ప్రభుత్వ విద్యను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం
పేద విద్యార్థులకు అండగా నిలిచిన అమ్మ ఒడి, విద్యా, వసతి దీవెన
‘నాడు–నేడు’తో విద్యాసంస్థల రూపురేఖలు మార్చిన జగన్
గోరుముద్దతో పౌష్టికాహారం పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు
మాజీ సీఎం జగన్ జన్మదినోత్సవం అంటే పేద విద్యార్థులకు గుర్తొచ్చేవి ట్యాబ్‌లే
ప్రస్తుత కూటమి సర్కార్ నిర్లక్ష్య వైఖరితో విద్యారంగం కుదేలు
‘మన పిల్లలు.. గ్లోబల్ స్టూడెంట్స్’ అని గర్వంగా చెప్పుకొనే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకెళ్లారు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నర్సరీ నుంచి డిగ్రీ, పీజీ వరకూ అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నాంది పలుకుతూ.. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తీసుకున్న ప్రతి నిర్ణయం పేదోడికి మేలు చేకూర్చింది. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఐబీ సిలబస్, టోఫెల్ ఇలా ఒకటేమిటి అధికారంలో ఉన్నన్నాళ్లూ సంస్కరణల పథాన ముందుకు సాగారు. అయితే ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నాటి నవశకం కాస్త.. నేడు అదోరకం అన్నట్లుగా తయారైంది. ఫలితంగా పేద విద్యార్థుల జీవితాలు అంధకారమయమవుతున్నాయి.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ 21వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. దీని కోసం విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారు. ఎందుకంటే గడిచిన రెండేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ట్యాబ్‌లను పంపిణీ చేసి విద్యార్థులకు సమకాలీన ఆధునిక వసతులతో కూడిన విద్యారంగం వైపు అడుగులు వేయించింది. కానీ ప్రస్తుతం కూటమి సర్కార్ ఆ పథకానికి ఎగనామం పెట్టి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లింది. అంతేకాక విద్యారంగంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన విద్యావిప్లవానికి తూట్లు పొడిచేలా నిర్ణయాలు తీసుకుంటూ ఓ తరాన్ని బలి తీసుకుంటోందని పలువురు విద్యారంగ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మ ఒడితో ఆనందాలు..
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టి ఆ వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రోజూ తమ పిల్లలను బడికి పంపించే కుటుంబానికి ఏడాదికి రూ.15 వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా సాయమందించారు. కృష్ణాజిల్లాలో 1,35,434 మంది విద్యార్థులకు రూ.203 కోట్లు, ఎనీ్టఆర్ జిల్లాలో 1,80,254 మంది విద్యార్థులకు రూ.266 కోట్లు చొప్పున ఉమ్మడి కృష్ణాజిల్లాలో రూ.469 కోట్లు ఏటా ఆయా కుటుంబాలకు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానిది.
విద్యా, వసతి దీవెనలతో అండదండలు..
గత ప్రభుత్వ హయాంలో ఏటా ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పేర్లతో కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేది. ప్రధానంగా జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించి రూ.43 వేల నుంచి లక్షన్నర వరకూ ఫీజులుండగా వాటిని విడతల వారీగా అందించింది. ఎనీ్టఆర్ జిల్లాలో గత సర్కార్ సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాదీవెన పథకం ద్వారా రూ.406.56 కోట్లు, వసతి దీవెన ద్వారా రూ.152.49 కోట్లు అందించింది. అలాగే కృష్ణా జిల్లాలోను 35 వేల మంది విద్యార్థులకు సుమారుగా రూ.350 కోట్ల మేర సాయమందించింది.
‘నాడు–నేడు’ అద్భుతం..
గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో పాఠశాలల రూపురేఖలు సైతం మార్పు చేసేందుకు నాడు–నేడు పథకం ద్వారా విశేష కృషి జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలోనే తొలి విడతగా 341 పాఠశాలలకు రూ.96.32 కోట్లు, రెండో విడతగా 596 పాఠశాలలకు రూ.240 55 కోట్లు కేటాయించారు. రెండో విడత పనుల ముగింపు దశలో ఉండగా కూటమి సర్కార్ వాటిని పూర్తిగా నిలిపివేసింది. కృష్ణాజిల్లాలోనూ రెండో విడత పనులను సైతం పూర్తిగా ఆపేసింది.
ఆధునికతకు అందలం..
గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఆయా పాఠశాలలను తీర్చిదిద్దింది. అందులో భాగంగా ఏటా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్‌లను అందించింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటి ఏడాది 26,334 మంది విద్యార్థులకు రెండో ఏడాది సైతం అదే రీతిలో కొనసాగించింది. ప్రతి పాఠశాలకు స్మార్ట్ టీవీలతో పాటుగా ప్రాథమిక పాఠశాలలో ఇంటర్నల్ ప్యానల్స్‌ను అందించింది.
ఆరోగ్యానికి ప్రాధాన్యం..
జగనన్న గోరుముద్దతో పాఠశాలకు వచ్చే విద్యార్థులకు పరిపూర్ణమైన పౌష్టికాహారాన్ని అందించే ఏర్పాట్లు గత ప్రభుత్వం ప్రారంభించింది. రోజుకొక మెనూతో విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అంతేకాకుండా విద్యార్థులకు కోడిగుడ్డు, చెక్కీలు, రాగిజావ వంటి కొత్త ఆహారాలను సైతం పరిచయం చేసి విద్యార్థులకు పరిపూర్ణమైన ఆహారాన్ని జగన్ అందించారు.
ఆంగ్ల బోధనతో కొత్త చరిత్ర..
సమకాలీన సమాజంలో మాతృభాషతో పాటుగా ఆంగ్ల భాషలో బోధన జరిగినప్పుడు విద్యార్థులకు మేలు జరుగుతుందని గత జగన్ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలల్లో ఆంగ్ల బోధనను ప్రారంభించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా తెలుగు– ఆంగ్ల భాషల్లో ముద్రించిన పుస్తకాలను అందించి వారికి పాఠ్యాంశాలు చక్కగా అర్థమయ్యేందుకు గత ప్రభుత్వం సహకరించింది.
పథకాలు అమలు చేయాలి
విద్యారంగంలో గత ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పథకాలన్నీ కూటమి సర్కార్ అమలు చేయాలి. అవి పేద విద్యార్థులకు మేలు చేశాయి. అమ్మ ఒడి వంటి పథకాలను ఇంకా విస్తృతంగా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి నేడు దాని ప్రస్తావన ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావటం లేదు. నాడు–నేడు సైతం నిలిపివేసింది.
– సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
అద్భుతమైన ప్రగతి..
మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. దేశంలోనే మొదటి సారిగా బైలింగ్వల్ టెక్ట్స్ బుక్స్, ఒకటి నుంచి 5వ తరగతికి బొమ్మలతో కూడిన డిక్షనరీని, ఇంట్రాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ట్యాబ్‌లు ఇలా ఒకటేమిటి ప్రతిఅంశంలో కొత్తదనాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులకు మేనమామగా ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
– టి. కల్పలత, ఎమ్మెల్సీ
విద్యాకానుకకు జాతీయ గుర్తింపు..
గతంలో టీడీపీ సర్కార్ పాఠశాలలు ప్రారంభమైన ఆరు మాసాలైనా విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనపడేది కాదు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలలు తెరిచిన రోజునే అందరికీ జగనన్న విద్యాకానుక పేరుతో పాఠ్యపుస్తకాలతో పాటుగా అత్యధిక నాణ్యత కలిగిన నోటు పుస్తకాలు, బూట్లు, బ్యాగ్, డిక్షనరీలు ఇలా ఎనిమిది రకాల వస్తువులను అందించేవారు. జగన్ ప్రభుత్వం అందిస్తున్న విద్యాకానుకకు జాతీయ స్థాయిలో ప్రశంసలు అభించాయి.
కూటమి సర్కార్ తూట్లు..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యారంగానికి సంబంధించి అనేక పథకాలకు తూట్లు పొడిచిందని నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, నాడు–నేడు, ట్యాబ్‌ల పంపిణీతో పాటుగా పలు కార్యక్రమాలను నిలిపివేయటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జగనన్న గురుముద్ద పేరుతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనాన్ని సైతం ఇష్టారాజ్యంగా మార్చేసి, పరిశుభ్రత లేకుండా చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో పని చేసే ఆయాలకు జీతాలు ఇవ్వకపోవటంతో విద్యాసంస్థల్లో విద్యార్థులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment