సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంపై కాగ్ గణాంకాలు వెల్లడి
ఏపీ కేటాయింపులు రూ.1.30 లక్షల కోట్లు
ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో వ్యయం రూ.1.07 లక్షల కోట్లు
ఇది ఏకంగా 82.54 శాతం
సమర్థంగా సామాజిక రంగ నిధుల వినియోగం
ఏపీ తర్వాత కేటాయింపులు, వ్యయంలో తమిళనాడు
సామాజికాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్
పేదల విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం
నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతి
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి.
సామాజిక రంగ వ్యయం అంటే..
సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్‌బీఐ పరిగణిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment