
క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఫీజుల జారీ
రుసుములు చెల్లిస్తున్న పలువురు స్థల యజమానులు
తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10 శాతం కట్
మెయినాబాద్ మండలం ఎంకేపల్లె గ్రామంలో 600 గజాల స్థలం ఉండగా, భూ యజమాని 2020 అక్టోబర్ నెలలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. తాజాగా రేవంత్ సర్కారు ఎల్‌ఆర్‌ఎస్‌లను క్రమబద్దికరిస్తుండంతో అధికారులు డాక్యుమెంట్లను స్క్రూట్నీ చేసి ఫీజు రూ.83,651గా నిర్ధారించారు. 25 శాతం రాయితీ రూ.20,912 పోను, మిగిలిన రూ.61,738 చెల్లించాలని ఈనెల 10న దరఖాస్తుదారునికి ఫీజు ఇంటిమేషన్ లెటర్ పంపారు. దీంతో ఆయన రుసుము చెల్లించేశాడు. ట్విస్ట్ ఏంటంటే.. సంబంధిత స్థలం 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాల్లో ఒకటి కావడమే.
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరిధిలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు 27 ఏళ్ల క్రితం నాటి ప్రభుత్వం 111 జీవోను తీసుకొచ్చింది. ఇప్పటికే దీని పరిధిలోని 84 గ్రామాల్లో అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించకుండానే దరఖాస్తుదారులకు ఫీజు ఇంటిమేషన్ పంపిస్తున్నారు.
దీంతో ఇదే అదనుగా భావిస్తున్న దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ రుసుము చెల్లించి, ప్రొసీడింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు హెచ్‌ఎండీఏ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి మూడు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈనెల 31 లోపు ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వర్తిస్తుండటంతో చాలామంది ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి వివాదాలు, న్యాయపరమైన చిక్కులు లేని లేఅవుట్లలో ప్లాట్లకు ఆటోమేటిక్‌గా ఫీజు చెల్లించాలని ఆన్‌లైన్‌లో నోటీసులు అందుతున్నాయి.
రిజెక్ట్ అయితే 10 శాతం కట్..
గతంలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే ఫీజు ఇంటిమేషన్ లెటర్‌ను అధికారులు పంపించేవారు. కానీ ఇప్పుడు డీఫాల్ట్‌గా ఫీజు ఇంటిమేషన్ లింక్‌లను పంపిస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే ఫీజు చెల్లించడానికి అవకాశం ఇవ్వాలి. కానీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
దరఖాస్తుదారుడు ఫీజు చెల్లించిన తర్వాత ఒకవేళ తిరస్కరణకు గురైతే చెల్లించిన ఫీజులో 10 శాతం ప్రాసెసింగ్ చార్జీల కింద కట్ చేసుకొని మిగిలిన మొత్తం ఇస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఆదాయం కోసమే దరఖాస్తుదారులకు ముందు ఫీజు ఇంటిమేషన్ పంపించి, రుసుములు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
తిరస్కరణలో శాస్త్రీయత లోపం
ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్లు, స్థలాలు చెరువులు, కాల్వలు, నీటి వనరులకు 200 మీటర్ల దూరంలో ఉంటే వాటిని నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు. అయితే ఈ ప్రక్రియను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఆధారంగా నీటి వనరులను గుర్తిస్తుండటం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదని పీర్జాదిగూడ మాజీ మేయర్ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆయా మ్యాప్‌లు పురాతన కాలం నాటివని, పట్టణీకరణ అయ్యాక విలేజ్ మ్యాప్‌లలో పిల్ల కాల్వలు, వాగులు కనిపించవని తెలిపారు.
ఈ కారణంగా ఆయా దరఖాస్తులను తిరస్కరించడం సరైంది కాదన్నారు. కొన్ని లేఅవుట్లు నీటి పరిధిలో లేకున్నా, మాస్టర్‌ప్లాన్‌లో తప్పుల కారణంగా నిషేధిత జాబితాలోకి చేరాయి. ఇలాంటి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు చర్యలు తీసుకోవాలి. సిబ్బంది కొరత, దరఖాస్తుల పరిశీలనలో సిబ్బంది తీరిక లేకుండా ఉండటంతో ఆటువైపు ఎవరూ చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment