
జనన, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ లాంటి డాక్యుమెంట్లు డిజిటల్ రూపంలో పెట్టే యోచన
కుటుంబంలోని ఏ సభ్యుడు ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొందుతున్నారనే వివరాలు కూడా..
రాష్ట్ర పౌరుల డేటాబేస్ తయారీ యోచనలో ప్రభుత్వం
ప్రతి కుటుంబానికి చెందిన సమస్త వివరాలు నిక్షిప్తం
ఒక్కో కుటుంబానికి ఒక్కో విశిష్ట గుర్తింపు నంబర్ కేటాయింపు
పథకాలకు అవసరమైన డాక్యుమెంట్లు పదేపదే ప్రభుత్వానికి సమర్పించే అవసరం లేకుండా వెసులుబాటు
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అర్హత సాధిస్తే ఆటోమేటిక్‌గా సభ్యులకు సమాచారం
పథకాలు పారదర్శకంగా, లోపాలు లేకుండా అర్హులకు చేరవేయడమే లక్ష్యమన్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: బీసీల కులగణన, ఎస్సీ వర్గీకరణ కార్యక్రమాలను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. సమీకృత రాష్ట్ర పౌరుల డేటాబేస్(database)ను తయారు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించిన ఐటీ శాఖ.. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ భారీ ప్రాజెక్టు కోసం రూ.30 కోట్లు అవసరమని, కేంద్రం రూ.25 కోట్లు కేటాయిస్తే, తాము రూ.5 కోట్లు భరిస్తామని తెలిపింది.
తదుపరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని వెల్లడించింది. ప్రభుత్వ పథకాలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా, పారదర్శకంగా, పూర్తిస్థాయి కచ్చితత్వంతో అర్హులైన లబ్ధిదారులకు చేరవేసేందుకు ఈ డేటాబేస్ ఏకైక వాస్తవ వనరుగా ఉంటుందని పేర్కొంది.
ఈ ప్రాజెక్టు ఎందుకంటే..
రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ గత ఏడాది చివర్లో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్‌కు లేఖ రాశారు. ఎల్‌ఆర్.నం.1816/సీఎసీ/ఈఎస్‌డీ పేరిట పంపిన ఈ లేఖలో డేటాబేస్ ప్రాజెక్టు వివరాలతో పాటు ప్రతిపాదనలు పొందుపరిచారు.
ప్రతి కుటుంబానికి ఓ ప్రొఫైల్
⇒ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రతి కుటుంబానికి విడివిడిగా విశిష్ట గుర్తింపు ఐడీ నంబర్ జారీ చేస్తారు. ఈ నంబర్ కిందే కుటుంబం వివరాలన్నింటినీ నమోదు చేస్తారు.
⇒ ప్రతి కుటుంబం ప్రొఫైల్‌ను ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇందులో కుటుంబసభ్యుల వివరాలు, వారి బంధుత్వం, ఫోన్ నంబర్లు, చిరునామాలు పొందుపరుస్తారు.
⇒ కుటుంబంలో ఎవరు, ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ఎప్పటినుంచి పొందుతున్నారనే వివరాలు కూడా నమోదు చేస్తారు. ప్రతి కుటుంబసభ్యుని అర్హతలు, సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన వివరాలు పొందుపరుస్తారు.
⇒ కుటుంబసభ్యులందరి డాక్యుమెంట్లు (సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన మేరకు మాత్రమే) అందులో ఉంటాయి. జనన, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు తదితరాలను డిజిటలైజ్ చేసి నిక్షిప్తం చేస్తారు. తద్వారా ప్రభుత్వ పథకాలకు పదేపదే డాక్యుమెంట్లు సమరి్పంచాల్సిన అవసరం ఉండదు.
వివరాలు అత్యంత భద్రం
⇒ కుటుంబాల వివరాలన్నింటినీ అత్యంత పకడ్బందీగా భద్రపరుస్తారు. వీటిని ఎవరెవరు తెలుసుకోగలరో పేర్కొంటూ ప్రొటోకాల్‌ను నిర్ధారిస్తారు. ఆ ప్రొటోకాల్ ఉన్నవారికి మాత్రమే కుటుంబ వివరాలు అందుబాటులోకి వచ్చేలా యాక్సెస్ కంట్రోల్ విధానం ఉంటుంది.
⇒ ప్రస్తుతం వివిధ వనరుల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని (డేటా) ఈ కొత్త డేటాబేస్‌కు బదిలీ చేస్తారు. ఈ డేటా ఏ సమయంలోనూ కోల్పోకుండా ఉండేలా రికవరీ ఏర్పాట్లు చేస్తారు.
బహుళ ప్రయోజనార్థంగా..!
ఈ డేటాబేస్‌ను తయారు చేయడం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రానికి పంపిన సమగ్ర నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ప్రయోజనాలను అర్హులకు పంపిణీ చేయడంలో ఎక్కడా పొరపాట్లు జరగవని తెలిపింది. లబ్ధిదారుల దరఖాస్తులను పరిష్కరించడం సుళువు అవుతుందని, ఎప్పటికప్పుడు దరఖాస్తుల స్థితిగతులు తెలుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలుస్తాయని వివరించింది. ముఖ్యంగా ఏదైనా కుటుంబంలోని ఏ సభ్యుడైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏదైనా సంక్షేమ పథకం పొందేందుకు అర్హులయితే ఆటోమేటిక్‌గా వారికి నేరుగా సమాచారం వెళ్తుందని, సదరు వ్యక్తి పథకం కింద లబ్ధి పొందేలా శీఘ్రగతిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment