sub-registrar office
-
రిజిస్ట్రేషన్ల అక్రమాలపై కొరడా
సాక్షి, అమరావతి: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటుచేసుకున్న నకిలీ చలానాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రేషన్ల శాఖ లోతైన విచారణ జరుపుతోంది. ప్రభుత్వం నష్టపోయిన సొమ్మును పూర్తిగా రికవరీ చేయాలని, అవినీతికి ఆస్కారం లేకుండా, భవిష్యత్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించడంతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి ముమ్మర తనిఖీలు చేయిస్తోంది. నకిలీ చలానాల వ్యవహారంలో 16 మంది సబ్ రిజిస్ట్రార్ల పాత్ర ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో దస్తావేజు లేఖరులు (డాక్యుమెంట్ రైటర్లు) కీలకపాత్ర పోషించినా సబ్ రిజిస్ట్రార్ల ప్రమేయం కూడా ఉండవచ్చని ఉన్నతాధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేసే వారి సహకారం ఉండటం వల్లే డాక్యుమెంట్ రైటర్లు ఇంత భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారు. మరో 10 మందిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. వారిలోనూ కొందరిని విధుల నుంచి తప్పించారు. వారిపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ అక్రమాలపై ఆయా కార్యాలయాల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి 10 కేసులు నమోదు చేయించారు. మరికొంత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. మొత్తం 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు బయటపడ్డాయి. వీటితోపాటు అనుమానం ఉన్న కార్యాలయాల్లో నాలుగు రోజుల్లో మొత్తంగా 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను తనిఖీ చేశారు. తనిఖీ చేసిన వాటిలో 30 వేల చలానాల విషయంలో తేడాలున్నట్టు గుర్తించారు. రికవరీపై దృష్టి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రూ.5.42 కోట్లు కోల్పోవడంతో దాన్ని తిరిగి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే రూ.1.37 కోట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన మొత్తాన్ని రెండు, మూడు రోజుల్లో రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తేడా వచ్చిన డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్ రైటర్, రిజిస్టర్ చేయించుకున్న యజమానులతో మాట్లాడి ఈ సొమ్ము తిరిగి కట్టించుకుంటున్నారు. ఎక్కువగా డాక్యుమెంట్ రైటర్లే యజమానులకు తెలియకుండా చలానాల ద్వారా ఈ అక్రమాలు చేసినట్టు తేలింది. అందుకే వారినుంచి తిరిగి సొమ్ము రికవరీ చేయడంతోపాటు కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ అక్రమాలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయనే అంశంపైనా దృష్టి సారించారు. మొదట కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇది బయటపడినా ఎక్కువగా అక్రమాలు జరిగింది మాత్రం కృష్ణా జిల్లాలో కావడంతో అక్కడ రిజిస్టరైన డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాలను వెలికి తీసేందుకు కమిషనర్ అండ్ ఐజీ కార్యాలయంలో అదనపు ఐజీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. విచారణ కొనసాగుతోంది: ధర్మాన రిజిస్ట్రేషన్ల శాఖలో తప్పుడు చలానాలపై విచారణ కొనసాగుతోందని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశామని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తప్పు చేసినట్టు తేలిన ప్రతి ఒక్కరిపైనా చర్య తీసుకుంటామన్నారు. చలానాల చెల్లింపులపై అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. మొదట ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు జరిగిన లావాదేవీలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పామని తెలిపారు. తర్వాత 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లపై నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ఇందుకోసం రిజిస్టేషన్ల శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అక్రమాలు ఇక అసాధ్యం రజత్ భార్గవ చలానాలతో అక్రమాలకు పాల్పడటం ఇకపై సాధ్యం కాదని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన వెంటనే సంబంధిత వ్యవస్థను మార్పు చేసినట్టు తెలిపారు. విజయవాడలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎఫ్ఎంఎస్కు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను అనుసంధానం చేశామని తెలిపారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల కోసం తీసిన చలానాలపై ఆధారపడకుండా అవి రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో (కార్డ్ సిస్టమ్) కనబడతాయని తెలిపారు. తద్వారా డాక్యుమెంట్ విలువ ప్రకారం చలానా ఉందో లేదో తెలుస్తుందని, అప్పుడే డాక్యుమెంట్ రిజిస్టర్ అవుతుందని వివరించారు. నకిలీ చలానాలతో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లతోపాటు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారు కూడా వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరు తప్పు ఉంటే వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తున్నామన్నారు. -
ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కార్యాలయాలన్నిటిలో పాత నెట్‌వర్క్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా సేవలు అందించడమే లక్ష్యంగా పలు మార్పులు చేస్తున్నారు. గతంలో ఏపీ, తెలంగాణ మధ్య డేటా సర్వర్ విభజన జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవలే ఆ డేటా సర్వర్ విభజనను పూర్తిచేసి.. హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’కు తరలించారు. అక్కడ ఏపీ సెంట్రల్ సర్వర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన సమస్య పరిష్కారమైనట్లు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు. అలాగే గతంలో తహశీల్దార్ కార్యాలయాల నుంచి సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలు డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉండేవి. దీనివల్ల జాప్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా మార్చి నేరుగా డేటా సెంటర్‌కు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అనుసంధానించనున్నారు. ఒరాకిల్ నుంచి జావాకు.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఒరాకిల్ సాప్ట్వేర్ వినియోగిస్తున్నారు. వీటిని 2011లో ఏర్పాటుచేశారు. దీనివల్ల పని చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కంప్యూటర్ నెట్‌వర్క్‌ను జావా సాఫ్ట్వేర్కి మార్చనున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో జరిగే జాప్యం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అవసరమైన సాఫ్ట్వేర్లకు కొత్తగా లైసెన్సులు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. కంప్యూటర్ల నెట్వర్క్ స్పీడ్ 4 ఎంబీపీఎస్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ నెట్వర్క్ నుంచి కొనుగోలు చేయనున్నారు. డేటా భద్రత పక్కాగా.. డేటా బేస్‌లో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఇబ్బంది నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ (డిజాస్టర్ రికవరీ సిస్టమ్)ను భువనేశ్వర్‌లో నెలకొల్పుతున్నారు. ఇందుకోసం నేషనల్ ఇన్‌ఫ్రమాటిక్ సిస్టమ్ (ఎన్ఐఎస్)తో ఒప్పందం చేసుకోనున్నారు. అలాగే రూ. 12 కోట్లతో డిజిటల్ సర్వర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. డేటా బేస్, డిజాస్టర్ రికవరీ సిస్టమ్తోపాటు ఈ వ్యవస్థలోనూ రిజిస్ట్రేషన్ల సమాచారం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్లో సదుపాయాలు కల్పించనున్నారు. రిజిస్ట్రేషన్ల సమయాన్ని తగ్గిస్తాం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల డేటా నెట్‌వర్క్‌లో పూర్తి మార్పులు చేస్తున్నాం. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సర్వర్ వ్యవస్థను మార్చాం. డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్‌కు పడుతున్న సమయాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎంవీ శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ -
తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించింది. సంతకవిటి (శ్రీకాకుళం జిల్లా), బలిజిపేట (విజయనగరం జిల్లా), కశింకోట (విశాఖ జిల్లా), కొయ్యలగూడెం (పశ్చిమగోదావరి జిల్లా), ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), రాజుపాలెం (గుంటూరు జిల్లా), ఉలవపాడు (ప్రకాశం జిల్లా), ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా), కూడేరు (అనంతపురం జిల్లా) తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లెక్కల్లో చూపించని నగదును స్వాధీనం చేసుకున్నారు. ► రైతులకు పంపిణీ చేయకుండా ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలను గుర్తించారు. ‘స్పందన’, ‘మీ సేవ’ పోర్టళ్లలో చేసిన దరఖాస్తులను నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పరిష్కరించ లేదని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. కొన్ని కార్యాలయాల్లో ప్రైవేట్ సిబ్బంది పని చేస్తున్నారని గుర్తించారు. ► తహసీల్దార్ కార్యాలయాలపై జరిపిన సోదాల్లో మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.3,50,277 నగదును స్వాధీనం చేసుకున్నారు. ► బిక్కవోలు (తూర్పు గోదావరి జిల్లా), జగ్గయ్యపేట (కృష్ణా జిల్లా), బద్వేలు (వైఎస్సార్ జిల్లా), పీలేరు (చిత్తూరు జిల్లా) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ► సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అనధికార వ్యక్తులు పని చేస్తున్నట్టు గుర్తించారు. మొత్తం మీద లెక్కల్లో చూపించని రూ.9,23,940 స్వాధీనం చేసుకున్నారు. ► నెల్లూరు జిల్లా గూడురు మున్సిపల్ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం ఆఫీసు సమయం ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా 33 భవన నిర్మాణ అనుమతులు ఇచ్చినట్టు గుర్తించారు. ఈ సోదాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని ఏసీబీ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. -
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో దొంగలు పడ్డారు
కొవ్వూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎటువంటి సొత్తు చోరీ కాలేదు. పాత రికార్డులోని కొన్ని పేజీలు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఇంటి దొంగల పనా..? బయట వ్యక్తులు చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 1998కి చెందిన దస్తావేజు కాపీ రికార్డు (ఫైల్ వ్యాల్యూమ్)లోని కొన్ని పేజీలు గల్లంతయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బం దిపై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1999 నుంచి రికార్డులను ఆన్లైన్ చేస్తున్నారు. అంతకు ముందు రికార్డులన్నీ మాన్యువల్‌గా ఉన్నాయి. కొవ్వూరు కా ర్యాలయంలో ఉండే మాన్యువల్ రికార్డుల్లో కొన్నిపేజీలు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది. 10న డీఐజీ విచారణ కొవ్వూరుకి చెందిన గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు, డీఐజీకి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజి స్ట్రేషన్ శాఖ డీఐజీ బి.సూర్యనారాయణ ఈనెల 10న విచారణకు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అదేరోజు పేజీల గల్లంతుపై కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని 1007 నంబర్లోని ఒరిజినల్ ఫైల్ వ్యాలూమ్లో ఉండాల్సిన 2135, 2136, 2137, 2138 అనే నాలుగు నంబర్లకు సంబంధించిన పేజీలను చించుకునిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసుస్టేషన్లో క్రైమ్ నం.202/2018 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ 427,379 నంబర్ల కింద కేసు రిజిస్ట్రర్ అయ్యింది. ఎవరా అజ్ఞాతవాసి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అసలు గారపాటి రవికిషోర్ అనే వ్యక్తి కొవ్వూరులో ఎవరూ లేరనేది ప్రాథమికంగా గుర్తిం చారు. వాస్తవంగా రికార్డు గదిలోకి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. పేజీలు గల్లంతైన వ్యవహారం బయట వ్యక్తులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీనిని బట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ తేదీన ఎవరు సబ్ రిజిస్ట్రార్‌గా, ఎవరెవరు విధుల్లో ఉండగా ఇది జరిగిందనే విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఇన్చార్జ్ సబ్రిజిస్ట్రార్లుగా పనిచేసిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పేర్లను, వారు చేస్తున్న ఉద్యోగం వివరాలను జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలితే విచారణ సులభం కావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు గుర్తుతెలియని వ్యక్తి కావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరైనా నింది తులు ఉంటే నేరం రుజువు కావడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆరుగురిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఆయా పేజీల్లో ఏముంది..! రికార్డులో గల్లంతైన పేజీలు ఎవరి ఆస్తికి సంబంధించినవి అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికారులు ఈ రికార్డుని సీజ్ చేశారు. గల్లంతైన పేజీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు గురించి అడిగితే అధికారులు నోరు విప్పడంలేదు. విచారణలో ఉందని దాట వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఘటన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు గుణపాఠం నేర్పిందనే చెప్పవచ్చు. ఈ ఘటనలో నేరానికి పా ల్పడిన వ్యక్తి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా బాధ్యులు కావాల్సి వచ్చింది. గల్లంతైన నాలుగు పేజీలకు సంబంధించిన ఆస్తుల నకళ్లు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయా నంబర్లకు సంబంధించి ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించి సొమ్ములు చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మధ్య మా మూళ్ల వాటాలు తేలకపోవడం లేదా వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలో ఈ దుర్చశ్యకు పాల్పడ్డారా.. అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. జిల్లా రిజిస్ట్రార్ బదిలీ పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మికి పదోన్నతి రావడంతో ఫి ర్యాదు చేసిన మ రుసటి రోజే బదిలీ కావడం గమనార్హం. పేజీలు గల్లంతైన రికార్డుని ఆమె సీజ్ చేశారని కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్ ఎన్‌పీఎస్‌ఆర్ రాజు చెబుతున్నారు. ఇప్పటివరకూ గల్లంతైన నాలుగు పేజీల నంబర్లకు సంబంధించిన ఆస్తు ల వివరాలు కూడా పోలీసులకు అందలేదని తెలి సింది. ప్రస్తుతం పదోన్నతిపై వెళ్లిన జిల్లా రిజిస్ట్రార్ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫోన్ నంబర్ స్విచాఫ్‌లో ఉంది. నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా మరో వ్యక్తి విధుల్లో చేరే వరకూ విచారణకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులే విచారణకు రావాల్సి ఉంటుం దన్నారు. దీంతో ఈ కేసు నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఆరుగురు సిబ్బందిని బదిలీ చేయగా వారి స్థానంలో విధుల్లో చేరేందుకు కొత్త సిబ్బంది సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1998కి ముందు ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. -
శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యలయంపై ఏసీబీ దాడులు
-
నిషేధిత భూములపై కాసులపంట
♦ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు ♦ కూకట్పల్లి, బాలానగర్, ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దందా ♦ నిషేధిత, ప్రభుత్వ, వక్ఫ్ భూములకూ రిజిస్ట్రేషన్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిషేధిత భూముల్లో కాసుల పంట పండింది. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కడం, అక్రమ వసూళ్లకు దిగడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తిగా గాడి తప్పింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియ దీనికి మరింత ఊతమిచ్చింది. ప్రభుత్వ, వక్ఫ్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఇలా అన్నీ బై నంబర్లు, అక్షరాలతో దర్జాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. మియాపూర్ భూ కుంభకోణంతో తీగ లాగితే మిగతా డొంకంతా కదులుతోంది. నగర శివారులోని ఎల్బీనగర్, కూకట్పల్లి, బాలానగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వందల ఎకరాల నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ యథేచ్ఛగా సాగింది. వాటి దస్తావేజుల నమోదులో సబ్ రిజిస్ట్రార్లు కనీస నిబంధనలు కూడా పాటించలేదు. బ్రోకర్ల ద్వారా స్క్వేర్ ఫీట్లు, గజాలు, ఎకరాలుగా లెక్కతేల్చి ప్రత్యేక ధరలు నిర్ణయించి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటికీ బై నంబర్లు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసిన సంఘటనలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. సర్వే నంబర్ల పక్కన.. మియాపూర్ మదీనగూడా గ్రామ సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి. కానీ స్థలం తమదంటూ అప్పట్లో ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. మూడు దశాబ్దాలుగా కోర్టులో వివాదం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఈ భూములను చేర్చి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమాచారం పంపారు. కానీ 100 సర్వే నంబర్ పక్కన నంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు కానీచ్చేశారు. ఎనీవేర్ కింద దర్జాగా.. ఎల్బీనగర్ పరిధిలోని తుర్కయంజాల్, రాగన్నగూడ తదితర ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టినా నాలుగింతల మొత్తాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రర్ చేయని వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములకు సైతం ఎనీవేర్ కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. శేరిలింగంపల్లి గోపన్‌పల్లి సర్వే నంబర్ 124లో 279.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూమి మినహా మిగతా దాన్ని ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటి రిజిస్ట్రేషన్లకూ తెర లేపారు. 100, 200, 300 గజాల కింద రిజిస్ట్రేషన్లు కానిచ్చారు. ఇక హయత్‌నగర్ మండలం రాగన్నగూడలోని సర్వే నంబర్ 509, 523ల్లో ప్లాట్ రిజిస్ట్రేషన్‌పై నిషేధం ఉన్న యథేచ్చగా కొనసాగింది. ‘వక్ఫ్’ భూమి సైతం.. బాలానగర్ స»Œ రిజిస్ట్రార్ కార్యాల యంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద వక్ఫ్‌బోర్డు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేసేశారు. అత్తా పూర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో 355/1, 2, 3 నంబర్లలో అత్యంత విలువైన వక్ఫ్ భూమిపై వివాదం కోర్టులో కొనసాగుతోంది. అయితే ఓ స్థిరాస్తి సంస్థ ఈ భూమిలో వేసిన ప్లాట్లను బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించేసు కుంది. తొలుత రాజేంద్రనగర్‌లో రిజిస్ట్రేషన్‌కు యత్నించగా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉండటంతో తిరస్కరించారు. దీంతో సదరు స్థిరాస్తి సంస్థ బాలానగర్‌లో పని పూర్తి చేయించుకుంది. -
ఇంకా స్తబ్ధతే!
► కుదుట పడని రియల్ రంగం ► పది శాతం పడిపోయిన పురోగతి ► ఆదాయంలో రూ.కోట్లలో వెనకంజ ► కొత్త జిల్లాల్లో పెరగని దస్తావేజులు ► నోట్ల రద్దు, నగదు పరిమితే కారణం సాక్షి, నిర్మల్ : పెద్ద నోట్ల రద్దు కారణంగా గతేడాది నవంబర్ నుంచి రియల్ రంగం పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే కొత్త నోట్ల రాక, మార్కెట్లో వాటి చలామణి సాధారణ స్థాయికి వస్తున్నప్పటికీ రియల్ రంగంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొనుగోలుదారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్క ఆధారాలు చూపించాల్సి పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు, ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పురోగతిలో తిరోగమనం ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలలో ఉన్నాయి. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా మొత్తంగా 41,495 దస్తావేజులు కాగా, రూ.65.68 కోట్ల ఆదాయం లభించింది. అదే 2016లో ఆ 12 నెలల కాలంలో 40,861 దస్తావేజులు కాగా, రూ.59.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండేళ్ల పరంగా పురోగతిని చూస్తే 2015 కంటే 2016లో పురోగతి 10 శాతం తిరోగమనంలో ఉండగా ఆదాయం పరంగా రూ.5.69 కోట్ల వెనకంజలో ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పరంగా వార్షిక ఆదాయం ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలై మార్చితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మరో నెల మార్చి మిగిలి ఉండగా వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్ల వెనకంజలో ఉంది. ఈ ఆదాయాన్ని ఈ ఒక్క నెలలో అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. జనవరి నెలలో ఉమ్మడి జిల్లా మొత్తంగా రూ.2.70 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో మరో మూడు కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్న వార్షిక లక్ష్యాన్ని అందుకోవడం నష్టంగానే కనిపిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడినా... కొత్త జిల్లా ఏర్పడక ముందు మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో రియల్ రంగం జోరుగా సాగింది. మంచిర్యాల ప్రాంతంలో ప్రతీ రోజు 60 దస్తావేజులు, నిర్మల్ ప్రాంతంలో 40 దస్తావేజుల వరకు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరుగడం ఖాయంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్‌ప్లాంట్ కింద భూ నిర్వాసితులకు ముంపు కింద భారీగా పరిహారం రావడం అక్కడ గత మూడు, నాలుగేళ్లుగా రియల్ రంగం జోరుగా సాగింది. అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత క్రమంగా ఇక్కడ దస్తావేజుల సంఖ్య తగ్గుతూ రోజుకు 40 వరకు వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఈ సంఖ్య మరింత తగ్గింది. గత సెప్టెంబర్ ముందు నుంచి నిర్మల్ జిల్లా ఏర్పాటు మీద ఉద్యమం సాగగా, అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లాను కూడా ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా క్రయవిక్రయాలు సంఖ్య పెరిగి దస్తావేజులు రోజుకు 40 వరకు జరిగాయి. అయితే ఇక్కడ భూముల రేట్లను రెండు, మూడు ఇంతలు, అంతకంటే ఎక్కువ పెంచడంతో ఆ తరువాత క్రమంలో కొనుగోలులో స్తబ్ధత నెలకొంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 15కు పడిపోయింది. ఆదిలాబాద్ నాలుగేళ్లుగా రియల్ పరంగా సబ్ధత నెలకొంది. ఒక్కప్పుడు రోజుకు 40 దస్తావేజులు కాగా ప్రస్తుతం 20 నుంచి 30 వరకు అవుతున్నాయి. ఆసిఫాబాద్‌లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇదిలా ఉంటే మరో ఏడాది వరకు రియల్ రంగంలో పురోగతి ఉండకపోవచ్చునని అధికారులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నోట్ల చెలామణిపై పరిమితుల నేపథ్యంలో మునపటి పరిస్థితిని అందుకోవడం ఆశామాషీకాదని పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో దస్తావేజులు, ఆదాయం వివరాలు సంవత్సరం దస్తావేజుల ఆదాయం (ఏప్రిల్–మార్చి) సంఖ్య రూ.కోట్లలో) 2014–15 30,104 55.71 2015–16 45,870 60.42 2016–17(జనవరి వరకు) 31,527 45.43 -
రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
వైఎస్సార్ జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం దాడులకు దిగారు. ఎనిమిది సభ్యుల ఏసీబీ బృందం కార్యాలయానికి చేరుకుని స్టాంప్ వెండర్లను కూడా లోపలికి రప్పించి గేట్లకు తాళాలు వేయించింది. లోపల రికార్డులు తనిఖీ చేయడంతోపాటు సిబ్బందిని, స్టాంప్ వెండర్లను విచారిస్తున్నారు. -
రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్‌లో ఏసీబీ సోదాలు
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఆస్తుల క్రయవిక్రయాలకు నెలవైన రిజిస్ట్రార్ కార్యాలయాలు.. అక్రమార్జనకు నిలయాలన్న నిజం..అవినీతి నిరోధకశాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బృందం రాజమహేంద్రవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై గురువారం జరిపిన దాడితో మరోసారి రుజువైంది. ఈ దాడిలో సుమారు రూ.1,70,000 లంచపు సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు చెప్పారు. ఇద్దరు రిజిస్ట్రార్లను, క్రయవిక్రయదారుల నుంచి ఈ సొమ్ములు అనధికారికంగా తీసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ఏడుగురు ప్రైవేటు వ్యక్తులను, 17 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. భీష్మ ఏకాదశి సందర్భంగా ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అందిన సమాచారం మేరకు ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం డీఎస్పీ ప్రసాదరావు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, సిబ్బంది గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో స్థానిక సాయికృష్ణా థియేటర్ సమీపంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులతో పాటు, డాక్యుమెంట్ రైటర్లు, కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న లంచం ఇచ్చేందుకు, లంచంగా తీసుకున్న నగదు సుమారు రూ.1,70,000 స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు ఎం.జీవన్‌బాబు, సీహెచ్ శ్రీనివాసబాబులను; కార్యాలయంలో సిబ్బందితో పాటు మామూళ్ళు వసూలు చేసేందుకు, ఇతర పనులకు అనధికారికంగా రోజుకి రూ.500 ఇచ్చే పద్ధతిన పనిచేస్తున్న వి.నాగమురళి, డి.ప్రసాద్, ఎం.విక్టర్ జాన్మిల్టన్, నరసయ్య గాంధీ, రాజేష్, విజయ్‌గోపాల్, వెంకటేశ్వరరావుతో పాటు 17మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు మధ్యవర్తుల సమక్షంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై దాడి నిర్వహించగా లంచాల రూపంలో ఇచ్చిన రూ.1,70,000 పట్టుబడిందని డీఎస్పీ చెప్పారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకున్న వారిపై చర్యలు ఉంటాయన్నారు. దాడిలో ఇన్స్పెక్టర్లు ఎం.రమేష్, బి.సుదర్శనరావు, ఎస్కే గఫూర్ పాల్గొన్నారు. -
ఇక రాత్రిళ్లూ రిజిస్ట్రేషన్లు..
రెండు షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలు నేటి నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ప్రయోగం బోయినపల్లిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మారేడుపల్లిలో మధ్యాహ్నం 2 గం॥నుంచి రాత్రి 8 గంటల వరకు సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఇక సులభతరం కానున్నాయి. రోజుల తరబడి జాప్యం కాకుండా వెంట వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి 8 గంటల సమయంలోనూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. స్థిరాస్తుల దస్తావేజుల నమోదు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండటంతోపాటు..పెరుగుతున్న తాకిడిని అధిగమించేందుకు ముంబయి తరహాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండు షిఫ్టుల పద్ధతిలో సేవలందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటు ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని బోయిన్పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెండు షిఫ్టులుగా పనిచేయనున్నాయి. ప్రతి రోజు రెండేసి షిఫ్టులుగా వేర్వేరు సమయాల్లో ఆరుగంటల చొప్పున సిబ్బంది సేవలందించనున్నారు. పనివేళలు ఇలా... నగరంలోని బోయినపల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు ప్రక్రియ రెండు షిఫ్టులుగా కొనసాగనుంది. ఉదయం షిఫ్టుగా బోయినపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేయనుంది. ఇలా రెండు షిఫ్టులు కార్యాలయ సిబ్బంది సేవలందిస్తారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ కారణంగా రెండు కార్యాలయాల్లో దాదాపు 12 గంటలపాటు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ రెండు కార్యాలయాల్లో ప్రవేశపెడుతున్న షిఫ్టుల పద్ధతికి స్పందన లభిస్తే..రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సైతం దీన్ని విస్తరించనున్నారు. అనంతర రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ...ఇక ఈసీల జారీ
=పభుత్వం ఆదేశం =ఊపిరిపీల్చుకున్న జనం విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్)ల జారీలో కాస్త వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఈసీలు తదితర సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సడలింపు ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతకుముందు లాగానే ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వీటిని జారీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఉత్తర్వులు అందాయి. దీంతో రిజిస్ట్రేషన్స్ శాఖలో పెద్ద సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రజలు గతంలో మాదిరిగా వివిధ రకాల సేవలు పొందవచ్చని అందిన ఆదేశాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడాదిగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట... గత ఏడాది కాలంగా మీ సేవా కేంద్రాలలో ఈసీలు, దస్తావేజుల నకళ్లు జారీ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాటిని జారీ చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాంతో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈసీలు, దస్తావేజు నకళ్ల జారీ నత్తనడకన సాగుతోంది. ఈసీల కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈసీ కోసం దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో అవి పరిష్కారం కావటం లేదు. ఆన్లైన్లో అనేక సమస్యల వల్ల ఈసీ పొందటం గగనమవుతోంది. గతంలో ఈసీ పొందటానికి వంద రూపాయలలోపు ఖర్చు చేసేవారు. మీ సేవల్లో ఈసీ పొందటానికి కనీసం రూ.300 ఖర్చు అవుతోందని చెపుతున్నారు. దీంతోపాటు గంటల వ్యవధిలో పూర్తయ్యే ఈసీల జారీ ప్రక్రియ వారం.. పది రోజులు కూడా పడుతోంది. దస్తావేజుల నకళ్లు, దాఖలైన అర్జీలు మీ సేవల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉంటున్నాయి. వీటిన్నింటిపై ప్రజల నుంచి, రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అందిన విజ్ఞప్తులపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి తోట నరసింహం ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈసీలు, ఇతర సేవలు పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కొద్దిరోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్లో పొందుపరచనున్నారు. అనంతరం ఈసీలు, దస్తావేజు నకళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జారీ చేస్తారు.