తెలంగాణ పరువు తీసిందెవరు?.. కవితపై సీతక్క సీరియస్‌ | Minister Seethakka Counters Brs Mlc Kavitha | Sakshi
Sakshi News home page

తెలంగాణ పరువు తీసిందెవరు?.. కవితపై సీతక్క సీరియస్‌

Published Fri, Mar 21 2025 5:12 PM | Last Updated on Fri, Mar 21 2025 5:19 PM

Minister Seethakka Counters Brs Mlc Kavitha

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. మీ కుటుంబమే పరువు తీసిందంటూ కవితపై మండిపడ్డారు. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది.. మీ కుటుంబమే.. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. కరప్షన్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ బీఆర్ఎస్.. మహిళలకు అడుగడుగున అన్యాయం చేసింది బీఆర్ఎస్సే’’ అంటూ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు. మహిళా కమిషన్‌కి సభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళ సంఘాలకు ఇవ్వాల్సిన రూ. 3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు. తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే.. రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారు’’ అంటూ సీతక్క ప్రశ్నించారు.

‘‘మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ డీఎన్‌ఏలోనే కరప్షన్ ఉంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు?. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాము. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు?’’ అంటూ సీతక్క నిలదీశారు.

‘‘ప్రజలకు ఇళ్లు ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము వచ్చి 15 నెలలు అయింది.. అప్పుడే అన్ని కావాలన్నట్టుగా అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు.. వారి పేరు పథకాలకు పెడితే ఎందుకంత కడుపు మంట?, మీరు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే.. తప్పుడు ప్రచారం చేయొద్దు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా అప్పల కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది’’ అని సీతక్క హితవు పలికారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement