సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొవ్వూరు పర్యటనలో ఉన్నారు. కాగా, సీఎం జగన్ శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జనవరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను జమచేశారు. దీంతో, జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. రూ.703 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘విద్యాదీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.10,636 కోట్లు ఖర్చు చేశాం. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదగాలి. వివక్ష పోవాలన్నా, పేదరికం పోవాలన్నా చదవన్నదే గొప్ప అస్త్రం. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యం. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం. అందుకే నాలుగేళ్ల పాలనలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు హ్యూమన్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే దశ దిశ చూపిస్తుంది. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయి. ప్రతీ పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగింది. ఉన్నత విద్యలో కరిక్యులమ్ మార్చేశాం. జాబ్ ఓరియోంటెడ్‌గా కరిక్యులమ్ మార్చాం. దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ప్రవేశపెట్టాం. పిల్లల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం నుంచి ఒక సత్యా నాదెళ్ల రావాలి. ప్రతిభ చూపించే ప్రతీ విద్యార్థికి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు. గత పాలనలో దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా ఉండేది. ఒక్క జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నాయి. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతోంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment