ఇంకా స్తబ్ధతే!
► కుదుట పడని రియల్ రంగం
► పది శాతం పడిపోయిన పురోగతి
► ఆదాయంలో రూ.కోట్లలో వెనకంజ
► కొత్త జిల్లాల్లో పెరగని దస్తావేజులు
► నోట్ల రద్దు, నగదు పరిమితే కారణం
సాక్షి, నిర్మల్ : పెద్ద నోట్ల రద్దు కారణంగా గతేడాది నవంబర్ నుంచి రియల్ రంగం పై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే కొత్త నోట్ల రాక, మార్కెట్లో వాటి చలామణి సాధారణ స్థాయికి వస్తున్నప్పటికీ రియల్ రంగంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా రూ.2 లక్షలకు పైబడిన వ్యవహారాల్లో నగదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయాల్సిన పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండడంతో రియల్ రంగం కుదుటపడటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొనుగోలుదారులు అంతకుమించిన నగదు వ్యవహారాలు సాగిస్తే దానికి సంబంధించి పక్క ఆధారాలు చూపించాల్సి పరిస్థితి ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగంలో ముందడుగు పడటం లేదని, తద్వారా దస్తావేజులు, ఆదాయం పరంగా రిజిస్ట్రేషన్ల శాఖకు తిరోగమనం కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పురోగతిలో తిరోగమనం
ఉమ్మడి జిల్లాలో తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బోథ్, మంచిర్యాల, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటలలో ఉన్నాయి. 2015 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరంగా మొత్తంగా 41,495 దస్తావేజులు కాగా, రూ.65.68 కోట్ల ఆదాయం లభించింది. అదే 2016లో ఆ 12 నెలల కాలంలో 40,861 దస్తావేజులు కాగా, రూ.59.99 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ రెండేళ్ల పరంగా పురోగతిని చూస్తే 2015 కంటే 2016లో పురోగతి 10 శాతం తిరోగమనంలో ఉండగా ఆదాయం పరంగా రూ.5.69 కోట్ల వెనకంజలో ఉంది.
సాధారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ పరంగా వార్షిక ఆదాయం ప్రతీ ఏడాది ఏప్రిల్ నుంచి మొదలై మార్చితో ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరంలో మరో నెల మార్చి మిగిలి ఉండగా వార్షిక ఆదాయం పరంగా సుమారు రూ.15 కోట్ల వెనకంజలో ఉంది. ఈ ఆదాయాన్ని ఈ ఒక్క నెలలో అందుకోవడం గగనంగానే కనిపిస్తోంది. జనవరి నెలలో ఉమ్మడి జిల్లా మొత్తంగా రూ.2.70 కోట్ల ఆదాయం లభించింది. మార్చిలో మరో మూడు కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్న వార్షిక లక్ష్యాన్ని అందుకోవడం నష్టంగానే కనిపిస్తోంది.
కొత్త జిల్లాలు ఏర్పడినా...
కొత్త జిల్లా ఏర్పడక ముందు మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో రియల్ రంగం జోరుగా సాగింది. మంచిర్యాల ప్రాంతంలో ప్రతీ రోజు 60 దస్తావేజులు, నిర్మల్ ప్రాంతంలో 40 దస్తావేజుల వరకు జరిగేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచిర్యాల జిల్లా ఏర్పాటు జరుగడం ఖాయంగా ఉండడం, ఆ ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, జైపూర్ పవర్‌ప్లాంట్ కింద భూ నిర్వాసితులకు ముంపు కింద భారీగా పరిహారం రావడం అక్కడ గత మూడు, నాలుగేళ్లుగా రియల్ రంగం జోరుగా సాగింది.
అయితే కొత్త జిల్లా ఏర్పాటు తరువాత క్రమంగా ఇక్కడ దస్తావేజుల సంఖ్య తగ్గుతూ రోజుకు 40 వరకు వచ్చింది. నోట్ల రద్దు తరువాత ఈ సంఖ్య మరింత తగ్గింది. గత సెప్టెంబర్ ముందు నుంచి నిర్మల్ జిల్లా ఏర్పాటు మీద ఉద్యమం సాగగా, అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా నిర్మల్ జిల్లాను కూడా ప్రకటించారు. ఆ సమయంలో నిర్మల్ జిల్లాలో భూముల రేటు విపరీతంగా పెరిగాయి. అదేవిధంగా క్రయవిక్రయాలు సంఖ్య పెరిగి దస్తావేజులు రోజుకు 40 వరకు జరిగాయి. అయితే ఇక్కడ భూముల రేట్లను రెండు, మూడు ఇంతలు, అంతకంటే ఎక్కువ పెంచడంతో ఆ తరువాత క్రమంలో కొనుగోలులో స్తబ్ధత నెలకొంది.
రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 15కు పడిపోయింది. ఆదిలాబాద్ నాలుగేళ్లుగా రియల్ పరంగా సబ్ధత నెలకొంది. ఒక్కప్పుడు రోజుకు 40 దస్తావేజులు కాగా ప్రస్తుతం 20 నుంచి 30 వరకు అవుతున్నాయి. ఆసిఫాబాద్‌లో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఇదిలా ఉంటే మరో ఏడాది వరకు రియల్ రంగంలో పురోగతి ఉండకపోవచ్చునని అధికారులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో నోట్ల చెలామణిపై పరిమితుల నేపథ్యంలో మునపటి పరిస్థితిని అందుకోవడం ఆశామాషీకాదని పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో మూడేళ్లలో దస్తావేజులు, ఆదాయం వివరాలు
సంవత్సరం దస్తావేజుల ఆదాయం
(ఏప్రిల్–మార్చి) సంఖ్య రూ.కోట్లలో)
2014–15 30,104 55.71
2015–16 45,870 60.42
2016–17(జనవరి వరకు) 31,527 45.43