ఎల్‌బీ స్టేడియంలో అట్టహాసంగా కార్యక్రమం
జిల్లాల నుంచి నూతన ఉపాధ్యాయుల తరలింపు... సీఎం రేవంత్‌రెడ్డి చేతుల
మీదుగా నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు 10 వేల మంది వరకూ రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా చేరబోతున్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీరికి బుధవారం నియామక ఉత్తర్వులు నేరుగా అందించనున్నారు. హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఎంపికైన కొత్త టీచర్లకు సంబంధిత జిల్లా కేంద్రాల డీఈవోల నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి.
ఉదయం డీఈవో ఆఫీసుకు రావాలని కోరారు. జిల్లాల నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఇతర టీచర్లు కలిపి మొత్తం 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ పరీక్షకు 2.45 లక్షల మంది హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ నిర్వహించారు. సెపె్టంబర్ 30న డీఎస్సీ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. ప్రతి పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, జిల్లా సెలక్షన్ కమిటీకి పంపారు. వారం రోజుల్లోనే ధ్రువపత్రాల పరిశీలన చేశారు. ముగ్గురిలో ఒకరిని జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. వీరికి నియామక పత్రాలను అందించబోతున్నారు.
10,006 పోస్టుల భర్తీ..
మొత్తం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 10,006 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. మిగతా పోస్టుల్లో కొన్ని బ్యాక్‌లాగ్‌లపై నిర్ణయం తీసుకోలేదు. కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల ఆగిపోయాయి. కొన్ని పోస్టులకు సరైన అభ్యర్థి దొరకలేదని అధికారులు తెలిపారు.
ఎస్‌జీటీ, ఎస్‌ఏ రెండు ఉద్యోగాలు వచ్చిన వాళ్లు 700 మంది వరకూ ఉన్నారు. వీరిని గుర్తించి, ఏదైనా ఒకదానిలో కొనసాగేందుకు ఐచ్ఛికం ఇచ్చారు. ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారికి టీచర్ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ క్రోడీకరించిన తర్వాతే తుది జాబితాను విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment