సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో దొంగలు పడ్డారు | Old records missings in Sub-Registrar Office | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో దొంగలు పడ్డారు

Published Sun, Sep 16 2018 11:06 AM | Last Updated on Sun, Sep 16 2018 11:06 AM

Old records missings in Sub-Registrar Office - Sakshi

కొవ్వూరు: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దొంగలు పడ్డారు. అవును మీరు విన్నది నిజమే. అయితే ఎటువంటి సొత్తు చోరీ కాలేదు. పాత రికార్డులోని కొన్ని పేజీలు మాత్రం గల్లంతయ్యాయి. దీనిపై ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగుచూసింది. ఇది ఇంటి దొంగల పనా..? బయట వ్యక్తులు చేశారా అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 1998కి చెందిన దస్తావేజు కాపీ రికార్డు (ఫైల్‌ వ్యాల్యూమ్‌)లోని కొన్ని పేజీలు గల్లంతయ్యాయి. దీనిపై ఫిర్యాదు అందడంతో ఉన్నతాధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న ఆరుగురు సిబ్బం దిపై బదిలీ వేటు వేశారు. రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 1999 నుంచి రికార్డులను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. అంతకు ముందు రికార్డులన్నీ మాన్యువల్‌గా ఉన్నాయి. కొవ్వూరు కా ర్యాలయంలో ఉండే మాన్యువల్‌ రికార్డుల్లో కొన్నిపేజీలు గల్లంతవడం చర్చనీయాంశంగా మారింది.

10న డీఐజీ విచారణ
కొవ్వూరుకి చెందిన గారపాటి రవికిషోర్‌ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు, సీఎంకు, డీఐజీకి రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు అందింది. దీనిపై స్పందించిన స్టాంప్స్‌ అండ్‌ రిజి స్ట్రేషన్‌ శాఖ డీఐజీ బి.సూర్యనారాయణ ఈనెల 10న విచారణకు ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్‌ పి.విజయలక్ష్మిని విచారణాధికారిగా నియమించారు. ఆమె అదేరోజు పేజీల గల్లంతుపై కొవ్వూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని 1007 నంబర్‌లోని ఒరిజినల్‌ ఫైల్‌ వ్యాలూమ్‌లో ఉండాల్సిన 2135, 2136, 2137, 2138 అనే నాలుగు నంబర్లకు సంబంధించిన పేజీలను చించుకునిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసుస్టేషన్‌లో క్రైమ్‌ నం.202/2018 కింద కేసు నమోదయ్యింది. ఐపీసీ 427,379 నంబర్ల కింద కేసు రిజిస్ట్రర్‌ అయ్యింది. 

ఎవరా అజ్ఞాతవాసి 
రికార్డులో పేజీలు గల్లంతుపై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అసలు గారపాటి రవికిషోర్‌ అనే వ్యక్తి కొవ్వూరులో ఎవరూ లేరనేది ప్రాథమికంగా గుర్తిం చారు. వాస్తవంగా రికార్డు గదిలోకి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. పేజీలు గల్లంతైన వ్యవహారం బయట వ్యక్తులకు తెలిసే అవకాశాలు తక్కువ. దీనిని బట్టి ఇక్కడ పనిచేసే సిబ్బంది సహకారంతోనే ఈ తంతు జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏ తేదీన ఎవరు సబ్‌ రిజిస్ట్రార్‌గా, ఎవరెవరు విధుల్లో ఉండగా ఇది జరిగిందనే విషయం పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. గతంలో ఇక్కడ ఇన్‌చార్జ్‌ సబ్‌రిజిస్ట్రార్‌లుగా పనిచేసిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది పేర్లను, వారు చేస్తున్న ఉద్యోగం వివరాలను జిల్లా రిజిస్ట్రార్‌ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎవరో తెలితే విచారణ సులభం కావడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫిర్యాదుదారుడు గుర్తుతెలియని వ్యక్తి కావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరైనా నింది తులు ఉంటే నేరం రుజువు కావడంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని భావించిన అధికారులు ఆరుగురిని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. 

ఆయా పేజీల్లో ఏముంది..!
రికార్డులో గల్లంతైన పేజీలు ఎవరి ఆస్తికి సంబంధించినవి అనే అంశం ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికారులు ఈ రికార్డుని సీజ్‌ చేశారు. గల్లంతైన పేజీలకు సంబంధించిన ఆస్తుల వివరాలు గురించి అడిగితే అధికారులు నోరు విప్పడంలేదు. విచారణలో ఉందని దాట వేస్తున్నారు. వాస్తవంగా ఈ ఘటన రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులకు గుణపాఠం నేర్పిందనే చెప్పవచ్చు. ఈ ఘటనలో నేరానికి పా ల్పడిన వ్యక్తి ఎవరనేది తేలకపోవడంతో ఇక్కడ పనిచేసే సిబ్బంది అంతా బాధ్యులు కావాల్సి వచ్చింది. గల్లంతైన నాలుగు పేజీలకు సంబంధించిన ఆస్తుల నకళ్లు తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆయా నంబర్లకు సంబంధించి ఎవరైనా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తులను విక్రయించి సొమ్ములు చేసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది మధ్య మా మూళ్ల వాటాలు తేలకపోవడం లేదా వ్యక్తిగత ద్వేషాల నేపథ్యంలో ఈ దుర్చశ్యకు పాల్పడ్డారా.. అన్నది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. 

జిల్లా రిజిస్ట్రార్‌ బదిలీ
పోలీసులకు ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన జిల్లా రిజిస్ట్రార్‌ విజయలక్ష్మికి పదోన్నతి రావడంతో ఫి ర్యాదు చేసిన మ రుసటి రోజే బదిలీ కావడం గమనార్హం. పేజీలు గల్లంతైన రికార్డుని ఆమె సీజ్‌ చేశారని కొవ్వూరు సబ్‌రిజిస్ట్రార్‌ ఎన్‌పీఎస్‌ఆర్‌ రాజు చెబుతున్నారు. ఇప్పటివరకూ గల్లంతైన నాలుగు పేజీల నంబర్లకు సంబంధించిన ఆస్తు ల వివరాలు కూడా పోలీసులకు అందలేదని తెలి సింది. ప్రస్తుతం పదోన్నతిపై వెళ్లిన జిల్లా రిజిస్ట్రార్‌ విజయలక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ స్విచాఫ్‌లో ఉంది. నూతనంగా జిల్లా రిజిస్ట్రార్‌గా మరో వ్యక్తి విధుల్లో చేరే వరకూ విచారణకు ఇబ్బందులు తప్పవని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుదారులే విచారణకు రావాల్సి ఉంటుం దన్నారు. దీంతో ఈ కేసు నీరుగారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఇక్కడ నుంచి ఆరుగురు సిబ్బందిని బదిలీ చేయగా వారి స్థానంలో విధుల్లో చేరేందుకు కొత్త సిబ్బంది సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 1998కి ముందు ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement