా ఈ అక్రమాలు చేసినట్టు తేలింది.
అందుకే వారినుంచి తిరిగి సొమ్ము రికవరీ చేయడంతోపాటు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ అక్రమాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయనే అంశంపైనా దృష్టి సారించారు. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇది బయటపడినా ఎక్కువగా అక్రమాలు జరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో కావడంతో అక్కడ రిజిస్టరైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు కమిషనర్ అండ్ ఐజీ కార్యాలయంలో అదనపు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు.
విచారణ కొనసాగుతోంది: ధర్మాన
రిజిస్ట్రేషన్ల శాఖలో తప్పుడు చలానాలపై విచారణ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పు చేసినట్టు తేలిన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకుంటామన్నారు. చలానాల చెల్లింపులపై అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. మొదట ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పామని తెలిపారు. తర్వాత 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లపై నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు.
అక్రమాలు ఇక అసాధ్యం రజత్ భార్గవ
చలానాలతో అక్రమాలకు పాల్పడటం ఇకపై సాధ్యం కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన వెంటనే సంబంధిత వ్యవస్థను మార్పు చేసినట్టు తెలిపారు. విజయవాడలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎఫ్‌ఎంఎస్‌కు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను అనుసంధానం చేశామని తెలిపారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల కోసం తీసిన చలానాలపై ఆధారపడకుండా అవి రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో (కార్డ్ సిస్టమ్) కనబడతాయని తెలిపారు. తద్వారా డాక్యుమెంట్ విలువ ప్రకారం చలానా ఉందో లేదో తెలుస్తుందని, అప్పుడే డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందని వివరించారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతోపాటు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారు కూడా వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరు తప్పు ఉంటే వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment