నిందితులకు వాళ్ల సొంత డాక్యుమెంట్లు కూడా ఇవ్వరా?
ఈడీకి సుప్రీంకోర్టు అక్షింతలు
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్‌ఏ) కేసుల దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది.
పీఎంఎల్‌ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్‌ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది.
‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment