సాక్షి, కరీంనగర్: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణన అంతా కాకి లెక్కలే ఉన్నాయని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతీచోటా వినిపిస్తోందన్నారు. తెలంగాణలో బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా? అని ప్రశ్నించారు. మేము ఏమన్నా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నారని అంటారని కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘మేము చేసిన ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కానీ, బీసీ గణన సరిగా జరగలేదు అనే మాట ప్రతి చోటా వినిపించింది. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారు. బీసీల జనాభా కేవలం 46.2 మాత్రమే ఉందా?. నిన్న ఆగమాగం లెక్కలు పెట్టారు. రేపు అసెంబ్లీలో పెడుతున్నారంట. పెడితే బిల్లు పెట్టండి.
.. మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకుని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్లు పెట్టీ మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. బీసీలకు 56.3% రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. ఇదే మోసం మీరు కర్ణాటకలో చేశారు, బీహార్‌లో చేశారు. అదే మోసం తెలంగాణాలో చేస్తున్నారు. మీరు చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే. మేము ఏమైనా అంటే ఎన్నికలకు అడ్డుపడుతున్నామని అంటున్నారు. 21 లక్షల మంది బీసీల లెక్క తేడా వస్తోంది.
ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలలో వ్యత్యాసం తీవ్రంగా ఉంది. కాబట్టి 15 రోజులు రివ్యూకు అవకాశం ఇవ్వాలి. ఈ విషయంలో మేము అందరం పెద్దలను కలుస్తాము. పోరాటాలకు మేము ఎప్పుడు సిద్ధమే. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం అన్నారు. ఇప్పుడు మైనార్టీలతో కలుపుకుని 56.3% బీసీలు అని మీరే అంటున్నారు. 56.3% రిజర్వేషన్లు ఇచ్చి మీరు ఎన్నికలకు పోవాలి’ అని కవిత డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment