నకిలీ మందుల తయారీదారులపై దాడులు  | Hyderabad police unearth illegal pharma unit in Uttarakhand | Sakshi
Sakshi News home page

నకిలీ మందుల తయారీదారులపై దాడులు 

Published Sat, Mar 2 2024 5:07 AM | Last Updated on Sat, Mar 2 2024 5:07 AM

Hyderabad police unearth illegal pharma unit in Uttarakhand - Sakshi

డీసీఏ, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల అదుపులో నిందితులు

‘ఆపరేషన్‌ జై’ పేరిట ఉత్తరాఖండ్‌లో సోదాలు... రూ. 44.33 లక్షల విలువైన నకిలీ మందులు స్వాదీనం 

డీసీఏ, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల అంతర్రాష్ట్ర ఆపరేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: నకిలీ మందుల తయారీ కేంద్రం గుట్టుర ట్టు చేసేందుకు తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ), హైదరాబాద్‌ సీపీ టాస్‌్కఫోర్స్‌ బృందం అధికారులు కలిసి ‘ఆపరేషన్‌ జై’పేరిట అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్‌ హెర్బ్స్‌ అండ్‌ డ్రగ్స్‌ పేరిట ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న ట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు పక్కా ఆధారాలు సేకరించారు. దాడిలో మొత్తం రూ.44.33 లక్షల విలువైన నకిలీ మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ జైకు సంబంధించిన వివరాలను డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు.  

మలక్‌పేట్‌లో లింకులు ఉత్తరాఖండ్‌ వరకు..  
నకిలీ మందుల విక్రయానికి సంబంధించి విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు డీసీఏ అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది మలక్‌పేట్‌లోని ఓ మెడికల్‌ దుకాణంలో ఫిబ్రవరి 27న సోదాలు చేపట్టగా రూ.7.34 లక్షల విలువైన ఎంపీఓడీ–200 ట్యాబ్లెట్లు పట్టుబడ్డాయి. ఈ నకిలీ మందులను విక్రయిస్తున్న అర్వపల్లి సత్యనారాయణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మీర్‌పేట్‌కు చెందిన గాండ్ల రాములు నుంచి తాను ఈ నకిలీ ట్యాబ్లెట్లు కొనుగోలు చేసినట్టు అతను అంగీకరించాడు.

ఈ సమాచారంతో డీసీఏ అధికారులు గాండ్ల రాములును అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌కు చెందిన విషాద్‌ కుమార్, సచిన్‌ కుమార్‌ల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు తెలిపాడు. సచిన్‌ కుమార్, విషాద్‌ కుమార్‌లు వాట్సప్‌ కాల్స్‌ ద్వారా తన నుంచి ఆర్డర్లు తీసుకుని ఉత్తరాఖండ్‌ నుంచి మందులను పంపుతున్నట్టు పేర్కొన్నాడు.

ఈ సమాచారం మేరకు డీసీఏ, టాస్‌్కఫోర్స్‌ అధికారులు ఉత్తరాఖండ్‌లో ఆపరేషన్‌ చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో నెక్టార్‌ హెర్బ్స్‌ అండ్‌ డ్రగ్స్‌ సంస్థలో ఫిబ్రవరి 29న డీసీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సచిన్‌ కుమార్‌ నకిలీ ట్యాబ్లెట్లను తయారు చేసి, వివిధ కంపెనీల లేబుల్స్‌ అతికించి లక్ష నకిలీ ట్యాబ్లెట్లను రూ.35 వేలకు విక్రయిస్తున్నట్టు ఆధారాలు సేకరించారు. ఆ సంస్థనుంచి మొత్తం రూ. 44.33 లక్షల విలువైన నకిలీ ట్యాబ్లెట్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement