చదువులు చక్కదిద్దేందుకు ఏకంగా రూ.73,000 కోట్లు వెచ్చించాం: సీఎం జగన్
ఇది మానవ వనరులపై మూలధన పెట్టుబడి.. భావి తరాల భవితకు బలమైన పునాది
తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేసే గొప్ప కార్యక్రమం
ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, డిజిటల్ బోధనతో నాణ్యమైన చదువులు
ఆన్‌లైన్ కోర్సులు అందించేలా అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందం
మన చదువుల ఘనతకు ఐరాసలో చిట్టి చెల్లెమ్మల ప్రసంగాలే నిదర్శనం
జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి
జగనన్న విద్యాదీవెనతో తల్లుల ఖాతాల్లోకి రూ.708.68 కోట్లు
కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి ఖాతాల్లోకి జమ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఒక్క విద్యా దీవెన, వసతి దీవెనతో దాదాపు రూ.18 వేల కోట్లు లబ్ధి
14 ఏళ్లు, మూడు దఫాలు సీఎంగా ఉన్న చంద్రబాబు పేద పిల్లలకు చేసిన మంచి ఏమిటి? వారి భవిష్యత్తు మార్చాలని మీ అన్న చూపించిన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా చూపించారా? ఆయన చేసిన మంచేమిటి అంటే ఏ ఒక్కరికీ ఏదీ గుర్తురాదు. కానీ చంద్రబాబు పేరు చెబితే విద్యారంగానికి చేసిన చెడు గురించి మాత్రం చాలా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ బడిని నీరుగార్చి నారాయణ, చైతన్య సంస్థల్ని పోషించింది చంద్రబాబు.
అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లిష్ మీడియం, గవర్నమెంట్ బడుల్లో మాత్రం తెలుగు మీడియం అని నిర్దేశించింది చంద్ర బాబు. మంచి చేయడానికి మీ బిడ్డ, మీ అన్న నాలుగు అడుగులు ముందుకేస్తే 8 అడుగులు వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్న మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వాళ్లు చేస్తున్న యుద్ధం కేవలం జగన్‌తో కాదు! జగన్ అనే ఒక్కడు పక్కకు తప్పుకుంటే జరిగే నష్టం ఏమిటన్నది ప్రతి ఇంట్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాప, పిల్లాడు ఆలోచన చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా, తరతరాల తలరాతలను మార్చాలని గత 57 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఒక్క చదువులతోనే పేదరికాన్ని అధిగమించడం సాధ్యమని బలంగా విశ్వసించి విద్యారంగాన్ని సమూలంగా సంస్కరించినట్లు చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, నాడు–నేడు తదితర పథకాలు, కార్యక్రమాల ద్వారా పేదల ఉన్నత చదువులకు భరోసా కల్పించామన్నారు.
ప్రభుత్వ టీచర్లకు చెల్లించే జీతభత్యాలు కాకుండా పేద పిల్లలు చదువుకునేలా ప్రోత్సహిస్తూ వివిధ పథకాలు, సర్కారు స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఏకంగా రూ.73 వేల కోట్లకుపైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. పేదింటి బిడ్డల ఉన్నత చదువులకోసం ఇంతగా పరితపిస్తుంటే పెత్తందారులైన దుష్ట చతుష్టయానికి కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 2023 అక్టోబరు–డిసెంబరు త్రైమాసికానికి సంబంధించి 9,44,666 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తూ రూ.708.68 కోట్లను సీఎం జగన్ శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఐదేళ్లుగా విద్యారంగ పురోభివృద్ధి కోసం తీసుకున్న విప్లవాత్మక చర్యలను వివరించారు.
పెద్ద చదువులు చదివే 93 శాతం పిల్లలకు లబ్ది..
తరతరాల పేదరికం సంకెళ్లను తెంచేస్తూ పెద్ద చదువులు అనే పునాదులపై ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదిగేందుకు దోహదం చేసే గొప్ప కార్యక్రమం ఈరోజు పామర్రు నుంచి జరుగుతోంది. వంద శాతం ఫీజులను పిల్లల తల్లులకే అందచేసి వారి ద్వారా కాలేజీలకు చెల్లించే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని గత 57 నెలలుగా అమలు చేస్తున్నాం.
ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా ఆ తల్లుల ఖాతాలకు ఫీజుల మొత్తాన్ని జమ చేయడం కొనసాగిస్తూ వచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతున్న 9.45 లక్షల మంది పిల్లలకు అంటే ఏకంగా 93 శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పూర్తి ఫీజులను మీ జగనన్న ప్రభుత్వమే చెల్లిస్తోంది. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను ఆలోచించమని కోరుతున్నా.
ఆదాయ పరిమితిని పెంచాం..
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మంది పిల్లలు బాగా చదివి బాగుపడాలని ఆరాట పడ్డాం. ఏ పేదవాడూ తన పిల్లల చదువుల కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదనే తపనతో ఆదాయ పరిమితిని పెంచాం. గతంలో రూ.లక్షకే పరిమితమైన ఆదాయ పరిమితిని ఏకంగా రూ.2.5 లక్షలకు పెంచి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలిగాం. ఫీజులు ఇంతే కడతాం! ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు అమ్ముకోండి! మీ చావు మీరు చావండనే గత ప్రభుత్వ విధానాలకు పూర్తిగా స్వస్తి పలికాం.
తల్లిదండ్రులు ఎవరూ ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని మన భుజ స్కంధాలపై వేసుకున్నాం. త్రైమాసికం ముగిసిన వెంటనే తల్లుల ఖాతాల్లోకి ఫీజులు జమ చేస్తూ కాలేజీలకు అందచేసే గొప్ప సంప్రదాయానికి నాంది పలికాం. పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లించే విద్యా దీవెనే కాకుండా ఖర్చుల కోసం ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి అమలు చేస్తున్నాం. తాజాగా అందిస్తున్న రూ.708 కోట్లతో కలిపి ఇప్పటిదాకా 29.66 లక్షల మందికి పిల్లలకు మంచి చేస్తూ జగనన్న విద్యాదీవెన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.12,609 కోట్లు తల్లులకు అందచేశాం.
జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల భోజనం, వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో రూ.4,275 కోట్లు ఉంటుంది. వచ్చే ఏప్రిల్‌లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో రూ.1,100 కోట్లు కూడా కలిపితే విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా వెచ్చిస్తున్న సొమ్ము ఏకంగా దాదాపు రూ.18 వేల కోట్లు అవుతుంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలు బాగుపడాలి, ఆ కుటుంబాలు బాగుండాలనే సంకల్పంతో ప్రతి అడుగూ వేస్తూ వచ్చాం. మనందరి ప్రభుత్వం ప్రతి స్థాయిలోనూ విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చింది.
హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్..
ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యారంగంలో వివిధ పథకాలు, కార్యక్రమాల కోసం 57 నెలల వ్యవధిలో రూ.73 వేల కోట్లు వ్యయం చేశాం. గవర్నమెంట్ టీచర్లకు ఇచ్చే జీతాల వ్యయం దీనికి అదనం. ఇదంతా పేద, మధ్య తరగతి కుటుంబాల మెరుగైన జీవితం కోసం మనం చేసిన హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్. పేద కుటుంబాల్లో ప్రతి పాపా, ప్రతి బాబు గొప్ప చదువులతో ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు, పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా ఎదిగి ఆ కుటుంబాల తలరాతలు మారాలని, భవిష్యత్ బాగుండాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం.
మన విద్యా విధానంలో మీ అన్న ప్రభుత్వం ఈ 57 నెలల్లో ఎలాంటి మార్పులు చేసింది? దానివల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? అనేది ఒకసారి అందరూ గమనించాలని కోరుతున్నా. మన విద్యార్థులు రేపు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో టెక్నాలజీ ఎంతో మారిపోయింది. ఆధునిక చదువులకు అనుగుణంగా మన విద్యా విధానాలను సంస్కరిస్తూ మెరుగైన పద్ధతులు, టెక్నాలజీని మన ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు అందుబాటులోకి తెస్తూ అడుగులు వేశాం.
చదువుల యుద్ధం..
ప్రభుత్వం స్కూళ్లలో మనం ఇంగ్లీషు మీడియం తెచ్చినందుకు మెచ్చుకోవాల్సింది పోయి పెత్తందారులైన చంద్రబాబు, ఈనాడు రామోజీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తోంది. గవర్నమెంట్ బడులు మారాలని ఆరాటపడటం మన తప్పు! ఇంగ్లీష్ మీడియం తేవాలని తపనపడటం మనం చేసిన తప్పు! ఇలా ఆరాటపడినందుకు ఇంత మందితో యుద్ధం చేయాల్సి వస్తోంది.
మనపై యుద్ధం చేస్తున్న వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీస్తే ఏ ఒక్కరూ తెలుగు మీడియంలో చదువుతున్నారని చెప్పరు. వాళ్ల పిల్లలేమో ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేదింటి పిల్లలనూ అలాగే చదివిస్తూ మీ జగన్ అడుగులు వేస్తుంటే మాత్రం తెలుగు భాష అంతరించి పోతోందంటూ యాగీ చేస్తూ మనమీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు.
విద్యారంగంలోనూ క్లాస్ వార్..
ఇప్పుడు విద్యారంగంలో కూడా క్లాస్ వార్ జరుగుతోంది. పెత్తందార్లకు, పేదలకు మధ్య యుద్ధం ఇది. డబ్బున్న వారికి ఒక చదువులు, డబ్బులు లేని వారికి మరో చదువులు అనే ధోరణులపై జరుగుతున్న యుద్ధం ఇది. ఈ క్లాస్ వార్‌లో మీ కష్టాలు తెలిసిన అన్నగా మీ తరఫున ఒక విప్లవంగా, తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తీసుకొచ్చాం.ఈ సంస్కరణలు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కొనసాగకుంటే కూలీల పిల్లలు కూలీలుగానే, పనివారు పనివారుగానే, పేద సామాజిక వర్గాల పిల్లలు అదే పేదరికంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది.
అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు కొనసాగాలి. ఈ సంస్కరణలు వేగంగా అడుగులు పడుతూ పోవాలి. విదేశాల్లోని గొప్ప విశ్వవిద్యాలయాల కోర్సులను సైతం ఆన్‌లైన్‌లో మన పిల్లలకు అందుబాటులోకి తేవడం విప్లవాత్మక మార్పు. ఇవన్నీ మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. మనం వచ్చే వరకు గవర్నమెంటు బడులలో ఇంగ్లిష్ మీడియం కూడా ఎవరూ చూడలేదు. ఇవన్నీ 57 నెలల కాలంలోనే శ్రీకారం చుట్టాం.
బాబు ఒక్క మంచీ చేయలేదు..
పిల్లలకు ప్రభుత్వ స్కూళ్లలో ఎలాంటి ఆహారం అందుతుందో చంద్రబాబు ఏనాడు కనీసం ధ్యాస పెట్టలేదు. బైజూస్ కంటెంట్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు. నాడు – నేడుతో స్కూళ్లను బాగుపరచాలన్న ఆలోచనే చేయలేదు. ఇంగ్లీషు మీడియం ఊసే లేదు. అమ్మ ఒడి దిశగా అడుగులు వేసిందీ లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలన్న ఆలోచనే ఏ రోజూ చేయలేదు.
అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తూ మన కరిక్యులమ్ లో మార్పులు తెచ్చింది ఒక బోడి సున్నానే. విదేశీ విద్యా దీవెనతో ఏకంగా రూ.1.25 కోట్ల దాకా చదివించే బాధ్యత నాదీ అన్న ప్రోత్సాహకర మాటలే నాడు లేవు. రాష్ట్రంలో ఆయన పరిపాలన వల్ల జరిగిన మంచి ఒక్కటంటే ఒక్కటీ లేదు. గ్రామాలకు, సామాజిక వర్గాలకు, అవ్వాతాతలకు, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పిల్లలకు, జాబ్స్ కోసం వెతుక్కుంటున్న పిల్లలకు ఇది చేశానని ఆయన చెప్పగలిగే పరిస్థితే లేదు.
హాజరైన మంత్రులు, నేతలు
కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రçఘురాం, టి.కల్పలత, మొండితోక అరుణ్‌కుమార్, రుహుల్లా, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, దూలం నాగేశ్వరరావు, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎంఎస్ నాగిరెడ్డి, ఉన్నత విద్యాచైర్మన్ హేమచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
నేటి విత్తనం.. రేపు మహా వృక్షం
ఇవాళ మన పిల్లలకు కావాల్సింది ఏదో కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే ఫర్వాలేదని భావించే చదువులు కానే కాదు. ఈరోజు మనకు కావాల్సింది క్వాలిటీ చదువులు. ఇవాళ్టి తరం రేపు పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే నాణ్యమైన చదువులు కావాలి. ఈ నిజం, అవసరాన్ని తెలుసుకున్నాం కాబట్టే మన పిల్లలందరూ భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా మన అడుగులు ముందుకు పడ్డాయి.
ఈ దిశగా ప్రాథమిక విద్యలో కీలక మార్పులు తెచ్చాం. మనం వచ్చిన తర్వాతే గవర్నమెంట్ బడుల పరిస్థితులు మారాయి. ఇవాళ ఒకటో తరగతిలో మనం వేసే విత్తనం మరో 10–15 ఏళ్లలో చెట్టు అవుతుంది. మంచి భవిష్యత్ లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది. అలా కాకుండా మన పిల్లలు పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలనే తపనతో అడుగులు వేస్తూ వచ్చాం. నాడు–నేడుతో గవర్నమెంట్ స్కూళ్లలో సమూల మార్పులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా మన ప్రయాణం సాగుతోంది.
జగన్ అనే వ్యక్తి పక్కకుపోతే...!
జగన్ అనే ఒక్కడు పక్కకుపోతే రేపు పిల్లల చదువులు ఉండవు! గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉండదు! 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ కథ దేవుడెరుగు విద్యారంగం గాలికి పోతుంది! ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష, పేదవాడికి ఇంటికే మందులు, వ్యవసాయం గాలికి ఎగిరిపోతాయి. రైతన్న పూర్తిగా చతికిలబడిపోతాడు. అక్కచెల్లెమ్మల బతుకులు చిన్నాభిన్నం అవుతాయి.
పేదవాడికి తోడుగా నిలబడుతూ, పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధం చేస్తున్నది కేవలం మీ జగన్ మాత్రమే. అందుకనే ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. వాళ్లు చెప్పే అబద్ధాలు, మోసాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు చెబుతారు. ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు కొనిస్తామంటారు. మీ ఇంటికి ఎవరు మంచి చేశారు? ఎవరి హయాంలో మంచి జరిగింది? అనే ఆలోచన చేయండి. మీ జగన్ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా సైనికులుగా నిలబడండి. నేను చెప్పే ఈ మాటలు కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
పిల్లల బాధ్యత తీసుకున్నారు
తోడేళ్లన్నీ ఏకమైనా జగనన్న మనందరి కోసం పోరాడుతున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తేవాలన్న సంకల్పం గొప్పది. వ్యవస్ధలో మార్పు రావాలంటే విద్యతోనే సాధ్యమని భావిస్తూ సంస్కరణలు చేపట్టారు. స్కూళ్లు మొదలయ్యే జూన్, జూలై వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఆలోచిస్తారు.
ఇప్పుడు జగనన్న ఆ బాధ్యత తీసుకున్నారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్న 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. సామాన్యుడైన నన్ను ఎమ్మెల్యేను చేశారు. ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తా. ముఠా నాయకులు, ప్యాకేజ్ స్టార్‌ను ప్రజలు తరిమి కొట్టాలి. ఓ వ్యక్తి ఇటీవల తరచూ అత్తగారింటికి నిమ్మకూరు వస్తున్నాడు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి కొత్త కథలు చెబుతున్నాడు. – కైలే అనిల్‌కుమార్, పామర్రు ఎమ్మెల్యే
విద్యార్థులకు వరంలా..
అమ్మలా గోరుముద్ద అందిస్తూ నాన్నలా ఫీజులు చెల్లిస్తున్న మీది గొప్ప మనసు అన్నా. కృష్ణా యూనివర్సిటీలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బీటెక్ చదువుకుంటున్నా. నాన్న చదువుకునే రోజుల్లో స్కాలర్‌షిప్ కోసం ఎన్నో ఆఫీస్‌ల చుట్టూ తిరిగినట్లు చెప్పారు.
నేను ఏ ఒక్క ఆఫీస్‌కూ వెళ్లకుండా వలంటీర్ అన్నయ్య మా ఇంటికే వచ్చి పత్రాలు ఇచ్చారు. విజన్ ఉన్న మీరు సీఎంగా ఉండటం విద్యార్థులకు వరం. ప్రతిక్షణం మా గురించి ఆలోచించే మీరు మళ్లీ మళ్లీ సీఎం కావాలి. మీద్వారా మా కుటుంబం చాలా లబ్ధి పొందింది. – పి.శ్రీ షణ్ముఖ సాయి ప్రియ, విద్యార్థిని
గొప్ప ప్రజా నాయకుడు మీరే..
మాది పేద కుటుంబం. నాన్న ప్రైవేట్ ఉద్యోగి. ఆయన జీతంపైనే కుటుంబం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటర్ పూర్తి చేశా. ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నా. విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా లబ్ధి పొందా. కరిక్యులమ్ కోర్సులతో పాటు ఇతర కోర్ సబ్జెక్ట్‌లు నేర్చుకోవడం వల్ల మంచి గ్రిప్ సంపాదించా. సాఫ్ట్‌వేర్ జాబ్స్‌కు అర్హత సాధించా. వరల్డ్ టాప్ యూనివర్సిటీలలో ఎంఎస్ చేయాలనుకుంటున్నా.
మీరు యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. మాల్కం గ్లాడ్‌వెల్ అనే ఇంగ్లిష్ రచయిత టెన్ థౌజండ్ అవర్స్ థియరీ రాశారు. మీరు కూడా టెన్ థౌజండ్ అవర్స్ ప్రజల మధ్య గడిపారు కాబట్టి ఇంత గొప్ప నాయకుడయ్యారు. నేను కూడా ఆ థియరీని పాటించి వరల్డ్‌లో గ్రేట్ ప్రొఫెషనల్ పేరు సాధించాక మళ్లీ మీ దగ్గరకు వచ్చి స్టేజ్‌పై నిలబడి మాట్లాడతానని మాట ఇస్తున్నా. – దిల్షాద్, విద్యార్థిని
తొలిసారిగా ఓ ముఖ్యమంత్రి....
మన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 21 ఫ్యాకల్టీస్‌లో 330 కాలేజీల్లో సీట్లు సాధిస్తే జగనన్న విదేశీ విద్యా దీవెనతో రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. పిల్లల డిగ్రీలకు ప్రయోజనం దక్కేలా వారు ఏం చదువుతున్నారు? కరిక్యులమ్‌లో ఎలాంటి మార్పులు తేవాలి? అత్యున్నత భావి పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తేవాలి? అని మొదటిసారిగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మీ అన్న మాత్రమే.
కరిక్యులమ్‌ను జాబ్ ఓరియెంటెండ్‌గా మార్చాం. నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు తెచ్చాం. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్ షిప్ తీసుకొచ్చింది ఇప్పుడే. మన కరిక్యులమ్‌లో సర్టిఫైడ్ ఆన్‌లైన్ వర్టికల్స్‌ను తొలిసారిగా తీసుకొచ్చాం. చదువుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ తొలిసారిగా అనుసంధానం చేస్తూ అడుగులు వేశాం. డిగ్రీ పూర్తయ్యాక మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించక ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో విదేశాల్లో ఉన్నదేమిటి? ఇక్కడ లేనిదేమిటి? అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్టుల్లో ఉన్న వర్టికల్స్‌ను ఆన్‌లైన్‌లో మన పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది కూడా మన ప్రభుత్వమే.
ప్రఖ్యాత వర్సిటీల్లో ఉన్న దాదాపు 2 వేల కోర్సులన్నీ ఆన్‌లైన్ ద్వారా మన కరిక్యులమ్‌లో భాగాలుగా మారి సర్టిఫికెట్లు కూడా వారే ఇచ్చేలా అడుగులు వేశాం. అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు చేతిలో పుచ్చుకొని హార్వర్డ్, ఎంఐటీ, ఎల్‌ఎస్‌సీ, ఎల్‌బీఎస్ లాంటి అంతర్జాతీయ వర్సిటీల నుంచి ఆన్‌లైన్‌లో కోర్సులు పూర్తి చేసి పొందిన సర్టిఫికెట్లతో నైపుణ్యాలు సాధించిన మన విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే అంతర్జాతీయంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో అందరికంటే ముందుంటారు.
జగన్నాథ రథం..
విప్లవాత్మక సంస్కరణలతో మన జగన్నాథ రథం వడివడిగా కదులుతోంది. స్కూల్ ఎడ్యుకేషన్‌లో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకు అడుగులు పడుతున్నాయి. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానాన్ని మీ అన్న పరిపాలనలోనే తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచే టోఫెల్ ఓరియెంటేషన్‌తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతోంది కూడా ఇప్పుడే. గవర్నమెంట్ స్కూళ్లలో బైలింగ్యువల్ టెక్సŠట్‌బుక్స్ మన పిల్లల చేతుల్లో కనిపిస్తోంది కూడా ఇప్పుడే. ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లలకు సైతం అందించింది ఈ 57 నెలల కాలంలోనే.
మన పేద పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకునే లిటరసీ నుంచి డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని, 8వ తరగతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏకంగా ట్యాబ్‌లు ఇచ్చింది కూడా ఈ 57 నెలల కాలంలోనే. నాడు – నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసి 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములో ఐఎఫ్‌పీ ప్యానెళ్లు తెచ్చింది మన ప్రభుత్వమే. పిల్లలను బడులకు పంపేలా ప్రోత్సహిస్తూ తల్లులకు అమ్మ ఒడితో ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తోంది కూడా మనమే. పిల్లలకు రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్దను పౌష్టికాహారంతో అందిస్తోంది కూడా ఈ 57 నెలలుగానే.
ప్రతి మండలానికి కనీసం 2 జూనియర్ కాలేజీలు, అందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒకటి ఉండాలని ఏర్పాట్లు చేసింది కూడా మన ప్రభుత్వమే. విద్యా వ్యవస్థను మన ప్రభుత్వం ఎంత ఉన్నత స్థాయికి చేర్చిందో చెప్పేందుకు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థినులు ఐక్యరాజ్యసమితిలో అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన అరుదైన ఘట్టమే నిదర్శనం. మన చదువుల ఘనతను చిట్టి చెల్లెమ్మలు ప్రపంచానికి చాటి చెప్పారు.
ఎమ్మెల్యే అనిల్‌ను చూసినప్పుడల్లా..
ఎమ్మెల్యే అనిల్‌ని చూసినప్పుడల్లా అందరూ తన మాదిరిగా ఉంటే ప్రతి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని అనిపిస్తుంది. నిజాయతీ, నిబద్ధత ఉన్న అనిల్‌ను మీరందరూ దీవించండి. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కొన్ని పనులు అడిగాడు. అధికారులను పిలిపించి అవన్నీ కచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తానని హామీ ఇస్తున్నా.
పెత్తందారులకో ధర్మం.. పేదలకో ధర్మమా?
ఇవాళ నేను చెబుతున్న ప్రతి మాటా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతున్నా. తల్లిదండ్రులు, పిల్లలందరూ దీన్ని గమనించాలి. పెత్తందార్లయిన వారికో ధర్మమట! పేదలైన మీకో ధర్మమట! వారి పిల్లలకు ఒక బడి.. మన పిల్లలకు ఇంకో బడట! వారి చదువులు వేరట.. మన చదువులు వేరట! పెత్తందార్లుగా వారుండాలట... పనివారిగా మనం ఉండాలట! పరిశ్రమలు వారివట.. కార్మికులుగా మాత్రమే మనమట!
సామ్రాజ్యాలన్నీ వారివట.. సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట! వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ జగన్ పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే మాత్రం చెడగొడుతున్నారంటూ యాగీ చేస్తారు. ఇవన్నీ మన పిల్లలు ఎప్పటికీ పేదలుగానే ఉండిపోవాలని కోరుకొనే పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనాలుగా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment