‘డీఎస్సీ’కి నకిలీల బెడద! | Many candidates are submitting certificates with wrong locality | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ’కి నకిలీల బెడద!

Published Sun, Oct 6 2024 4:18 AM | Last Updated on Sun, Oct 6 2024 4:18 AM

Many candidates are submitting certificates with wrong locality

తప్పుడు స్థానికతతో ధ్రువపత్రాలు సమర్పిస్తున్న పలువురు అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత ప్రక్రియ గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ నెల 9న నియామక పత్రాలు అందిస్తారో లేక వాయిదా వేస్తారోననే సందేహాలు అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది అభ్యర్థులు నకిలీ స్థానికత పత్రాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో వాటిని పరిశీలించాకే నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా న్యాయ సమస్యలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

అడ్డదారిలో సర్టిఫికెట్లు..: టీచర్‌ పోస్టును ఎలాగైనా చేజిక్కించుకోవడానికి అన్ని జిల్లాల్లోనూ అభ్యర్థులు నకిలీ స్థానికతతో సర్టిఫికెట్లు తెస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున రాష్ట్ర అధికారులు మెరిట్‌ లిస్ట్‌ను జిల్లాలకు పంపగా అందులో ఎవరి లోపాలు ఏమిటని అభ్యర్థులు పరస్పరం కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరికొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అభ్యర్థి నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికతగా పరిగణిస్తారు. 

గతంలో నాలుగు నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్లు పరిగణనలోకి తీసుకొనేవాళ్లు. ఉన్నత క్లాసులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వద్ద ఆ రికార్డు తప్పకుండా లభించే వీలుండేది. కానీ ఇప్పుడు ఒకటి నుంచి ఏడో తరగతి నిబంధన ఉండటంతో ఏదో ఒక స్కూల్‌ నుంచి అభ్యర్థులు ధ్రువీకరణ తెస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు విద్యాశాఖ వద్ద సరైన రికార్డులు కూడా ఉండటం లేదు. కరోనా వ్యాప్తి అనంతరం చాలా వరకు ప్రైవేటు ప్రాథమిక స్కూళ్లు మూతపడటం వల్ల వాటిల్లో చదివిన విద్యార్థుల రికార్డులు ప్రభుత్వం వద్ద పక్కాగా లేవు. 

దీన్ని అవకాశంగా తీసుకున్న అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు తెస్తున్నారని అధికారులకు అందుతున్న ఫిర్యాదులనుబట్టి తెలుస్తోంది. మరోవైపు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటాలోనూ నకిలీ సర్టిఫికెట్లు వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా ఇవి అధికారికంగా వచ్చే ధ్రువపత్రాలు కావడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు భావించగా చాలాచోట్ల అనర్హులు ఈ పత్రాలు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది.

మోసాల్లో మచ్చుకు కొన్ని ..
∙ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ అభ్యర్థి ఎస్జీటీ కేటగిరీలో ర్యాంకు సాధించాడు. ఉట్నూర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసినట్లు స్థానికత సర్టిఫికెట్‌ జత చేశాడు. అయితే ఆ సర్టిఫికెట్‌తో బోనఫైడ్, ఇతర సర్టిఫికెట్లను అధికారులు పోల్చి చూడగా అడ్మిషన్‌ నంబర్, పుట్టిన తేదీ, తండ్రిపేరు తప్పుగా ఉన్నాయి. దీన్ని నిలదీసిన అధికారులకు తన దగ్గరున్న మరో స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాడు. దీనిపై ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.

ఆదిలాబాద్‌ పట్టణంలో మరాఠీ మీడియంలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఓ మహిళా అభ్యర్థి స్థానికంగానే చ దువు పూర్తిచేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. అయితే అవి నకిలీవని, ఆమె మహారాష్ట్రలో చదివిందంటూ మరో అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో నుంచి రిజిస్టర్‌ తెప్పించి అధికారులు పరిశీలించగా అభ్యర్థి ఇంటిపేరు, తండ్రిపేరు కొట్టేసి ఉన్నట్లు గుర్తించారు.

వరంగల్‌ జిల్లాలో ఓ అభ్యర్థి స్థానికంగా చదివినట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌పై కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ పాఠశాల రికార్డులు తెప్పించాలని అధికారులు ప్రయత్నించగా అది ఎప్పుడో మూతపడటంతో రికార్డులు దొరకలేదు.

మెదక్‌ జిల్లా హవేలీ ఘనపురం మండలానికి చెందిన భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ శాఖలోనే ఉద్యోగం చేస్తున్నారు. భార్యకు డీఎస్సీలో ర్యాంకు రావడంతో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ధ్రువీకరణ పత్రం సమర్పించింది. ఇద్దరి వార్షికాదాయం రూ. లక్షల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎలా వెనుకబడి ఉన్నారని ఇతర అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ అభ్యర్థి సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు ఆపేశారు.

కోల్చారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద ర్యాంకు వచ్చింది. ఆమె భర్త ప్రభుత్వ ఉద్యోగి. దీంతో ఆమె తన తండ్రి పేరుతో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ సమర్పించింది. నిబంధనల ప్రకారం భర్త ఆదాయం ప్రకారం సర్టిఫికెట్‌ ఉండాలనేది ఇతర అభ్యర్థుల అభ్యంతరం. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement