ఇక రాత్రిళ్లూ రిజిస్ట్రేషన్‌లు..
రెండు షిఫ్టులుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలు
నేటి నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ప్రయోగం
బోయినపల్లిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు
మారేడుపల్లిలో మధ్యాహ్నం 2 గం॥నుంచి రాత్రి 8 గంటల వరకు
సిటీబ్యూరో: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఇక సులభతరం కానున్నాయి. రోజుల తరబడి జాప్యం కాకుండా వెంట వెంటనే రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి 8 గంటల సమయంలోనూ స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. స్థిరాస్తుల దస్తావేజుల నమోదు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండటంతోపాటు..పెరుగుతున్న తాకిడిని అధిగమించేందుకు ముంబయి తరహాలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండు షిఫ్టుల పద్ధతిలో సేవలందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర పనుల్లో బిజీగా ఉండే వారికి వెసులుబాటు ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని బోయిన్‌పల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రెండు షిఫ్టులుగా పనిచేయనున్నాయి. ప్రతి రోజు రెండేసి షిఫ్టులుగా వేర్వేరు సమయాల్లో ఆరుగంటల చొప్పున సిబ్బంది సేవలందించనున్నారు.
పనివేళలు ఇలా...
నగరంలోని బోయినపల్లి, మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజుల నమోదు ప్రక్రియ రెండు షిఫ్టులుగా కొనసాగనుంది. ఉదయం షిఫ్టుగా బోయినపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం షిఫ్టు మారేడుపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేయనుంది. ఇలా రెండు షిఫ్టులు కార్యాలయ సిబ్బంది సేవలందిస్తారు. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం అమలులో ఉన్న కారణంగా ఒక రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని రెండు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది.
ఈ కారణంగా రెండు కార్యాలయాల్లో దాదాపు 12 గంటలపాటు రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా ఈ రెండు కార్యాలయాల్లో ప్రవేశపెడుతున్న షిఫ్టుల పద్ధతికి స్పందన లభిస్తే..రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సైతం దీన్ని విస్తరించనున్నారు. అనంతర రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.