
కేంద్రమంత్రి బండి సంజయ్
ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ భారత జట్టు.. ఎంఐఎంతో అంటకాగే కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండియా గెలవాలనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. పాకిస్తాన్ గెలవాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యాలి. బీసీ కులగణనకు మేం వ్యతిరేకం కాదు. కానీ అందులో ముస్లింలను చేర్చడాన్ని అంగీకరించం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే. అందుకే ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా–ఈ రేసు కేసుల్లో అవినీతి జరిగిందని చెబుతున్నా.. సీఎం కనీసం వారికి నోటీసులైనా ఇచ్చే సాహసం చేయడం లేదు..’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్‌పై దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి
⇒ ‘దూదేకుల కులాలకు రిజర్వేషన్లను మేం ఏనాడూ అభ్యంతర పెట్టలేదు. కానీ ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి బిల్లు పంపితే ఎందుకు ఆమోదించాలి? 60 లక్షల మంది బీసీల జనాభా ఎట్లా తగ్గిందో సమాధానం చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సీబీఐ విచారణ జరిపించాలని కోరితే అడ్వకేట్ జనరల్ ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్‌రావు, శ్రవణ్ విదేశాలకు పారిపోయారు. మీరు విదేశాలకు పంపిస్తే..మేం పట్టుకురావాలా? మేం లిక్కర్ కేసులో కవితను జైల్లో వేశాం. ట్యాపింగ్ కేసులో మీకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరండి. దోషులందరినీ అరెస్టు చేసి బొక్కలో వేస్తాం..’అని సంజయ్ అన్నారు.
బీసీ సమాజాన్ని సీఎం అవమానించాడు
⇒ ‘పేదరికం ఆధారంగా రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.. ఆదాయాన్ని బట్టి కాదు. యూపీఏ పదేళ్ల పాలనలో 2.94 కోట్ల ఉద్యోగాలిస్తే, పదేళ్లలో మోదీ 17.19 కోట్ల కొలువులిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్రపై చర్చకు సిద్ధమా అని సవాలు విసిరితే, తోకముడిచి పారిపోయారు. ప్రధాని మోదీని పెద్ద బీసీ, నన్ను చిన్న బీసీ అంటూ సీఎం బీసీ సమాజాన్ని అవమానించాడు. కాంగ్రెస్ అగ్రనేత అల్లుడి కోసం రూ.15 వేల కోట్ల ఖర్చయ్యే మూసీ ప్రక్షాళనను రూ.1.5 లక్షల కోట్లకు పెంచి కమీషన్లు దొబ్బాలనుకుంటే కేంద్రం ఎందుకు సహకరించాలి?..’అని కేంద్రమంత్రి ప్రశ్నించారు.
ఓడిపోతే ముక్కు నేలకు రాస్తారా?
ఆరు గ్యారంటీలు సహా మేనిఫెస్టో హామీలన్నీ అమలు చేశారని భావిస్తే కాంగ్రెస్ పార్టీకే ఓటెయ్యాలని, సమస్యలపై నిరంతరం పోరాడుతూ సర్కార్ మెడలు వంచేది బీజేపీ అనుకుంటే తమకు మద్దతివ్వాలని సంజయ్ కోరారు. ‘కాంగ్రెస్ పాలన బాగుందనుకుంటే మీ 14 నెలల పాలనపై ఎమ్మెల్సీ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుందామా? కాంగ్రెస్ ఓడిపోతే ముక్కు నేలకు రాసి సీఎం పదవి నుంచి తప్పుకుంటారా?..’అని నిలదీశారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment