
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి విజయ సంకేతం చూపుతున్న అంజిరెడ్డి
కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచిన అంజిరెడ్డి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. నువ్వా..నేనా అన్నట్టుగా మూడురోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ముక్కోణపు పోరులో చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి అత్యధిక ఓట్లతో విజయం సాధించారు.
బుధవారం తెల్లవారుజాము నుంచి కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగింది. ఉదయం 8.30 గంటలకల్లా.. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన 11 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తంవ్యాలి డ్ ఓట్లు 2,23,343 కాగా, అందులో 28,686 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. అధికారులు 1,11,672 ఓట్లను గెలుపు కోటాగా నిర్ధారించారు.
మొదటి ప్రాధాన్యతలో 7 రౌండ్లు బీజేపీ... 4 రౌండ్లు కాంగ్రెస్‌కు ఆధిక్యం
మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కౌంటింగ్ జరిగిన 11 రౌండ్‌లలో మొదటి నుంచీ బీజేపీ ఆధిక్యం కనబర్చగా, మధ్యలో 6,7,8,9 రౌండ్‌లలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి ఆధి క్యం వచ్చింది. చివరి రెండు రౌండ్‌లలో తిరిగి బీజేపీ మెజారిటీ సాధించింది.
మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థికి 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్ధికి 60,419 ఓట్లు వచ్చాయి. ఏ అభ్యర్ధికీ గెలుపు టార్గెట్ కోటా అయిన 1,11,672 ఓట్లు రాలేదు. గెలుపు కోటాను చేరుకోవడానికి అంజిరెడ్డికి 35,997 ఓట్లు, నరేందర్‌రెడ్డికి 41,107 ఓట్లు, ప్రసన్న హరికృష్ణకు 51,253 ఓట్లు అవసరం అయ్యాయి.
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిపై బీజీపీ అభ్యర్థి అంజిరెడ్డి కేవలం 5,110 ఓట్ల అధిక్యం సాధించారు. గెలుపు కోటాకు కావాల్సిన ఓట్లకు ఎవరూ చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల కోసం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను వరుస క్రమంలో ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగించారు.
ఈ క్రమంలో 53 మంది ఎలిమినేట్ అయ్యారు. అయినా ఎవరూ కోటా ఓట్లు సాధించలేదు. దీంతో చివరకు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను ఎలిమినేట్ చేసి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి..........ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి .............ఓట్టు వచ్చాయి.
అధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డి
అయితే ఇద్దరూ కోటా ఓట్లను చేరుకునే పరిస్థితి లేకపోవడంతో అధిక ఓట్లతో ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని విజేతగా ప్రకటించాలనుకున్నారు. కానీ, దానిపై కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఇద్దరిలో ఎవరికీ గెలుపు కోటా ఓట్లు రానందున ఫలితాన్ని ప్రకటించొద్దని అవసరమైతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాలని రిటర్నింగ్ ఆఫీసర్‌ను కోరారు. దీంతో అధికారులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
చివరకు మిగిలిన ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్ధిని విజేతగా ప్రకటించాలన్న ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని బుధవారం అర్ధరాత్రి విజేతగా ప్రకటించారు. దీంతో కౌంటింగ్ హాల్ నుంచి నరేందర్‌రెడ్డి బయటకు వచ్చారు. ఆయన్ను మీడియా చుట్టుముట్టగానే భావోద్వేగానికి గురై.. కన్నీటి పర్యంతమయ్యారు. ఏమీ మాట్లాడలేక పోయారు. గురువారం ఉదయం ప్రెస్‌మీట్ పెడతామని ఆయన అనుచరులు మీడియాకు చెప్పగా, నరేందర్‌రెడ్డి కారు ఎక్కి అంబేడ్కర్ స్టేడియం నుంచి వెళ్లిపోయారు.
చెల్లని ఓట్లు.. సహకరించని పార్టీ !
నరేందర్‌రెడ్డి ఓటమిలో చెల్లని ఓట్లు కీలక పాత్ర పోషించాయి. చిన్న చిన్న పొరబాట్లతో దాదాపు 28వేలకుపైగా గ్రాడ్యుయేట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 28 వేల చెల్లని ఓట్లలో 15 వేలకుపైగా నరేందర్‌రెడ్డికి వచ్చినవే కావడం గమనార్హం. అందుకే ఓడిన బాధ కంటే కూడా తన ఓట్లు చెల్లకుండా పోయి ఓటమికి దారి తీయడం ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
పెద్దపల్లి జిల్లా నాయకులు తరహాలో మిగిలిన మూడు జిల్లాల ముఖ్యనేతలు తమకు సహకరించకపోవడం కూడా తమ ఓటమికి మరో కారణమని నరేందర్‌రెడ్డి వర్గం వాపోయింది. కరీంనగర్ ఎన్నికల సభలోనూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ సీటు ఓడిపోతే తన ప్రభుత్వానికి వచ్చే ఢోకా ఏమీలేదని వ్యాఖ్యానించడం కూడా తమకు ప్రతికూలంగా మారిందని ఆయన అనుచరులు గుర్తు చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
ప్రొఫైల్
పేరు: చిన్నమైల్ అంజిరెడ్డి
పుట్టినతేదీ: 18–06–1966
రామచంద్రాపురం, సంగారెడ్డి
విద్యార్హత: ఎమ్మెస్సీ మ్యాథ్స్ (ఉస్మానియా)
సతీమణి: గోదావరి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, సంగారెడ్డి
రాజకీయం: 2009 ప్రజారాజ్యం పార్టీతో ఆరంగ్రేట్రం
2014లో సంగారెడ్డి సెగ్మెంట్‌లో ఇండిపెండెంట్‌గా పరాజయం
Comments
Please login to add a commentAdd a comment