
సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం సాధికారతపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన ఈనెల 7, 8 తేదీల్లో డెహ్రాడూన్‌లో జరగనున్న చింతన్ శిబిర్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఇందులో భాగంగా మంత్రులు ఆదివారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌కు బయలుదేరనున్నారు.
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, దేశానికి దిక్సూచిగా నిలిచిన కులగణన, బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సదస్సులో ప్రసంగిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, అమలవుతున్న పథకాలను మంత్రి సీతక్క ఈ సందర్భంగా వివరించనున్నారు.