ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు | Radical changes in Andhra Pradesh registrations department | Sakshi
Sakshi News home page

ఏపీ రిజిస్ట్రేషన్ల శాఖలో సమూల మార్పులు

Published Mon, Aug 2 2021 4:34 AM | Last Updated on Mon, Aug 2 2021 12:34 PM

Radical changes in Andhra Pradesh registrations department - Sakshi

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కార్యాలయాలన్నిటిలో పాత నెట్‌వర్క్‌ను కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. ప్రజలకు మరింత వేగంగా, నాణ్యంగా సేవలు అందించడమే లక్ష్యంగా పలు మార్పులు చేస్తున్నారు. గతంలో ఏపీ, తెలంగాణ మధ్య డేటా సర్వర్‌ విభజన జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇటీవలే ఆ డేటా సర్వర్‌ విభజనను పూర్తిచేసి.. హైదరాబాద్‌ నుంచి మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్‌’కు తరలించారు. అక్కడ ఏపీ సెంట్రల్‌ సర్వర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన సమస్య పరిష్కారమైనట్లు రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులు చెబుతున్నారు. అలాగే గతంలో తహశీల్దార్‌ కార్యాలయాల నుంచి సబ్‌–రిజిస్ట్రార్‌ కార్యాలయాలు డేటా సెంటర్‌కు అనుసంధానమై ఉండేవి. దీనివల్ల జాప్యం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా మార్చి నేరుగా డేటా సెంటర్‌కు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను అనుసంధానించనున్నారు. 

ఒరాకిల్‌ నుంచి జావాకు.. 
ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్లలో ఒరాకిల్‌ సాప్ట్‌వేర్‌ వినియోగిస్తున్నారు. వీటిని 2011లో ఏర్పాటుచేశారు. దీనివల్ల పని చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను జావా సాఫ్ట్‌వేర్‌కి మార్చనున్నారు. రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో జరిగే జాప్యం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. అవసరమైన సాఫ్ట్‌వేర్లకు కొత్తగా లైసెన్సులు తీసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. కంప్యూటర్ల నెట్‌వర్క్‌ స్పీడ్‌ 4 ఎంబీపీఎస్‌ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్‌ నెట్‌వర్క్‌ నుంచి కొనుగోలు చేయనున్నారు. 

డేటా భద్రత పక్కాగా.. 
డేటా బేస్‌లో ఏవైనా సమస్యలు ఏర్పడితే ఇబ్బంది నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ వ్యవస్థ (డిజాస్టర్‌ రికవరీ సిస్టమ్‌)ను భువనేశ్వర్‌లో నెలకొల్పుతున్నారు. ఇందుకోసం నేషనల్‌ ఇన్‌ఫ్రమాటిక్‌ సిస్టమ్‌ (ఎన్‌ఐఎస్‌)తో ఒప్పందం చేసుకోనున్నారు. అలాగే రూ. 12 కోట్లతో డిజిటల్‌ సర్వర్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. డేటా బేస్, డిజాస్టర్‌ రికవరీ సిస్టమ్‌తోపాటు ఈ వ్యవస్థలోనూ రిజిస్ట్రేషన్ల సమాచారం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్‌లో సదుపాయాలు కల్పించనున్నారు. 

రిజిస్ట్రేషన్ల సమయాన్ని తగ్గిస్తాం.. 
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల డేటా నెట్‌వర్క్‌లో పూర్తి మార్పులు చేస్తున్నాం. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సర్వర్‌ వ్యవస్థను మార్చాం. డాక్యుమెంట్ల రిజిష్ట్రేషన్‌కు పడుతున్న సమయాన్ని ఇంకా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. 
– ఎంవీ శేషగిరిబాబు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement