గోదావరి ఒడ్డున ఉన్న కొవ్వూరు టీడీపీలో వర్గపోరు తీవ్రమవుతోంది. ఈ ఎస్‌సీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఘర్షణ పడుతుంటే చంద్రబాబు వినోదం చూస్తున్నారు. సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రిని అక్కడి క్యాడర్ అడ్డుకుంటోంది. మరో నేతను బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్న మాజీ మంత్రి వ్యతిరేకులు. రెండు వర్గాల మధ్య కుంపటి వెలిగించి చలి కాచుకుంటున్న చంద్రబాబు. అసలు కొవ్వూరు పచ్చ పార్టీలో ఏం జరుగుతోంది?
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ పై అసమ్మతి తీవ్రమవుతోంది. చంద్రబాబే రగిల్చిన కుంపట్లు చల్లార్చడానికి ఆయనే నియమించిన ద్విసభ్య కమిటీ ఒక వర్గం గానూ.. నియోజకవర్గంలో పార్టీని ప్రభావితం చేయగల మరో ముఖ్యనేత అచ్చిబాబు వర్గం మరోపక్క జవహర్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి.
ఈ రెండు వర్గాలు నియోజకవర్గంలోని వారి సానుభూతిపరులతో రహస్య సమావేశాలు పెట్టి చర్చలు జరుపుతున్నాయి. జవహర్ కు కొవ్వూరు స్థానం కేటాయిస్తే అందరం కలిసి చిత్తుగా ఓడిస్తామని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశాయి రెండు వర్గాలు. జవహర్ వద్దు - టీడీపీ ముద్దు అంటూ జవహర్ వ్యతిరేకులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో కొవ్వూరు తెలుగుదేశంలో సీటు వ్యవహారం హీటెక్కింది.
టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జవహర్ కొవ్వూరులో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నా ఆయన పెత్తనం మాత్రం సాగడం లేదు. కొవ్వూరు వ్యవహారాల్లో తలదూర్చవద్దని గతంలో అధిష్టానం కూడా ఆయన్ను హెచ్చరించింది. కొవ్వూరులోనే నివాసం ఉంటున్న జవహర్ ను ద్విసభ్య కమిటీ నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడంలేదు.
ప్రస్తుతం సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణ ఆధ్వర్యంలోని ద్విసభ్య కమిటీ సారధ్యంలోనే కొవ్వూరు టీడీపీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంపై జవహర్ వర్గం ఎప్పడినుంచో గుర్రుగా ఉంది. కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును బరిలోకి దింపేందుకు జవహర్ వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు సైతం ముప్పిడి అభ్యర్థిత్వాన్ని అంగీకరించారన్న ప్రచారం సాగుతుండగా..ఆయన రంగంలోకి దిగి నియోజకవర్గం అంతా పర్యటిస్తున్నారు.
ద్విసభ్య కమిటీలోని ఓ సభ్యుడైన జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి గతంలో మాజీ మంత్రి జవహర్‌తో సన్నిహితంగానే ఉన్నారు. ఆ తర్వాత వారి మధ్య తలెత్తిన ఆర్థిక వివాదాల కారణంగా చౌదరి సైతం జవహర్‌కు దూరమయ్యారు. జవహర్ మంత్రిగా ఉన్న సమయంలో అచ్చిబాబును వ్యతిరేకించడంతో ఆయన కూడా ఇప్పుడు వ్యతిరేకం అయ్యారు. తమ పంతం నెగ్గించుకోవడానికి ద్విసభ్య కమిటీ, అచ్చిబాబు వర్గాలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇటీవల జవహర్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు దొమ్మేరు గ్రామంలో వివాదంగా మారింది. ఓ వర్గం నేతలు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి మరీ జవహర్‌పై విమర్శలు గుప్పించారు. 2014 నుంచి సీనియర్ నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టిన ఆయన వర్గ విభేదాలకు కారకుడయ్యారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.
కొవ్వూరు నియోజకవర్గంలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. సీటు ఎవరికి ఇస్తారన్న స్పష్టత ఇవ్వకపోవడంతో ఇరు వర్గాల మధ్య రోజు రోజుకూ విభేదాలు తీవ్రమవుతున్నాయి. జవహర్ వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని ఆయన వర్గం ప్రచారం చేసుకుంటోంది. ఇదే జరిగితే జవహర్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు టీడీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జవహర్‌ను కాదంటే ఆయన వర్గం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్ని పచ్చ పార్టీ అధినేత ఎలా చక్కదిద్దుకుంటారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment