నిషేధిత భూములపై కాసులపంట
నిషేధిత భూములపై కాసులపంట
Published Mon, Jun 5 2017 4:11 AM | Last Updated on Thu, Mar 28 2019 4:57 PM
♦ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్లు
♦ కూకట్‌పల్లి, బాలానగర్, ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దందా
♦ నిషేధిత, ప్రభుత్వ, వక్ఫ్ భూములకూ రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిషేధిత భూముల్లో కాసుల పంట పండింది. కొందరు అధికారులు అడ్డదారులు తొక్కడం, అక్రమ వసూళ్లకు దిగడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తిగా గాడి తప్పింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియ దీనికి మరింత ఊతమిచ్చింది. ప్రభుత్వ, వక్ఫ్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు ఇలా అన్నీ బై నంబర్లు, అక్షరాలతో దర్జాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి.
మియాపూర్ భూ కుంభకోణంతో తీగ లాగితే మిగతా డొంకంతా కదులుతోంది. నగర శివారులోని ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, బాలానగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో వందల ఎకరాల నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ యథేచ్ఛగా సాగింది. వాటి దస్తావేజుల నమోదులో సబ్ రిజిస్ట్రార్లు కనీస నిబంధనలు కూడా పాటించలేదు. బ్రోకర్ల ద్వారా స్క్వేర్ ఫీట్లు, గజాలు, ఎకరాలుగా లెక్కతేల్చి ప్రత్యేక ధరలు నిర్ణయించి కోట్లు దండుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నింటికీ బై నంబర్లు వేసి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసిన సంఘటనలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి.
సర్వే నంబర్ల పక్కన..
మియాపూర్ మదీనగూడా గ్రామ సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది ప్రభుత్వ భూమి. కానీ స్థలం తమదంటూ అప్పట్లో ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. మూడు దశాబ్దాలుగా కోర్టులో వివాదం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఈ భూములను చేర్చి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమాచారం పంపారు. కానీ 100 సర్వే నంబర్ పక్కన నంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు కానీచ్చేశారు.
ఎనీవేర్ కింద దర్జాగా..
ఎల్‌బీనగర్ పరిధిలోని తుర్కయంజాల్, రాగన్నగూడ తదితర ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టినా నాలుగింతల మొత్తాలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రర్ చేయని వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములకు సైతం ఎనీవేర్ కింద ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. శేరిలింగంపల్లి గోపన్‌పల్లి సర్వే నంబర్ 124లో 279.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఐటీ కంపెనీలకు కేటాయించిన భూమి మినహా మిగతా దాన్ని ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వీటి రిజిస్ట్రేషన్లకూ తెర లేపారు. 100, 200, 300 గజాల కింద రిజిస్ట్రేషన్లు కానిచ్చారు. ఇక హయత్‌నగర్ మండలం రాగన్నగూడలోని సర్వే నంబర్ 509, 523ల్లో ప్లాట్ రిజిస్ట్రేషన్‌పై నిషేధం ఉన్న యథేచ్చగా కొనసాగింది.
‘వక్ఫ్’ భూమి సైతం..
బాలానగర్ స»Œ రిజిస్ట్రార్ కార్యాల యంలో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద వక్ఫ్‌బోర్డు భూమి కూడా రిజిస్ట్రేషన్ చేసేశారు. అత్తా పూర్ ఎంఎం పహాడీ ప్రాంతంలో 355/1, 2, 3 నంబర్లలో అత్యంత విలువైన వక్ఫ్ భూమిపై వివాదం కోర్టులో కొనసాగుతోంది. అయితే ఓ స్థిరాస్తి సంస్థ ఈ భూమిలో వేసిన ప్లాట్లను బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో దర్జాగా రిజిస్ట్రేషన్ చేయించేసు కుంది. తొలుత రాజేంద్రనగర్‌లో రిజిస్ట్రేషన్‌కు యత్నించగా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉండటంతో తిరస్కరించారు. దీంతో సదరు స్థిరాస్తి సంస్థ బాలానగర్‌లో పని పూర్తి చేయించుకుంది.
Advertisement
Advertisement