
రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానంలో గెలువు కోసం పోటాపోటీ
మూడుచోట్లా గెలిచి సత్తా చాటాలని ఆశిస్తున్న బీజేపీ
గ్రాడ్యుయేట్ సీటు సాధించాలనే పట్టుదలతో కాంగ్రెస్
స్వతంత్ర అభ్యర్థుల ఓట్ల చీలికపైనే ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు
సాక్షి, హైదరాబాద్: మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గురువారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రులు, అదే జిల్లాల ఉపాధ్యాయ, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు.
3 ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించి శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ కూడా ఉత్తర తెలంగాణలో గెలిచి పట్టు నిలుపుకునే ప్రయత్నంలో పావులు కదిపింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేస్తున్న హర్షవర్ధన్‌రెడ్డి (పీసీసీ అధికార ప్రతినిధి)కి అధికార అభ్యర్ధిగా కాకుండా కాంగ్రెస్ పరోక్ష మద్దతు అందిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో ఎక్కడా అభ్యర్ధిని నిలపలేదు. ఏ స్వతంత్ర అభ్యర్ధికి కూడా ప్రత్యక్ష, పరోక్ష మద్దతు ప్రకటించలేదు.
కరీంనగర్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా...
మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో తమ అభ్యర్థి మల్క కొమురయ్య గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ అంచనా వేస్తోంది. ఇక్కడ ప్రధానంగా మల్క కొమురయ్య (బీజేపీ), వంగా మహేందర్‌రెడ్డి (పీఆర్‌టీయూ), అశోక్‌కుమార్.వై (యూటీఎఫ్, ఇతర సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (ఎస్టీయూ, ఇతర సంఘాలు)ల మధ్య పోటీ ఉంటుందని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ పరిధిలో ఇలా...
మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానంలో ప్రధానంగా సి.అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణల మధ్య పోటీ ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నరేందర్‌రెడ్డికి విజయావకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. అయితే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి పడే ఓట్లను బట్టి ఫలితాలు ప్రభావితం అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సి.అంజిరెడ్డి (బీజేపీ), ఉటుకూరి నరేందర్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రసన్న హరికృష్ణ (బీఎస్‌పీ), రవీందర్‌సింగ్(ఏఐఎఫ్‌బీ)ల మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు.
వరంగల్ ఉపాధ్యాయ పరిధిలో ఇలా...
వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ప్రధానంగా సరోత్తమ్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డిల మధ్య పోటీ ఉండే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చివరకు టీచర్లను ఇన్‌ఫ్లుయన్స్ చేయడం మనీ మేనేజ్‌మెంట్ అనేది కీలకంగా మారిందని చెబుతున్నారు. హర్షవర్ధన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు పరోక్షంగా మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నారు. శ్రీపాల్‌రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీచర్ల సమస్యలపై సరిగ్గా స్పందించలేదని సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇక మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ ఓటింగ్‌పై ఏ మేరకు ప్రభావం చూపుతారనే దానిని బట్టి ఓటింగ్ సరళిలో మార్పులు వచ్చి విజేతలపై స్పష్టత వస్తుందంటున్నారు. ఇక్కడ ప్రధానంగా హర్షవర్ధన్‌రెడ్డి (టీచర్స్ జేఏసీ అభ్యర్ధి, టీపీసీసీ అధికార ప్రతినిధి), పులి సరోత్తమ్‌రెడ్డి (బీజేపీ), శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూ మద్దతు), మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ (ఎస్టీ్టయూ, బీసీ సంఘాల మద్దతు), సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్ అభ్యర్థి)ల మధ్యనే పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
9 ఓట్లు.. 12 మంది సిబ్బంది
ఇది భీమారం ప్రభుత్వ పాఠశాల (జగిత్యాల జిల్లా)లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రం. దీని పరిధిలోని కరీంనగర్– ఆదిలాబాద్–నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్, టీచర్స్‌కు సంబంధించి 9 మంది ఓటర్లే ఉండగా,పోలింగ్ కేంద్రం నిర్వహణకు 12 మంది సిబ్బంది, పోలీసులు నియమితులయ్యారు.
చిత్రవిచిత్రాలు
– రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రానికి ఒక వైపు ప్రహరీ లేదు. దీంతో టెంట్‌హౌస్ నుంచి పరదాలు తెప్పించి చాటు చేశారు.
– జగిత్యాల జిల్లా కోరుట్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగే కేంద్రం(ఉపాధ్యాయ, పట్టభద్రులు కలిపి)లో తొమ్మిది మంది ఓటర్లే ఉన్నారు. వీరికోసం పోలింగ్ సిబ్బంది ఎనిమిది మంది, మరో ఆరుగురు పోలింగ్ సిబ్బంది ఎన్నికల్లో విధుల్లో పాలుపంచుకుంటున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ పరిధిలోని పట్టభద్రుల ఓటర్లు 38 మంది ఉండగా, ఉపాధ్యాయ ఓటరుఒక్కరే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment