సాక్షి, నిజామాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయితే, తాము భయపడే వాళ్లం కాదు.. భయపెట్టే రకం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో అభివృద్ధి చేయలేక తమపై కేసులు పెడుతున్నారని కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశవహయ్యారు. అనంతరం కవిత మాట్లాడుతూ..‘దేశంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక కేటీఆర్, నాపై కేసులు పెడుతున్నారు. అయినా భయపడేది లేదు. నేను, కేటీఆర్ ఏ తప్పు చేయలేదు. మాపై కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పు కణికల్లాగా బయటకు వస్తాం.
పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రాన్ని ఎదురించినా కేసు.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిదన్నా కేసు. సీఎం పేరు మర్చిపోతే కేసు.. హీరో పేరు మర్చిపోతే కేసు. రైతులు భూమి ఇవ్వకపోతే కేసు. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారు. అయినా మేము భయపడేది లేదు.. గట్టిగా నిలబడతాం. పోరాటం మాకేమీ కొత్త కాదు..
ఎవరికైనా స్కూటీలు వచ్చాయా?. తులం బంగారం వచ్చిందా.. మహాలక్ష్మి వచ్చిందా?. ఎన్నెన్నో హామీలు ఇచ్చారు.. బీరాలు పలికారు. హామీలు నెరవేరాయా?. కాంగ్రెస్ వాళ్లను నిలదీయండి.. ప్రశ్నించండి. రుణమాఫీ అన్నారు.. పూర్తిగా చేయలేదు.. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు.. దరఖాస్తులు చెత్త కుప్పలో పడేశారు. 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారు. ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు. నిరుద్యోగులు మహిళలు ఉద్యోగులు విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పోలీసుల రాజ్యం నడుస్తోంది. ఇటు నుంచి సూర్యుడు అటు ఉదయించినా నిజామాబాద్‌లో రాబోయే రోజుల్లో గులాబీ జెండానే ఎగురుతుంది. రాబోయే లోకల్ ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ ఎగరడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment